Eenadu Sunday (31-07-2011)

ఢిల్లీలో తెలుగు జెండా... ఏపీ భవన్‌
దేశరాజధానిలో తెలుగు జెండా... ఏపీ భవన్‌. అక్కడ తెలుగు మాటలు వినిపిస్తాయి. తెలుగు రుచులు వూరిస్తాయి. తెలుగు చాణక్యులు ఆ చెట్ల నీడల్లోనే వ్యూహరచనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు జలుబు చేస్తే ఏపీ భవన్‌కు తుమ్ములొస్తాయన్న మాట అక్షరాలా నిజం
                                                  http://www.eenadu.net/htm/31cover1a.jpg
  దిగో ద్వారక..'పడకసీను పద్యం విన్నంత ఆనందం- అల్లంతదూరంలో ఏపీ భవన్‌ కనిపించగానే. ఢిల్లీ మహానగరంలో అడుగుపెట్టినప్పటి నుంచీ ఒక్క తెలుగువాడైనా కనిపించకపోతాడా, ఒక్క తెలుగు మాటైనా వినిపించకపోతుందా అని ఆశపడేవారికి 'ఆంధ్రప్రదేశ్‌ భవనము'... గుండ్రటి తెలుగక్షరాల బోర్డు సున్నుండల డబ్బాలా అనిపిస్తుంది. ఏపీ భవన్‌కు చేరుకున్నామంటే బోలెడంత ధైర్యం. కొండంత భరోసా.
'ఏమండీ! ఎలా ఉన్నారు?'
'తమ్మీ! ఎప్పుడొచ్చినవే!'
'ఏమప్పా! రైలుకొచ్చినావా, ఫ్త్లెటుకొచ్చినావా' మాండలికాల మట్టివాసన గుబాళిస్తుంది. ఆవరణకు ఆనుకునే మహానుభావుడు టంగుటూరి ప్రకాశంపంతులు నిలువెత్తు విగ్రహం. చేతులెత్తి వెుక్కాలనిపిస్తుంది. అదేం విచిత్రవో, పరాయి ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎక్కడలేని రాష్ట్రాభిమానం పొంగుకొస్తుంది. ఏపీ భవన్‌... ఢిల్లీ తెలుగువారి వారాంతపు అడ్డా! దేశ రాజధాని నగరాన్ని చూడ్డానికొచ్చేవారికి పర్యాటక ప్రదేశం. ఆందోళనకారులకు ఉద్యమ కేంద్రం. పైరవీకారులకు పవర్‌కారిడార్‌. రాజకీయ నిరుద్యోగులకు ఉపాధికల్పన కేంద్రం. విలేకరులకు వార్తల కల్పవృక్షం. భోజన ప్రియులకు ఘుమఘుమల చిరునామా.
రాజకోట రహస్యం...
ఎటుచూసినా బుగ్గకార్లు. తుపాకులతో సెక్యూరిటీ సిబ్బంది. హడావిడిగా తిరిగే అధికారులు. గుంపులుగుంపులుగా రాజకీయ నాయకులు. వెనకాలే అనుచరులూ భజనపరులూ. ఎవరో పెద్దింటివాళ్ల పెళ్లిసందడిలా అనిపిస్తుంది. అంతమందికి ఇక్కడేంపని? పనికట్టుకుని మరీ ఏపీ భవన్‌కు ఎందుకొస్తారు?... ఇండియాగేట్‌ను సందర్శించాక, తెలుగుభోజనం రుచిచూడటానికి వచ్చే ఎవరికైనా ఇలాంటి అనుమానమే కలుగుతుంది.
ఒక్కముక్కలో చెప్పాలంటే, దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సచివాలయం ఇది. ప్రతిదేశంలో మనకో రాయబార కార్యాలయం ఉన్నట్టే, ఢిల్లీలో ఒక్కో రాష్ట్రానికీ ఒక్కో అధికారిక కేంద్రం ఉంటుంది. అలాంటి పాతిక పైచిలుకు భవన్‌లలో ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ఒకటి. కాకపోతే మన రాష్ట్రం పెద్దది కాబట్టి, నేతలూ ఎక్కువే కాబట్టి, ఎప్పుడూ ఏదో ఓ రాజకీయ పంచాయతీ జరుగుతూనే ఉంటుంది కాబట్టి... ఏ కర్ణాటక భవన్‌తోనో కేరళ భవన్‌తోనో పోలిస్తే ఏపీ భవన్‌లో సందడి కాస్త ఎక్కువే. పాలనపరంగా... కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు ఇది వారధి. రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న పనులను చక్కబెట్టడం, రాష్ట్రం నుంచి వచ్చే ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడం ఏపీ భవన్‌ ప్రధాన బాధ్యతలు. గవర్నర్‌, ముఖ్యమంత్రి, స్పీకర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బ్యూరోక్రాట్లు... వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి తరచూ ఢిల్లీకి వచ్చే ప్రముఖులకు భోజనం, వసతి... వగైరా సేవలన్నీ ఏపీ భవనే అందిస్తుంది.
ఐఏఎస్‌ స్థాయి అధికారి 'రెసిడెంట్‌ కమిషనర్‌' హోదాలో ఏపీ భవన్‌ బాధ్యతలు చూస్తారు. పెద్దగా అధికారాలు ఉండవుకానీ, పిల్లల చదువులూ సతీమణుల ఉద్యోగాలూ తదితర కారణాలవల్ల ఢిల్లీలోనే ఉండాలనుకునే ఉన్నతాధికారులు కోరికోరి ఏపీభవన్‌ి పోస్టింగ్‌ వేయించుకుంటారు. ఆ బాపతు అధికారులు ఎక్కువైనప్పుడు, ఇది ఐఏఎస్‌ల పునరావాస కేంద్రంగానూ మారిపోతుంది.
తెలుగు కూడలి...
ఢిల్లీలోని తెలుగువారికి ఆంధ్రప్రదేశ్‌భవన్‌ ఓ వారాంతపు కూడలి. తెలుగు మాటలు వినడానికీ తెలుగు వంటలు రుచిచూడటానికీ తెలుగు కబుర్లు చెప్పుకోడానికీ తెలుగు అనుబంధాలు పెంచుకోడానికీ సెలవురోజుల్లో వాలిపోతారు. ఇక్కడే పరిచయాలు స్నేహాలు అవుతాయి. స్నేహాలు బంధుత్వాలుగా మారతాయి. భవన్‌లోని అంబేద్కర్‌ ఆడిటోరియం ఓ వోస్తరు భువనవిజయం! ఇక్కడ అన్నమయ్య కీర్తనలూ క్షేత్రయ్య పదాలూ కమ్మకమ్మగా వినిపిస్తాయి. కూచిపూడి నృత్యాలు కనువిందుచేస్తాయి. అవధానుల పాండిత్యానికీ, పృచ్ఛకుల సమయస్ఫూర్తికీ, రసజ్ఞులైన ప్రేక్షకుల కరతాళధ్వనులకూ ఇక్కడి గోడలే సాక్ష్యాలు. ఇక ఏ ఉగాదో వస్తోందంటే... ఏపీ భవన్‌కు పండగకళే! మామిడాకు తోరణాలూ బంతిపూల అలంకారాలూ వేదపండితుల ఆశీర్వచనాలూ పట్టుచీరల రెపరెపలూ మట్టిగాజుల గలగలలూ... ఆ వైభవాన్ని కళ్లారా చూడాల్సిందే. మూడువందల యాభై సీట్లున్నా... ఏ మూలకీ సరిపోవు.
అప్పట్లో, ఢిల్లీలోని ఆంధ్రులు తెలుగు సినిమాల కోసం వెుహంవాచినట్టు ఎదురుచూసేవారు. ఢిల్లీ తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు సంఘం, ఆంధ్రాకల్చరల్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీల వాళ్లు పోటీపడి ఏపీ భవన్‌లో కొత్తకొత్త సినిమాలు వేసేవారు. శని, ఆదివారాల్లో ప్రదర్శనలు ఉండేవి. టిక్కెట్టు నూటయాభై రూపాయలు. ఆరేడువందలు తీసుకుని సంవత్సరకాలం చెల్లుబాటయ్యేలా పాసులు కూడా ఇచ్చేవారు. నెలకు రెండు సినిమాల చొప్పున సంవత్సరంలో 24 సినిమాలు చూసే అవకాశం ఉండేది. ఆడిటోరియం అద్దెలు పెరగడం, ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోవడం తదితర కారణాలతో ఇప్పుడు సంఘాలవారు వెనకడుగు వేస్తున్నారు. ఆ మధ్య ఓ సినిమా వేస్తే, పట్టుమని పదిహేనుమంది ప్రేక్షకులు కూడా లేరట!'డైరెక్ట్‌-టు-హోమ్‌' సౌకర్యాలూ మల్టీప్లెక్స్‌ విలాసాలూ... ఏపీ భవన్‌లో సినిమా సందడి తగ్గడానికి ప్రధాన కారణాలు.
ఢిల్లీ గోవిందుడు!
'స్వామీ నాకు పదవులనివ్వు'
'దేవుడా నా పోస్టు కాపాడు'
'ఎలాగైనా ప్రవోషన్‌ వచ్చేట్టు చూడవయ్యా'
'ఈసారి కాంట్రాక్టు మనకే దక్కాలి'
...వందలాది విన్నపాల్ని చిరునవ్వులతో వింటాడు ఏపీ భవన్‌ వెంకటేశ్వరుడు. పనులు కానివాళ్లు మరో అర్జీ పెట్టుకుంటారు. అయినవాళ్లు 'నీ రుణం ఉంచుకోంలే స్వామీ' అంటూ హుండీలో కానుకలు సమర్పించి వెళ్తారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని తెలుగువారికి ఏపీభవనేశ్వరుడు కొంగుబంగారం. గత ఏడాది స్వామివారి హుండీ ఆదాయం రూ.48 లక్షలు! అమెరికన్‌ డాలర్లు, ఇతర దేశాల కరెన్సీ, బంగారు నగలు అదనం. భక్తాదులు శ్రీవారికి వెండి కిరీటం, హస్తాలు, శంఖచక్రాలు చేయించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే అతిథులకు ఉదయాన్నే దైవదర్శనం చేసుకునే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో 2002 జూన్‌లో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుడిని నియమించింది. ఆతర్వాత, ఉత్తరాది నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఇక్కడే సుదర్శన కంకణాల పంపిణీ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అధిష్ఠానాన్ని కలవడానికి వచ్చే కాంగ్రెస్‌ నేతలు... నానా తిప్పలూ పడినా పెద్దల అపాయింట్‌మెంట్లు దొరక్కపోతే, తమ గోడంతా వెళ్లబోసుకునేది ఏపీ భవన్‌ శ్రీనివాసునికే. ఏ దిక్కూలేనివారికి దేవుడే దిక్కు.గోవిందా... గోవిందా!
ఎన్టీఆర్‌ ముద్ర...
ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు ఏపీ భవన్‌పై తిరుగులేని ముద్ర వేశారు. తెలుగువారికే కాదు, తెలుగు భవనానికీ ఢిల్లీలో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చిన ఘనత ఆయనదే. ఏపీ భవన్‌కు మకుటంలా శోభిల్లే గోదావరి బ్లాక్‌ ఎన్టీఆర్‌ చేతులమీదుగానే ప్రారంభమైంది. ప్రారంభోత్సవ శిలాఫలకం మీద పెద్దక్షరాలతో ఉన్న ఎన్‌.టి.రామారావు పేరును చూసి ఉత్తరభారతీయులు దీన్ని 'ఎన్టీఆర్‌ భవన్‌' అని పిలిచేవారు. ఏపీ భవన్‌ వేదికగానే ఆయన జాతీయస్థాయిలో సంకీర్ణ రాజకీయాలు నడిపారు. నేషనల్‌ ఫ్రంట్‌ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరిగేవి. వి.పి.సింగ్‌, దేవీలాల్‌, ఐ.కె.గుజ్రాల్‌ వంటి మహామహులతో ఆయన గురజాడ సమావేశమందిరంలో సుదీర్ఘ మంతనాలు జరిపేవారు. ఎవరొచ్చినా తనే స్వయంగా ఎదురెళ్లి, సాదరంగా తోడ్కొని వచ్చేవారని ఇక్కడి సిబ్బంది గుర్తుచేసుకుంటారు. తెలుగువారి అతిథి మర్యాదలకు ఆయనో ప్రతీక! సమావేశాల తర్వాత, సభామందిరం పక్కనే ఉన్న క్యాంటీన్‌లో షడ్రసోపేతమైన విందుభోజనం సిద్ధంగా ఉండేది. ఎన్టీఆర్‌ వచ్చారంటే, క్యాంటీన్‌లో ఉలవచారు ఉండాల్సిందే. చక్కెర పొంగలి వండాల్సిందే. 'అద్భుతం... ఇంకాస్త వడ్డించండి బ్రదర్‌' అని అడిగి మరీ వేయించుకునేవారట! నిజానికి తెలుగు రుచులు ఉత్తరాది ప్రముఖులకు పరిచయమైంది అప్పుడే! అప్పట్లో ఏపీ భవన్‌ సంచాలక బాధ్యతలు చూసిన కిషన్‌రావు, ఎన్టీఆర్‌ అభిరుచికి తగినట్టు దీన్ని సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సప్తాహోత్సవాలకు బీజం పడింది కూడా అప్పుడే. ఆ వారంరోజులూ ఎన్టీఆర్‌ నటించిన పౌరాణిక, జానపద చిత్రాలు ప్రత్యేకంగా ప్రదర్శించేవారు. ఆంధ్రప్రదేశ్‌ భవన్‌కు సంబంధించినంతవరకూ అది స్వర్ణయుగం!
ఆ ఇద్దరూ...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌కూ మాజీ సీఎం చంద్రబాబుకూ ఏపీ భవన్‌తో కాస్త వైవిధ్యమైన అనుబంధం ఉంది. ముఖ్యమంత్రి కాకముందు వైఎస్‌ ఏపీ భవన్‌కు దూరంగా ఉంటే, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత చంద్రబాబునాయుడు ఆ గడప కూడా తొక్కలేదు. రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అక్కడి సిబ్బందితో జరిగిన గొడవే ఆయన్ను పంతాలకు తీసుకెళ్లిందని ఓ ప్రచారం. ఏదో ఆందోళన సందర్భంగా ఏపీ భవన్‌ గేట్లు మూసేయాలని అధికారులు ఆదేశించారు. సిబ్బంది శిరసావహించారు. అప్పుడే వైఎస్‌ వెళ్లారు. కాపలాదారులు ఆయన్ని గుర్తుపట్టలేదు. లోపలికి వెళ్లబోతే అడ్డుకున్నారు. వైఎస్‌కు కోపం వచ్చింది. చిటపటలాడారు. విషయం క్షమాపణల దాకా వచ్చింది. అప్పటి రెసిడెంట్‌ కమిషనర్‌ అశోక్‌ఝా చొరవతో గొడవ సద్దుమణిగింది. ఆ సంఘటన తర్వాత వైఎస్‌ మనస్తాపానికి గురయ్యారు. ముఖ్యమంత్రి అయ్యేదాకా భవన్‌లో అడుగుపెట్టలేదు. సీఎం హోదాలో తొలిసారిగా వెళ్లినప్పుడు అక్కడున్న సిబ్బందితో ఆప్యాయంగా మాట్లాడారట. అప్పటికీ ఇప్పటికీ తానెంతో మారినట్టు వారితో చెప్పారట.
చంద్రబాబుకు ఇలాంటి చేదు అనుభవాలేమీ లేవు. అయితే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి హోదాలో రాకపోకలు సాగించి, ప్రతిపక్షనాయకుడిగా వెళ్లడం అంటే... పూలమ్మిన చోట కట్టెలమ్మిన చందంగానే ఉంటుందన్న ఉద్దేశమేవో... ఏపీ భవన్‌లో కాలుపెట్టలేదు. అందులోనూ తన రాజకీయ ప్రత్యర్థి ముఖ్యమంత్రి హోదాలో కాటేజీలో ఉంటే, తాను ప్రతిపక్షనాయకుడిగా సాధారణ గదుల్లో ఉండటానికి మనస్కరించి ఉండకపోవచ్చు. గతంలో చంద్రబాబు ఢిల్లీకి వచ్చినప్పుడు కంభంపాటి రావ్మోహన్‌రావు ఇంట్లో బసచేసేవారు. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత క్వార్టర్‌ చేజారిపోయింది. ప్రస్తుతం, తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో దిగుతున్నారు. ఆయన ఏపీ భవన్‌కు రాకపోయినా భవన్‌ అధికారులు మాత్రం ప్రతిపక్షనాయకుడికిచ్చే ప్రొటోకాల్‌ ప్రకారం ఓ వాహనాన్నీ ప్రొటోకాల్‌ సిబ్బందినీ పంపడం ఆనవాయితీగా వస్తోంది. వైఎస్‌ తర్వాత వచ్చిన రోశయ్యకు వెుదటి అంతస్తులోని కాటేజీకి మెట్లెక్కి వెళ్లడం ఇబ్బందిగా అనిపించేది. వెంటనే ఓ లిఫ్టు వేయించాలని అధికారుల్ని ఆదేశించారు. అదికాస్త సిద్ధమయ్యేలోపు పదవిలోంచి దిగిపోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ సౌకర్యాన్ని అనుభవిస్తున్నారు.
ఏ నాయకుడికి ఎంత గ్లామర్‌ ఉందో, ఏ మేరకు ఢిల్లీలో పలుకుబడి ఉందో తెలుసుకోవాలంటే... సర్వేలూ ప్రజాభిప్రాయ సేకరణలూ అక్కర్లేదు. ఆయా నేతలు వచ్చినప్పుడు, ఏపీ భవన్‌లో కనిపించే సందడిని చూస్తేనే అర్థమైపోతుంది.
డీఎస్‌, కేకే - కేరాఫ్‌ 215
పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు డి.శ్రీనివాస్‌, కేశవరావు ఎప్పుడూ శబరి బ్లాక్‌లోని 215 గదిలోనే దిగేవారు. డీఎస్‌ దాన్ని 'లక్కీరూమ్‌'గా భావించేవారు. 'ఎప్పుడూ ఈగదిలో ఉంటారేం?' అని విలేకర్లు పిచ్చాపాటిగా అడిగినప్పుడు, 'ఈ గది గురించి మీకేం తెలుసు?' అంటూ.. 215 మహత్యాన్ని వివరించేవారు. కేకే, డీఎస్‌... ఇద్దరిదీ ఒకటే సెంటిమెంటు. ఇద్దరూ ప్రస్తుతం మాజీలుగానే మిగిలారు. కె.వి.పి.రామచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు కేబినెట్‌ మంత్రులకు కేటాయించే 322 గదిని పర్మనెంటుగా తన అధీనంలోనే ఉంచుకున్నారు. ఆయన ఢిల్లీలో ఉన్నా లేకపోయినా గది మాత్రం ఆయన పేరు మీదే ఉండేది. రాజీనామాతో ఆ బంధం తెగిపోయింది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిని అయితే అంతా ముద్దుగా 'ఏపీ భవన్‌ అల్లుడు' అని పిలుస్తారు. సాధారణంగా ఢిల్లీకి వచ్చే ఎమ్మెల్యేలకూ ఎమ్మెల్సీలకూ గోదావరి బ్లాక్‌లో తాత్కాలిక వసతి కల్పిస్తారు. కానీ పొంగులేటి మాత్రం ఎమ్మెల్సీ కాకముందు నుంచే ఇక్కడ శాశ్వతంగా మకాం వేశారు. ఆ కిటుకు ఏమిటో ఎవరికీ తెలియదు.
ఉద్యమాలూ ధర్నాలూ వూపందుకున్న సమయాల్లో ఏపీ భవన్‌ వాతావరణం గంభీరంగా మారిపోతుంది. భవన్‌ లోపల నేతల హడావిడి ఉంటే, బయట ఉద్యమకారుల సందడి కనిపిస్తుంది. ఢిల్లీకి వస్తే... ముఖ్యమంత్రి స్థాయి అధికారులకు కూడా అంతంతమాత్రం భద్రతే ఉంటుంది. ఇక మీడియా ప్రతినిధులైతే కాచుకుని ఉంటారు. గేటు బయట అరడజను వోబీ వ్యాన్లు సిద్ధంగా ఉంటాయి. దీంతో ప్రజల దృష్టినీ ప్రభుత్వ దృష్టినీ ఆకర్షించడానికి చాలామంది ఇక్కడే నిరసనలకు దిగుతుంటారు. స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమకారులు... సీఎం కాన్వాయ్‌కి అడ్డుపడిన సందర్భాలూ ఉన్నాయి.

భోజనం తయార్‌!
ఏపీ భవన్‌ అంటే... తెలుగింటి వంటశాల. అక్కడికెళ్తే ఆవకాయ ఉంటుంది, గోంగూర పచ్చడి ఉంటుంది, సోనామసూరి అన్నం ఉంటుంది. పప్పూ రసమూ కూరలూ పెరుగూ... అచ్చతెలుగు భోజనం వడ్డిస్తారు. కారం మీద మమకారం ఉన్నవారైతే ఆ నాన్‌వెజ్‌ రుచులను ఓపట్టాన మరచిపోలేరు. రాజకీయాలతో పాలన వ్యవస్థతో సంబంధంలేని సామాన్యులకు ఏపీ భవన్‌ అంటే ఆ కమ్మకమ్మని రుచులే గుర్తుకొస్తాయి. ఈ సౌకర్యం కూడా ఎన్టీఆర్‌ హయాంలోనే వెుదలైంది. అంతకుముందు, ప్రముఖుల కోసం చిన్న పూటకూళ్ల ఇల్లు ఉండేది. ముందుగా ఆర్డరు చేస్తేనే, వండిపెట్టేవారు. కుదరకపోతే, కడుపు మాడ్చుకోవాల్సిందే. తినడానికి ఏమీ దొరికేది కాదు. అతిథులకూ ప్రవాసులకూ తెలుగు వంటలు రుచి చూపించే లక్ష్యంతో ఎన్టీఆర్‌ ఓ క్యాంటీన్‌ ఏర్పాటు చేయించారు. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన సాయిక్యాటరర్స్‌ 1986 నుంచి ఇప్పటివరకూ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. మధ్యలో కొంతకాలం అశోక హోటల్స్‌వారు బాధ్యతలు తీసుకున్నా మధ్యలోనే వదిలేశారు. మళ్లీ సాయిక్యాటరర్స్‌కే పగ్గాలు దక్కాయి. ఈ సంస్థ సింగపూర్‌లో 'ఆంధ్రా కర్రీ' పేరుతో హోటల్‌ నడుపుతోంది. రాజీవ్‌గాంధీ, వాజ్‌పేయి, అద్వానీ, వి.పి.సింగ్‌, అరుణ్‌శౌరీ, ప్రవోద్‌మహాజన్‌, ఒమర్‌అబ్దుల్లా వంటి రాజకీయ నాయకులూ మణిరత్నం, షారుక్‌ఖాన్‌, బాలకృష్ణ, జయప్రద, కృష్ణంరాజు, సత్యనారాయణ, వోహన్‌బాబు, శారద వంటి సినీతారలూ ఇక్కడి రుచులను ఆస్వాదించారు. మధ్యాహ్నం అన్నంతోపాటు పూరీ, రాత్రికి రొట్టె వడ్డిస్తారు. మటన్‌, చికెన్‌, చేపలకూర ప్రత్యేకం. రోజూ ఏడెనిమిది వందల మంది దాకా క్యాంటీన్‌ వంటకాలు రుచి చూస్తారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య వేయికిపైగా ఉంటుంది. జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు ఒమర్‌ అబ్దుల్లా ఉదయంపూట సైక్లింగ్‌ చేసుకుంటూ వచ్చి ఇక్కడి టిఫిన్‌ రుచిచూసి వెళ్లేవారు. ఓసారి రాహుల్‌గాంధీ కూడా వచ్చారు. ఇక్కడ రెండు విభాగాలున్నాయి. ఒకటేవో... సాధారణ ప్రజలకు. మరొకటి ప్రముఖులకు. రెండూ కిటకిటలాడుతూనే ఉంటాయి. ముఖ్యమంత్రుల్లో ఎన్టీఆర్‌ది ప్రత్యేక శైలి. ఆయన తెల్లవారుజామున నాలుగింటికంతా యోగా వ్యాయామం పూర్తిచేసుకునేవారు. వెంటనే ఓ చెంబునిండా గుమ్మపాలు తాగేవారు. ఆయన దిగారంటే, క్యాంటీన్‌ సిబ్బంది తెల్లవారుజామున రెండింటికే హర్యానా శివార్లకో అశాోకారోడ్డులో ఉండే క్రికెటర్‌ కీర్తీ ఆజాద్‌ తండ్రి భగవత్‌జా ఆజాద్‌ ఇంటికో వెళ్లి ఆవుపాలు తెచ్చేవారు. అల్పాహారంలో ఇడ్లీ, కుడుములు, దోసెలు ఉండేవి. చంద్రబాబు అల్పాహారంలో ఇడ్లీ, దోసె ఉండాల్సిందే. మధ్యాహ్నం సాధారణ శాకాహారం తీసుకొనేవారు. వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి మాంసాహార, శాకాహార వంటకాలు రెండూ ఆస్వాదించేవారు. కిరణ్‌కుమార్‌రెడ్డికూడా అంతే.
'ఒకసారు వారం రోజులు ఇక్కడే మకాం వేసి పెద్దపదవి తెచ్చుకున్నాడు. ఇంకోసారు నెలరోజులు సెంట్రల్‌ మినిస్టర్ల చుట్టూ తిరిగి బామ్మర్దికి కాంట్రాక్టు సాధించుకున్నాడు. ఏపీ భవన్‌లో కూర్చుంటే పనైపోతుందని గట్టి నమ్మకం! మరి, మా పనెందుకు కావడం లేదు సార్‌! రాష్ట్రంకాని రాష్ట్రంలో ఎన్నాళ్లుండాలి? మాకు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే అదృష్టమే లేదా?' అని ఆవేదనగా ప్రశ్నిస్తారు భవన్‌ సిబ్బంది. చాలామంది ఉద్యోగుల్లో ఈ నిస్పృహ కనిపిస్తుంది. నియామకం నుంచి రిటైర్మెంట్‌ దాకా సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం అంటే, ఎవరికైనా ఇబ్బందే. బంధువుల్ని చూడాలన్నా, ఆత్మీయుల్ని కలుసుకోవాలన్నా సుదీర్ఘ ప్రయాణం. ఏపీ భవన్‌కు వచ్చే ముఖ్య నేతలకు తమ కష్టాల కథ చెబుతూనే ఉంటారు. ఎవరో ఒకరు తమను ఒడ్డున పడేయకపోతారా అన్న ఆశ. వాళ్ల అమాయకత్వానికి ఏపీ భవన్‌ నర్మగర్భంగా నవ్వుకుంటోంది. అవునుమరి, ఎంతమంది నాయకుల్ని చూళ్లేదు. ఎన్ని హామీలు విన్లేదు. బోలెడంత అనుభవం! తనకే ప్రాణం ఉంటేనా, పాలిటిక్సులో చక్రం తిప్పేది. ఇప్పుడు మాత్రం ఏం తక్కువైంది... ఏపీ భవన్‌ అంటే, మినిస్టర్‌ విథవుట్‌ పోర్ట్‌ఫోలియో!
తెలుగు వైభవం
పీ భవన్‌లోని వివిధ భవనాల పేర్లు తెలుగుదనానికి అద్దంపడతాయి. అతిథులకోసం ఏర్పాటు చేసిన గృహసముదాయాలకు శబరి, స్వర్ణముఖి, గోదావరి... అంటూ నదుల పేర్లు పెట్టారు. వెుదటి అంతస్తులోని సభామందిరానికి గురజాడ అప్పారావు పేరును ఖరారు చేశారు. శబరి బ్లాక్‌లో గవర్నర్‌, ఉభయసభల అధిపతులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి వారికి ఆతిథ్యం ఇస్తారు. ఈ బ్లాక్‌లో వెుత్తం అయిదు సూట్లుంటాయి. అందులో ఒకటి గవర్నర్‌కు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రిజర్వు చేసి ఉంచుతారు. వెుదటి అంతస్తులో ఓ సూట్‌ స్పీకర్‌కు కేటాయిస్తారు. ఈ బ్లాక్‌ ఏపీ భవన్‌ ప్రధాన ప్రాంగణానికి వెనుకవైపున ఉంటుంది. దీనితర్వాత ముఖ్యమైన బ్లాక్‌ స్వర్ణముఖి. దీన్ని రాష్ట్రమంత్రులు, కేబినెట్‌స్థాయి వ్యక్తులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ గవర్నర్లకు కేటాయిస్తారు. దీనికి అనుబంధంగానే ముఖ్యమంత్రి కాటేజీ. వెుదటి అంతస్తులో సీఎం విశ్రాంతి మందిరం ఉంటుంది. కిందిభాగంలో వీఐపీలకూ సాధారణ సందర్శకులకూ రెండు ప్రత్యేకమైన గదులు ఉంటాయి. మంత్రులకు ఆతిథ్యం ఇచ్చే స్వర్ణముఖి బ్లాక్‌ నుంచి నేరుగా ముఖ్యమంత్రి కాటేజీలోకి రావడానికి ప్రత్యేక ద్వారం ఏర్పాటుచేశారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇతర ప్రభుత్వ అధికారులు, సాధారణపౌరుల కోసం 62 గదులతో నిర్మించిన బ్లాక్‌కు గోదావరి అని నామకరణం చేశారు. తొమ్మిది అంతస్తుల్లో నిటారుగా కనిపించే ఈబ్లాక్‌ ఏపీ భవన్‌కు ప్రధాన ఆకర్షణ. వసతిగృహాల నిర్వహణలో అధికారులు పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శ ఉంది. కొన్నిచోట్ల అయితే, ముక్కుమూసుకుని తిరగాల్సిన పరిస్థితి ఉందని చాలామంది నాయకులు ఫిర్యాదు చేశారు. దీని మీద ప్రభుత్వం ఓ కమిటీని వేసింది.
ఇట్లు..మీ సేవలో!
కొత్తగా ఎంపికైన ఎంపీలకు ఢిల్లీలో ఎక్కడేముందో తెలుసుకోవడం కష్టం కావడంతో.. 1985లో పార్లమెంట్‌ లైజనింగ్‌ యూనిట్‌ను ప్రారంభించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 60 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు సేవలందించడం దీని ప్రధాన విధి. క్రమంగా ఎంపీలు వ్యక్తిగత కార్యాలయాలను ఏర్పాటుచేసుకోవడంతో ప్రస్తుతం లైజనింగ్‌ యూనిట్‌కు పనిలేకుండాపోయింది.
* రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలయ్యే కేసులను సత్వరంగా పరిష్కరించే ఉద్దేశంతో 1986లో లీగల్‌సెల్‌ను ఇక్కడికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టులో నడిచే వాయిదాలకు సకాలంలో హాజరుకావడం ఈ విభాగం బాధ్యత. ముఖ్యమైన కేసుల విషయంలో సీనియర్‌ అడ్వొకేట్లతో సంప్రదింపులు జరుపుతారు. సుప్రీంకోర్టు న్యాయవాదులను ఇక్కడ అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌గా నియమిస్తారు.
* సమాచార పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో లైబ్రరీ, రీడింగ్‌రూమ్‌ నడుస్తున్నాయి.
* టీటీడీ సమాచార కేంద్రంలో శ్రీవారి దర్శనం, వసతి, ప్రత్యేక సేవల టిక్కెట్లు లభిస్తాయి.
* ఆప్కో చేనేతలు, ఆంధ్రప్రదేశ్‌ సన్నబియ్యం ఈ ఆవరణలోనే దొరుకుతాయి. అతిథులు, సిబ్బంది కోసం ఓ వైద్యశాల కూడా ఉంది.
-


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

Ratan Tata special article on Eenadu