సర్వం జగన్నాథం
సర్వం జగన్నాథం ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే... జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఆషాఢ శుద్ధవిదియ... పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు. భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది. జగన్నాథ జయజయధ్వానాలతో పూరీ నగరవీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించి పోతారు. భక్తిపారవశ్యంతో మైమరచిపోతారు. ఆ క్షణం అపురూపం. స్వరం జగన్నాథం. రెండు నెలల ముందే... జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవు...