Happy new year
దీపమై వెలిగించు 'స్వా మీ! నా ఆధ్యాత్మిక సాధన ముందుకు సాగడం లేదు. ఉపవాసాలు చేశాను, పుణ్యక్షేత్రాల సందర్శన చేశాను, పూజలు చేశాను, యజ్ఞాలు చేశాను...' ఇంకేదో చెప్పబోతున్నాడు శిష్యుడు. 'సేవ చేశావా?'... చర్చ ముగిసిందన్నట్టు వెళ్లిపోయాడు గురువు. సేవలో - ఆస్తికుడు దేవుణ్ని తెలుసుకుంటాడు. నాస్తికుడు తనను తాను తెలుసుకుంటాడు. * * * నేను-నా కుటుంబం-నా కెరీర్... కొత్తసంవత్సర తీర్మానాలన్నీ 'నా' చుట్టూనే తిరుగుతాయి. బాగానే ఉంది. మరి, నలుగురి కోసం ఏం చేస్తున్నాం? మహాఅయితే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర యాచకుడికి ఓ రూపాయి వేస్తాం. భూకంపాలో వరదలో వచ్చినప్పుడు వందో రెండువందలో విరాళంగా ప్రకటిస్తాం. పాతబట్టల్ని ఉదారంగా పనిమనుషులకిస్తాం. అదంతా దానవో ధర్మవో అవుతుంది. మనం మాట్లాడుతున్నది బాధ్యత గురించి. సామాజిక బాధ్యత గురించి. నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం...మనచుట్టూ అనేకానేక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించడంలో మన పాత్ర ఏమిటి? * * * మంచిపని చేయడానికి మహాత్ముడే కానక్కర్లేదు. మానవత్వం చూపడానికి మదర్‌థెరీసా రానక్కర్లేదు. ఆ వారసత్వాన్ని మనమూ అందిపుచ్చుకోవచ్చు...