Eenadu Sunday (01/01/2012)




సమాజం పిలుస్తోంది!
నేను, నా జీవితం, నా చదువు, నా ఉద్యోగం, నా ఇల్లు, నా బ్యాంక్‌ బ్యాలెన్సు అనుకుంటే నూతిలోని కప్పకీ, ఒడ్డునున్న మనిషికీ తేడా ఏం ఉంటుంది? సమాజం కోసం కొంత సమయం కేటాయిస్తేనే జీవితానికి సార్థకత. 'స్వచ్ఛంద సేవ'లో ఆ అవకాశం ఉంది. వాలంటీర్ల కొరతతో సతమతమైపోతున్న స్వచ్ఛంద సంస్థలకు చేయూతనిద్దాం రండి.
చ్చిన పనే చేస్తాం. పిల్లలకు పాఠాలు చెబుతాం. గృహిణులకు యోగా నేర్పుతాం. వృద్ధులతో కాలక్షేపం చేస్తాం. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం. అదీ, వీలున్నప్పుడే చేస్తాం.
రోజుకో గంట. వారానికో రోజు. నెలకో నాల్రోజులు. ఏడాదికో పదిహేనురోజులు.
చేసినంతసేపూ ఇష్టంగా చేస్తాం. మమేకమైపోతాం. ఆ శ్రమలో కష్టం ఉండదు. అలసటే అనిపించదు. కొండంత సంతృప్తి! ప్రతిఫలాన్ని కోరుకోం కాబట్టి, ఆశనిరాశలుండవు. బాసిజం వూసేలేదు కాబట్టి, ఎవరో నెత్తిన కూర్చుని అజమాయిషీ చేస్తున్న భావనే కలగదు.
ఆ అవకాశం ఒక్క స్వచ్ఛంద సేవలోనే ఉంది.
ఆ అదృష్టం వాలంటీర్లకే దక్కుతుంది.
కాస్త తీరికుంటే చాలు, తీరిక చేసుకుంటే చాలు. 'స్వచ్ఛంద సేవ' అపారమైన ఆత్మసంతృప్తినిస్తుంది, వెలకట్టలేని ఆనందాన్ని పంచుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, పదవీవిరమణ చేసిన పెద్దలు...ఎవరైనా ఆ సేవానుభూతిని పొందడానికి అర్హులే. బ్రిటన్‌ లాంటి చోట్ల అయితే జనాభాలో పాతిక నుంచి ముప్ఫైశాతం మంది వాలంటీర్లే. అంత చైతన్యం మనదగ్గరా ఉంటేనా, వందకోట్ల ప్రజల్లో పాతిక కోట్లమంది స్వచ్ఛంద సేవకులు తయారవుతారు. ఒక్కొక్కరు రోజుకో గంట కేటాయించినా, పాతిక కోట్ల పనిగంటలు! ఆమాత్రం చొరవ చాలు... సమస్యల్లేని సమాజాన్ని నిర్మించుకోవచ్చు.
హాబీ వేరు. స్వచ్ఛంద సేవ వేరు. హాబీ మనకు మాత్రమే తృప్తినిస్తుంది. స్వచ్ఛంద సేవ సమాజానికీ ఉపయోగపడుతుంది. ఫలితాలూ ప్రభావాలూ కళ్లముందే కనిపిస్తాయి. ఇందులో వ్యక్తిత్వ వికాస కోణమూ ఉంది. అదే ఇప్పుడు, కాలేజీ క్యాంపస్‌లనూ కార్పొరేట్‌ ఆఫీసులనూ ఆకర్షిస్తోంది.
మార్పు సంకేతం...
వాలంటీర్‌గా పనిచేయడం అంటే, సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛా జగత్తులో కాలుపెట్టడం. పరిమితమైన అనుభవాలతో పరిమితమైన భావజాలాల మధ్య బతికే బతుకు, జైలు జీవితం కంటే ఎక్కువేం కాదు. పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచే మన చుట్టూ ఓ కనిపించని కంచె ఉంటుంది. పల్చని ఇనుపతెరలు పహారాకాస్తూ ఉంటాయి. మన ఇల్లు, మన కుటుంబం, మన స్నేహితులు...అంతా ఇరుకిరుకుగా ఉంటుంది. బయటికెళ్తే బోలెడంత ప్రపంచం. రకరకాల మనుషులు. భిన్నమైన మనస్తత్వాలు. లెక్కలేనన్ని సమస్యలు. బుద్ధుడికైనా మహావీరుడికైనా గడపదాటాకే బుద్ధి వికసించింది. పదిమంది పిల్లలకు ఇంగ్లిష్‌ నేర్పడం, ఏదైనా స్వచ్ఛంద సంస్థ వెబ్‌సైట్‌ డిజైన్‌ చేయడం, వైద్యశిబిరం నిర్వహించడం, పర్యావరణ అవగాహన సదస్సులు జరపడం...ఆ బాధ్యత భుజానికెత్తుకోగానే మనలో జవాబుదారీతనం అలవడుతుంది. ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాలన్న నిబద్ధత ఏర్పడుతుంది. మనకు తెలియకుండానే మన జీవితం క్రమశిక్షణ బాట పడుతుంది. అది జీవనశైలి మీదా ప్రభావం చూపుతుంది. అప్పుడూ ఇరవైనాలుగు గంటలే. ఇప్పుడూ ఇరవైనాలుగు గంటలే. అందులోంచి ఓ రెండు గంటల్ని పక్కన పెట్టి, స్వచ్ఛంద సేవకు కేటాయించడం అంటే, మాటలా? ఓ వోస్తరు మేధోమథనమే జరుగుతుంది. నిజానికి, మనల్ని మనం నిష్పాక్షికంగా అంచనా వేసుకునే ప్రక్రియ కూడా ఇప్పుడే వెుదలవుతుంది.
అర్ధరాత్రి దాకా టీవీ చూడ్డం మానెయ్యాలి. పొద్దున్నే లేవాలి.
సెల్‌ఫోన్‌ కబుర్లు తగ్గించాలి.
ఛాటింగ్‌ ఆదివారాలకే పరిమితం చేయాలి.
బ్లాగింగ్‌కు బానిసైపోకూడదు.
...చిట్టా పెరిగేకొద్దీ ఎంత సమయం, ఎంత డబ్బు, ఎంత శక్తి వృథా అయిపోతున్నాయో అర్థమవుతుంది. రెండుగంటల కోసం వెుదలైన కసరత్తు... జీవితకాలానికి సరిపడా 'టైమ్‌ మేనేజ్‌మెంట్‌'ను నేర్పుతుంది.
విత్తనం వెులకై, చిగురై, వెుక్కై...చేతికంది వస్తుంటే రైతుకెంత ఆనందం! వాలంటీరు పొందే సంతృప్తీ అలాంటిదే. మన స్థోమతను బట్టి ఏ స్వచ్ఛంద సంస్థకో అనాథ శరణాలయానికో చేతనైనంత డబ్బు ఇచ్చి బాధ్యత పూర్తయిందని చేతులు దులుపుకోవడం వేరు. ఇక్కడలా కాదు. ప్రతి మలుపూ కళ్లారా చూస్తాం. ఆ మార్పులో మనమూ భాగస్వాములం అవుతాం.
ఓ పసివాడు పాఠం టకటకా అప్పజెప్పేస్తాడు.
ఫర్వాలేదు, బాగానే అర్థమౌతోంది.
ఓ గృహిణి గడగడా ఇంగ్లీషు మాట్లాడేస్తుంది.
వెరీగుడ్‌! ఎంత తొందరగా పట్టేసుకున్నావు తల్లీ!
ఓ మురికివాడ తలంటుకున్నంత శుభ్రంగా తయారవుతుంది.
కలా, నిజమా అన్నంత సంభ్రమం.
ఓ గవర్నమెంటు ఆఫీసరు, మనం కనిపించగానే కర్చీఫ్‌తో చెమటలు తుడుచుకుంటాడు.
ఆర్టీఐ బాణం గుచ్చుకోవాల్సిన చోటే గుచ్చుకుందని అర్థం.
చిన్న మార్పే. వాలంటీర్‌ మీద చూపే ప్రభావం మాత్రం చాలా పెద్దది. అన్నిటికంటే ముందు, 'నేను చేయగలను, ఏదైనా సాధించగలను' అన్న నమ్మకం కలుగుతుంది. ఆ ఆత్మవిశ్వాసం.. పుస్తకమంతా బట్టీకొట్టి పరీక్షలకు వెళ్తున్నప్పుడు లేదు, యూనివర్సిటీ గోల్డ్‌మెడలిస్టు హోదాలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు లేదు, ఆఫీసులో కీలకమైన ప్రాజెక్టు చేస్తున్నప్పుడు లేదు.
ఇప్పుడెలా వచ్చింది?
అంతా స్వచ్ఛంద సేవ మహత్యం!
ఒంటరితనంతో బాధపడుతున్నవారికీ, డిప్రెషన్‌లాంటి సమస్యలు వేధిస్తున్నవారికీ స్వచ్ఛంద సేవను మించిన చికిత్సలేదంటారు నిపుణులు. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ ద్వారా ఆ తేడాను గుర్తించగలిగారు కూడా. అంతమంది మధ్య, అంతమంది కోసం పనిచేస్తున్నప్పుడు ఒంటరి భావనకు చోటెక్కడిది? ఒక్కరోజు కనిపించకపోతే, 'ఎక్కడున్నారు?' అన్న పలకరింపులు. ఒంట్లో నలతగా ఉంటే, 'ఎలా ఉన్నారు?' అన్న పరామర్శలు. మానసిక సమస్యలకు బంధాల్ని మించిన మందేముంది? ఎంతోకొంత సమయాన్ని స్వచ్ఛంద సేవకు కేటాయించేవారు, మిగిలినవారితో పోలిస్తే ఆరోగ్యంగా ఉంటారనీ, ఎక్కువకాలం బతుకుతారనీ మిచిగాన్‌ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. మనకు బాగా ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉండదు. మనసు సేదతీరుతుంది. గుండె సాఫీగా పనిచేసుకుపోతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. నాలుగు ప్రాంతాలకు వెళ్లడం, నలుగుర్నీ కలవడం...ఇలా బయటి పనులు పెట్టుకోవడం వల్ల ఆ టీవీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాం. సోఫాకు అతుక్కుపోవడం ఆగిపోతుంది. చురుగ్గా తిరుగుతాం కాబట్టి, శరీరానికీ వ్యాయామమే!
కెరీర్‌ నిచ్చెన..
ఓ మంచి స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో పనిచేయడమంటే, అనుభవాల యూనివర్సిటీలో అడ్మిషన్‌ దొరికినట్టే! సంస్థ నిర్వహణ, సభ్యుల మధ్య సమన్వయం, నిధుల సేకరణ, కమ్యూనికేషన్‌ సామర్థ్యం, మీడియా సంబంధాలు, లక్ష్య సాధనకు అనుసరించే వ్యూహాలూ... అతిదగ్గర నుంచి గమనిస్తాం. ఆ అనుభవం వృత్తిఉద్యోగాల్లో కూడా ఉపయోగపడుతుంది.
'వాలంటీర్‌' హోదా కొలువులకు సరికొత్త అర్హత. 'రెజ్యూమే'లో ఆ మాట ఉంటే, దాదాపుగా ఉద్యోగం వచ్చేసినట్టే. చదువు, గతానుభవం తదితర విషయాల్లో సరిసమానమైన అర్హతలు ఉంటే, ఆ పదిమందిలోనో పాతికమందిలోనో 'వాలంటీర్‌'కే అవకాశం ఇస్తున్నారు మానవ వనరుల నిపుణులు. సామాజిక బాధ్యతగా కార్పొరేట్‌ సంస్థలు చేపట్టే వివిధ కార్యక్రమాల నిర్వహణ, స్వచ్ఛంద సేవలో అనుభవం ఉన్న ఉద్యోగులకే అప్పగిస్తున్నారు. చాలా కంపెనీల్లో స్వచ్ఛంద సేవకుల బృందాలున్నాయి. ఐబీఎమ్‌ ఉద్యోగుల్లో పదిహేను శాతం మంది వాలంటీర్లే. వీరంతా క్రై, పరిక్రమ లాంటి సేవాసంస్థలకు తమవంతు సహకారం అందిస్తారు. గోద్రెజ్‌ పరివారంలోనూ ఈ సంస్కృతి ఉంది. ఉద్యోగి కుటుంబ సభ్యులను కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తారు. వర్ల్‌పూల్‌ తమిళనాడులోని కొన్ని గ్రామాల్ని దత్తత తీసుకుంది. సిబ్బంది సాయంతో అక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్రానికి సంబంధించి రెడ్డీస్‌ ల్యాబ్స్‌, జీఎమ్‌ఆర్‌, శాంత బయోటెక్నిక్స్‌ వంటి సంస్థలు కూడా కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా చాలా కార్యక్రమాలు చేపట్టాయి. 'వాలంటీర్‌గా పనిచేశాడంటే, సామాజిక స్పృహ ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉండితీరతాయి. నలుగురితో కలిసి పనిచేయడం అలవాటై ఉంటుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లగలడు. క్షేత్రస్థాయిలో సమస్యల్ని పరిష్కరించిన అనుభవం ఉండే ఉంటుంది. ఏ కార్పొరేట్‌ సంస్థ అయినా, ఇలాంటి ఉద్యోగుల్నే కోరుకుంటుంది' అంటారు హెచ్‌ఆర్‌ నిపుణులు రోహిణి.
పైచదువుల విషయంలో, స్వచ్ఛంద సేవ అదనపు అర్హత. దాదాపుగా అన్ని విదేశీ విశ్వవిద్యాలయాలూ 'కమ్యూనిటీ వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌'కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. వృత్తీ ప్రవృత్తీ ఒకటే అయితే బావుండని అనుకునేవారు, ఏ స్వచ్ఛంద సంస్థలోనో కొంతకాలం పనిచేసి, సామాజిక సేవా రంగంలో మంచి ఉద్యోగం వెతుక్కోవచ్చు. సేవ అంటే...చిన్న ఆఫీసుగది, మట్టికుండలో నీళ్లు, రబ్బరు చెప్పులూ, ముతక గుడ్డలూ గుర్తుకు రావాల్సిన అవసరం లేదు. వచ్చినా అదంతా పాత మాట. ఇప్పుడు, ఎన్జీవోలు కార్పొరేట్‌ వాతావరణంలో నడుస్తున్నాయి. వేలకొద్దీ జీతాలూ ఎయిర్‌ కండిషన్డ్‌ ఆఫీసులూ సాధారణమైపోయాయి. 'సామాజిక బాధ్యతతో కూడిన ఉద్యోగం' కోరుకునే వారికి ఈ రంగంలో బోలెడన్ని అవకాశాలు. స్వచ్ఛంద సేవ చదువుల మీదా వృత్తి ఉద్యోగాల మీదా సానుకూల ప్రభావం చూపుతుంది. 'వాలంటీర్లుగా సేవలు అందించే ఉద్యోగులు మిగిలినవారితో పోలిస్తే విధి నిర్వహణలో ముందుంటున్నారు. వాలంటీర్లుగా పేర్లు నవోదు చేసుకున్న విద్యార్థులు పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు' అని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెబుతోంది.
అండగా...
స్వచ్ఛంద సేవకు రెండు మార్గాలున్నాయి. ఒకటి...ఒంటరిగానో ఓ నలుగుర్నీ కూడగట్టో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం. ఇలాంటి సందర్భాల్లో, మనకంటూ ఓ వ్యవస్థను నిర్మించుకోవాలి. నిధుల సేకరణ నుంచి మీడియా సంబంధాల దాకా అన్నీ మనమే చూసుకోవాలి. అలాంటప్పుడు, ప్రధాన లక్ష్యం మీద దృష్టిసారించలేం. అప్పటికే ఆ రంగంలో పేరుప్రతిష్ఠలున్న స్వచ్ఛంద సంస్థల తరఫున పాల్గొనడం రెండో పద్ధతి. కాకపోతే, ఒకటిరెండుసార్లు ఆ సంస్థ ప్రాజెక్టుల్ని సందర్శించడం ద్వారా విశ్వసనీయతనూ చిత్తశుద్ధినీ నిర్ధారించుకున్నాకే...సభ్యత్వం తీసుకోవాలి. అదృష్టవశాత్తు, లక్ష్యశుద్ధి ఉన్న సంస్థలకు దేశంలో కొదవలేదు. 'యూత్‌ ఫర్‌ సేవ'కు దేశవ్యాప్తంగా వాలంటీర్లు ఉన్నారు. స్వచ్ఛంద సేవకుల సాయంతోనే విద్య, ఆరోగ్యం, పర్యావరణం తదితర రంగాల్లో సేవలు అందిస్తోంది. మురికివాడల పిల్లలకూ అనాథలకూ ఇంగ్లీషు నేర్పుతోంది. కంప్యూటర్‌ పాఠాలు చెబుతోంది. లైబ్రరీలు నడుపుతోంది. వినాయక చవితికి మట్టి ప్రతిమల్ని ప్రోత్సహిస్తోంది. 'చదువులు అయిపోగానే లేదా కెరీర్‌ ప్రారంభించడానికి కాస్త ముందుగా...మా ప్రాజెక్టులకు వాలంటీర్‌గా చేయవచ్చు. ఆతర్వాత కూడా వీలునుబట్టి ఎంతోకొంత సమయం కేటాయించవచ్చు' అంటారు ఆ సంస్థ హైదరాబాద్‌ విభాగ ప్రతినిధి. ఐవాలంటీర్‌ కూడా దాదాపుగా ఇలాంటి ఆలోచనలతోనే పనిచేస్తోంది. 'రోజుకు రెండు గంటలు కేటాయించండి చాలు. సమాజంలో మార్పు తీసుకొద్దాం' అంటూ 'మేక్‌ ఎ డిఫరెన్స్‌' వాలంటీర్లను ప్రోత్సహిస్తోంది. మురికివాడల పిల్లల్లో ఈ సంస్థ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుతోంది. కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని అందిస్తోంది. సామాజిక స్పృహ ఉన్న ఓ ఇరవైమంది విద్యార్థులు దీన్ని స్థాపించారు. ఇంగ్లిష్‌ వాలంటీర్లుగా, కంప్యూటర్‌ వాలంటీర్లుగా, ప్లేస్‌మెంట్‌ వాలంటీర్లుగా దాదాపు వేయిమంది యువతీయువకులు సేవలు అందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకంగా స్వచ్ఛంద సేవకుల విభాగం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న రామకృష్ణమఠం శాఖల్లో స్వచ్ఛంద సేవకు అవకాశం ఉంది. కొద్దిరోజుల పాటు పూర్తిస్థాయి వాలంటీర్‌గా పనిచేయాలనుకునే వారికి 'యూత్‌ ఫర్‌ సేవ', 'ఐ వాలంటీర్‌' లాంటి సంస్థలు స్పాన్సర్‌షిప్‌లు కూడా ఇస్తున్నాయి. అపీజే గ్రూప్‌ ఉత్తమ స్వచ్ఛంద సేవకులకు అవార్డులు ప్రకటిస్తోంది.
ఆధ్యాత్మికత...
ధ్యానంలో ప్రార్థనలో ఎంత మనశ్శాంతిని పొందగలవో, అంతకు రెట్టింపు ఆనందం సేవా కార్యక్రమాల ద్వారా అనుభవంలోకి వస్తుంది. అన్ని మతాలూ దీనజన సేవకు ప్రాధాన్యం ఇచ్చాయి. గీతలో కృష్ణుడు కర్మయోగమని చెప్పవచ్చు, గ్రంథ్‌సాహిబ్‌లో గురునానక్‌ 'నిష్కామ్‌సేవ' అని నిర్వచించి ఉండవచ్చు. అంతర్లీన భావం ఒక్కటే... దీనజన సేవలో దైవత్వం ఉంది. 'నలుగురికీ సేవ చేస్తున్నప్పుడు మనిషి అహాన్ని వదులుకుంటాడు. పంచుకోవడంలోని ఆనందాన్ని తెలుసుకుంటాడు. ఒక్కసారి ఆ దివ్యానందాన్ని రుచి చూస్తే, నాదీ అన్న భావనే ఉండదు. నేను, నాది...అనుకున్నంత కాలమే ఐహికమైన బాధలు' అని బోధిస్తారు స్వామి చిదాత్మానంద. 'డబ్బుతో ఏదైనా సాధించవచ్చని అనుకుంటాం. అదంతా భ్రమ. సేవతోనే ఏ మార్పు అయినా సాధ్యమవుతుంది' అంటారు 'ద గివ్‌ బ్యాక్‌ సొల్యూషన్‌' రచయిత్రి సుసాన్‌ స్కాగ్‌. సేవ ద్వారా తమ జీవితాల్ని మార్చుకున్న వాలంటీర్ల అనుభవాలను తన పుస్తకంలో పొందుపరిచారు సుసాన్‌. అందులో రకరకాల అనుభవాలున్నాయి. అనారోగ్యాన్ని గెలిచామన్నవారు ఉన్నారు. కష్టాలకు దూరమయ్యామన్నవారు ఉన్నారు. ఒత్తిడి ఎగిరిపోయిందన్నవారు ఉన్నారు. ఏకాగ్రత పెరిగిందన్నవారు ఉన్నారు. దేవుణ్ని చూడగలిగామని చెప్పినవారూ ఉన్నారు.
నిజంగా, సేవకు అంత శక్తి ఉందా?
ఈ ప్రశ్నకు ఒకటే సమాధానం... 'మనిషిలో అంతర్లీనంగా ఆ శక్తి ఉంది.
సేవ - తట్టిలేపింది. వెలుగు చూపింది'.
సేవతో ఆత్మవిశ్వాసం
- శ్యామ్‌, ఇట్‌ ఈజ్‌ టైమ్‌ టు మేక్‌ ఎ డిఫరెన్స్‌
మేం ఉండేది హైదరాబాద్‌లోని వోతీనగర్‌లో. బోరబండ మీదుగా రోజూ ఆఫీసుకు వెళ్తుంటాను. రోడ్లన్నీ గతుకులమయం. ఎవరో కాంట్రాక్టరు అసంపూర్తిగా వదిలేసినట్టున్నాడు. వర్షాకాలంలో అయితే నరకమే. ప్రభుత్వాన్నీ ప్రజాప్రతినిధుల్నీ తిట్టుకోవడం తప్పించి ఏమీ చేయలేని పరిస్థితి. రెండ్రోజుల తర్వాత తెలిసింది...నేనేం చేయగలనో! మా కంపెనీ ఆవరణలో 'ఇట్‌ ఈజ్‌ టైమ్‌ టు మేక్‌ ఎ డిఫరెన్స్‌' (ఐటీఎమ్‌డీ) స్వచ్ఛంద సంస్థ సమాచార హక్కు చట్టంపై అవగాహన శిబిరం నిర్వహించింది. ప్రజల చేతిలోని పాశుపతాస్త్రం గురించి వివరంగా చెప్పారు. మరో ఆలోచన లేకుండా వాలంటీర్‌గా పేరు నవోదు చేసుకున్నాను. తొలి అస్త్రం బోరబండ రోడ్డు మీదే గురిపెట్టాను. అధికారుల్లో కదలిక వచ్చింది. చకచకా పనులు పూర్తిచేశారు. ఎక్కడ ఏ చిన్న సమస్య కనిపించినా...వెంటనే ఆగిపోతాను. పరిష్కారం గురించి ఆలోచిస్తాను. చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటాను. టీవీ ఛానళ్ల చర్చా కార్యక్రమాల్లో తరచూ కనిపించే ప్రజాప్రతినిధుల్లో ఎంతమంది తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ నిధులను సమర్థంగా ఖర్చు చేస్తున్నారనే కోణంలో సమాచారహక్కు ద్వారా వివరాలు సేకరిస్తున్నాను. క్షేత్రస్థాయిలో నిర్ధారించుకున్నాక ప్రజల ముందు పెట్టాలన్నది ఆలోచన. ఐటీ ఉద్యోగిగా నా విధులు నిర్వర్తిస్తూనే...ఒక పౌరుడిగా సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది.
దారి తెలిసింది...
- శివకృష్ణ, రామకృష్ణ మఠం
ఇంటర్‌లో మాస్టారు చెప్పిన వివేకానందుడి పాఠం నా మీద చాలా ప్రభావం చూపింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదివేరోజుల్లో ఓ మిత్రుడు స్వామీజీ రచించిన 'కర్మయోగం' పుస్తకాన్ని కానుకగా ఇచ్చాడు. అదే నన్ను రామకృష్ణ మఠానికి దగ్గర చేసింది. నిరుపేదలకు వైద్యం, నిర్భాగ్యులకు అన్నం, వ్యక్తిత్వ వికాసం...మఠం చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలు నన్ను ఆకట్టుకున్నాయి. స్వచ్ఛంద సేవకుడిగా ఆ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. పుస్తకశాలలో బాధ్యతలంటే మరింత ఉత్సాహం! చుట్టూ వివేకానందుడి గ్రంథాలు. ప్రతి పుస్తకం ఒక విజ్ఞాన భాండాగారమే. స్వచ్ఛంద సేవలో పాల్గొంటూనే ఆ సాహిత్యాన్ని చదువుకున్నాను. 'సేవ అనేది సమాజాన్ని బాగుచేయడానికి కాదు. నీ కోసమే, నిన్ను నీవు ఉద్ధరించుకోడానికే' అంటాడు వివేకానందుడు. ఎంత గొప్పమాట! సేవను మించిన వ్యక్తిత్వవికాస మార్గం లేదు. సేవాపథంలో ఉన్నవారు సమయాన్ని వృథాచేసుకోరు. చెడు ఆలోచనలు పారిపోతాయి. ఏకాగ్రత సాధ్యమవుతుంది. ఒత్తిడి ఎగిరిపోతుంది. అన్నిటికీ మించి సత్సాంగత్యం దొరుకుతుంది. మనలాంటి భావాలే ఉన్న వ్యక్తుల మధ్య ఉండగలగటం గొప్ప వరం. నా దృష్టిలో సేవ...ఆధ్యాత్మిక అభ్యంగన స్నానం. మనసును శుభ్రం చేసుకోడానికి ఇంతకుమించిన మార్గం లేదు.
పొందుతున్నదే ఎక్కువ!
- హరిణి, నచికేత తపోవన్‌
స్వచ్ఛంద సేవ ద్వారా నలుగురికీ ఏదో మంచి చేస్తున్నామని భ్రమపడతాం. నిజానికి, మనం ఇస్తున్నదాని కంటే పొందుతున్నదే ఎక్కువ. అమెరికా నుంచి తిరిగొచ్చాక, పిల్లల బాధ్యతల కారణంగా ఉద్యోగం చేయకూడదనుకున్నాను. కొంత సమయాన్ని స్వచ్ఛంద సేవకు కేటాయించాలన్నది నా ఆలోచన. 'నచికేత తపోవన్‌' ఆశయాలూ ఆధ్యాత్మికతా నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో ఓ పాఠశాల నడుస్తోంది. అందరూ నిరుపేదల పిల్లలే. అందులో అనాథలు కూడా ఉన్నారు. ఓ విద్యార్థి టాయిలెట్‌కు వెళ్లే తొందర్లో బట్టలు పాడుచేసుకున్నాడు. సమయానికి ఆయా కూడా లేదు. కన్నతల్లికి కబురుపెట్టారు. ఇంకా రాలేదు. పాపం! పసివాడు ఎంతసేపని భరిస్తాడు! బిక్కవెుహం వేసుకుని చూస్తున్నాడు. అప్పుడే స్వామి నచికేతానంద వచ్చారు. ఆ పిల్లవాడిని తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయించారు. బట్టలు పిండి ఆరేశారు. ఆ సంఘటన నన్ను చాలా ప్రభావితం చేసింది. సేవలో అహం ఉండకూడదన్న సత్యం బోధపడింది. అంతేకాదు, గతంలో నేను చక్కని ఇంగ్లిష్‌ రాయలేనేవో అన్న భయం ఉండేది. అదంతా అపోహే అని తేలిపోయింది. 'నచికేతాంజలి' పత్రికకు నెలనెలా వ్యాసాలు రాస్తున్నాను. విద్యార్థులకు పాఠాలు చెప్పిన అనుభవం పిల్లల పెంపకంలో చాలా ఉపయోగపడుతోంది. కొన్నిసార్లు ఎంత బాగా బోధించినా పిల్లలకు అర్థంకాదు. వెుదట్లో నిరాశపడేదాన్ని. 'లోపం నాలోనే ఉందేవో. నా బోధన పద్ధతి మరింత మెరుగుపడాలేవో' అన్న పాజిటివ్‌ ఆలోచనా ధోరణి అలవరుచుకున్నాక...ప్రతి సమస్యా నన్ను నేను సరిచేసుకోడానికి ఓ మంచి అవకాశంలా అనిపిస్తోంది. స్వచ్ఛంద సేవ వల్లే నా ఆలోచనల్లో పరిపూర్ణత సాధ్యమైంది.
ఆ ప్రభావమే నడిపిస్తోంది
- మానస, యూత్‌ ఫర్‌ సేవ
నేను ఐటీ ఉద్యోగిని. ఇన్ఫోసిస్‌లో టెక్నాలజీ లీడర్‌గా పనిచేస్తున్నాను. ముందు నుంచీ సామాజిక సేవ మీద ఆసక్తి. ఓ సహోద్యోగి 'యూత్‌ ఫర్‌ సేవ' అనే స్వచ్ఛంద సంస్థను పరిచయం చేశారు. పర్యావరణం, విద్య, వైద్యం...తదితర అంశాల మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆ సంస్థ కృషిచేస్తుంది. వాలంటీర్‌గా చేరిన కొత్తలో అరకు యాత్రకు వెళ్లాం. ఓ వారంరోజులు ప్రజల మధ్యే ఉండి, ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఆ యాత్ర ఉద్దేశం. ఆ అనుభవం నా కళ్లు తెరిపించింది. దుర్భర దారిద్య్రాన్ని చూశాను. దాంతోపాటే ఆ అమాయక గ్రామీణుల్లోని ప్రేమాభిమానాల్నీ చూశాను. బహిష్టు సమయంలో పాటించాల్సిన కనీస ఆరోగ్య సూత్రాల మీద కూడా గ్రామీణులకు అవగాహనలేదని అర్థమైపోయింది. ఆతర్వాత ఇదే విషయం మీద మరింత అధ్యయనం చేశాను. 'యూత్‌ ఫర్‌ సేవ' ఆధ్వర్యంలో ఓ సర్వే నిర్వహించాం. ఆ మూడునాలుగు రోజులూ స్కూళ్లలో గైరు హాజరీ కూడా ఎక్కువ. కొందరైతే, ఆ వయసు రాగానే బడిమానేస్తారు. మనమంతా పెద్దగా పట్టించుకోని తీవ్ర సమస్య ఇది. 'యూత్‌ ఫర్‌ సేవ' ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఆరోగ్య సూత్రాల మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. పోషక విలువల గురించి వివరిస్తున్నాం. మారుమూల పల్లెల్లోని విద్యాసంస్థల్లో ఉచితంగా ప్యాడ్స్‌ పంపిణీ చేసే ఆలోచన కూడా ఉంది. మా సంస్థ ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని ప్రమాణాల మెరుగుదలకు కృషిచేస్తోంది. నేను జగద్గిరిగుట్ట స్కూల్‌కు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నాను. స్వచ్ఛంద సేవ చాలా తృప్తినిస్తోంది. వృత్తి జీవితం మీద కూడా ఆ ప్రభావం ఉంది. ప్రాజెక్టులో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు చాలా ఓపిగ్గా పరిష్కరిస్తున్నా. నలుగుర్నీ సమన్వయం చేసుకోవడం అన్నది సేవా కార్యక్రమాల ద్వారా అలవడింది. ప్రతి విషయాన్నీ సామాజిక కోణం నుంచీ ఆలోచించడం అలవాటైంది.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు