విహారయాత్రకు వెళ్తున్నారా? ఈ ఆప్‌లు సర్దుకోండి! (Eenadu 20.04.17)

వేసవి వచ్చేసింది కదా... ఇంట్లో పిల్లలకు సెలవులు కూడా వచ్చేసుంటాయి! ‘ఎక్కడికైనా సరదాగా వెళ్లొద్దామండీ’ అనే మాట ఇంట్లో వినిపిస్తుంటుంది. స్నేహితులైతే ‘ఎప్పటి నుంచో అనుకుంటున్నాం... ఈ సారైనా టూర్‌కి వెళ్దాం’ అంటుంటారు. ఇంకెందుకు ఆలస్యం... టికెట్‌లు బుక్‌ చేసేయండి, సామాన్లు సర్దుకోండి, విహారయాత్రకు సిద్ధమైపోండి! అదేమంత చిన్న విషయమా అంటారా? ఈ ఆప్‌లు, వెబ్‌సైట్ల గురించి తెలుసుకుంటే మీ టూర్‌ ప్రణాళిక చిటికెలో అయిపోతుంది! అవేంటో, వాటి ఆప్షన్లేంటో చూద్దాం!
ఎవరేం చెప్పారు... అక్కడేం బాగున్నాయి
 క్కడికైనా టూర్‌కి వెళ్తున్నాం అంటే... గతంలో ఆ ప్రాంతాన్ని చూసి వచ్చిన వారి నుంచి సమాచారం సేకరిస్తాం. అక్కడ ఏం బాగుంటాయి, ప్రత్యేకతలు ఏంటి, ఏ హోటల్‌లో దిగమంటారు లాంటి విషయాలు విచారిస్తాం. అంతర్జాలంలోనూ ఇలాంటి సమాచారం అందించే వెబ్‌సైట్‌ ఒకటి ఉంది. అదే www.travelistly.com.మీరు వెళ్లాలనుకుంటున్న నగరం/దేశం పేరును ఇందులో ఎంటర్‌ చేస్తే... అక్కడికి గతంలో వెళ్లినవారు తమ వెబ్‌సైట్లు/బ్లాగుల్లో రాసుకున్న సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తుంది. అక్కడి వాతావరణం, ఆహార పదార్థాలు, చూడాల్సిన ప్రాంతాల గురించి సచిత్ర కథనాలు, వీడియోలు ఈ వెబ్‌సైట్‌లో పొందొచ్చు. దీంతోపాటు ఆ ప్రాంతం సమాచారాన్ని వికీపీడియాలో చదువుకునేలా ఆ పేజీ నుంచే లింక్‌ ఇచ్చారు కూడా. మొబైల్‌ ఆప్‌లోనూ ఈ సర్వీసులు లభిస్తాయి.
పక్కా ప్రణాళిక కోసం 
టూర్‌కి వెళ్దాం అనుకునేటప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఏం చూద్దాం, ఏం చేద్దాం అంటూ ఆలోచనలతో సమయం వృథా చేసే బదులు www.triphobo.com వెబ్‌సైట్‌లోకి వెళ్లిపోండి. మీ ఆలోచనలు చెప్తే అదే చక్కగా ప్రణాళిక వేసి చూపిస్తుంది. మీరు ప్రయాణించాలనుకుంటున్న విధానం, ఎంత మంది లాంటి వివరాలు అందిస్తే ఖర్చు ఎంతవుతుందనేది చూపిస్తుంది. దీంతోపాటు ఈ వెబ్‌సైట్‌లో థింగ్స్‌ టు డూ, ట్రిప్‌ ప్లాన్స్‌, టూర్స్‌, వెకేషన్‌ అంటూ మరికొన్ని ఆప్షన్లున్నాయి. థింగ్స్‌ టు డూ ఆప్షన్‌లోకి వెళ్లి మీరు విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్న ప్రాంతం పేరు ఎంటర్‌ చేస్తే అక్కడ ఉండే ముఖ్యమైన ప్రదేశాలు, ఆసక్తికరమైన అంశాల గురించి వివరంగా సమాచారం దొరుకుతుంది.
ఎక్కడ నుంచి... ఎన్ని రోజులు
మీరు ఎక్కడ ఉన్నారు, ఎన్ని రోజులు టూర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు, ఎంత ఖర్చు పెడదామనుకుంటున్నారు... లాంటి వివరాలు చెబితే చాలు, మీ టూర్‌కు ప్రణాళికను సూచించే వెబ్‌సైట్‌ ఒకటుంది.అదే www.Destigogo. com.ఈ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి మీరుంటున్న ప్రాంతం వివరాలతోపాటు, మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతం స్థితిగతులూ నమోదు చేయాలి. అంటే మంచు ప్రదేశానికా, ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతానికా, అడ్వెంచరస్‌ టూర్‌కా లేక ఏదన్నా పెద్ద నగరానికా అనే వివరాలు ఇవ్వాలి. ఆ అంశాల ఆధారంగా ఈ వెబ్‌సైట్‌ మీ టూర్‌ ప్రణాళికను సిద్ధం చేసి చూపిస్తుంది. అందులో మన దేశంలోని ప్రాంతాలే కాకుండా, విదేశాల్లోని నగరాల గురించీ ఉంటుంది. ఆయా వివరాలు చూసుకొని అందులోంచే నేరుగా టికెట్‌లు, హోటల్‌ రూమ్‌లు బుక్‌ చేసుకోవచ్చు.
అన్నీ సర్దుకున్నారా?
సామాన్లన్నీ ప్యాక్‌ చేశావా? ఛార్జర్‌ బ్యాగులో వేశావా? టికెట్‌ ప్రింట్‌, ఆధార్‌ కార్డు పట్టుకున్నావా? విహార యాత్రకు బయలుదేరుతున్నాం అనగానే... ఇలాంటి ప్రశ్నలు ఓ వంద రెడీ అవుతాయి. దీంతో మనసులో తెలియని కంగారు మొదలవుతుంది. బయలుదేరే ముందు ఇలాంటి ప్రశ్నలేసుకునేకన్నా సామాన్లు సర్దుకున్నప్పుడే వేసుకుంటే కంగారు తప్పుతుంది కదా. ఇలాంటి ప్రశ్నల్ని ఒక జాబితాగా సిద్ధం చేసి అందించే ఆప్‌ ఒకటి ఉంది. అదే Packpoint. ఇందులో మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతం, తేదీ, ఎవరెవరు వెళ్తున్నారు, అక్కడ ఏమేం చేద్దామనుకుంటున్నారు లాంటి వివరాలు ఇవ్వాలి. అప్పుడు ఆయా అంశాలకు తగ్గట్టుగా చెక్‌ లిస్ట్‌ను సిద్ధం చేసి పెడుతుంది. దాని ఆధారంగా సామాన్లు సర్దుకోవడమే.
అక్కడి సంగతులు
క మనిషిని కలవడానికి వెళ్తున్నామంటేనే ఆ వ్యక్తి గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకుంటుంటాం. అలాంటిది కొత్త ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడి విషయాలు, వారి ఆచార వ్యవహారాలు, విధి విధానాలు తెలుసుకోవాలి కదా. దాని కోసం గూగుల్‌లో వెతికే కన్నా ఆ సమాచారాన్ని పద్ధతి ప్రకారం అందించే ఓ వెబ్‌సైట్‌లో చూసుకోవడం మంచిది. www.thebasetrip.com లోకి వెళ్లి మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతం పేరు ఎంటర్‌ చేయండి. ఉదాహరణకు మీరు పనామా అనే దేశం పేరు ఎంటర్‌ చేశారనుకోండి. అక్కడి కరెన్సీ, వాతావరణ పరిస్థితులు, పాస్‌పోర్టు, వీసా అవసరమా, అక్కడ ఎలాంటి పవర్‌ ప్లగ్‌లు వాడుతారు, కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఎలా ఉంది, అంతర్జాలం వేగం, రోడ్డు ప్రయాణ నిబంధనలు లాంటి విషయాలు విభాగాల వారీగా తెలుసుకోవచ్చు.
ఏముంటాయి... ఏం చేస్తారు
లానా ప్రదేశానికి వెళ్తాను అని చెప్తే చాలు... అక్కడ చూడాల్సిన ప్రముఖ ప్రదేశాలు, రుచి చూడాల్సిన ఆహార పదార్థాల జాబితాను అందించే ఆప్‌Google Trips. దీన్ని మొబైల్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్లడానికి టికెట్‌ బుక్‌ చేసుకోగానే ఆ సమాచారం మీ జీమెయిల్‌కి వస్తే... ఈ ఆప్‌లో ఆ ప్రాంతం పేరుతో ఓ టాస్క్‌ క్రియేట్‌ అయిపోతుంది. మీ టికెట్‌ల సమాచారం అందులో రిజర్వేషన్స్‌ ట్యాబ్‌లో చేరిపోతుంది. దాంతోపాటు ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రముఖ టూరిస్టు ప్లేస్‌లు, దేవాలయాలు, రెస్టరెంట్ల వివరాలు అందులో కనిపిస్తాయి. ఆ ప్లేస్‌కి సంబంధించిన గూగుల్‌ మ్యాప్‌ను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే ఆప్షనూ కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ మొబైల్‌కు నెట్‌ కనెక్టివిటీ పోయినా ఆఫ్‌లైన్‌ మ్యాప్‌ వాడుకోవచ్చు.
నంబర్లు సులభంగా...
టూర్‌లో ఉన్నప్పుడు మీ మొబైల్‌ లేదా గ్యాడ్జెట్లకు ఏదైనా సమస్య రావొచ్చు. లేదంటే ఇంట్లో ఏదైనా వస్తువు మొరాయించొచ్చు. అలాంటప్పుడు సంబంధిత కస్టమర్‌ కేర్‌తో మాట్లాడదామంటే ఆ నెంబర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కస్టమర్‌ కేర్‌ అధికారితో మాట్లాడటానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావొచ్చు. ఇలాంటి సందర్భాల్లో కస్టమర్‌ కేర్‌ వాళ్లే మీకు ఫోన్‌ చేస్తే బాగుంటుంది కదా. Aino ఆప్‌తో ఈ సౌకర్యం మీకు అందుతుంది. ఇందులో వివిధ సంస్థల కస్టమర్‌ కేర్‌ సర్వీసుల వివరాలుంటాయి. ఉదాహరణకు శాంసంగ్‌ సంస్థకు చెందిన కస్టమర్‌ కేర్‌ అధికారితో మాట్లాడాలంటే ఆప్‌లో శాంసంగ్‌ ట్యాబ్‌ను ఒత్తాలి. తర్వాత ఆప్‌ అడిగిన వివరాలు ఇస్తే... ఆ సంస్థ నుంచే మీకు కాల్‌ వస్తుంది.
ఎంతమంది... ఎప్పుడు
ప్రయాణానికి సామాన్లు సర్దుకున్నారు... టికెట్‌లు కొనుక్కున్నారు, కానీ అక్కడ వసతి గది బుక్‌ చేయడం మరచిపోయారా? అప్పటికప్పుడు ఫోన్లు చేసి రూమ్‌ బుక్‌ చేసుకుందామంటే అంత సులభం కాదు. కానీ మీ మొబైల్‌లో Airbnb ఆప్‌ ఉంటే ఈ ఇబ్బంది నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. మీరు విడిది చేద్దామనుకుంటున్న ప్రాంతంలో ఉన్న హోటళ్లు, ప్రైవేటు రూమ్‌ల వివరాలు ఈ ఆప్‌లో అందుబాటులో ఉంటాయి. ఎంత మంది వెళ్తున్నారు, ఎప్పుడు అనే వివరాలు ఆప్‌లో పొందుపరిస్తే దానికి తగ్గ వివరాలు వస్తాయి. వాటిని చూసి అక్కడి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో దొరికే ఆహార పదార్థాలు, జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాలు, కళాఖండాల ప్రదర్శనల జరిగే సమయం లాంటి వివరాలు కూడా ఈ ఆప్‌లో లభిస్తాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు