ChatGPT - Google: గూగులమ్మకు కొత్త గుబులు

గూగుల్‌... ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్‌ ఇంజిన్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది.


Updated : 30 Dec 2022

సవాలు విసురుతున్న ‘చాట్‌జీపీటీ’

కృత్రిమ మేధతో సరికొత్త ఆవిష్కరణ



గూగుల్‌... ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్‌ ఇంజిన్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. ఏ సందేహం వచ్చినా గూగులమ్మను అడగటం పరిపాటైంది. అలాంటి గూగులమ్మ ఇప్పుడు అప్రమత్తం కావల్సిన దశ వచ్చింది! తన అస్థిత్వానికి ముప్పు వాటిల్లుతుందా అని గూగుల్‌ ఆందోళన చెందుతోంది. కారణం- సాంకేతిక ప్రపంచంలో వచ్చిన సరికొత్త ఆవిష్కరణ- చాట్‌జీపీటీ!



చాట్‌జీపీటీ... కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో తయారైన చాట్‌బాట్‌ గూగుల్‌కు సవాల్‌ విసురుతోంది. ఇంకా సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రాకుండా, ప్రయోగ దశలోనే రెండు వారాల్లో 10లక్షల మంది యూజర్లను దాటిన ఈ చాట్‌జీపీటీని చూసి గూగుల్‌ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. రెండేళ్లలో ఇది గూగుల్‌ను దాటి పోతుందని అనుకుంటున్నారు.


ఏంటీ చాట్‌జీపీటీ



శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓపెన్‌ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన సాఫ్ట్‌వేరే ఈ చాట్‌జీపీటీ. 2015లో శామ్‌ ఆల్ట్‌మన్‌, ఎలాన్‌ మస్క్‌ కలసి 100 కోట్ల డాలర్లతో ఈ కంపెనీని ఆరంభించారు. 2018లో మస్క్‌ రాజీనామా చేశారు. అయినా పెట్టుబడులు మాత్రం పెడుతున్నారు. 2019లో మైక్రోసాఫ్ట్‌ కూడా ఇందులో 100 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టిందికోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.


అందుబాటులో ఉందా?


ప్రస్తుతానికి ఇదింకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఉచితంగా అందుబాటులోనే ఉంది. ఓపెన్‌ఏఐ.కామ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నమోదు చేసుకొని దీన్ని వినియోగించి చూడవచ్చు. వాడుతున్నవారి నుంచి సూచనలు తీసుకొని తీర్చిదిద్దుతున్నారు. లోపాలు లేకుండా పూర్తిస్థాయిలో ప్రజలందరికీ అందుబాటులో రావటానికి సమయం పడుతుంది.


ఏంటి దీని ప్రత్యేకత?


ఇంటర్నెట్‌లోని కోట్ల పదాల శిక్షణతో రూపొందిన ఏఐ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ జీపీటీ-3ని (జెనెరేటివ్‌ ప్రి ట్రైన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌-3) ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ప్రస్తుతానికి 175 బిలియన్‌ రకాల పారామితులతో కూడిన అత్యంత భారీ, శక్తిమంతమైన ఏఐ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌గా దీన్ని భావిస్తున్నారు. 300 బిలియన్‌ పదాలను దీని వ్యవస్థలో అమర్చారు.


మనుషుల మాదిరిగా రాతరూపంలో ఆవిష్కరించటమేగాకుండా, అనువాదాల్లో కూడా ఇది ఎంతో కచ్చితంగా ఉంటుంది. గూగుల్‌ సెర్చి మాదిరిగా ప్రశ్నలకు సమాధానాలను లిస్ట్‌ చేయటంతో ఆగకుండా... సులభంగా అర్థమయ్యేలా సమాధానాలను రాతరూపంలో రాస్తుంది. చాట్‌జీపీటీ. అంతేగాకుండా ఏవైనా అంశంపై కొత్త వ్యాసం కావాలన్నా, పరిశోధన పత్రాలు కావాలన్నా రాసిస్తుంది. అంతెందుకు టాపిక్‌ చెబితే కొత్త కవిత, లేఖలు కూడా తక్షణమే రాసిస్తుంది. మనుషులు మాట్లాడే వివిధ భాషలను అర్థం చేసుకొని సమాధానం ఇవ్వగలుగుతుంది. మనుషులు మాట్లాడుకున్నట్లే పిచ్చాపాటీ కబుర్లు చెబుతుంది. జోక్‌లు పేలుస్తుంది. వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే చాట్‌బోట్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి పరిధి చాలా పరిమితం. ఈ చాట్‌జీపీటీ మాత్రం వేగంగా, ఎదురుగా మనిషి కూర్చొని సమాధానం ఇచ్చినట్లే ఏది అడిగినా చెబుతుంది.


గూగుల్‌ ఎందుకు భయపడుతోంది?


గూగుల్‌లో ఏదైనా అడిగితే దానికి సంబంధించిన లింక్‌ల జాబితా వరుసగా వస్తుంది. కానీ అదే చాట్‌జీపీటీని అడిగితే... లింక్‌లు ఇచ్చి విడిచిపెట్టకుండా... ఆ అంశాన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లు వివరంగా అర్థం చేయిస్తుంది. అందుకే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గూగుల్‌ ఇంజిన్‌పై ఆధారపడటం తగ్గుతుందన్నది ఆందోళన. ‘‘గూగుల్‌ పని అయిపోయినట్లే! బహుశా మరో ఏడాదో రెండేళ్లలోనో కృత్రిమ మేధ గూగుల్‌ను విచలితం చేయబోతోంది. ఎల్లో పేజెస్‌ను గూగుల్‌ ఎలా దెబ్బతీసిందో... చాట్‌జీపీటీ గూగుల్‌కు అదే పని చేయబోతోంది’’అని జీమెయిల్‌ డెవలపర్‌ పౌల్‌ బుచెట్‌ హెచ్చరించటం గమనార్హం. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన గూగుల్‌.. చాట్‌జీపీటీకి దీటైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే పనిలో పడింది. కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా, చాట్‌జీపీటీకి మించి, బొమ్మలతో కూడిన సమాధానాలు ఇచ్చేలా కొత్త సాఫ్ట్‌వేర్‌తో రావాలని తమ కృత్రిమ మేధ బృందాలను సీఈవో సుందర్‌పిచాయ్‌ పురమాయించారని సమాచారం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు