వివాదాల సేతుసముద్రం

 వివాదాల సేతుసముద్రం

ఓడల ప్రయాణ దూరం తగ్గించేందుకు రామసేతు మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్‌ కాలువ’ తేవాలని తమిళనాడు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ ప్రతిపాదనపై తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దాంతో రాజకీయం మరింత వేడెక్కింది...




Published : 07 Feb 2023 00:23 IST

ఓడల ప్రయాణ దూరం తగ్గించేందుకు రామసేతు మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్‌ కాలువ’ తేవాలని తమిళనాడు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ ప్రతిపాదనపై తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దాంతో రాజకీయం మరింత వేడెక్కింది.


వివాదాల సేతుసముద్రం

దేశీయంగా తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకల మధ్య ఉన్న భూభాగాన్ని రామసేతుగా, ఆడమ్స్‌ బ్రిడ్జిగా వ్యవహరిస్తున్నారు. దాని మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్‌ కెనాల్‌’ ప్రాజెక్టును చేపట్టి తీరాల్సిందేనని తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం గట్టి పట్టు పడుతోంది. ఈ క్రమంలో గతనెల 12న అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. ఇక ఆలస్యం చేయకుండా సేతు సముద్రం ప్రాజెక్టును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేలా స్టాలిన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సేతుసముద్రం ప్రాజెక్టు విషయంలో కేంద్రం తీరు రైలును అడ్డుకోకుండా చైను లాగినట్లుందంటూ ఇటీవల పార్లమెంటులో డీఎంకే ఎంపీ, మాజీ కేంద్రమంత్రి టి.ఆర్‌.బాలు చేసిన వ్యాఖ్యలూ దుమారం రేపాయి. దశాబ్దాలుగా సేతుసముద్రం ప్రాజెక్టుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నేటికీ అది ఒక కొలిక్కి రాలేదు.

ప్రజల భావోద్వేగంతో ముడివడిన రామసేతును చీల్చి కాలువను తవ్వడాన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు ఆర్థికంగా మరింత బలపడాలంటే సేతు సముద్రం ప్రాజెక్టు కీలకమని ముఖ్యమంత్రి స్టాలిన్‌ చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును వద్దంటే యావత్‌ దేశానికే నష్టమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సరకు రవాణా కోసం ఓడలు శ్రీలంక మొత్తం చుట్టి ప్రయాణించాల్సి వస్తోంది. ఆ దూరాన్ని తగ్గిస్తూ 83.2 కిలోమీటర్ల మేర కాలువతో సేతు సముద్రం ప్రాజెక్టు ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు, పశ్చిమ తీరాలకు సరకు రవాణా సులువవుతుందని స్టాలిన్‌ వాదిస్తున్నారు.


సేతు సముద్రం ప్రాజెక్టును 1860లో అప్పటి మెరైన్‌ సర్వే అధిపతి, కమాండర్‌ ఏడీ టేలర్‌ ప్రతిపాదించారు. ఆ తరవాత కొన్నేళ్లపాటు దాని సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం తరఫున పరిశోధనలు జరిగాయి. తమిళనాడుకు చెందిన రామసామి మొదలియార్‌, మరికొందరు నిపుణులు సాంకేతిక అంశాల్లోనూ పరిశోధన చేసి ప్రాజెక్టు ప్రతిపాదనకు 1955లో ఓ రూపునిచ్చారు. ఆ తరవాత 1964లో నాగేంద్రసింగ్‌ నేతృత్వంలో మరో కమిటీని వేశారు. సేతు సముద్రం ప్రాజెక్టును రెండు విడతలుగా చేపడతామని 1999లో అప్పటి రక్షణ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ ప్రకటించారు. 2005 జులైలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మదురైలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో ప్రతిపాదిత వ్యయం రూ.2,427.40 కోట్లు. రామసేతును జాతీయ సంపదగా భావించి సేతుసముద్రం ప్రాజెక్టును ఆపించాలని కోరుతూ భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిపుణుల కమిటీ ద్వారా నివేదిక తెప్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రామసేతుకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలని కోర్టు సూచించింది. రాజేంద్ర కె.పచౌరి కమిటీ నివేదిక ప్రకారం ప్రత్యామ్నాయ మార్గం పర్యావరణ పరంగా, ఆర్థికంగా శ్రేయస్కరం కాదని కోర్టుకు కేంద్రం విన్నవించింది. ఇలా కోర్టులో వాదనలు నేటికీ జరుగుతున్నాయి. 2005లో సీఎస్‌ఐఆర్‌-నీరి నివేదిక ప్రకారం ప్రతిపాదించిన మార్గమే ఇప్పుడు తెరపై కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం గత ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎం.కరుణానిధి బలమైన పోరాటాలే చేశారు.


ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల రామసేతును విశ్వసించేవారి మనోభావాలు దెబ్బతింటాయని తమిళనాడులోని అన్నాడీఎంకే, భాజపాలు నిరసన తెలుపుతున్నాయి. సేతుసముద్రం ప్రతిపాదిత ప్రాంతం తక్కువ లోతుతో ఉండటంవల్ల ఎక్కువగా పూడిక తీయాల్సి వస్తుందని విపక్షాలు చెబుతున్నాయి. రామసేతుకు ఇబ్బంది లేకుండా తెచ్చే ప్రాజెక్టుకే మద్దతిస్తామని అవి అంటున్నాయి. కేంద్రమూ దానికే కట్టుబడి ఉన్నట్లు సంకేతాలున్నాయి. సేతుసముద్రం ప్రాజెక్టుతో గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌లో జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం కలుగుతుందని తమిళనాడులోని ప్రముఖ పర్యావరణ సంస్థ పూవులగిన్‌ నన్బర్గళ్‌ హెచ్చరిస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్ళినా కేవలం 30వేల టన్నుల బరువున్న ఓడలే ఆ మార్గం ద్వారా ప్రయాణించే వీలుందని పలువురు చెబుతున్నారు. ఇక్కడి పరిస్థితుల కారణంగా వేగం తగ్గించడం, దానివల్ల అధిక ఇంధనాన్ని ఖర్చుచేయడం లాంటివి ఆర్థిక భారాన్ని పెంచేవేనని విశ్లేషిస్తున్నారు. మరోవైపు సేతుసముద్రం ప్రాజెక్టుపై కేంద్రం 2021లో ప్రత్యేక కమిటీని వేసింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు మరెన్ని మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు