Eenadu Etaram (30_07_2011)
న్యూయార్క్ వర్క్‌షాప్‌లో పాఠాలు నేర్చుకుంది నిపుణులే. అక్కడ జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్)లో మెరిసింది మధునే. పదిహేడు సంవత్సరాల మొదటి ప్రదర్శన, పదిహేను రోజుల కిందట వర్క్‌షాప్ ఆ రెండు సందర్భాల మధ్య ఈ యువకుడి ఎదుగుదల ఉంది. ప్రతిభకు మెరుగులు పెట్టుకుంటూ నిరంతర కృషితో అనుకున్నది సాధించిన పట్టుదల ఉంది. ఆ కృషి, పట్టుదల వల్ల ప్రపంచం మెచ్చే కళాకారుడు తయారయ్యాడు. మన రాష్ట్రం నుంచే. మధ్యలో ఎన్నో ఆటుపోట్లు. కష్టాలు. కన్నీళ్లు. అవమానాలు. అన్నింటినీ భరించాడు. అతడే అరుసమ్ మధుసూధన్ ఉరఫ్ మైమ్ మధు. మెప్పించాడు!పదిహేడేళ్ల కిందట... వరంగల్ జిల్లాలోని భీమారం అనే పల్లెటూరు. వినాయకచవితి ఉత్సవాలు. పదిహేనేళ్ల కుర్రాడి ఏకపాత్రాభినయానికి చప్పట్లు మార్మోగాయి. అది మొదటి ప్రదర్శన. పదిహేను రోజుల కిందట... అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఓ వేదిక. పేరున్న మైమ్ కళాకారులు, నటులు, డ్యాన్సర్లు క్లాసులకు హాజరయ్యారు. అదే యువకుడు పాఠాలు చెప్పాడు. వర్క్‌షాప్ ముగిసింది. మళ్లీ చప్పట్లు మార్మోగాయి.
మధు మొదటి ప్రదర్శన. మాటల్లేవు. అన్నీ సైగలే. ప్రేక్షకులు కాసేపు నవ్వారు. మధ్యమధ్యలో ఆలోచనల్లో పడిపోయారు. ఒక్కోసారి 'అయ్యో పాపం' అన్నారు. తనకిచ్చిన కొద్దిసమయంలో అన్ని భావాలు పలికించి 'సెభాష్' అనిపించుకున్నాడు మధు. అప్పటిదాకా అతడికే తెలియదు దాన్ని మైమ్ అంటారని. ఫ్రెండ్ చెప్పాకే తెలిసింది. ఆపై ప్రేక్షకుల మెచ్చుకోలు మరింత నేర్చుకోవాలనే ఉత్సాహాన్నిచ్చాయి. అదే ఉద్దేశంతో మైమ్ కళలో పేరున్న ఓ వ్యక్తి దగ్గరికెళ్లాడు. శిష్యుడిగా చేరతానని బతిమాలాడు. అవకాశమివ్వలేదు సరికదా, ఆ పెద్దమనిషి 'మైమ్ గురించి నీకేం తెలుసని పోటుగాడిలా నా దగ్గరికొచ్చావ్?' అని అవమానించాడు. ఆ మాటతో మధులో కన్నీళ్లు ఉప్పొంగాయి. ఆ కన్నీళ్లలోంచి ఓ లక్ష్యం పుట్టుకొచ్చింది. 'మాటలు పడ్డచోటే మేటి కళాకారుడు అనిపించుకోవాల'నే పట్టుదల పెరిగింది. మైమ్ గురించి ఆరా తీశాడు. తమ ప్రాంతంలోనే నాగభూషణం, కళాధర్ అనే కళాకారులున్నారనే విషయం తెలిసింది. నాగభూషణం సార్‌ని ఒప్పించి శిష్యుడిగా చేరాడు. మెళకువలు ఒంట పట్టించుకుంటూనే ఆయనతో కలిసి వందల ప్రదర్శనలిచ్చాడు.
మేలి మలుపు!
ఓవైపు ఇష్టమైన చదువు. మరోవైపు ప్రాణంలాంటి మైమ్. నేర్పుగా జోడు సవారీ చేశాడు మధు. డిగ్రీలో ఉన్నపుడు అతడి కాలేజీలో 'ప్రేక్షక సభ' అనే ఓ సాంస్కృతిక సంస్థ ఉండేది. ఈ సంస్థ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ కళాకారుడిగా ఎంపికయ్యాడు. సరిగ్గా అదే సమయంలో భారత ప్రభుత్వం కోల్‌కతాలో జరిగే జాతీయ ఐక్యతా సమ్మేళనానికి ఇద్దరు కళాకారులను పంపమని ప్రేక్షకసభను కోరింది. ఆ ఇద్దరిలో ఒకడిగా వెళ్లాడు మధు. ఊహించని అవకాశం. కోల్‌కతా వెళ్లాలని, అక్కడ ఉన్న ప్రఖ్యాత మైమ్ కళాకారుడు నిరంజన్ గోస్వామిని కలవాలనే చిరకాల కోరిక నెరవేరింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని గోస్వామి శిష్యుడిగా చేరాడు. ఆయనతో కలిసి దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చాడు.
విదేశాల్లోనూ...
మధుసూదన్ తర్వాతి లక్ష్యం ప్రపంచ ప్రఖ్యాత మైమ్ ఆర్టిస్ట్ టోనీ మోంటనారోతో కలిసి పనిచేయడం. అదీ తొందర్లోనే నెరవేరింది. యు.ఎస్. మైమ్ థియేటర్ మోంటనారో పేరు మీద ఏటా ఒక్కరికి స్కాలర్‌షిప్ ఇస్తుండేవాళ్లు. 2001లో ఆ స్కాలర్‌షిప్ ఎంపికయ్యాడు మధు. అలా అతడితో కలిసి పనిచేసే అవకాశమొచ్చింది. ఇంకేం. మరింత రాటు దేలిపోయాడు. శిక్షణ పూర్తయ్యాక అమెరికాలోని అన్ని నగరాల్లో ప్రదర్శనలిచ్చాడు. మైమ్‌లో పరిపూర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఇండియా తిరిగొచ్చాక యోగా నేర్చుకున్నాడు. కేరళ వెళ్లి కలరీపయ్యట్టు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి ఆ సంఖ్య వెయ్యి దాటింది.
అకాడెమీ!
మధు హైదరాబాద్‌లో స్థిరపడ్డాక 'ఇండియన్ మైమ్ అకాడెమీ' సంస్థ ప్రారంభించాడు. సామాన్య ప్రజల నుంచి, తెరపై హావభావాలు పలికించే నటులందరికీ ఉపయోగపడేలా ఓ కోర్సు రూపొందించాడు. అంతేకాదు ఒకనాటి తన అనుభవాన్ని మనసులో పెట్టుకొని కళపై అభిమానంతో తన దగ్గరికొచ్చే పేద పిల్లలకు ఉచితంగా మైమ్‌లో శిక్షణనిస్తున్నాడు. వీలు చేసుకొని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి మైమ్ కళతో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నాడు.
ప్రేక్షకుడి స్థాయికెళ్లాలి!
'మైమ్ భారతీయ కళ. అన్ని కళలకు తల్లిలాంటిది. దీనితో సాత్విక, ఆంగిక అభినయాలు రెండూ పలికించవచ్చు. కళాకారుడి మనసులో రూపుదిద్దుకున్న భావాలు ప్రేక్షకుడికి శూన్యంలో కనపడాలి. ప్రేక్షకుడు రససిద్ధి పొందాలంటే కళాకారుడు ముందు మానసికంగా స్పందించాలి. ప్రేక్షకుల స్థాయికెళ్లి దాన్ని ఆస్వాదించాలి. ఓ కళారూపం ప్రదర్శిస్తున్నపుడు వ్యక్తి పాత్ర, వస్తువులు, కొలతలు అన్నీ మనసులో ముద్ర పడిపోవాలి. ప్రేక్షకుడు ఆనందంతో చప్పట్లు కొట్టినపుడే ఆ ప్రదర్శనకు పరిపూర్ణత' అంటాడు మధు.
* 2007లో కేంద్రప్రభుత్వ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ సంగీత నాటక అకాడెమీ అవార్డు.
* ప్రపంచంలోనే అతి కొద్దిమంది మైమ్ కళాకారులకిచ్చే 'టోనీ మాంటెనారో' స్కాలర్‌షిప్.
* జపాన్ 'మిన్ తనక' స్కాలర్‌షిప్.
మేలు చేయాలని ఆలోచన మనసులో ఉంటే సరిపోదు. దాన్ని ఆచరణలో చూపించాలి. పునీత్ అదే చేశాడు. అతడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల విద్యార్థి. అక్కడే హౌస్ సర్జన్. విధుల్లో భాగంగా చాలామంది ఎయిడ్స్ రోగులకు వైద్యం చేసేవాడు. అందులో ఎక్కువమంది పేదలే. వాళ్లను కలిసినపుడు అతడి మదిలో మెదలిందో ఆలోచన. బాధితుల స్థితిగతులపై పరిశోధనలు చేస్తే వాళ్లకు సాయం చేసినట్టు అవుతుందని భావించాడు. వెంటనే అనుమతి కోరుతూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐ.సి.ఎం.ఆర్.)కు దరఖాస్తు చేసుకున్నాడు. గ్రీన్ సిగ్నలొచ్చింది. కార్యక్షేత్రంలోకి దిగాడు. వెయ్యిమంది ఎయిడ్స్ రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడాడు. వాళ్లు వాడుతున్న మందులేంటి? అవి ఎలా పనిచేస్తున్నాయి? వాటిపై ఉన్న అపోహలేంటి? ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ఏం చేయాలి? వివరాలతో 208 పేజీల పరిశోధన పత్రం రూపొందించాడు. రోగుల అనుభవాలతో కేస్ స్టడీలు తయారు చేశాడు. దీనికోసం రోజుకు నాలుగైదు గంటల చొప్పున ఐదునెలలు కష్టపడ్డాడు. ముందు చాలామంది అసలు మాట్లాడటానికే ఒప్పుకోలేదు. సమాజంలో చులకన అవుతామనే ఉద్దేశంతో మందులు వాడని ఎయిడ్స్ రోగుల్ని గమనించాడు. వివరాలతో ఐసీఎంఆర్‌కి పరిశోధన పత్రం అందజేశాడు. పునీత్‌లాగే దేశవ్యాప్తంగా ఏడువందల మంది వివిధ అంశాలపై పరిశోధనలు సమర్పించారు. అందులో ఉత్తమమైన యాభై పరిశోధనలు ఎంపిక చేసి త్రివేండ్రంలోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీకి ఆహ్వానించారు. అక్కడ తన పరిశోధన వివరాల్ని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌తో ప్రత్యక్షంగా వివరించాడు. వాటిని మళ్లీ జల్లెడ పడితే మనోడిది నాలుగో ఉత్తమ పరిశోధనగా ఎంపికైంది. దీంతో అతడిని జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక 'ప్రపంచ విద్యా పరిశోధక సదస్సు'కు ఎంపిక చేశారు. అక్కడ 'ఎమర్జింగ్ రిసెర్చర్స్ కాన్ఫరెన్స్' విభాగంలో పాల్గొంటాడు. దీనికి ప్రపంచవ్యాప్తంగా పేరున్న శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హాజరవుతారు. పునీత్ ఇంతకుముందు జాతీయ సైన్స్ ఒలింపియాడ్‌లోనూ మంచి ప్రతిభ చూపాడు.పరిశోధనలకు అందిన పురస్కారం! ఇరవై మూడేళ్ల కుర్రాడు. సాదాసీదా వైద్య విద్యార్థి. కానీ గిరి గీసుకొని కూర్చోలేదు. పరిధి మించి ఆలోచించాడు. పట్టుపట్టి పరిశోధనలు చేశాడు. దేశవ్యాప్తంగా ఏడువందల మందితో పోటీపడితే నాలుగో స్థానం దక్కింది. గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు రమ్మంటూ ఆహ్వానమందింది. ఆ యువ వైద్యుడే అన్నే పునీత్‌బాబు.హైదరాబాదీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి