ఒక్క 'ఆప్‌' చాలు...!


ఆప్‌... రెండక్షరాల ఈ పదం 'స్మార్ట్‌ఫోన్ల' తీరాన్ని సునామీలా తాకింది. దైనందిన జీవితానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన పనులు, ఆటలు, పాటలు... ఇలా 'ఆప్‌' ప్రభంజనం లేని రంగం లేదు. సుడిగాలిలా వచ్చిన ఈ ఆప్‌లు... కాసుల వర్షాన్నీ కురిపించాయి. ఆప్‌ అంటే అదేదో విదేశీయులు సృష్టించేది అనుకుంటారంతా. కానీ, మనవాళ్లు కూడా కొన్ని సూపర్‌హిట్‌ ఆప్‌లను సృష్టించారు.
స్మార్ట్‌ఫోన్లు వచ్చాక కాలక్షేపానికి కొదవలేదు. వాటి ప్రత్యేకతలలోనికి వెళ్లామంటే... కొత్తకొత్త ఆటలూ, సదుపాయాలూ ఎన్నో. అలాంటి స్మార్ట్‌ఫోన్లకు ఆప్‌లు తోడయ్యాయి. ఆప్‌ అంటే... అదో సాఫ్ట్‌వేర్‌. దీనిసాయంతో స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్లెట్లలో ఇంటర్‌నెట్‌, ఇతర ఆఫ్‌లైన్‌ అప్లికేషన్లను చూసుకోవచ్చు. కొన్ని ఫోన్లలో ఇవి ఫోన్‌తోపాటే వస్తాయి. మరికొన్నింటిని ఇంటర్‌నెట్‌ నుంచి, ఆప్‌ స్టోర్ల నుంచీ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆప్‌స్టోర్‌ అంటే... ఇలాంటి ఆప్‌లు ఉండే ఒక వేదిక అన్నమాట. ఆపిల్‌ వాళ్ల ఆప్‌ స్టోర్‌, నోకియా వాళ్ల ఓవీఐ స్టోర్‌ ఇలాంటివే.ఈ ఆప్‌లు వచ్చాక సమయమే తెలియకుండా పోయింది. సూపర్‌హిట్‌ అయిన ఈ ఆప్‌లు వాటి తయారీదారుల పాలిట కామధేనువులయ్యాయి. అలాంటి ఎన్నో ఆప్‌లను భారతీయులు కూడా తయారుచేశారు. వీటిలో కొన్ని కోటికిపైగా డౌన్‌లోడ్‌ కావడం విశేషం.
ఐఫోన్‌ కెమెరా చిక్కింది
2007లో ఆపిల్‌ కంపెనీ మొట్టమొదటి ఐఫోన్‌ను విడుదల చేసింది. ఎంతోమంది దాన్ని కొన్నారు. అందులోని సదుపాయాలను ప్రశంసించారు. కానీ, రోహిత్‌ భట్‌ మాత్రం అందులో ఒక లోపాన్ని కనిపెట్టారు. అదేంటంటే... అందులోని కెమెరాకు 'జూమ్‌' సదుపాయం లేదు! అంటే... దూరంగా ఉన్న వాటిని దగ్గరగా చూడలేమన్నమాట.
కర్ణాటకకు చెందిన ఆయన 1996లో రోబోసాఫ్ట్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ప్రారంభించారు. ఆపిల్‌ ఐఫోన్‌ వచ్చినప్పుడు... ఆ కెమెరాకు డిజిటల్‌ జూమ్‌ ఏర్పాటుచేస్తే దూరంగా ఉన్నవాటిని కూడా దగ్గరగా చూపించవచ్చు అనుకున్నారు భట్‌. అలా తయారుచేసిందే... 'కెమెరా ప్లస్‌ ఆప్‌'. ఇది కూడా ఐఫోన్‌లానే వేగంగా దూసుకుపోయింది. ఇప్పటివరకూ సుమారు కోటిన్నరకుపైగా కెమెరా ప్లస్‌ ఆప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారంటేనే ఇదెంత హిట్టయ్యిందో అర్థమవుతుంది. ఈ ఆప్‌ ద్వారా ఫొటోల్లో చాలా మార్పులు తీసుకురావొచ్చు. వాటిని ఆన్‌లైన్‌లో కూడా పెట్టుకోవచ్చు.
ఆపిల్‌ కంపెనీ ఆప్‌ స్టోర్‌ను ప్రారంభించినప్పుడు 200 ఆప్‌లను విడుదల చేసింది. అందులో అయిదు రోబోసాఫ్ట్‌ తయారుచేసినవే కావడం విశేషం.
ఫోనే లైటవుతుంది
రాత్రుళ్లు బెడ్‌లైట్‌ లేకుండా పడుకోవడం కష్టమనుకునేవాళ్లు కొందరు, వెలుతురు ఎక్కువగా ఉంటే పడుకోలేమనేవాళ్లు కొందరు. ఈ సమస్యకు పరిష్కారమే మా ఆప్‌ అంటారు బెంగళూరుకు చెందిన రోహిత్‌ సింఘాల్‌. ఈయన 2006లో సోర్స్‌బిట్స్‌ అనే కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ తయారుచేసిన నైట్‌స్టాండ్‌ అనే ఆప్‌... మన ఫోన్‌ని ఒక గడియారంలా మార్చేస్తుంది. అంతేకాదు, ఆ గడియారంలోని డయల్‌... ఫోన్‌ ఛార్జింగ్‌ ఉన్నంతవరకూ వెలిగేలా చేస్తుంది. ఈ కంపెనీ తయారుచేసిన మరో సూపర్‌హిట్‌ ఆప్‌... రోబోకిల్‌. దీన్ని ఐఫోన్లకోసమే తయారుచేశారు. అంతరిక్షకేంద్రాన్ని ఆక్రమించిన రోబోలతో ఫైట్‌ చేయడమే ఈ గేమ్‌ సారాంశం. ఇప్పటివరకూ సుమారు కోటిన్నర రోబోకిల్‌ ఆప్‌లు డౌన్‌లోడ్‌ అయ్యాయి. ఈ కంపెనీ ఇప్పటివరకూ 300 ఆప్‌లను తయారుచేసింది.దారిచూపే 'సారథి'
చండీగఢ్‌కు చెందిన సుప్రసిద్ధ ఆప్‌ కంపెనీ ఆర్క్‌ మొబైల్‌ సొల్యుషన్స్‌ తయారుచేసిన ఆప్‌లు నోకియా ఓవీఐ స్టోర్‌లో కొన్నిలక్షలకుపైగా డౌన్‌లోడ్‌ అయ్యాయి. ఇందులో సూపర్‌హిట్‌ అయిన ఆప్‌ 'ట్రైన్‌ డిఫెండర్‌'. ఈ ఆటలో - రైల్లో ఉగ్రవాదులు ప్రవేశిస్తారు. ఆట ఆడేవాళ్లు వాళ్లతో పోరాడి ప్రయాణికులను రక్షించాలి. ఇప్పటివరకూ ఇవి సుమారు 40 లక్షలు డౌన్‌లోడ్‌ అయ్యాయి.
మీరుండే ప్రాంతంలో మీ స్నేహితులు ఎవరున్నారు? మీరు ఇంటికి వెళ్లే దారిలో ఓ పూలదుకాణం దగ్గర పూలు కొనాలనుకున్నారు, పండ్ల దుకాణం దగ్గర పండ్లు కొనాలనుకున్నారు, సూపర్‌మార్కెట్‌లో సరుకులు కొనాలనుకున్నారు... ఆ మార్గంలోనే వెళ్లి, ఇవన్నీ గుర్తుపెట్టుకుని కొనుక్కురావాలంటే ఎలా?... ఇలాంటి ఎన్నో ఆప్‌లను తయారుచేసింది నాగపూర్‌కి చెందిన లొకేషన్‌ గురు అనే కంపెనీ. ఇది తయారుచేసిన ఇలాంటి 'సారథి' అనే ఆప్‌లు ఇప్పటివరకూ అయిదులక్షలకుపైగా డౌన్‌లోడ్‌ అయ్యాయి.
'ఆప్‌ను తయారుచేయాలంటే మేథోమథనాలు అక్కర్లేదు, చిన్న ఆలోచన చాలు. వీటిలో ఉపయోగించే రంగులూ, బ్యాక్‌గ్రౌండూ ఆకర్షణీయంగా ఉండాలి. అందరూ వీటిని సులభంగా వినియోగించేలా ఉండాలి. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ స్క్రీన్‌కి సరిపోయేలా ఉండాలి. అంతేతప్ప, మనకు విజ్ఞానం ఉందికదా అని కష్టమైన విధంగా దాన్ని తయారుచేయకూడదు' అంటారు ఈ ఆప్‌ల తయారీదారులు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు