|
హింస ధ్వని!
వేలిముద్రల్లో నేరస్థుల ఆనవాళ్లు ఉన్నట్టే...'నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో' వార్షిక నివేదికల్లో రక్తపు మరకల గుర్తులు కనిపిస్తాయి, హాహాకారాల ప్రతిధ్వనులు వినిపిస్తాయి. యముని మహిషపు గంటల సవ్వడిని తలపించే ఆ అంకెల రంకెలివి...
వీధులన్నీ ఎర్రగా - రక్తంతో కళ్లాపి చల్లినట్టు. చెట్లకు పుర్రెల గుత్తులు. ఎటుచూసినా శవాల గుట్టలు. ట్రక్కులకొద్దీ నోట్ల కట్టలు. ఎక్కడి నుంచో తుపాకుల మోతలు. పత్రికల నిండా చావు రాతలు.ఎవడో దొంగాడు...ముసలమ్మ మెడలోని పుస్తెలతాడు తెంచుకెళ్తున్నాడు. ఇంకెవడో ముసుగు వెధవ, తాళాలు పగులగొట్టి ఇల్లంతా దోచేస్తున్నాడు. డెబిట్‌కార్డు బేబులోనే ఉంటుంది, ఖాతాలోని డబ్బు మాయమౌతుంది. ఇ-మెయిల్‌లో లాటరీ వూరింపులు, ఫేస్‌బుక్ నిండా అమ్మాయిల మార్ఫింగ్ ఫొటోలు. మన జాగాలో ఏ గూండాలో పాగావేస్తారు. ప్రశ్నించలేం. తిరగబడలేం.
ఎవరి నేరాలివి? ఏ ముఠాల ఘోరాలివి?
34వేల హత్యలు, 35వేల హత్యాయత్నాలు, 25వేల అత్యాచారాలు, 27వేల దోపిడీలు - ఇవేం ప్రగతి సూచికలు కాదు. ఏడాది కాలపు పాపాల చిట్టాలు. 2012 సంవత్సరానికి సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన గణాంకాలు - దేశంలో శాంతిభద్రతల పరిస్థితులకు నిలువుటద్దాలు. ఆ అంకెలు మనతో మాట్లాడతాయి. 'భద్రం బిడ్డో...' అని హెచ్చరిస్తాయి.
కొన్ని విషయాల్ని స్వానుభవం దాకా రానివ్వకూడదు. ఇతరుల చేదు అనుభవాల్లోంచే పాఠాలు నేర్చుకోవాలి. వ్యవస్థలో ఎక్కడ ఏ లోపాలున్నాయో తెలుసుకోవాలి. ఎలాంటి సమయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలో అర్థంచేసుకోవాలి. నేర స్వభావాల్ని గమనించాలి. నేరస్థుల మనస్తత్వాన్ని అంచనా వేసుకోవాలి. ఆ అవగాహన - మనల్ని మనం రక్షించుకోడానికి పనికొస్తుంది. మనచుట్టూ ఉన్నవాళ్లను కాపాడుకోడానికీ అక్కరకొస్తుంది. సమాజమంటే మనందరి సమూహమేగా!
అదిగదిగో...సైబర్ రాకాసి! సంజయ్ ముంబయిలోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. సమర్థుడన్న పేరుంది. ఈమధ్యే పెళ్లయింది. భార్య రంజిత చాలా మంచమ్మాయి. ఒకట్రెండు వారాలుగా, అతని ఫేస్‌బుక్ ఖాతాలో అసభ్యమైన రాతలూ అశ్లీలమైన ఫొటోలూ ప్రత్యక్షం అవుతున్నాయి. ఆఫీసులో అతన్ని అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. హెడ్డాఫీసు నుంచి హెచ్చరికలు వచ్చాయి. రంజిత అలిగి పుట్టింటికి వెళ్తానంటోంది. సంజయ్ జీవితం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. 'నేను అమాయకుణ్ని. గిట్టనివాళ్లు ఇదంతా చేస్తున్నారు...' అని చెప్పినా ఎవరూ నమ్మడంలేదు. నీకు తెలియకుండా, నీ ఫేస్‌బుక్‌లోకి ఎలా ప్రవేశిస్తారంటూ దబాయింపులు. ఆ మాట కూడా నిజమే. ఏం చేయాలో తోచక, సైబర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. ఓ అజ్ఞాత హ్యాకర్ అతని ఫేస్‌బుక్ ఖాతాలో దూరినట్టు పరిశోధనలో వెల్లడైంది. ముద్దాయి హైదరాబాద్‌కు చెందిన కాలేజీ విద్యార్థి.ఇ-మెయిళ్లలో, ఫేస్‌బుక్‌లలో, అధికారిక వెబ్‌సైట్లలో ఇలాంటి చొరబాట్లు సర్వసాధారణమే. అందులోనూ, కార్పొరేట్ యుద్ధాల్లో సైబర్ ఆయుధాల వాడకం బాగా పెరిగింది. కంపెనీ డేటా నాశనం చేయడం, అంకెల్ని తారుమారు చేసేయడం, సంస్థ ఉత్పత్తులు నాసిరకమంటూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో దుమ్మెత్తిపోయడం...వగైరా వగైరా 'సైబర్ పరువునష్టం' చర్యలకు తెగబడుతున్నారు... అందులో విశ్వాస ఘాతకులైన వ్యక్తుల పాత్ర ఎంతో, పోటీ సంస్థల పన్నాగమూ అంతే.
గత ఏడాది అత్యధిక సంఖ్యలో హ్యాకింగ్ కేసులు నమోదైన రాష్ట్రం మనదే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం... నేరస్థులంతా 18 నుంచి 30 ఏళ్ల లోపువారే. గౌరవనీయ కుటుంబాలకు చెందినవారే. డబ్బే లక్ష్యంగానో, పైశాచికానందమే పరమావధిగానో, లైంగిక వేధింపుల్లో భాగంగానో, వ్యక్తి గౌరవాన్నో సంస్థ ప్రతిష్ఠనో దెబ్బతీయడానికో... ఇలా రకరకాల కారణాలతో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఏటికేడాది రెట్టింపు అవుతున్న ఇ-ఘోరాలు పోలీసులకు చెమట పట్టిస్తున్నాయి.
సైబర్ దాడుల్ని తప్పించుకోడానికి ఒకటే మార్గం...మన జాగ్రత్తలో మనం ఉండటం, సొంత కంప్యూటర్ ద్వారానే ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడం, పుట్టినతేదీ ఇంటిపేరూ భార్యాపిల్లలపేర్లూ - పాస్‌వర్డ్ వూహించడానికి పనికొచ్చే వ్యక్తిగత వివరాల్ని బహిర్గతం చేయకపోవడం, అనుమానాస్పద సైట్స్ జోలికి వెళ్లకపోవడం, అపరిచితుల ఫేస్‌బుక్ రిక్వెస్టులకు స్పందించకపోవడం, వ్యక్తిగత ఫొటోల్ని ఆన్‌లైన్‌లో పెట్టకపోవడం, తరచూ పాస్‌వర్డ్‌లను మార్చడం...స్థూలంగా, అప్రమత్తతే ఆన్‌లైన్ రక్షణ కవచం.
మహా నరకాలు... గుర్నాథరావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఎప్పుడో, పాతికేళ్ల క్రితం హైదరాబాద్ శివార్లలో ఐదువందల గజాల స్థలం కొన్నాడు. అందులో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. రియల్‌బూమ్‌లో ధరలు విపరీతంగా పెరిగాయి. కోట్ల విలువ చేసే ఆ స్థలం మీద ఓ బిల్డరు కన్నేశాడు. ఎంతోకొంత ముట్టజెప్పి తనపేరున రాయించుకోవాలనుకున్నాడు. రోజూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. ఒకటిరెండు సార్లు ముసుగు మనుషులొచ్చి ఇల్లంతా గుల్లచేసి వెళ్లారు. దీంతో, బిక్కచచ్చిపోయి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు. పిల్లలెక్కడో అమెరికాలో ఉన్నారు. భార్య ఆరోగ్య పరిస్థితీ అంతంతమాత్రమే. పోలీసు కేసు పెట్టడానికేమో ధైర్యం చాలడం లేదు. ఒక్క గుర్నాథరావు సమస్యే కాదది. మహానగరాలు మెల్లమెల్లగా మాఫియా రంగు పులుముకుంటున్నాయి.నగరీకరణ పెరుగుతోంది. పట్టణాలు కిక్కిరిసిపోతున్నాయి. రకరకాల వ్యక్తులు, రకరకాల మనస్తత్వాలు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో, మహానగరాల్లో నేరాల సూచీ పైపైకి ఎగబాకుతోంది. సాంఘిక నేరాలూ ఆర్థిక నేరాలూ...ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. సంఘ విద్రోహశక్తులూ మాఫియాలూ ఈ ధోరణులను అనుకూలంగా మలుచుకుంటున్నాయి. బడికెళ్లిన పిల్లలు భద్రంగా తిరిగొస్తారన్న నమ్మకం లేదు. ఆఫీసుకెళ్లిన మనిషి క్షేమంగా ఇంటికి చేరతాడన్న భరోసా లేదు. స్త్రీల పరిస్థితి మరీ ఘోరం. ఆటోడ్రైవర్ల ముసుగులోని నేరస్థులూ, సహప్రయాణికుల రూపంలోని గొలుసు దొంగలూ, ఒంటరిగా కనిపిస్తే చాలు... మాటలతో చేతలతో కంపరం పుట్టించే కామపిశాచాలూ...నగర మహిళలకు నరకం చూపుతున్నారు. వృద్ధులకైతే దినదినగండమే. దొంగలు ఏ రూపంలో దాడిచేస్తారో వూహించలేని పరిస్థితులు. యాభైకిపైగా నగరాల్లో...దాదాపు ఐదు లక్షల నేరాలు నమోదయ్యాయంటే, సమస్య తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. గతంతో పోలిస్తే, ఆర్థిక నేరాలు ఆరున్నర శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా వాహనాల చోరీ కేసుల్లో సగానికి సగం, చీటింగ్ కేసుల్లో ఇరవై తొమ్మిది శాతం ఇక్కడే...నగరాల్లోనే.
కాలనీ సంఘాల ద్వారా, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ల ద్వారా...నగరజీవి మానవ సంబంధాల్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక జీవనం - అభద్రతను తొలగిస్తుంది. వయోధికుల్నీ పిల్లల్నీ ఒంటరిగా వదలాల్సిన పరిస్థితుల్లో ఇళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా మంచి ఆలోచనే. చిట్స్, డిపాజిట్ల విషయంలో అనామక సంస్థల్ని నమ్మకపోవడం, స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లో నిపుణుల సలహా తీసుకోవడం, గొలుసుకట్టు స్కీమ్‌లకు సాధ్యమైనంత దూరంగా ఉండటం... తదితర జాగ్రత్తల ద్వారా ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
జాగ్రత్తమ్మా... పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగావకాశం. నెలకు యాభైవేల జీతం. అప్పుడే, క్యాంపస్ నుంచి బయటికొచ్చిన స్వాతికి ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంగా అనిపించింది. మంచి రోజు చూసుకుని ఉద్యోగంలో చేరింది. అందరూ ఆత్మీయంగా పలకరించారు. ఏ పని ఎలా చేయాలో దగ్గరుండి నేర్పించారు. బాస్ అయితే, ఎక్కడలేని ప్రేమ కురిపించాడు. ఆ చూపుల్లో తేడానూ ఆ స్పర్శలో పన్నాగాన్నీ అర్థంచేసుకోడానికి ఎంతో సమయం పట్టలేదు. తనేమో ట్రైనీ. అతనేమో పాతికేళ్ల సీనియర్. పై అధికారులకు మెయిల్ పెట్టినా స్పందన లేదు. ఆ పోరులో దాదాపుగా ఒంటరైపోయింది. శక్తికి మించిన పనులు అప్పగించి, అసమర్థురాలిగా ముద్రవేసే ప్రయత్నమూ మొదలైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగానికి రాజీనామా చేసింది స్వాతి.
కార్యాలయాల్లో లైంగిక వేధింపులు - అతి తీవ్ర సమస్యగా పరిణమిస్తున్నాయి. అవి హద్దులుదాటి అత్యాచారాల దాకా వెళ్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఆమెను నీడలా వెంటాడేవాడు, కాటేయాలని కాచుకుకూర్చున్నవాడు, కళ్ల నిండా కామాన్ని పులుముకున్నవాడు - ఏ రాక్షసలోకం నుంచో దిగిరాడు, కోరలతో ప్రత్యక్షం కాడు. ఆ దుర్మార్గుడు- స్నేహితుడో, బంధువో, పొరుగువాడో, సహోద్యోగో, రక్తసంబంధీకుడో. గత ఏడాది రాష్ట్రంలో నమోదైన 1,441 అత్యాచార కేసుల్లోనూ...ఆ అఘాయిత్యం తెలిసినవారి పనే. పట్టుమని పద్దెనిమిదేళ్లు కూడా లేని టీనేజీ రేపిస్టుల సంఖ్య కూడా గతంలో కంటే పెరిగింది. అలాంటి కేసులు ఎనభైదాకా నమోదయ్యాయి. మహిళలకు, మరో ప్రమాద హెచ్చరిక ఇది!
'నవ్వు చాటున విషం రువ్వుతున్నాడేమో, పరిచయస్థుడన్న ముసుగులో నయవంచనకు తెగబడుతున్నాడేమో...జాగ్రత్తమ్మా' అని హితవు చెబుతున్నాయి క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు. వరకట్న కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 28 శాతం దాకా ఇక్కడే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిదివేల మంది మహిళలు కట్నపిశాచాల బారినపడ్డారు. భర్త కారణంగానో, అత్తింటి బంధువుల కారణంగానో నరకహింసలు అనుభవించినవారి సంఖ్య అక్షరాలా లక్ష. గత ఏడాది, మహిళలపై నేరాలకు సంబంధించి రెండున్నర లక్షల సంఘటనలు నమోదయ్యాయి. ఆ కేసుల్ని వెనక్కి తీసుకోమంటూ భయపెడుతున్న ఉదంతాలూ అనేకం. మహిళల కేసుల్లోనే ఉపసంహరణలూ రాజీలూ ఎక్కువ. సమాజం ఎప్పుడూ పురుష పక్షపాతే!
వరకట్న హింస విషయంలో అమ్మాయి తల్లిదండ్రులూ కొంతమేర బాధ్యులే. తొలి పరిచయంలోనో, మలి పరిచయంలోనో వరుడి తాలూకు బంధువుల మనస్తత్వం అర్థమైపోతుంది. డబ్బు కోసం గడ్డితినే రకమని తెలిసిపోతుంది. అలాంటి కక్కుర్తి కుటుంబంలో, తమ ముద్దుల కూతురు సుఖపడగలదని ఎలా అనుకుంటారు? ఎన్‌ఆర్‌ఐ సంబంధాల విషయంలో మరీ అన్యాయం. ముక్కూమొహం తెలియనివారి చేతుల్లో బిడ్డను పెట్టేస్తారు. కన్నవారు కాస్త జాగ్రత్తగా ఉంటే, అసలు కట్నం ప్రసక్తే లేని వివాహాలకు మొగ్గు చూపితే... ఇంత కష్టం ఉండదు. గృహహింస కేసులు కూడా తగ్గుముఖం పడతాయి. గృహహింస అయినా, వరకట్న వేధింపులు అయినా...తమకు జరిగిన అన్యాయాన్ని చట్టం దృష్టికి తీసుకెళ్లగలిగిన చైతన్యం మహిళల్లో పెరగాలి. చిన్నచిన్న ఆత్మరక్షణ చిట్కాలు కొంతమేర ధైర్యాన్నిస్తాయి. సమస్యో సంక్షోభమో వచ్చినప్పుడు, ఎవరో వచ్చి కాపాడతారన్న భ్రమ నుంచి బయటపడాలి.
'మహిళా! నీకు నువ్వే రక్ష. ఆత్మవిశ్వాసమే వెన్నంటి నిలిచే సాయుధ పటాలం'.
చిన్నారులూ...క్షేమమేనా! ఆడుకోడానికంటూ వెళ్లిన పసివాడు ఇంకా తిరిగిరాలేదు. చీకటి పడుతోంది. చినుకులు రాలుతున్నాయి. అమ్మకు ఆందోళన మొదలైంది. అంతలోనే, భర్త ఆఫీసు నుంచి తిరిగొచ్చాడు. వెతకడానికి బయల్దేరారిద్దరూ - బడి, ట్యూషన్, కిరాణాకొట్టు, బంధువుల ఇళ్లు... ఎక్కడా ఆచూకీలేదు. అంతలోనే, సెల్‌ఫోన్ మోగింది. పది లక్షలు ఇస్తేనే బిడ్డను అప్పగిస్తానంటూ బేరం. లేదంటే, శవమే దక్కుతుందని ఓ అపరిచిత స్వరం హెచ్చరిక.
ప...ది...ల...క్ష...లు! అప్పటికప్పుడు ఎలా వస్తాయి, ఎవరిస్తారు? మరోదార్లేక, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపు ఫోన్‌కాల్ ఆధారంగా పరిశోధన మొదలైంది. ఇదంతా, దూరపు బంధువు బరితెగింపే అని తేలింది. నేరస్థుడిని వలపన్ని పట్టుకున్నారు. అప్పటికే పసివాడి గొంతు నులిపేశాడా దుర్మార్గుడు.
ఇలాంటి దురదృష్టకర సంఘటనలు మహబూబ్‌నగర్ జిల్లాకో, ప్రకాశం జిల్లాకో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా జరిగిన నేరాల్లో పదిశాతం పసివాళ్లతో ముడిపడినవే. గతంతో పోలిస్తే ఈ సంఖ్య పదిహేనుశాతం పెరిగింది. మొత్తంగా, పిల్లలపై దాడులూ అపహరణలూ తదితర ఉదంతాలు నలభైవేల దాకా రికార్డులకెక్కాయి. పిల్లలకు భద్రత కల్పించలేని అసమర్ధ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. గత ఏడాది, దేశంలో ఎనిమిదిన్నర వేలమంది అభంశుభం తెలియని బాలికలు అత్యాచారానికి గురయ్యారు.
దిగ్భ్రాంతిని కలిగించే మరో ధోరణి...పిల్లల ఆత్మహత్యలు! అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే అనేకానేక కారణాలతో ప్రాణాలు తీసుకున్న పసివాళ్ల సంఖ్య నూటముప్ఫై శాతం పెరిగింది. బాల్యాన్ని స్వర్గంతో పోలుస్తారే! భలే అందంగా ఉంటుందని కవితలల్లుతారే! ...అలాంటిది, చావే నయమన్న ఆలోచన ఆ పిల్లలకెందుకు వచ్చింది? - సామాజిక శాస్త్రవేత్తలు దృష్టిసారించాల్సిన అంశమిది.
పిల్లల అక్రమ తరలింపు ఇంకో తీవ్ర సమస్య. యాచక వృత్తిలో దింపే ముఠాలూ, శరీరభాగాల్ని విక్రయించే కసాయి గుంపులూ, బాలికల్ని వ్యభిచార గృహాలకు అప్పగించే దుర్మార్గ దళాలూ...చురుగ్గా తిరుగుతున్నాయి. ఒక్క ఏడాది కాలంలోనే దాదాపు పదివేలమంది చిన్నారులు కిడ్నాపర్ల బారినపడ్డారు, పదహారు వందల మంది హత్యకు గురయ్యారు. డబ్బు కోసమో ప్రతీకారం కోసమో ఆ లేత జీవితాల్ని చిదిమేయడానికి చేతులెలా వచ్చాయో! ఎంత ఘోరం! ఎంత అమానవీయం!
కన్నవారు కదిలితేనే, సమాజం పూనుకుంటేనే పిల్లలకు రక్షణ. పసిబిడ్డలు తమ భయాల్నీ ఆందోళనల్నీ నిస్సంకోచంగా పంచుకోగల అరమరికల్లేని వాతావరణాన్ని కల్పించడం అమ్మానాన్నల బాధ్యత. బాలలపై జరిగే నేరాల్లో 90 శాతం తెలిసినవారి పనే. పెద్దలు కాస్త జాగ్రత్తగా ఉంటే, ఆ ఉత్పాతాన్ని నివారించవచ్చు. స్వేచ్ఛగా, నిర్భయంగా పెరిగి పెద్దయ్యే అవకాశాన్ని చిన్నారులకు ఇద్దాం. అయినా, వాళ్లంతట వాళ్లుగా ఈ భూమ్మీదికి రాలేదు. ప్రేమగా చూసుకుంటామనో, బంగారు భవిష్యత్తు ఇస్తామనో...మాటిచ్చి మరీ మనమే తీసుకొచ్చాం. కుట్రల కారణంగానో కుతంత్రాల వల్లో ఏ ఒక్క చిన్నారి మరణించినా అది నయవంచనే అవుతుంది. సమాజమే ముద్దాయి స్థానంలో నిలబడాల్సి ఉంటుంది.
గుండెల్లో రైళ్లు... రైలు కూత... బండి కదులుతోందనడానికి సంకేతం. ప్లాట్‌ఫామ్ మీదున్న బంధుమిత్రుల్లో ఓ రకమైన ఆత్రుత. 'క్షేమంగా వెళ్లిరా', 'ఆరోగ్యం జాగ్రత్త', 'అందర్నీ అడిగినట్టు చెప్పు', 'బండి దిగ్గానే ఫోన్‌చెయ్', 'పక్క స్టేషన్‌లో భోంచేయండి', 'వెంటనే బయల్దేరి వచ్చెయ్', 'హోటల్లో తిని ఆరోగ్యం పాడుచేసుకోకండి', 'వంట చేసుకుని చేతులు కాల్చుకోకండి' - రకరకాల సలహాలూ సూచనలూ జాగ్రత్తలూ బుజ్జగింపులూ. మళ్లీ కలుసుకోలేమేమో అన్నంత ఉద్వేగం. ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వేశాఖ తీసుకుంటున్న మొక్కుబడి చర్యలు చూస్తుంటే, ఆ మాటే నిజమవుతుందేమో అన్న భయం కలుగుతుంది. ఆ చుకుబుకు రైలులో ప్రతి ఇరవై అయిదు నిమిషాలకూ ఒక నేరం జరుగుతోంది.ఒక్క గత ఏడాదే, 848 దోపిడీ కేసులూ 16వేల దొంగతనాల కేసులూ రికార్డులకెక్కాయి. మూడేళ్లలో 1114 హత్యా యత్నాలూ 764 హత్యలూ 426 కిడ్నాప్‌లూ నమోదయ్యాయి. ఇదంతా వేలమంది ప్రయాణికుల సాక్షిగానే! అవి రైలు పట్టాలా, దొంగలకూ దోపిడీదారులకూ స్నాతకోత్సవ పట్టాలా! ప్రతి బోగీలోనూ ఓ సీసీ కెమెరా ఏర్పాటు చేసినా చాలు...నేరాల్ని కొంతమేర అరికట్టవచ్చు. పోలీసుశాఖకూ రైల్వే రక్షణ దళాలకూ మధ్య సమన్వయం లోపించడం మరో సమస్య. నేరాల్ని నియంత్రించడంలో ప్రయాణికుల భాగస్వామ్యమూ అవసరమే. బొత్తిగా ముక్కూమొహం తెలియనివాళ్లను నమ్మకూడదు. అలాంటివారు ఇచ్చే ఆహారపదార్థాలు అస్సలు తీసుకోకూడదు. నగదు, బంగారం సాధ్యమైనంత తక్కువగా తీసుకెళ్లాలి. అనుమానాస్పద వ్యక్తులూ సామగ్రీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. అవసరమైతే, ఆ ముఠాల్ని సమష్ఠిగా ఎదిరించాలి.
* * *
మాయమైపోతున్నడమ్మా... ఉద్యోగం ఇప్పిస్తానని ఒకడు, పెళ్లి చేసుకుంటానని ఒకడు, ఇత్తడిని పుత్తడి చేస్తానని ఒకడు, బట్టతల మీద జుట్టు మొలిపిస్తానని ఒకడు, గుప్తనిధులు చూపిస్తానని ఒకడు - సమాజంలో రకరకాల మోసాలు! గత ఏడాది, దేశవ్యాప్తంగా నమోదైన చీటింగ్ కేసుల సంఖ్య - దాదాపు లక్ష! నమ్మిన సంస్థకే కన్నమేయడం, కీలకమైన సమాచారాన్ని పోటీ సంస్థలకు చేరవేయడం... ఇలా నమ్మక ద్రోహానికి సంబంధించిన కేసులు ఇరవై వేలదాకా ఉన్నాయి.సామాన్యుడి మదిలో ఒకటే ప్రశ్న... తోటి మనిషిని నమ్మాలా, వద్దా! నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక నమ్మొద్దనే చెబుతోంది. అయినా సరే, నమ్మితీరాలి. ఎందుకంటే, మనిషి సంఘజీవి. నమ్మకమే సామాజిక వ్యవస్థకు ఆది, పునాది. మంచి మాత్రమే ఉండాలనుకోవడం దురాశ. ఏమాత్రం మంచి లేదనుకోవడం నిరాశ. సమాజం - మంచిచెడుల జుగల్‌బందీ! పాలూనీళ్లూ వేరుచేసుకుంటూ... మంచిచెడులు బేరీజువేసుకుంటూ... అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ జాగ్రత్తగా అడుగులేస్తూ... ముందుకెళ్లడమే మనిషి పని.
హెచ్చరికో...హెచ్చరిక!
ఏ పెళ్లికో వెళ్లొస్తాం. తీరా చూస్తే... తాళంకప్ప పగులగొట్టో కిటికీ వూచలు తొలగించో...దొంగలు ఇల్లంతా వూడ్చుకెళ్లుంటారు. వెంటనే, పోలీస్ కేసు పెడతాం. ఒకట్రెండు రోజుల హంగామా, జాగిలాల హడావిడి! ఆతర్వాత మన గోడు వినే నాథుడే కనిపించడు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. గత ఏడాది... రూ. 21,07,194 లక్షల విలువైన సొత్తు దొంగలపాలైతే, అందులో ఘనత వహించిన పోలీసుశాఖ రికవరీ చేసింది రూ. 1,41,793 లక్షలే!మానవ సంబంధాలపై లోతుగా చర్చించాల్సిన సమయం వచ్చింది. కన్నవారి సంరక్షణలో ఉన్న పిల్లలు ప్రయోజకులు అవుతారనీ, ఎవరూ లేని అనాథలు త్వరగా దారితప్పుతారనీ అనుకోడానికి వీల్లేదు. ఎందుకంటే, బాలనేరస్థుల్లో 5866 మంది అమ్మానాన్నలు ఉన్నవారే. 209 మంది మాత్రమే అనాథలు.
పురుషులతో పోలిస్తే, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, సమస్యల్ని తట్టుకునే గుండె నిబ్బరం మహిళల్లోనే ఎక్కువేమో. తాజా లెక్కల ప్రకారం, గత ఏడాది 90 వేల పురుషులు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళల సంఖ్య నలభై ఏడువేల లోపే.
ఆంధ్రప్రదేశ్ రహదారులు...యమలోకానికి రాచమార్గాలు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 43 శాతం తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలోనే జరుగుతున్నాయి. అందులోనూ ట్రక్కు, లారీ ప్రమాదాల్లో 13 శాతం తెలుగు గడ్డ మీదే.
ఓ మహిళ ముఖ్యమంత్రి అయితే... ఆ రాష్ట్రంలో ఆడవారికి పరిపూర్ణ రక్షణ ఉంటుందని భావిస్తాం. అదంతా భ్రమేనని తేలింది. మహిళలపై హింసాత్మక సంఘటనల్లో మమతాబెనర్జీ నాయకత్వంలోని పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది. నిన్నమొన్నటిదాకా మహిళా హోంమంత్రి ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.
కారంటే తెల్లకారే! ఆ హుందాతనమే వేరు- అని బలంగా నమ్మేవారిలో దొంగలు కూడా ఉన్నారు. గత ఏడాది చోరీకి గురైన కార్లలో అధిక శాతం తెల్లకార్లే! కారు కొంటున్నప్పుడు...బ్రాండే కాదు, రంగూ చూడాలి!
మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం. అదో అనారోగ్యమన్న సంగతే మరచిపోతున్నాం. దేశంలో నమోదవుతున్న ఆత్మహత్యల్లో ఆరుశాతం దాకా మానసిక సమస్యల వల్లే సంభవిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా నమోదైన హత్యల్లో 'ప్రేమ' కారణంగా జరిగినవి...ఏడున్నర శాతం. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మొత్తం హత్యల్లో 'ప్రేమ' హత్యల శాతం దాదాపు పద్దెనిమిది! ప్రేమికుల సంఘానికి ఆగ్రహం కలిగించే విషయం ఏమిటంటే..'లైంగిక' కారణాల వల్ల జరిగిన హత్యల్ని కూడా ఈ జాబితాలోకే నెట్టేశారు పోలీసులు.
ఏ తల్లి బిడ్డో, ఏ భార్య భర్తో, ఏ భర్త భార్యో- రోడ్డు పక్కనో, రైలు పట్టాల మీదో, మురికి నాలాల్లోనో, లాడ్జి గదుల్లోనో, పార్కు బెంచీల మీదో శవాలై దర్శనమిచ్చినవారి సంఖ్య నలభైవేలు. దేశవ్యాప్తంగా రోజుకు వందకుపైగా గుర్తుతెలియని శవాలు బయటపడుతున్నాయి. ఆ అపరిచిత ఆత్మలకు శాంతి కలుగుగాక!
చాలా సందర్భాల్లో జైళ్లు...సీనియర్ దొంగలూ జూనియర్ దొంగలూ కలుసుకోడానికి చక్కని వేదికలు అవుతున్నాయి. కొత్త చిట్కాల్ని తెలుసుకోడానికీ వృత్తి నైపుణ్యాల్ని పెంచుకోడానికీ పాఠశాలలు అవుతున్నాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్ జైళ్లు ఖైదీల్ని సంస్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి నేరాలు చేస్తూ దొరికిపోయినవారి జాబితాలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. |
చిత్రగుప్తుడి చిట్టా...
దేశ అభివృద్ధి విషయంలో జాతీయ ఆర్థిక సర్వే నివేదికలా...దలాల్ స్ట్రీట్‌లో - మార్కెట్ సూచీలా... ఒక నిర్దిష్ట కాలానికి, దేశంలో శాంతిభద్రతల పరిస్థితికి సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలే సాక్ష్యాలు. చట్టాల రూపకల్పనలో శాంతి భద్రతల వ్యూహ రచనలో, క్రిమినాలజిస్టుల విశ్లేషణల్లో ఈ లెక్కలే కీలకం అవుతాయి. ఢిల్లీ కేంద్రంగా ఈ సంస్థ సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో పనిచేస్తుంది. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉంటుంది. ఆయా రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖలూ విజిలెన్స్ విభాగాలూ అవినీతి నిరోధక శాఖల నుంచి అందిన సమాచారాన్ని క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విశ్లేషిస్తుంది. 1953 నుంచీ నిరాటంకంగా నివేదికలు వెలువడుతున్నాయి. అరవై ఏళ్లనాటి నివేదికతో పోలిస్తే నేరాలూ ఘోరాలూ వందలరెట్లు పెరిగాయి.
|
|
|
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి