'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)



అందరూ...ఇంటర్నెట్‌లో సమాచారాన్ని చూస్తారు, మెయిల్స్‌ చూసుకుంటారు. మహా అయితే వీడియోలు వీక్షిస్తారు. అతి కొద్దిమంది మాత్రం, వ్యాపార అవకాశాల్ని వెతుక్కుంటారు. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను 'వరల్డ్‌ వైడ్‌ డబ్బు'గా మార్చుకుంటారు, 'నెట్‌ ఎంట్రప్రెన్యూర్స్‌'గా అవతరిస్తారు.
సంస్థ పేరు:
పేరేదైనా, చివర్లో 'డాట్‌కామ్‌' తోక.చిరునామా:
బెడ్‌రూమ్‌ కమ్‌ ఆఫీస్‌రూమ్‌ కమ్‌ మీటింగ్‌రూమ్‌ కమ్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌.
హోదా:
మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కమ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కమ్‌ క్లర్క్‌ కమ్‌ ఆఫీస్‌బాయ్‌
మౌలిక సదుపాయాలు:
డొక్కు కంప్యూటర్‌, పాత బైకు.
వాటాదారులు:
ఏక వ్యక్తి సైన్యం. మహా అయితే, ఒకరిద్దరు మిత్రులు.
మేధోమథనం:
ఇరానీ కేఫ్‌లోనో, కాఫీడేలోనో. ఆఫీసు మెట్ల మీదో, క్యాంపస్‌ చెట్ల నీడనో.
లక్ష్యాలు:
మార్కెట్‌లో నిలవాలి.
జీవితంలో 'సక్సెస్‌' సాధించాలి.
* * *
s..u..c..c..e..s..s
...అన్న మాటకు అంతర్జాలంలో రకరకాల నిర్వచనాలు ఉంటాయి. ఆ ఆంగ్లాక్షరాల్ని మనం గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో టైపు చేయగానే ఎవరో చెప్పిన విజయ సూత్రాలూ, ఇంకెవరివో గెలుపు చరిత్రలూ వరుసగా ప్రత్యక్షం అవుతాయి.
ఆ యువకులు మాత్రం ప్రత్యేకం!
అంతర్జాలాన్నే తమ విజయాలకు వేదికగా మలుచుకున్నారు. 'సక్సెస్‌' అని కొడితే చాలు, వాళ్ల విజయగాథలూ ప్రత్యక్షం అవుతాయి. వాళ్లు చెప్పిన గెలుపు సూత్రాలూ దర్శనమిస్తాయి. ఆ సృజన దిగ్గజాలకు సైతం దిమ్మతిరిగేలా చేస్తోంది. ఆ దూకుడు వ్యూహకర్తల్ని కూడా వూపిరి తిప్పుకోనివ్వడం లేదు. ఆరేడు వందలకోట్ల రూపాయల భారీ విక్రయ లావాదేవీతో వార్తలకెక్కిన రెడ్‌బస్‌.ఇన్‌ సంగతే తీసుకుందాం. బస్సుల గురించి ఆలోచించేంత తీరిక కార్పొరేట్‌ పెద్దలకెక్కడిది? వాళ్ల దృష్టంతా విమానాల మీదే! కోట్లరూపాయల వ్యాపారం ముందు చిల్లర టికెట్లు చిన్నగానే అనిపిస్తాయి. ఓ ఐటీ యువకుడు ఆ మార్కెట్‌ మీద కన్నేశాడు. అదీ యాదృచ్ఛికంగానే. సామా ఫణీంద్ర ఏదో పండక్కి బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ రావాలనుకుంటే, ఒక్క బస్సూ దొరకలేదు. మనం వెళ్లిన ఏజెంటు దగ్గర టికెట్లు ఉండవు. కానీ ఇంకేదో బస్సులో ఖాళీలుంటాయి. ఆ సంగతి ఏజెంటుకు తెలియదు. బస్సు ఆపరేటర్లకూ టికెట్‌ ఏజెంట్లకూ మధ్య అనుసంధానం లేదు. మొత్తంగా, ఓ వ్యవస్థంటూ లేదక్కడ. ఆ చిన్న అనుభవంలోంచే రెడ్‌బస్‌ ప్రాణంపోసుకుంది. సహచరులు చరణ్‌ పద్మరాజు, సుధాకర్‌ పసుపునూరి ఎర్రబస్సుకు ఓ రూపం ఇవ్వడంలో అండగా నిలిచారు. 2006లో ఐదు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన వ్యాపారం...ఆరేళ్లలో మూడువందల యాభై కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకుంది. ఆ యువకులు చేసిందల్లా ఒకటే - ప్రయాణికుల్నీ, టికెట్లనూ, ఏజెంట్లనూ, బస్‌ ఆపరేటర్లనూ ఒక ఛత్రం కిందికి తీసుకురావడం. అందుకో సాఫ్ట్‌వేర్‌ తయారుచేయడం. అన్నిటికీమించి, ఇంటర్నెట్‌ వేదికగా దాన్నో వ్యాపారంగా తీర్చిదిద్దడం. ప్రపంచంలోని 50 వినూత్న వ్యాపార ఆలోచనల్లో ఒకటిగా రెడ్‌బస్‌ గుర్తింపు పొందింది. దాదాపు పన్నెండువేల మార్గాలకు ఆ సంస్థ సేవలు విస్తరించాయి. కనుచూపు మేరలో కూడా బలమైన పోటీదారు లేడు. ఆ తిరుగులేని ఆధిపత్యమే దక్షిణ ఆఫ్రికా సంస్థ నాస్పర్స్‌ను ఆకట్టుకుంది. భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుంది. ఇప్పుడు, ఆ ముగ్గురు మిత్రులు...ముగ్గురు కుబేరులు!సరికొత్త ఆలోచన, వినూత్నమైన వ్యాపారకోణం, పరిమితమైన పెట్టుబడి, అపరిమితమైన మార్కెట్‌ అవకాశాలు, సవాళ్లను ప్రేమించే గుణం, సమస్యల్ని ఎదిరించే ధైర్యం - ఏ 'ఇంటర్నెట్‌ ఎంట్రప్రెన్యూర్‌' విజయగాథలో అయినా కనిపించే మలుపులివే. వాళ్ల వెనకేం ఆస్తిపాస్తులుండవు, ఘనమైన వ్యాపార వారసత్వం ఉండదు. పక్కా మధ్యతరగతి. రెండుపదుల వయసులో కోటి ఆశలతో, శతకోటి కలలతో క్యాంపస్‌ నుంచి బయటికొస్తారు. ఏ బహుళజాతి సంస్థలోనో ఉద్యోగానికి చేరతారు. జీతం బావుంటుంది. జీవితమూ బావుంటుంది. మనసే, స్థిమితంగా ఉండనీయదు. 'బతుకు బోర్‌ కొడుతోంది బాబాయ్‌' అంటూ నసగడం మొదలుపెడుతుంది. 'కొత్తగా ఏదైనా ట్రై చేయొచ్చుగా!' అని వూరిస్తుంది. 'యు కాన్‌ డు ఇట్‌ యార్‌!' అని రెచ్చగొడుతుంది.
చేతిలో టెక్నాలజీ, బుర్రలో ఐడియా, గుండెల్లో దమ్ము...ఓ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి ఈమాత్రం సాధన సంపత్తి సరిపోతుంది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తారు. ఇంకేముంది, నిబిడాశ్చర్యంలో జనం. 'నీకేం పోయేకాలం వచ్చిందిరా, లక్షణమైన ఉద్యోగం'...కుటుంబ సభ్యుల తిట్లు, 'కంపెనీపెట్టి బిల్‌గేట్స్‌ అయిపోదామనే'...మిత్రుల ఎకసెక్కాలు. అన్నింటినీ తట్టుకుని, అవరోధాల్ని నెట్టుకుని, నెట్‌ ఆధారిత కంపెనీని ఓ స్థాయికి తీసుకురావడమంటే మాటలు కాదు. శత్రుదుర్భేద్యమైన కోటను కట్టినంత శ్రమ. మార్కెటింగ్‌, ప్రచారం, సిబ్బంది జీతాలు, ఆఫీసు అద్దెలు, పెద్ద సంస్థల పోటీ - దినదినగండమే! వెంచర్‌ క్యాపిటలిస్టు దొరికి, చేతిలో నాలుగు రాళ్లు ఆడేదాకా...వూపిరాడదు! అదృష్టం కలిసొచ్చి ఏ విదేశీ సంస్థో కొంటానంటూ ముందుకొచ్చిందంటే...డబ్బే డబ్బు! 'భవిష్యత్‌లోనూ నువ్వే సీయీవో...భారతీయ మార్కెట్‌ బాధ్యతలన్నీ నీకే' అంటూ అదనపు ఆఫరు! జిందగీ జిగేల్‌జిగేల్‌!!
అందులోనూ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల కళ్లన్నీ భారతీయ డాట్‌కామ్‌ కుర్రాళ్ల మీదే. ఒక్క గత ఏడాదే, మూడువందల పైచిలుకు సంస్థల్లో దేశవిదేశీ వెంచర్‌ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెట్టారని అంచనా. వాటిలో చాలావరకూ ఇంటర్నెట్‌ కంపెనీలే. ప్రస్తుతానికి అవన్నీ చిన్నచిన్న వ్యాపారాలే కావచ్చు...కానీ, భవిష్యత్‌ అవకాశాలు అపారం. భారత్‌లో ఆన్‌లైన్‌ లావాదేవీలు వూపందుకుంటున్నాయి. యువత తమ మిగులు ఆదాయంలో 33 శాతం దాకా ఆన్‌లైన్‌ షాపింగ్‌కే వెచ్చిస్తున్నారు. ఆ అంకెలు ఇన్వెస్టర్లను వూరిస్తున్నాయి. వాళ్ల ముందున్నది రెండే మార్గాలు - వీలైతే మొత్తంగా కొనేయడం, లేదంటే పెట్టుబడులు పెట్టి మెజారిటీ వాటాలు దక్కించుకోవడం.
'హాట్‌' మెయిలే!
'నేనో ఐటీ కంపెనీ పెడతాను. నా సంస్థలో వందలమంది ఉద్యోగులు పనిచేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్లు ఉంటారు. ఏటా కోట్ల రూపాయల టర్నోవరు...' ఈ మాటలు అంటున్నప్పటికి సబీర్‌ భాటియా ఓ సాధారణ యువకుడు. చండీగఢ్‌లో పుట్టాడతను. తల్లి బ్యాంకు ఉద్యోగి, తండ్రి సైనికాధికారి. కాలేజీ రోజుల్లోనూ తను మరీ తెలివైన విద్యార్థేం కాదు. కష్టపడి అమెరికన్‌ యూనివర్సిటీలో సీటు తెచ్చుకున్నాడు. వెనువెంటనే ఆపిల్‌లో కొలువొచ్చింది. రాజాలాంటి ఉద్యోగానికి రాజీనామా చేసి డాట్‌కామ్‌ కంపెనీ పెడతానంటే...ఎవరుమాత్రం ఒప్పుకుంటారు. కానీ, మనవాడు మొండిఘటం. 'హాట్‌ మెయిల్‌' ఐడియా మీదున్న నమ్మకమే అతన్ని ముందుకు నడిపించింది. మిత్రుడు జాక్‌స్మిత్‌తో కలిసి ఆ వెబ్‌మెయిల్‌ సర్వీసును ప్రారంభించాడు. కొద్దిరోజుల్లోనే పోటీదార్లను వెనక్కినెట్టి, గూగుల్‌ తరువాతి స్థానానికి చేరింది హాట్‌మెయిల్‌. ఆ పనితీరు మైక్రోసాఫ్ట్‌నూ ఆకట్టుకుంది. భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకున్నాడు బిల్‌గేట్స్‌. 1997లో 400 మిలియన్‌ డాలర్లంటే చాలా చాలా పెద్ద మొత్తం! అప్పటికి హాట్‌మెయిల్‌ వయసు - ఏడాది. ఓ భారతీయుడు స్థాపించిన డాట్‌కామ్‌ సంస్థ అంత ధర పలకడం, మైక్రోసాఫ్ట్‌ కోరికోరి బేరానికి రావడం - అప్పట్లో ఓ సంచలనం! ఆతర్వాత సబీర్‌ చాలా డాట్‌కామ్‌ సంస్థలు స్థాపించాడు. కొన్నింటిని లాభానికి విక్రయించాడు. కొన్నింటిని నష్టాల వల్ల మూసేశాడు. ఇంకొన్ని బాగానే నడుస్తున్నాయి.'నేనోసారి బిల్‌గేట్స్‌తో చాలాసేపు మాట్లాడాను. మిగతా వ్యాపారవేత్తల్లానే ఉన్నాడు. అందరూ అడిగే సందేహాలే అడిగారు' అంటాడు సబీర్‌ ఆ ఐటీ దిగ్గజం ప్రస్తావన వచ్చినప్పుడు. ఆ మాటకొస్తే, సబీర్‌ గురించి తెలిసినవారు కూడా అలానే అనుకుంటారు! గొప్ప తెలివితేటలు ఉన్నవారికే గొప్ప ఆలోచనలు రావాలని లేదు. సాధారణ వ్యక్తులు కూడా అసాధారణంగా ఆలోచించగలరు- బలీయమైన ఆకాంక్ష ఉంటే.
'బాజీ.కామ్‌' గెలుపు బాజా!
రెడ్‌బస్‌ భారీ లావాదేవీ గురించి చర్చ జరిగిన ప్రతిసారీ బాజీ.కామ్‌ ప్రస్తావన వస్తుంది. ఎనిమిది తొమ్మిదేళ్ల క్రితం...ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం ఈబే... పసిగుడ్డులాంటి బాజీ.కామ్‌ను 230 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అది కలోనిజమో అర్థంకావడానికే చాలా సమయం పట్టింది - మార్కెట్‌ విశ్లేషకులకు. అవ్నీష్‌ బజాజ్‌, సువీర్‌సుజన్‌ అనే యువకులు బాజీ.కామ్‌ను స్థాపించారు. ఇద్దరూ ఐఐటీలో సహపాఠీలు. ఇద్దరూ హార్వర్డ్‌లో చదువుకున్నారు. ఇద్దరూ వివిధ సంస్థల్లో పనిచేశారు. ఇ-బేని తలదన్నే దేశీ డాట్‌కామ్‌ సంస్థను స్థాపించాలన్నది ఉమ్మడి కోరిక. ఆరోజు రానే వచ్చింది. తమ కలల్ని నిజం చేసుకోడానికి కోటి రూపాయల వార్షిక వేతనాన్ని వదులుకున్నారు. 'ఎవరైనా ఏదైనా అమ్మవచ్చు, కొనవచ్చు' అన్న సూత్రం మీద పనిచేసేలా బాజీ.కామ్‌ను రూపొందించారు. అంటే, ఆ వెబ్‌సైట్‌ కేవలం సంధానకర్త మాత్రమే. ఈ నమూనాను ఎంచుకోవడం వల్ల... గోదాములు, సరుకులు వగైరా వగైరా పెట్టుబడి ఖర్చులు తప్పాయి. అప్పుడప్పుడే ఐటీ కొలువుల్లో చేరుతున్న యువతరానికి బాజీ.కామ్‌లో షాపింగ్‌ కొత్త అనుభవాన్నిచ్చింది. ఓవైపు వేలంపాటలు, మరోవైపు సాధారణ అమ్మకాలు- అభిరుచిని బట్టి ఎంచుకోవచ్చు! ఐదూ పదివేలతో ప్రారంభమైన బాజీ.కామ్‌ రిజిస్టర్డ్‌ కస్టమర్ల సంఖ్య పది లక్షలకు చేరింది. సరిగ్గా అదే సమయంలో, ఇ-బే భారత్‌ మార్కెట్‌లో పాగా వేయాలని నిర్ణయించింది. సహజంగానే బాజీ.కామ్‌ మీద కన్నేసింది. 'భారత్‌కు సంబంధించినంత వరకూ మీకే బాధ్యతలు అప్పగిస్తాం. రూ.230 కోట్ల దాకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం' అంటూ బేరం పెట్టింది. కాదనడానికి కారణం కనిపించలేదు. అవ్నీష్‌, సుజన్‌ సంతోషంగా సంతకాలు చేశారు.
డాలర్‌ పాఠాలు...
ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక...సందేహాలు తీర్చుకోడానికీ కొత్త పాఠాలు నేర్చుకోడానికీ పిల్లలు ట్యూషన్‌ దాకా ఎందుకెళ్లాలి? అందులోనూ అమెరికా లాంటి దేశాల్లో ట్యూషన్‌ పెట్టించుకోవడం అంటే, ఖరీదైన వ్యవహారమే. అందులో పదోవంతు ఇచ్చినా బుర్రకు ఎక్కేలా బోధించగల ఉపాధ్యాయులకు భారత్‌లో కొదవే లేదు. అమెరికన్ల అవసరాన్నీ భారతీయుల నైపుణ్యాన్నీ టెక్నాలజీ సాయంతో ముడిపెడితే ఎలా ఉంటుంది? - గణేష్‌ కృష్ణన్‌ అనే బెంగుళూరు యువకుడి ఆలోచనకు సాంకేతిక రూపమే ట్యూటర్‌విస్టా.కామ్‌. 2005లో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. నెలకు వందడాలర్ల ఫీజు చెల్లిస్తే చాలు - ఎంతసేపైనా, ఎన్ని సబ్జెక్టులైనా చెప్పేస్తామంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు గుప్పించారు. ఉపాధ్యాయుల నియామకం, శిక్షణ తదితర విషయాల్లో గణేష్‌ చాలా ప్రామాణికమైన విధానాల్ని రూపొందించుకున్నాడు. రెండువేలమంది ఉపాధ్యాయుల్ని నియమించుకున్నాడు. అక్కడ అమెరికాలో విద్యార్థి కంప్యూటర్‌ మీద క్లిక్‌ చేసిన మరునిమిషంలోనే...ఇక్కడ భారత్‌లో ఓ ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండేలా చక్కని వ్యవస్థను సిద్ధంచేశాడు. గణితంలో, ఆంగ్లంలో అత్తెసరు మార్కులు తెచ్చుకునే సగటు అమెరికన్‌ హైస్కూలు విద్యార్థులనూ వారి తల్లిదండ్రులనూ ఆ ప్రాజెక్టు భలేగా ఆకట్టుకుంది. పియర్సన్‌గ్రూప్‌ దాదాపు ఆరువందల కోట్ల రూపాయలు చెల్లించి ట్యూటర్‌విస్టాలో వాటాలు తీసుకుంది. గణేష్‌ ఒక్కసారిగా మధ్యతరగతి నుంచి సంపన్నవర్గానికి ఎగబాకాడు.
ట్యూటర్‌విస్టాకు ముందు గణేష్‌ 'కస్టమర్‌ అసెట్‌' అనే ప్రాజెక్టును నిర్వహించాడు. దాన్ని గణనీయమైన మొత్తానికి ఐసీఐసీఐ బ్యాంకుకు విక్రయించేశాడు. ప్రస్తుతం 'స్మార్ట్‌ థింకింగ్‌' సంస్థ ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారికి ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నాడు. రక్తం రుచి మరిగిన పులిలా...గెలుపు రుచి తెలిసిన బుర్ర మరింత లాభదాయకమైన, ఇంకాస్త శక్తిమంతమైన ఆలోచన కోసం తపిస్తూనే ఉంటుంది.
ఎగుడుదిగుళ్ల ప్రయాణం
మేక్‌మైట్రిప్‌.కామ్‌ వార్షిక టర్నోవరు రెండువేల కోట్ల రూపాయల పైమాటే - అన్న వాక్యం చదువుతుంటే, డాట్‌కామ్‌ వ్యాపారవేత్తలంటే కించిత్‌ అసూయ పుడుతుంది. క్లిక్కులతో కోట్లు గడించేస్తున్నారన్న భావనా ఏర్పడుతుంది. నిజమే, కానీ ఆ సంపద అయాచితంగా వచ్చింది కాదు. ఆ విజయం యాదృచ్ఛికమూ కాదు. దీప్‌కల్రా 'మేక్‌మైట్రిప్‌.కామ్‌'ను ప్రారంభించే నాటికి, డాట్‌కామ్‌ బూమ్‌ రాజ్యమేలుతోంది. భారత్‌-అమెరికాల మధ్య రాకపోకల సందడి బాగానే ఉంది. దీంతో ఆ యువకుడు బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఇ-ప్రయాణ సంస్థను స్థాపించాడు. మేక్‌మైట్రిప్‌ టికెట్లు బుక్‌ చేస్తుంది. హోటళ్లలో వసతి రిజర్వు చేస్తుంది. విహారయాత్రలకు సహకారం అందిస్తుంది. ప్రవాసులే లక్ష్యంగా వ్యాపార ప్రణాళిక రచించుకున్నాడు దీప్‌కల్రా. అంతలోనే బూమ్‌ ఢామ్మని పేలింది. మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడతానన్న అమెరికన్‌ వెంచర్‌ క్యాపిటలిస్టు వెనక్కి తగ్గాడు. లాభాల సంగతి అటుంచితే, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 'సగం జీతం మాత్రమే ఇచ్చుకోగలను. దయచేసి అర్థంచేసుకోండి' అన్న అభ్యర్థన కొందర్ని మాత్రమే కదిలించింది. తనకూ భార్యాపిల్లలున్నారు. వాళ్ల బాగోగులూ చూసుకోవాలి. ఓపక్క మేక్‌మైట్రిప్‌ నిర్వహిస్తూనే... చిన్నాచితకా సంపాదన మార్గాలు వెతుక్కున్నాడు. క్రమంగా అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రవాసుల రాకపోకలు పెరిగాయి. టూరిస్టుల హడావిడి ఎక్కువైంది. చౌకరకం విమాన సేవలు భారతీయ మార్కెట్‌ను ముంచెత్తాయి. ఇండియన్‌ రైల్వే ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థను ప్రారంభించడమూ శుభపరిణామమే. జనం కొనుగోలు సామర్థ్యం కూడా పెరిగింది. వీటన్నిటివల్లా, ప్రయాణాలు వూపందుకున్నాయి. మేక్‌మైట్రిప్‌ వార్షిక టర్నోవరు వేయికోట్ల రూపాయలను అధిగమించింది. 2010లో దీప్‌ అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌లో మేక్‌మైట్రిప్‌.కామ్‌ను నమోదు చేశాడు. అంచనాలకు మించి నిధులు సమకూరాయి. ఆ మొత్తం...బిలియన్‌ డాలర్లు!
క్లిక్కు...చమక్కు!
ఒకటో వ్యాపారం నష్టాలపాలైంది. రెండో వ్యాపారం దెబ్బకొట్టింది. మూడో వ్యాపారం మూలనపడింది. నాలుగూ అయిదూ ఆరూ... వరుస దెబ్బలు. అది చాలనట్టు, నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ మీద ఓ పుస్తకాన్ని రాసి, సొంత ఖర్చుతో ముద్రించుకున్నాడు. అనుకున్న స్థాయిలో అమ్మకాల్లేవు. అయినా, సందీప్‌ మహేశ్వరిలోని ఆశావాదం చచ్చిపోలేదు. 'ఈ వైఫల్యాలేవీ నన్ను బాధపెట్టలేదు. ఎందుకంటే ప్రతి పనీ ఇష్టంగానే చేశాను' అంటాడా యువకుడు. ఈసారి...ఇంటర్నెట్‌పై గురిపెట్టాడు. 2006లో ఇమేజ్‌బజార్‌.కామ్‌ పేరుతో ఆన్‌లైన్‌లో ఛాయాచిత్రాల్ని విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించాడు. తనో మంచి ఫొటోగ్రాఫర్‌. 2013 నాటికి ఇమేజ్‌బజార్‌ పది లక్షలకుపైగా ఫొటోలతో ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ ఛాయాచిత్రాల సమాహారంగా పేరు తెచ్చుకుంది. విశ్వవ్యాప్తంగా కస్టమర్లను సంపాదించుకుంది. 'షాట్‌ఇండియా.కామ్‌' మహేశ్వరి మరో వెంచర్‌. తాము తీసిన ఫొటోల్ని ఎవరైనా ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు. కొనుగోలుదారుల నుంచి అందే సొమ్ములో యాభైశాతం వారికి వెళ్తుంది. ఇదోరకంగా ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లను ప్రోత్సహించడం కూడా. 'జీవితం ఎంతో చిన్నది. నీకు ఇష్టంలేని పనులు చేస్తూ ఆ కొద్ది సమయాన్ని కూడా ఎందుకు వృథా చేసుకుంటావ్‌' అని సలహా ఇస్తాడు మహేశ్వరి తన పుస్తకంలో.
ఐడియా బజార్‌...
ఒకటీ ఒకటిన్నర దశాబ్దం నుంచీ భారత్‌లో బోలెడన్ని ఆన్‌లైన్‌ వ్యాపార ప్రయోగాలు జరుగుతున్నాయి. వైఫల్యాలూ భారీగానే ఉన్నా గేమ్స్‌2విన్‌.కామ్‌, స్నాప్‌డీల్‌.కామ్‌, యాత్రా.కామ్‌. భారత్‌మాట్రిమొనీ.కామ్‌... ఇలా ఎన్నో డాట్‌కామ్‌ సంస్థలు అవరోధాల్ని అధిగమించి లాభాలబాట పట్టాయి. సంజీవ్‌ బిక్‌చందానీ నౌకరీ.కామ్‌ను ప్రారంభించినప్పుడైతే...అంతా నవ్వుకున్నారు. నిరుద్యోగుల కోసం వెబ్‌సైట్‌ ఏమిటి, దాన్లో ప్రకటనలు ఎవరిస్తారంటూ? ఇప్పుడా సంస్థ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆన్‌లైన్‌లో చెల్లింపులు ఇష్టపడని అనుమానపు మనుషుల్నీ, సరుకు చూశాక కానీ డబ్బులు ఇవ్వకూడదనుకునే మొండి ఆసాముల్నీ దారికి తెచ్చుకోడానికి 'పార్సిల్‌ అందాకే డబ్బు ఇవ్వండి' అంటూ ఇ-దుకాణం ఫ్లిప్‌కార్ట్‌.కామ్‌ కొత్త వ్యాపార విధానానికి తెరతీసింది. యాభైవేల రూపాయల పెట్టుబడితో వి.ఎస్‌.ఎస్‌.మణి ప్రారంభించిన జస్ట్‌ డయల్‌.కామ్‌ ఇటీవలి పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.900 కోట్లకు పైగా సేకరించింది. షోరూమ్‌లూ, ఆసుపత్రులూ వగైరా స్థానిక చిరునామాల్నీ ఫోన్‌ నంబర్లనూ ఆఫ్‌లైన్‌లోనూ ఆన్‌లైన్‌లోనూ అందించే లోకల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఇది. విద్యార్థులూ ఉద్యోగార్థులూ తమ నైపుణ్యాన్ని పరీక్షించుకోడానికి ఓ వేదికగా పనికొచ్చే ర్యాంక్‌జంక్షన్‌.కామ్‌...అనతికాలంలోనే ఏంజిల్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లను అప్‌లోడ్‌ చేయడానికి సహకరించే స్త్లెడ్‌షేర్‌.కామ్‌ను ఆన్‌లైన్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ లింక్డిన్‌ దాదాపు రూ.650 కోట్లకు కొనుగోలు చేసింది. అంతేనా... ఆన్‌లైన్‌లో కూరగాయలు అందించేవారొకరు, అద్దెపుస్తకాలు ఇచ్చేవారొకరు, పనిమనుషుల్ని వెతికిపెట్టేవారొకరు, ఆటోలు బేరం కుదిర్చిపెట్టేవారొకరు - నిత్యజీవితంతో ముడిపడిన ప్రతి అంశాన్నీ ఓ వ్యాపార వస్తువుగా మార్చేస్తున్నారు నవతరం టెక్‌వీరులు.
* * *
ఒకానొక దశలో వ్యాపారవేత్తలంతా కలిసి కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేశారు...అయ్యా! మేం ఎగుమతి చేసే వస్తువుల మీద 'మేడ్‌ ఇన్‌ ఇండియా' అన్న ముద్ర తీసేయండి. భారత్‌ ఉత్పత్తులంటే నాసిరకం సరుకన్న అభిప్రాయం ఉంది. ఎవరూ కొనడం లేదు - అని సారాంశం.
మరి ఇప్పుడు! ప్రపంచంలోని వ్యాపార దిగ్గజాలన్నీ 'మేడ్‌ ఇన్‌ ఇండియా' డాట్‌కామ్‌ కంపెనీలవైపు ఆశగా చూస్తున్నాయి. వందలకోట్లు, వేలకోట్లు వెదజల్లి సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నాయి.
ఇది, మన విజయం. ఘన విజయం!
హితోక్తి.కామ్‌
ఆ పనిలో నైపుణ్యం ఉండాలి. ఆ పనంటే చచ్చేంత ప్రేమ ఉండాలి. మార్కెట్‌ అవకాశాలుండాలి. ఆన్‌లైన్‌ వ్యాపారం కావచ్చు, ఆఫ్‌లైన్‌ వ్యాపారమూ కావచ్చు...ఏ సంస్థను ప్రారంభించే ముందైనా గుర్తుంచుకోవాల్సిన అంశాలివి.
- అవ్నీష్‌ బజాజ్‌
బాజీ.కామ్‌ వ్యవస్థాపకుడు
నీ ఆకాంక్ష బలమైంది కనుక అయితే, దాన్ని నిజం చేయడానికి సృష్టిలోని సర్వశక్తులూ నీకు సహకరిస్తాయి - అని విశ్వసిస్తాన్నేను. ఏ ఔత్సాహికుడికి అయినా ఆమాత్రం ఆత్మవిశ్వాసం ఉండాలి. వైఫల్యాలకు భయపడటం వల్లే... చాలామంది తమ కలల్ని నిజం చేసుకోలేకపోతున్నారు.
- గణేష్‌ కృష్ణన్‌
ట్యూటర్‌విస్టా.కామ్‌ వ్యవస్థాపకుడు
రెడ్‌బస్‌ కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు... పిల్లల్ని నిద్రపుచ్చుతున్నప్పుడు అమ్మానాన్నలు ఇలాంటి విజయగాథలే చెప్పాలి. ఏదో ఒకరోజు వాళ్లు 'నేనూ ఎంట్రప్రెన్యూర్‌ అవుతా' అంటారు. దేశానికి అవసరమైంది అలాంటి తరమే.
- అలోక్‌ కేజ్రీవాల్‌,
గేమ్స్‌2విన్‌.కామ్‌
వరైనా మనకు ఉద్యోగం ఇచ్చారంటే ఒకటే అర్థం - వాళ్లకంటే మనం, ఎంతోకొంత తెలివైన వాళ్లం. ఏ యజమానీ తనకంటే తెలివి తక్కువవాళ్లకు కొలువు ఇవ్వడు.
- దీప్‌కల్రా
మేక్‌మైట్రిప్‌.కామ్‌
సాధారణమైన సాహసాలు చేయకపోతే, సాధారణంగానే మిగిలిపోతారు జాగ్రత్త!
- సందీప్‌ మహేశ్వరి
ఇమేజ్‌బజార్‌.కామ్‌
ప్పుడున్న విద్యావిధానం చదవడం మాత్రమే నేర్పుతుంది. ఆలోచించడం ఎలాగో చెప్పదు. పోటీ ప్రపంచంలో నిలవాలన్నా, గెలవాలన్నా - ఆలోచన ఉండాలి. పరిజ్ఞానం అవసరమే. కానీ, దాన్ని ఎలా ఉపయోగించాలన్న ఆలోచనలేకపోతే ఎంత పరిజ్ఞానం ఉండీ ఏం లాభం? కొత్తతరం ముందుగా ఆలోచించడం నేర్చుకోవాలి... అది కూడా కొత్తగా, వైవిధ్యంగా!
- సబీర్‌ భాటియా
హాట్‌మెయిల్‌ సృష్టికర్త
సినిమా... వ్యాపార పాఠం!
స్కార్‌ అందుకున్న 'లైఫ్‌ ఆఫ్‌ పై' చిత్రం ఇప్పుడో ఆసక్తికరమైన బిజినెస్‌ పాఠం. ఒక పులి, ఒక సముద్రం, ఒక పడవ, గమ్యాన్ని చేరాలని తపించే పైపటేల్‌ అనే కుర్రాడు - నాలుగు అంశాల చుట్టూ తిరిగే సినిమాకూ వ్యాపారానికీ సంబంధం ఏమిటనేగా మీ అనుమానం. సంబంధం ఉంది. ఒకానొక కొత్త సంస్థను స్థాపించి.. ముందుకెళ్లడమంటే - నడిసంద్రంలో ప్రయాణమే. అందులోనూ అంతంతమాత్రం ఆర్థిక పరిస్థితి. మనది చిల్లుల పడవలో ప్రయాణమన్నమాట. పులులూ సింహాల్లాంటి దిగ్గజాలతో కలిసి వెళ్లడం అంటే... ఏ నిమిషానికి ఏం జరుగుతుందో చెప్పలేని అనిశ్చిత వాతావరణం. అయినా, ఆశావాదం చావకూడదు. చాకచక్యంతో పులిని దారికి తెచ్చుకోవాలి. ఏ ఏంజిల్‌ ఇన్వెస్టర్లో, విదేశీ కంపెనీవాళ్లో నౌకల్లా ఎదురొచ్చి చేయి అందిస్తారని విశ్వసించాలి. అన్ని అవకాశాలూ చేజారిపోయినా, సముద్రాన్ని ఈదుకురాగలమన్న గుండెధైర్యం ఉండాలి. అప్పుడే, పైపటేల్‌లా ఒడ్డుకు చేరతాం. 'రెడ్‌బస్‌'లా గమ్యాన్ని అందుకుంటాం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు