ఆ నాలుగు అడుగులు
పరుగుపందేన్ని చూసేవాళ్లు ఓ విషయం గమనించి ఉంటారు. లక్ష్యం దిశగా వేలాది అడుగులు వేసినా.. కేవలం ఓ నాలుగైదు అంగలే గెలుపుని నిర్ణయిస్తాయి. పిల్లలు తప్పటడుగులు వేయడానికి ముందు కూడా ఇదే జరుగుతుంది. పాదాలు తాటిస్తూ వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వాళ్లకి నడకనిచ్చేవి మాత్రం ఓ నాలుగడుగులే! 2017లో మన శాస్త్ర-సాంకేతిక ప్రపంచం సాగించిన నడకలో.. ఈ నాలుగు అడుగులూ అలాంటివే. చరిత్రలో నిలిచిపోదగ్గవే! భవిష్యత్తు మానవులు స్మరించుకునేవే!
సంచిలోనే.. అమ్మకడుపు చల్లదనం
పరీక్షా నాళికలో వీర్యకణాన్నిచేర్చి.. అండాన్ని పండించడం యాభై ఏళ్లకిందటే చేశాం. నెలలు నిండకముందే బిడ్డ పుడితే ఇన్‌క్యూబేటర్‌లో పెట్టి బతికిస్తున్నాం. అదీ ఎనిమిది నెలలోపైతే సమస్య లేదు. ఆరు నుంచి ఏడునెలల శిశువైతే అష్టకష్టాలు పడాలి. ప్రపంచంలో శిశుమరణాలు ఎక్కువగా నమోదయ్యేది కూడా ఈ దశలోనే. ఆ సమస్యని అధిగమించేందుకే తల్లిగర్భసంచి బ్యాగుని సృష్టించగలిగారు అమెరికా ఫిలడెల్ఫియాలోని ఓ పిల్లల ఆసుపత్రి వైద్యులు. జీవసంచి(బయోబ్యాగ్) అని పిలుస్తున్న ఇందులో.. శిశువులు సురక్షితంగా సేదదీరగల ద్రావణం ఉంటుంది. ఇందులో 105 రోజుల ఎదుగుదల ఉన్న గొర్రెపిల్లని ఆరోగ్యకరంగా పెంచగలిగారు. గొర్రెపిల్లకి 105 రోజులంటే మనకి 22 వారాల శిశువులకి సమానం. ఈ ప్రయోగం మానవశిశువుల్లోనూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే విజయం సాధిస్తే.. ఆరేడు నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల్నీ.. మనం కంటికిరెప్పలా కాపాడుకోవచ్చు!
|
క్యాన్సర్‌ని కత్తిరించి పడెయ్!
మధుమేహం, రక్తపోటూ, కొన్ని రకాల క్యాన్సర్‌లు వంశపారంపర్యంగా వస్తాయని వినే ఉంటారు. మరి అవి అలా రావడానికి ముందే తల్లిలోని అండం(ఎంబ్రియో) నుంచే ఆ జన్యువుల్ని గుర్తించగలిగితే? గుర్తించి వాటిని సవరిస్తే? నిండు ఆరోగ్యవంతులైన మానవుల్ని పుట్టించవచ్చుకదా..! అమెరికా ఆరెగాన్ హెల్త్ సెంటర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఆ దిశగానే ఓ కీలకమైన ముందడుగు వేశారు. ఒకే ఒక కణం మాత్రమే ఏర్పడ్డ ఓ అండాన్ని తీసుకుని అందులోని జన్యువుని ‘ఎడిట్’ చేయగలిగారు. అంటే.. అందులోని వ్యాధుల్ని తొలగించి సవరించగలిగారు. మానవ అండంలోని జన్యుశ్రేణి ఓ పెద్ద బండరాయి అనుకుందాం! అందులో వృధాని తొలగించి మనకు నచ్చిన రీతిలో శిల్పంలా మలిచే ప్రయత్నం చేశారన్నమాట. అందుకు వాళ్లకో ఉలి సాయపడింది. దాని పేరు ‘క్రిస్పర్’. దీన్ని 2014లోనే కనిపెట్టినా.. ఈ ‘జన్యు ఎడిటర్’ని ఈ ఏడాదే తొలిసారి మానవ అండంపై ప్రయోగం చేశారు!
|
ఇక క్వాంటమ్ జాలం
ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్ సేవలన్నీ రేడియో తరంగాల ఆధారంగా పనిచేస్తాయి! ఆ తరంగాలు ప్రపంచంలో ఏ మూలనో ఉండే సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా మనకు అందిస్తాయి. రేడియోవేవ్స్ ద్వారా కాకుండా క్వాంటమ్ కమ్యూనికేషన్ ద్వారా వీటిని అందిస్తే.. ఎలాగుంటుందనే ఆలోచన వచ్చింది చైనాలోని శాస్త్రవేత్తలకి. ఆ దిశగా విజయం సాధించగలిగారు కూడా! శాటిలైట్ సాయంతో క్వాంటమ్ కమ్యూనికేషన్స్‌తో వీడియోకాల్స్ మాట్లాడుతున్నారు. ఆ సాంకేతికతని అంతర్జాలానికి తీసుకురావడంలో ఇదో పెద్ద ముందడుగు! సరే.. దీని వల్ల ఏమిటి లాభం? వేగం పరంగా ఇప్పుడున్న వాటికీ, క్వాంటమ్ కమ్యూనికేషన్స్‌తో పనిచేసే అంతర్జాలానికీ పెద్ద తేడా ఉండదు. ఇది హ్యాకింగ్‌కి నిరోధకంగా అద్భుతాలు చేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో పెట్టిన ఏ సమాచారం కూడా మూడోకంటికి తెలిసే అవకాశమే లేదట. ఒకవేళ.. ఎవరైనా లోపలికి వస్తే మొత్తం క్రాష్ అయిపోతుంది. హ్యాక్ చేసిన వాళ్లెవరో ఇట్టే తెలిసి పోతుంది!
|
ఆ రాకెట్‌ని మళ్లీ వాడుకోవచ్చు!
నింగిలోకి ఏ ఉపగ్రహాన్నో, వాహకనౌకనో చేరవేసే రాకెట్ తన పని పూర్తయ్యాక ఏమవుతుందో తెలుసా? ముక్కలుముక్కలుగా విడిపోయి ఆకాశంలో ఓ చెత్తగా మిగిలి.. అక్కడే చక్కర్లు కొడుతుంటుంది. అలా కాకుండా.. ఆ రాకెట్‌లని మళ్లీ వాడుకోగలవిగా(రీ-యూజబుల్‌గా) తయారుచేస్తే? 30 శాతం డబ్బు మిగులుతుంది. అతితక్కువ వనరులతో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న మనలాంటి దేశాలకి కోట్లాది రూపాయలు కలిసొస్తాయి. అంతేకాదు.. అతితక్కువ ధరకే మనుషులు ఏ చంద్రుడిపైకో, కుజుడిపైకో వెళ్లొచ్చే అవకాశం ఉంటుంది. రీయూజబుల్ కాగితాలూ, ప్లాస్టిక్ కవర్‌లలాగే.. ఈ రాకెట్‌లన్నమాట. అంతరిక్ష పరిశోధనలో సరికొత్త ఆలోచనలని ప్రపంచం ముందు పెడుతున్న ‘స్పేస్ ఎక్స్’ సంస్థ ఈ అద్భుతం చేస్తోంది. తాము ఇదివరకు ప్రయోగించిన ‘ఫాల్కన్ 9’ రకం రాకెట్ బూస్టర్‌ని మళ్లీ ఈ ఏడాది ప్రయోగించింది! వాడి పడేసిన ఓ రాకెట్‌ని మళ్లీ ఇలా నింగిలోకి పంపడం ప్రపంచంలో ఇదే మొదటిసారని చెబుతున్నారు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు.. ఎలాన్ మస్క్!
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి