మూడురోజుల్లో... పరిశ్రమ పెట్టొచ్చు!
‘నాకు ఐటీ, ఫార్మా కంపెనీల్లో ఐదంకెల ఉద్యోగం సాధించేంత చదువులేదు. అంతమాత్రాన కూలీనాలీ చేసుకుందామనుకున్నా ఇంట్లో ఒప్పుకోరు. కానీ ఆర్థికంగా నాకాళ్లపై నేను నిలబడాలని ఉంది..!’
..మనలోని 70 శాతం మందిలో ఉన్న ఆలోచన ఇది! ఇలాంటివాళ్లకే చక్కటి పరిష్కారమార్గాలు చూపిస్తోంది హైదరాబాద్‌లోని రూరల్ టెక్నాలజీ పార్కు(ఆర్టీపీ)! కేవలం మూడు నుంచి పదిరోజుల శిక్షణతో.. తక్కువలో తక్కువ ఐదువేల రూపాయల పెట్టుబడితో మీరూ పరిశ్రమని స్థాపించవచ్చు. ఈ సంస్థ దాన్నెలా సాధ్యం చేస్తోందంటే..
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్‌డీ)లో భాగమైన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఉన్న ఆర్టీపీ. తమకున్న తక్కువ అర్హతలతోనే స్వయం ఉపాధి సాధించాలనుకునే మహిళలకి శిక్షణతోపాటూ, మార్కెటింగ్ మెలకువలూ నేర్పించడం దీని లక్ష్యం. ‘రూరల్ టెక్నాలజీ పార్కు’ అన్నంతమాత్రాన ఇది గ్రామీణ స్త్రీలకే పరిమితం అనుకోనక్కర్లేదు. ఏ నగరం నుంచైనా దీన్ని సంప్రదించవచ్చు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, చదువు.. ఇవేమీ పరిగణనలోకి తీసుకోరు. నేర్చుకొని వ్యాపారం ప్రారంభించాలన్న తపన ఒక్కటుంటే చాలు.. పూర్తి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. వ్యాపారం ప్రారంభించి మరో పది మందికి చేయూత కల్పించాలనే లక్ష్యం ఉందా లేదా అని మాత్రమే చూస్తారు! కొన్ని ఆసక్తికరమైన కోర్సులివి..
ఎలా నమోదు చేసుకోవాలి?
శిక్షణ కోసం నమోదు చేసుకోవాలంటే ఒక చిన్న ఉత్తరం రాసినా సరిపోతుంది (చిరునామా: రూరల్ టెక్నాలజీ పార్కు, రాజేంద్రనగర్, హైదరాబాద్-500 030). లేదంటే rtpnird@gmail.com కు మీ వివరాలు మెయిల్ చేయొచ్చు. ఆయా బ్యాచ్‌లవారిగా కోర్సులు నిర్వహిస్తారు. అవి ప్రారంభమయ్యేటప్పుడు మీకు సమాచారం అందిస్తారు. నమోదు రుసుము వంద రూపాయలు. ప్రయాణ ఛార్జీలొక్కటే మీకు అదనపు ఖర్చు. కోర్సు పూర్తయ్యే వరకూ వసతి కూడా వారే కల్పిస్తారు. బ్యాచ్ ప్రారంభం కాకముందే మీకు శిక్షణ అవసరమైతే అదనపు ఫీజులతో మీకు తర్ఫీదు ఇస్తారు. వివరాలకు 9848780277 నెంబర్‌లో సంప్రదించవచ్చు.
|
పుట్టగొడుగుల పెంపకం
దీన్ని చిన్న స్థాయిలో ప్రారంభించడానికి ఒక చిన్న షెడ్‌లాంటి నిర్మాణం, చేతిలో అయిదువేలు రూపాయలుంటే చాలు. వేరే వాళ్ల మీద ఆధారపడకుండా మనకు మనమే సంపాదించుకోవచ్చు. పుట్టగొడుగులు ఒకవేళ అమ్ముడు కాకపోతే పాడవకుండా వాటిని ప్రాసెసింగ్ చేసే పద్ధతులు కూడా శిక్షణలో భాగంగా నేర్పుతున్నారు. వాటినీ చాలా తక్కువ ఖర్చుతోనే మనమే సొంతంగా ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు.
|
విస్తరాకులు...
సాధారణంగా వీటి తయారీకి కావాల్సిన హైడ్రాలిక్ యంత్రాల కోసం 70 వేల రూపాయలు అవసరమవుతాయి. హైడ్రాలిక్ మెషీన్లు కాకుండా చేతితో పనిచేసే పరికరాలని ఇరవైవేలలో కొనుగోలు చేసేయొచ్చు. ఆర్టీపీలో వాటిపైనే శిక్షణ అందిస్తున్నారు. అడ్డాకు, మోదుగాకుతో ఈ విస్తరాకులు తయారుచేస్తున్నారు. వీటితో గంటకు ముప్ఫై విస్తరాకులు తయారు చేయొచ్చు. రోజుకు నాలుగు గంటలు కష్టపడితే 120 వస్తాయి. ఒక్కోటి ఆరు రూపాయల వంతున(గరిష్ఠంగా) వేసుకుంటే నెలకు దాదాపు ఇరవైవేలు సంపాదించినట్లే. వీటిని తయారుచేసి విదేశాలకూ ఎగుమతి చేస్తున్నవాళ్లున్నారు.
|
వీళ్లు సాధించారు...
రాజేశ్వరిది సోమాజిగూడ. ఒకప్పుడు చిరుద్యోగి. పెద్దగా చదువుకోలేదు. బొటాబొటి జీతం కాకుండా.. ఆర్థికంగా మరింత స్థిరంగా నిలదొక్కుకోవాలనుకుంది. ఆర్టీపీ గురించి తెలుసుకుని శిక్షణకి దరఖాస్తు చేసుకుంది. సబ్బులూ, షాంపూల ఉత్పత్తి నేర్చుకుంది. ఇప్పుడు సంవత్సరానికి మూడు లక్షల రూపాయల ఆదాయం అందుకుంటోంది. పాత ఉద్యోగం కంటే దాదాపు మూడురెట్లు ఎక్కువ సంపాదిస్తోంది. యాదాద్రికి చెందిన రాధిక సాధారణ గృహిణి. సొంతంగా వ్యాపారం చేసేంత స్థితి లేదు. అందువల్ల తోటివారితో కలిసి కొద్ది పెట్టుబడితో డిటర్జెంట్, డిష్‌వాష్‌లు మొదలుపెట్టింది. ఇప్పుడు చక్కటి లాభాలు ఆర్జిస్తోంది. రాయపల్లికి చెందిన నాని, వెంకట లక్ష్మి.. కూడా ఏం చేయాలో తెలియక ఒకప్పుడు భవిష్యత్తు గురించి సతమతమైనవారే. ఇటుకల తయారీ వాళ్ల జీవితాన్ని మార్చేసింది. వాళ్ల ఊరిలో ఓ ఆసుపత్రిని నిర్మిస్తే.. అందుకు అవసరమైన మొత్తం ఇటుకలూ వీళ్లే తయారు చేసి ఇచ్చారు!
|
ఐదువేలుంటే చాలు...
మూడు రోజుల నుంచి పదిహేను రోజుల వరకూ నిడివి ఉంటాయంతే. వేప ఉత్పత్తులతోపాటు వర్మికంపోస్ట్ తయారీ (3 రోజులు), సబ్బుల తయారీ (4 రోజులు), విస్తరాకుల తయారీ (5 రోజులు), తేనె, సోయా ఉత్పత్తులు తయారు చేయడం (5 రోజులు), హెర్బల్ ఉత్పత్తులు (4 రోజులు), సహజ రంగుల తయారీ (15 రోజులు), ఆభరణాల తయారీ (10 రోజులు).. ఇలా దాదాపు ఇరవై రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి మనం ఎంచుకున్న వ్యాపారాన్ని ఐదు వేల నుంచి అరవైవేలదాకా ఉంటుంది. ‘ఇక్కడ శిక్షణనిచ్చేది కేవలం అధ్యాపకులు కాదు. ఆయా రంగాల్లో సంస్థలు నడుపుతున్నవారు. శిక్షణతోపాటూ పరిశ్రమ పరిస్థితినీ తమ అనుభవాలు రంగరించి చెబుతారు. కాబట్టి.. నేర్చుకున్నవారు అప్పటికప్పుడే ఆయా రంగంలో ధీమగా అడుగుపెట్టొచ్చు..’ అని చెబుతున్నారు ఆర్టీపీ సీనియర్ కన్సల్టంట్ ఖాన్.
|
సంచుల తయారీ
కాటన్ సంచుల తయారీ నేర్పిస్తున్నారు ఇక్కడ. శిక్షణా కాలం పదిరోజులు. బ్యాగులతో పాటే వివిధ గృహాలంకార వస్తువుల తయారీపైనా శిక్షణ అదనంగా ఉంటుంది. ఒక కుట్టు మిషన్, అయిదువేల రూపాయల ముడి సరకు మన చేతిలో ఉండాలంతే. రెండు నుంచి మూడు మీటర్ల కాటన్ వస్త్రంతో చిన్న సైజు బ్యాగులు ఇరవై దాకా తయారుచేయొచ్చు. మనం కొన్న వస్త్రానికి మనం చేసిన పనితనం, సృజన విలువ తెచ్చి పెడతాయి. అవే లాభంగా మారతాయి.
|
- కౌటిక్ ప్రణయశ్రీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి