కేరళ వరద ఒక కనువిప్పు (GK sharing article)

మానవ తప్పిదమే..!
పడమటి కనుమలకు చేటు ఫలితమే కేరళ విపత్తు!!
మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ  సిఫార్సుల్ని అటకెక్కించారు
పర్యాటకుల స్వర్గధామం కేరళ నేడు కనీవినీ ఎరుగని ప్రకృతి ప్రకోపాన్ని చవిచూస్తోంది. కుండపోత వర్షాలతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది మనిషి సృష్టించిన విపత్తేననేది పర్యావరణ నిపుణుడు మాధవ్‌ గాడ్గిల్‌ నిశ్చితాభిప్రాయం. పశ్చిమ కనుమల్లో పర్యావరణానికి కలిగిస్తున్న హాని నేడు ప్రకృతి వైపరీత్యం రూపంలో కేరళపై విరుచుకుపడుతోందని కుండబద్ధలు కొట్టారు. పశ్చిమ కనుమల పరిరక్షణపై సిఫార్సులు చేయడానికి మాధవ్‌ గాడ్గిల్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ(డబ్ల్యూజీఈఈపీ) 2011 ఆగస్టు 31న ప్రభుత్వానికి 522 పేజీల నివేదికను సమర్పించింది. ప్రస్తుతం వర్షాల్లో నష్టపోయిన కేరళలోని పలు ప్రాంతాలు పర్యావరణపరంగా సున్నితమైన మండలాలు(ఈఎస్‌జెడ్‌) అంటూ కమిటీ ఆనాడే వర్గీకరించింది. మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ నివేదికను అధ్యయనం చేసి, అమలుకు సిఫార్సులు చేయడం కోసం ఆ తర్వాత ఏర్పాటుచేసిన కస్తూరీరంగన్‌ కమిటీ కూడా పశ్చిమ కనుమల పరిరక్షణకు పలు సిఫార్సులు చేసింది. కానీ ఈ రెండు కమిటీల సిఫార్సుల్లో దేనినీ ప్రభుత్వం అమలుచేయలేదు. కొన్ని సిఫార్సులనైనా అమలుచేసి ఉంటే కేరళకు నేడు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదనేది పర్యావరణ నిపుణుల వాదన.

గాడ్గిల్‌ కమిటీ ఏం చెప్పింది? 
పశ్చిమ కనుమల మొత్తాన్నీ పర్యావరణ సున్నిత ప్రాంతం(ఈఎస్‌ఏ)గా ప్రకటించాలి. 
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని- పశ్చిమ కనుమలు విస్తరించిన 1,40,000 చదరపు మైళ్లను మూడు పర్యావరణ సున్నిత జోన్లు(ఈఎస్‌జెడ్‌-1,2,3)గా విభజించాలి. పశ్చిమ కనుమల్ని ఆనుకుని ఉన్న 142 తాలూకాలను ఈ 3 జోన్ల పరిధిలోకి తేవాలి. 
ఈఎస్‌జెడ్‌-1లో అన్ని అభివృద్ధి కార్యకలాపాల(గనుల తవ్వకం, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం లాంటివి)పై పూర్తి నియంత్రణలు విధించాలి. భూమిని అటవీయేతర పనులకు వినియోగించడంపై కఠిన నిబంధనలు విధించాలి. 
కొండచరియలు విరిగిపడటానికి కారణమౌతున్న క్వారీల తవ్వకాన్ని నియంత్రించాలి. 
అటవీ భూముల దురాక్రణకు ఆపాలి. 
భారీగా నీటిని నిల్వచేసే కొత్త ఆనకట్టలు వేటినీ జోన్‌-1లో అనుమతించకూడదు. కేరళలోని అత్తిరప్పిలి, కర్ణాటకలోని గుండియా జలవిద్యుత్‌ ప్రాజెక్టులు జోన్‌-1 పరిధిలోకి వస్తాయి. వీటికి పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదు. 
ప్రస్తుతం అనుసరిస్తున్న పర్యావరణ నిర్వహణ విధానాన్ని పూర్తిగా మార్చేయాలి. అట్టడుగునున్న గ్రామసభల స్థాయి నుంచి ఉన్నతస్థాయికి అనే విధానాన్ని అనుసరించాలే తప్ప పై నుంచి కిందికి అనే విధానం సరికాదు. 
పశ్చిమ కనుమల పర్యావరణ అథారిటీ(డబ్ల్యూజీఏ)ని ఏర్పాటుచేయాలి. దీనికి తగిన అధికారాలివ్వాలి. కేంద్ర పర్యావరణ, అటవీమంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేయాలి.
మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ నివేదిక పర్యావరణం, పర్యావరణ వేత్తలకు అనుకూలంగా ఉందే తప్ప.. అభివృద్ధికి దోహదపడేలా లేదని, పశ్చిమ కనుమల మొత్తాన్నీ పర్యావరణ సున్నిత పరిధిలోకి తెస్తే.. ఇంధనం, అభివృద్ధిపరంగా ఇది వివిధ రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బతీస్తుందన్న వాదన వచ్చింది. నివేదిక సమర్పించిన చాన్నాళ్ల తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం దీనిని బయటపెట్టలేదు. చివరికి దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు నివేదికను పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సిఫార్సుల అమలుకు నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నదీ పరీవాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, అనధికారికంగా నడుపుతున్న రాళ్ల క్వారీలు విపత్తును రెట్టింపుచేశాయి. వీటికి తక్షణం అడ్డుకట్ట వేయాలి. పర్యావరణ నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం ఇప్పటికైనా అమలుచేయాలి. పర్యావరణ పరిరక్షణ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’’
- మాధవ్‌ గాడ్గిల్‌
భారీగా క్వారీల తవ్వకం, ఆకాశహర్మాల నిర్మాణం, ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా అటవీ భూముల్ని ఆక్రమిస్తుండడం ప్రస్తుత విపత్తుకు ఓ ప్రధాన కారణం.
- పర్యావరణ వేత్తలు
కేరళకు ముప్పు ఎందుకు? 
పశ్చిమకనుమలకు ఆనుకుని ఉన్న కేరళలోకి.. కనుమల్లో నుంచి వచ్చే నీటి ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కనుమల హరిత రక్షణకు ఎలాంటి నష్టం చేకూర్చినా విపత్తుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ మనుషులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కనుమలకు భారీగా నష్టం చేకూరుస్తున్నారు. చెట్లు నరికేస్తున్నారు. గనులు తవ్వేస్తున్నారు. అడవుల్ని ఆక్రమించి అటవీయేతర పనులకు వినియోగిస్తున్నారు. దాని దుష్పరిణామాల్ని ఇప్పుడు కేరళ చవిచూస్తోందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు..
కస్తూరీ రంగన్‌ కమిటీ ఏం చెప్పింది?
గాడ్గిల్‌ కమిటీ సిఫార్సులపై అధ్యయనం చేసి.. అమలుకు సిఫార్సులు చేయడం కోసం కేంద్రం కస్తూరీరంగన్‌ నేతృత్వంలో మరో కమిటీని నియమించింది. 10 మంది సభ్యుల ఈ కమిటీని పశ్చిమ కనుమలపై ఉన్నతస్థాయి వర్కింగ్‌ గ్రూపు(హెచ్‌ఎల్‌డబ్ల్యూజీ) అని పిలుస్తారు. 2013 మే నెలలో కమిటీ నివేదికను సమర్పించింది.
పశ్చిమ కనుమలు మొత్తాన్నీ కాకుండా అందులో 37 శాతం(60 వేల చ.మైళ్లు) ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతం(ఈఎస్‌ఏ) పరిధిలోకి తేవాలి.
ఈఎస్‌ఏ ప్రాంతంలో గనుల తవ్వకం, క్వారీలు, ఇసుక మైనింగ్‌పై పూర్తి నిషేధం విధించాలి.
పశ్చిమ కనుమల్ని సాంస్కృతిక(58శాతం జనావాస ప్రాంతాలు, వ్యవసాయభూములు, తోటలు), సహజ భూప్రాంతం(ఇందులో 90 శాతం ఈఎస్‌ఏ పరిధిలోకి రావాలి)గా విభజించాలి.
ఇప్పటికే ఈఎస్‌ఏ ప్రాంతంలో కొనసాగుతున్న మైనింగ్‌ను రాబోయే ఐదేళ్లలో నిర్మూలించాలి.
అధ్యయనం తర్వాత మాత్రమే జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు అనుమతించాలి.
కాలుష్య కారక పరిశ్రమలపై పూర్తిగా నిషేధం విధించాలి.
ఈఎస్‌ఏ ప్రాంతంలోకి 123 గ్రామాల్ని తీసుకురావాలి.
ఈ కమిటీ కూడా సరైన రీతిలో అధ్యయనం చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అధికారం గ్రామసభలకు ఇవ్వకూడదన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. దీంతో ఈ నివేదికను కూడా కేంద్రం అమలుచేయలేదు. ఆ తర్వాత ఊమన్‌ కమిటీ చేసిన సిఫార్సుల్నీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
- ఈనాడు ప్రత్యేక విభాగం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు