గండికోట రహస్యమిదే!

వారాంతంలో..
గండికోట రహస్యమిదే!  
పెన్నా నది ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. చిత్రావతి చిన్నగా ఉరకలేస్తుంటుంది. ఎప్పుడో గాని ఈ నదులు ఉధృతంగా ప్రవహించవు. అందుకే కాబోలు.. శతాబ్దాలు గడుస్తున్నా.. గండికోట చెక్కుచెదరక నిల్చుంది. కోటలోని రహస్యాలు పదిలంగా ఉన్నాయి. రెండో హంపీగా పేరున్న గండికోటలో పాగా వేసేందుకు ఎందరో రాజులు ఎన్నెన్నో యుద్ధాలు చేశారు. పెన్నాలో నెత్తురు పారించారు. ఇప్పుడదే కోటకు కులాసాగా చేరిపోవచ్చు. దిలాసాగా విహరించవచ్చు. పెన్నా లోయ సోయగాలు మనసారా ఆస్వాదించవచ్చు.
అందమైన లోయలు, శత్రుదుర్భేద్యమైన కోట, ప్రాచీన కట్టడాలు, ఎటు చూసినా అబ్బురపరిచే దృశ్యాలు.. గండికోట రహస్యమిదే! కడప జిల్లా జమ్మలమడుగు నుంచి 11 కిలోమీటర్ల దూరంలో పెన్నానది ఒడ్డున ఉంటుందీ కోట. పూర్వం ఈ ప్రాంతాన్ని గిరిదుర్గం అనేవారు. పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట కొండల మధ్య భారీ గండి ఏర్పడింది. ఆ సమీపంలో కోటను నిర్మించడంతో దీనికి గండికోట అని పేరొచ్చింది. సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున్న లోయ గుండా పెన్నా నది వయ్యారాలు ఒలకబోస్తూ ప్రవహిస్తుంటుంది.
ఎందరో రాజులు..
11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్య రాజు త్రైలోక్యమల్లకు సామంతుడుగా ఉన్న కాకరాజు ఈ కోటను నిర్మించారు. విజయనగర రాజుల ఏలుబడి తర్వాత గండికోటపై పెమ్మసాని పాలకుల ఆధిపత్యం కొనసాగింది. పదహారో శతాబ్దంలో గోల్కొండ నవాబు అబ్దుల్‌ కులీకుతుబ్‌ షా ప్రధాని, సైన్యాధికారి మీర్‌జుమ్లా గండికోటను ముట్టడించాడు. తర్వాత హైదర్‌ అలీ, టిప్పుసూల్తాన్‌ స్వాధీనపరుచుకున్నారు. టిప్పు సుల్తాన్‌ మరణం తర్వాత స్వాతంత్య్రం వచ్చే వరకు ఇక్కడ ఆంగ్లేయుల పెత్తనం కొనసాగింది. 1980లో కేంద్ర పురాతత్వ శాఖ గండికోటను తమ అధీనంలోకి తీసుకుంది.
పునాదుల్లేని కోట..
గండికోట చుట్టూ మూడు రాతి ప్రాకారాలు ఉన్నాయి. పునాదులు లేకుండానే కొండలపై కోట గోడలను నిర్మించడం విశేషం.  నిర్మాణంలో ఎర్రటి నున్నటి రాళ్లను వినియోగించారు. 1,200 మీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పు ఉన్న కోట చుట్టూ 101 బురుజులు ఉన్నాయి. కోటలో 21 దేవాలయాలు ఉన్నాయి. 55 స్తంభాలతో, అరుదైన శిల్పకళతో మాధవరాయస్వామి ఆలయం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడి రంగనాయక ఆలయ స్తంభాలపై రామాయణ, భాగవత గాథలు దర్శనమిస్తాయి. ఆలయ మూలవిరాట్టు రంగనాయకస్వామి విగ్రహం ప్రస్తుతం మైలవరం పురావస్తు మ్యూజియంలో ఉంది. కోటలో జుమ్మా మసీదు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇవేగాక కారాగారం, ఎర్రకోనేరు, ధాన్యాగారం, రామబాణపు బురుజు, రాయలచెరువు, రంగమహల్‌, ఆయుధ కర్మాగారం, వ్యాయామశాల ఇలా సందర్శనీయ స్థలాలెన్నో ఉన్నాయి.
-యస్‌. మహమ్మద్‌ ఆరీఫ్‌, న్యూస్‌టుడే, జమ్మలమడుగు
ఇలా వెళ్లొచ్చు..
* కడప నుంచి గండికోట 86 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం ఇతర ప్రధాన నగరాల నుంచి కడపకు బస్సులు, రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
* గండికోటకు సమీపంలో (32 కి.మీ) ఉన్న రైల్వేస్టేషన్‌ ముద్దనూరు. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వెంకటాద్రి, రాయలసీమ, తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లు ముద్దనూరు మీదుగా వెళ్తాయి. ఇక్కడి నుంచి గండికోటకు బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. విజయవాడ నుంచి నేరుగా జమ్మలమడుగు వెళ్లే రైలు ఉంది. అక్కడి నుంచి సులభంగా గండికోటకు చేరుకోవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు