కిక్కిచ్చే క్రీడల స్నాక్స్.. ఇవిగో!

కిక్కిచ్చే క్రీడల స్నాక్స్.. ఇవిగో!
క్రీడాకారులు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలి. దాని కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా క్రీడా ప్రాంగణం లేదా జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. ఎక్కువ సమయం జిమ్‌లో కసరత్తులు చెయ్యాలంటే తగిన శక్తి అవసరం. ఇలాంటి సమయంలో ప్రొటీన్లతో కూడిన ఆహారం ఎంతో అవసరం. శక్తిని కోల్పోకుండా దృఢంగా ఉండాలంటే రోజువారి తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి!
కమ్మని కాఫీ
కాఫీ తాగడం వలన ఉత్సాహం రెట్టింపు అవుతుందని యూనివర్శిటి ఆఫ్ జార్జియా శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా నిర్థారించారు. ఇది అథ్లెట్స్‌కి శక్తినిస్తుందని చెబుతున్నారు. క్రీడాకారులు కసరత్తులు చేయడానికి వెళ్లే ముందు కప్పు(75-200 మిల్లి గ్రాముల) కాఫీ తాగితే ఉన్న శక్తితో పొలిస్తే 24శాతం శక్తి పెరుగుతుందని వారు నిర్థారించారు. కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిదేనంటున్నారు.

చక్కటి చాక్లెట్‌
రోజూ డార్క్ చాక్లెట్ తినడం మంచిదేనంటున్నారు కింగ్‌స్టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. వీరు సైక్లింగ్‌ చేసే యువతపై ప్రయోగాలు జరిపి తెలుసుకున్నారు. డార్క్‌ చాక్లెట్ తీసుకోని వారికన్నా అది తీసుకున్న వారు ఒకే సమయంలో 17శాతం ఎక్కువ దూరం సైక్లింగ్‌ చేశారని ప్రయోగపూర్వకంగా నిర్ధారించారు. ఇది క్రీడాకారులు సులభంగా ఆక్సిజన్‌ తీసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. 

నైస్‌ చెర్రీ 
ఎక్కువ సమయం జిమ్‌లలో కసరత్తులు చేసే వారు తొందరగా శక్తిని పొందడానికి చెర్రీ జ్యూస్ ఉపయోగపడుతుందని స్కాండినేవియన్ జర్నల్‌ ఆఫ్ మెడిసిన్ అండ్ సైన్సెస్ సంస్థ తెలిపింది. పరుగు పందెంలో పాల్గొనే క్రీడాకారులు పోటీకి ఐదు రోజుల ముందు ఈ జ్యూస్‌ తాగితే రెట్టింపు ఉత్సాహంతో పోటీలో పాల్గొని విజయం దిశగా దూసుకుపోతారన్నారు. 

భలే బాదం 
బాదంపప్పును సైక్లింగ్‌ క్రీడాకారులు క్రమం తప్పకుండా నాలుగు వారాలపాటు తింటే పోటీలో వేగం పెరుగుతుందని జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్‌ సంస్థ పేర్కొంది. ఇందులో ఉన్న మంచి కొవ్వు శిక్షణ సమయంలో అధిక శక్తిని అందిస్తుందని ఆ సంస్థ తెలిపింది. బాదం పప్పును రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలుంటాయని అన్నారు. ఇందులో కొవ్వు ఆమ్లాలు కండరాల దృఢంగా ఉండటానికి సహాయపడతాయని వారు తెలిపారు. 

ఆహా అరటి
అరటిపండును అథ్లెట్లు తప్పనిసరిగా తీసుకుంటారు ఎందుకంటే ఇందులో అధిక మోతాదులో పొటాషియం ఉంటుంది. ఇది పరుగు పందెంలో, సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు రెట్టింపు ఉత్సాహాన్నిస్తుందని ప్లాస్ వన్ సంస్థ ప్రయోగపూర్వకంగా వివరించింది. అరటిపండు తినే సైక్లింగ్ క్రీడాకారులు 75కిలోమీటర్ల వరకు సునాయాసంగా ప్రయాణం సాగించగలరని ఇందులో స్పోర్ట్ డ్రింక్‌తో సమానమైన పోషకాలుంటాయని తెలిపారు. ఇందులో స్పోర్ట్స్ డ్రింక్‌లో లేని యాంటి ఆక్సిడెంట్లు కలిగి ఉంటుందన్నారు. ఇందులో అధిక మోతాదులో ఫైబర్‌, విటమిన్ బి6 ఉంటాయన్నారు. ఇవి మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 

కండరాల కోసం..
క్రీడాకారులు కసరత్తులు ప్రారంభించే గంట ముందు పుచ్చకాయ జ్యూస్‌ తాగితే మంచి ఫలితాలుంటాయని జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ వారు తెలిపారు. ఇది కసరత్తుల సమయంలో గుండె కొట్టుకునే విధానాన్ని నిలకడగా ఉంచి కండరాలు దృఢత్వాన్ని పెంచుతుందన్నారు. ఇందులో ఉన్న అమీనో యాసిడ్‌, ఎల్-సిట్రులిన్‌ కండరాలను దృఢంగా మారుస్తాయి. జిమ్‌కి వెళ్లే గంట ముందు ఇది తాగడంతో ఉత్సాహాన్ని పెంచుతుంది. కసరత్తులు పూర్తయిన తర్వాత శరీరానికి అలసట రాకుండా ఉపయోగపడుతుంది. 


- ఇంటర్నెట్‌ డెస్క్‌

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు