అధిక బరువు.. దాంతోపాటు వచ్చే అనారోగ్యాల్ని నివారించాలంటే.. వంటకాల్లో ఉప్పు, నూనె తగ్గించాలి. ఇది తెలిసినా.. ఆ భోజనం చప్పగా ఉంటుందని చవులూరించే రుచుల్నే కోరుకుంటాం. కానీ ఉప్పు, నూనె ఏ మాత్రం వాడకుండా కూడా నోరూరించే పదార్థాలను తయారుచేసుకోవచ్చు. వాటినుంచి పోషకాలనూ పొందవచ్చు. పాలకూర అన్నం కావల్సినవి: బాస్మతీబియ్యం- రెండు కప్పులు, పాలకూర రసం- రెండు కప్పులు (పాలకూరను రుబ్బి రసం తీసుకోవాలి), కొబ్బరిపాలు- కప్పు, నీళ్లు- కప్పు, పచ్చిమిర్చి- ఆరు, క్యారెట్- ఒకటి (పెద్దది), బఠాణీలు- అరకప్పు(నానబెట్టాలి) యాలకులు- రెండు, అల్లం ముద్ద- అరచెంచా, పాలమీగడ- చెంచా, కరివేపాకు- నాలుగు రెబ్బలు, కొత్తిమీర, పుదీనా - కొద్దిగా. తయారీ: నానబెట్టిన బఠాణీలను ఉడికించుకోవాలి. తాజాగా దొరికితే వాటినే వాడొచ్చు. ఇప్పుడు పొయ్యిపై పాత్ర పెట్టి మీగడ వేసి యాలకులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముద్ద వేయించాలి. తరవాత పాలకూర రసం, కొబ్బరిపాలు, నీళ్లు, క్యారెట్ ముక్కలు, ఉడికించిన బఠాణీ, కొత్తిమీర, పుదీనా ఒకదాని తరవాత ఒకటి చేర్చాలి. రసం మరుగుతున్నప్పుడు కడిగిన బియ్యం వేసి కలిపి సన్ననిమంటపై ఉంచి ఉడకనివ్వాలి. అన్నం పూర...