ఉప్పు..నూనెల్లేని గొప్ప రుచులు
అధిక బరువు.. దాంతోపాటు వచ్చే అనారోగ్యాల్ని నివారించాలంటే.. వంటకాల్లో ఉప్పు, నూనె తగ్గించాలి. ఇది తెలిసినా.. ఆ భోజనం చప్పగా ఉంటుందని చవులూరించే రుచుల్నే కోరుకుంటాం. కానీ ఉప్పు, నూనె ఏ మాత్రం వాడకుండా కూడా నోరూరించే పదార్థాలను తయారుచేసుకోవచ్చు. వాటినుంచి పోషకాలనూ పొందవచ్చు.
బాస్మతీబియ్యం- రెండు కప్పులు, పాలకూర రసం- రెండు కప్పులు (పాలకూరను రుబ్బి రసం తీసుకోవాలి), కొబ్బరిపాలు- కప్పు, నీళ్లు- కప్పు, పచ్చిమిర్చి- ఆరు, క్యారెట్- ఒకటి (పెద్దది), బఠాణీలు- అరకప్పు(నానబెట్టాలి) యాలకులు- రెండు, అల్లం ముద్ద- అరచెంచా, పాలమీగడ- చెంచా, కరివేపాకు- నాలుగు రెబ్బలు, కొత్తిమీర, పుదీనా - కొద్దిగా. తయారీ: నానబెట్టిన బఠాణీలను ఉడికించుకోవాలి. తాజాగా దొరికితే వాటినే వాడొచ్చు. ఇప్పుడు పొయ్యిపై పాత్ర పెట్టి మీగడ వేసి యాలకులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముద్ద వేయించాలి. తరవాత పాలకూర రసం, కొబ్బరిపాలు, నీళ్లు, క్యారెట్ ముక్కలు, ఉడికించిన బఠాణీ, కొత్తిమీర, పుదీనా ఒకదాని తరవాత ఒకటి చేర్చాలి. రసం మరుగుతున్నప్పుడు కడిగిన బియ్యం వేసి కలిపి సన్ననిమంటపై ఉంచి ఉడకనివ్వాలి. అన్నం పూర్తిగా తయారయ్యాక దింపే ముందు మరికాస్త కొత్తిమీర, పుదీనా వేస్తే సరిపోతుంది. దీన్ని కుక్కర్‌లో కూడా ఉడికించుకోవచ్చు. అయితే ఒక కూత రాగానే సిమ్‌లో ఉంచి.. ఆ తరవాత కట్టేయాలి. ఉప్పు, నూనె మసాలా లేకుండా పోషకాలతో పాటు రుచినందించే ఆరోగ్యమైన అన్నం ఇది. నూనె ఉండదు కాబట్టి త్వరగా జీర్ణమవుతుంది. పిల్లలు, వృద్ధులు కూడా తీసుకోవచ్చు. పాలకూరలో సహజ ఉప్పు ఉంటుంది కాబట్టి రుచిలోనూ ఆ తేడా తెలియదు పుల్లదనం కోసం నిమ్మరసం, పచ్చిమామిడి, పచ్చిచింతకాయ, టమాటా రసం వాడుకోవచ్చు. గోంగూర పచ్చడిలో ఖర్జూర మిశ్రమానికి బదులు తేనెను కూడా ఎంచుకోవచ్చు. |
క్యాబేజీ - పావుకేజీ, క్యారెట్ - ఒకటి, పచ్చిమిర్చి - మూడు, కొబ్బరి తురుము - నాలుగు చెంచాలు, పొట్టు పెసరపప్పు - గుప్పెడు, పాలకూర తరుగు - రెండు గుప్పెళ్లు, పలుచని మజ్జిగ - కప్పు, మినప్పప్పు, సెనగపప్పు, కరివేపాకు - కొద్దిగా. కూరపొడికి: మినప్పప్పు - రెండు చెంచాలు, సెనగపప్పు - నాలుగు చెంచాలు, నువ్వులు - చెంచా, కరివేపాకు - కొద్దిగా. అన్నింటినీ విడివిడిగా వేయించుకుని ఆ తరవాత పొడి చేసుకోవాలి. తయారీ: దళసరి గిన్నె తీసుకుని అందులో పెసరపప్పును దోరగా వేయించి మజ్జిగతో ఉడికించాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు తరిగిన క్యాబేజీ, పచ్చిమిర్చి ముక్కలు వేసి సన్నని మంటపై ఉంచాలి. అయితే క్యాబేజీ మరీ మెత్తగా కాకూడదు. ఇప్పుడు నాన్‌స్టిక్ పాత్రను పొయ్యిమీద పెట్టి మినప్పప్పు, సెనగపప్పు, కరివేపాకు దోరగా వేయించి క్యారెట్ తురుము వేసి వేయించాలి. అది కొద్దిగా వేగాక పాలకూర తరుగు వేయాలి. పచ్చిదనం పోయేదాకా వేగనిచ్చి ఆ తరవాత ఉడికించి పెట్టుకున్న క్యాబేజీని నీళ్లు లేకుండా అందులో వేయాలి. కూర పొడిగా అయ్యాక కొబ్బరితురుము చేర్చాలి. రెండు నిమిషాలయ్యాక కూర పొడి వేసి కలియబెట్టి కొత్తిమీర తరుగు చల్లి దింపేయాలి. ఈ కూరలో నూనె, ఉప్పు లేని లోటును మజ్జిగ, పాలకూర, కొబ్బరి తీరుస్తాయి. ఇది పుల్కాల్లోకి చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పునకు బదులుగా సెనగపప్పు, పచ్చిబఠాణీలు కూడా చేర్చుకోవచ్చు. |
కందిపప్పు - కప్పు, టమాటాలు- పావుకేజీ, సొరకాయ - పావుకేజీ, మునక్కాడ - ఒకటి, బెండకాయలు - మూడు, పచ్చిమిర్చి - నాలుగైదు, అల్లం మిశ్రమం - అరచెంచా, నిమ్మకాయలు - మూడు, సాంబారు పొడి - రెండు చెంచాలు, తేనె - రెండు చెంచాలు, కరివేపాకు, కొత్తిమీర- కొద్దిగా, ఆవాలు, జీలకర్ర - చెంచా చొప్పున. తయారీ: కందిపప్పును ఉడికించి బాగా మెత్తగా అయ్యేందుకు మిక్సీలో వేయాలి. సొరకాయ, బెండకాయ, మునక్కాడల్ని ముక్కలుగా తరగాలి. టమాటాల్ని మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో తరిగి పెట్టుకున్న కూర ముక్కలు, టమాటా రసం, తేనె, పచ్చిమిర్చి, అల్లం మిశ్రమం, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర తీసుకుని కుక్కర్‌లో మూడు నాలుగు కూతలు వచ్చేదాకా ఉడకనివ్వాలి. కూరముక్కలు ఉడికాక నిమ్మరసం చేర్చి సిద్ధం చేసుకున్న కందిపప్పును కలిపి సాంబారు పొడి వేసి... పది నిమిషాల దాకా పొయ్యి మీద పెట్టాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో తాలింపు పెట్టి సాంబారుపై వేయాలి. కమ్మని సాంబారు సిద్ధం. |
కరివేపాకు - రెండు గుప్పెళ్లు, గోంగూర - నాలుగు గుప్పెళ్లు, టమాటాలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, ఖర్జూర మిశ్రమం - రెండు చెంచాలు (ఖర్జూరాలను నానబెట్టి ముద్దగా చేయాలి), నిమ్మకాయ - ఒకటి, మినప్పప్పు - రెండు చెంచాలు, సెనగపప్పు - చెంచా, నువ్వులు - మూడు చెంచాలు. తయారీ: కరివేపాకు, గోంగూరను సన్నగా తరిగి అందులో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి సన్నని మంటపై ఉంచి వేయించాలి. పప్పుల్ని విడివిడిగా దోరగా వేయించి చల్లారాక పొడి చేయాలి. మెత్తగా అయ్యాక వేగిన గోంగూర, ఖర్జూర మిశ్రమం వేసి మరోసారి మిక్సీ పట్టాలి. చివరిగా నిమ్మకాయ రసం చేర్చాలి. కరివేపాకు, గోంగూర, ఖర్జూరాల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పచ్చడిని వారానికి రెండు మూడు సార్లు తీసుకోవచ్చు. దీనివల్ల రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు. ఇది అన్నంలోకే కాదు.. పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. |
బీట్‌రూట్ ముక్కలు - రెండుకప్పులు, పెరుగు - కప్పు, పచ్చిమిర్చి - మూడు, ఉడికించిన టమాటా గుజ్జు - మూడు చెంచాలు, నిమ్మకాయ - ఒకటి, పలుచని మజ్జిగ - అరకప్పు, కొబ్బరి తురుము - మూడు కప్పులు, ఉల్లిపాయ ముక్కలు - మూడుచెంచాలు, కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా. తయారీ: బీట్‌రూట్ ముక్కల్ని సన్నగా తరిగి పచ్చిమిర్చి, మజ్జిగ చేర్చి కుక్కర్‌లో ఒకటిరెండు కూతలు వచ్చేదాకా ఉడికించాలి. ఆ ముక్కలు చల్లారాక కొబ్బరి తురుము, ఉడికించిన టమాటాగుజ్జు, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు.. బీట్‌రూట్‌లో కలిపి చివరగా పెరుగు వేయాలి. పైన కొత్తిమీర, కరివేపాకు తరుగు చల్లితే సరిపోతుంది. బీట్‌రూట్‌ను మజ్జిగలో ఉడికించడం వల్ల ముక్కల్లో ఉండే చప్పదనం తగ్గుతుంది. బీట్‌రూట్‌లో సహజమైన ఉప్పు ఉంటుంది. ఇది పాలకూర అన్నంలోకి చాలా బాగుంటుంది. |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి