వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)
ఈ సృష్టి ఒక నాటకరంగం. సకల ప్రాణులూ ఆ జీవన్నాటకంలో పాత్రధారులు. ఏనుగు మొదలు చలిచీమ దాకా... ప్రతి పాత్రా కీలకమైందే. ఏ ఒక్కటి లేకపోయినా వైవిధ్యం దెబ్బతింటుంది. నాటకం రసాభాస అవుతుంది. రేపటి నుంచి హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ఆందోళన కూడా అదే.మనిషి! మనిషి! మనిషి! ...జీవవైవిధ్య న్యాయస్థానం బిళ్లబంట్రోతు గొంతుచించుకుంటున్నాడు. 'నేనేలేవయ్యా! ఆ మనిషిని' అంటూ చికాకుచికాగ్గా వూబకాయుడూ అధిక రక్తపోటు బాధితుడూ మధుమేహపీడితుడూ అయిన ఓ శాల్తీ బోనెక్కాడు. ముద్దాయిగా నిలబడాల్సి వచ్చిందన్న పశ్చాత్తాపం అతన్లో ఏ కోశానా లేదు. కోటు సర్దుకున్నాడు. టై సవరించుకున్నాడు. టిష్యూపేపరుతో మొహం తుడుచుకున్నాడు. కోర్టుగదిలో ఏసీ లేదన్న చికాకు మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆ తాపానికీ, భూతాపానికీ కూడా తానే కారణమన్న సంగతి మాత్రం మరచిపోయాడు. తెలిసిన మూర్ఖుడంటే మనిషే!సందర్శకుల స్థానంలో... నదులు, సముద్రాలు, అడవులు, పర్వతాలు, పంటపొలాలు దిగాలుగా కూర్చున్నాయి. సకల జీవకోటికీ సాక్షులుగా వచ్చాయవి. మనిషిని చూడగానే జీవరాశి కోపం కట్టలు తెంచుకుంది. వీడే.., ఈ దుర్మార్గుడే, ఈ స్వార్థపరుడే... అంటూ పాములు బుసకొడుతున్నాయి. కందిరీగలు కరిచేద్దామా అన్నంత కోపంతో వూగిపోతున్నాయి. చిరుతలు చిర్రుబుర్రులాడుతున్నాయి. శాంతస్వభావులైన పిచ్చుకలకూ కోపమొచ్చింది. శాపనార్థాలు వూపందుకున్నాయి. ఓ దశలో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి. అంతలోనే న్యాయమూర్తి వచ్చారు. అంతా నిశ్శబ్దం. 'జీవకోటి వర్సెస్ మనిషి. ఒకటో ముద్దాయి నుంచి వందో ముద్దాయి దాకా - అన్నీ మానవుడే...' కేసు వివరాలు కోర్టుముందుంచాడు గుమస్తా. సకల జీవరాశి తరపు న్యాయవాది గొంతు సవరించుకున్నాడు... ''యువర్ ఆనర్! కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి ఉద్భవించింది. మెల్లమెల్లగా నదులూ సముద్రాలూ కొండలూ కోనలూ ప్రాణం పోసుకున్నాయి. ఎనభై నాలుగు లక్షల జీవకోటికీ అవి ఆవాసంగా నిలిచాయి. అప్పట్లో సృష్టిలో ఎంతో వైవిధ్యం ఉండేది. మహా అయితే ఇరవై లక్షల సంవత్సరాల క్రితమే, మనిషనేవాడు పుట్టాడు. మనిషి మనిషనిపించుకోడానికి ఇంకొంత సమయం పట్టింది. పారే ఏరు, పరుగెత్తే జింక, అనంత సముద్రం, ఉదయించే సూర్యుడు, అస్తమించే చంద్రుడు, మెరిసే నక్షత్రాలు... ప్రతీదీ అతనికి వింతే. కళ్లప్పగించి చూసేవాడు. వాటన్నిటి వెనుకా ఏదో నిగూఢ శక్తి దాగుందని భావించేవాడు. తరచూ భయపడేవాడు. ప్రకృతి తనకంటే చాలాచాలా శక్తిమంతమైందని బలంగా విశ్వసించేవాడు. దేవతగా ఆరాధించేవాడు. ఇదంతా తొలిదశ. మెల్లమెల్లగా ప్రకృతితో చనువు పెరిగింది. నదుల్ని ఈదాడు. జీవుల్ని మచ్చిక చేసుకున్నాడు. నక్షత్ర గమనాన్ని అర్థంచేసుకున్నాడు. ప్రకృతితో దోస్తీకట్టాడు. ఇది రెండో దశ. వైవిధ్యమే... ప్రకృతి విజయరహస్యం! చేయితిరిగిన రచయిత పాత్రల్ని సృష్టించినంత ఒడుపుగా... జీవరాశులకు ప్రాణం పోశాడు సృష్టికర్త! ఆ సూక్ష్మాన్ని గ్రహించలేకపోయాడా అహంభావి. ఎన్నో జీవజాతుల అంతర్ధానానికి తనే కారణమవుతున్నాడు. జాతికొకటి చొప్పున కేసు నమోదు చేసినా, ఈ మనిషిని వేలసార్లు ఉరితీయాలి...'' ఆవేశంగా వాదించాడు ప్రకృతి తరపు న్యాయవాది. జీవవైవిధ్య న్యాయమూర్తి శ్రద్ధగా ఆలకిస్తున్నారు. మధ్యమధ్యలో ముఖ్యమనిపించిన అంశాల్ని నమోదు చేసుకుంటున్నారు. ఓసారి కోర్టుగదంతా పరికించి చూసి, 'సాక్షుల్ని ప్రవేశపెట్టండి...' అని ఆదేశించారు. అడవితల్లి ఆక్రందన... పచ్చని వనలచ్చిమి ఎండుపుల్లలా తయారైపోయింది. మొహం నిండా నైరాశ్యం. గత వైభోగం లేదు. నిన్నటి కళాకాంతుల్లేవు. చూపులెటో. ధ్యాసెటో. 'చెప్పండి, మీ కష్టాలకు కారణమెవరు?'... న్యాయమూర్తి ఆత్మీయతకు ఆమె కరిగిపోయింది. ఏడుపొచ్చేసింది. చీరకొంగుతో కళ్లు తుడుచుకుంటూ తన కథంతా వివరించింది... ''నన్ను అడవితల్లి అంటారు. వనదేవతగా కొలుస్తారు. అడవిలోని సకల జీవరాశులూ నా బిడ్డలనుకున్నాను. చెట్లూచేమలూ నా చుట్టాలనుకున్నాను. సంతతి పెరుగుతున్నకొద్దీ సంబరమే. పచ్చదనం విస్తరిస్తున్నకొద్దీ పండగే! మనిషి నాగరికుడవుతున్న క్రమంలో అడవుల్ని నరికేసి గ్రామాల్ని నిర్మించుకున్నాడు. వన్యమృగాల్ని వేటాడి కడుపునింపుకున్నాడు. అయినా నేను బాధపడలేదు. వేల ఏళ్లక్రితం... ఆదిమ దశలో జంతువుల మధ్య జంతువుగా నా ఒళ్లో పెరిగిన బిడ్డేకదా... మనిషంటే! తల్లిగా ఆమాత్రం సహనం లేకపోతే ఎలా అనుకున్నాను. ఆలోచన పెరిగేకొద్దీ తెలివిమీరసాగాడు. అడవంటే అబ్బసొత్తనుకున్నాడు. అతని కళ్లు వన్యమృగాల మీద పడ్డాయి. తోలుతీసి అమ్ముకోడానికీ బొమ్మను చేసి అలంకరించుకోడానికీ ఎన్నో అమాయక ప్రాణుల్ని పొట్టనపెట్టుకున్నాడు. జాతులకు జాతులే అంతరించిపోయాయి. ఇంకొన్ని అంతరిస్తున్నాయి. అలా అని, రాయిలా రప్పలా సృష్టిలోని ప్రతిజీవీ శాశ్వతంగా ఉండాలని నేనేం కోరుకోవడం లేదు. మరణం కూడా పరిణామంలో భాగమే అంటాడు రిచర్డ్ డాక్సన్ అనే శాస్త్రవేత్త. నా అభిప్రాయం కూడా అదే. అంతపెద్ద డైనోసార్లే మాయమైపోయాయి. కానీ అది ప్రకృతి పరిణామంలో భాగంగా జరిగింది. ఇప్పటి మారణకాండకు మూలం మనిషి స్వార్థం. ఇందులో కొన్ని... ప్రత్యక్ష హత్యలు. నేరుగా కత్తులతోనో బందూకులతోనో చంపేస్తున్నాడు. ఇంకొన్ని పరోక్ష హత్యలు. మనుగడ సాగించలేని పరిస్థితి కల్పించి, జీవుల అంతానికి కారణం అవుతున్నాడు. గనుల తవ్వకాలూ రైల్వేలైన్లూ రోడ్డుమార్గాలూ పారిశ్రామికీకరణ... అడవి జీవులకు అవరోధాలు సృష్టిస్తున్నాయి. శబ్ద, వాయు కాలుష్యాన్ని కల్పిస్తున్నాయి. చెట్లు నరికేస్తే పిట్టలు గూళ్లెలా కట్టుకుంటాయి? ఆవాసం వెతుక్కుంటూ దిక్కుకొకటి వెళ్లిపోతాయి. అక్కడమాత్రం అనువైన పరిస్థితులు ఉంటాయన్న భరోసా లేదు. అడవంటే పులే గుర్తుకొస్తుంది. ఎంత దర్జా! ఏం రాజసం! నేటి పరిస్థితుల్లో పులిరాజాలు కూడా బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి. నక్కినక్కి నడవాల్సిన దుస్థితి. ఏ వేటగాడు గురిపెడతాడో, ఏ చర్మాల వ్యాపారి వల విసురుతాడో..అన్న భయం! పదేళ్ల క్రితం దేశంలో దాదాపు నాలుగువేల పులులుండేవి. మరి ఇప్పుడో! పదిహేను వందలలోపే. పులికి అనేకానేక అడవి జంతువులు ఆహారం. ఆ జీవులకు ఇంకేవో ప్రాణులు ఆహారం. దీంతో జీవరాశుల మధ్య ఒకవిధమైన సమతౌల్యం ఏర్పడేది. ఇప్పుడా అవకాశం లేదు. ఎలుగుబంట్లు వూళ్లమీదికి వస్తున్నాయన్నా ఏనుగుల మందలు పొలాల మీద దాడిచేస్తున్నాయన్నా..కారణం ఆ అసమతౌల్యమే! అడవి దాటిందంటే... పులి కూడా పిల్లే. ఏనుగైనా చిట్టెలుక అంత బలహీనపడిపోతుంది. పరుగుల జింక..ఎక్కడో ఓచోట బొక్కబోర్లాపడుతుంది. ఒక వూరి రాజు, మరో వూళ్లో సేవకుడు. స్థానబలం ఎక్కడలేని శక్తినిస్తుంది. వన్యజీవులకు సంబంధించినంత వరకూ... అడవే ఒక స్వర్గం, ఒక దుర్గం. అడవిలో వన్యమృగాలూ-చెట్లూ చెట్టాపట్టాలేసుకుని బతుకుతాయి. ఏ పులో సింహమో అటూ ఇటూ తిరుగుతుంటే... నరమానవులు ఆ పరిసరాల్లోకి కూడా రాలేరని చెట్లకు ధైర్యం. దట్టమైన చెట్ల మధ్య చేయితిరిగిన వేటగాడినైనా మూడుచెరువుల నీళ్లు తాగించవచ్చని వన్యమృగాల విశ్వాసం. చెట్లేమో నేలకూలుతున్నాయి. జీవరాశులేమో క్రమక్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఆ రెంటినీ ప్రేమించే గిరిపుత్రుల్ని తరిమితరిమి కొడుతున్నారు. ఇంకేముంది, అడవి చిక్కి శల్యమైపోతోంది. మా ఉసురు పోసుకుని... ఎన్నాళ్లని సంతోషంగా ఉంటాడీ మనిషి! అడవులు నాశనమైపోవడం వల్లే కదా..భూమి వేడెక్కుతోంది. వరదలు ముంచెత్తుతున్నాయి. భూసారం క్షీణించిపోతోంది. భవిష్యత్‌లో ఇంకెన్ని విపత్తులొస్తాయో! మా విన్నపం ఒక్కటే. అడవి ఎవరి ఆస్తీకాదు. ఆ చెట్లనెవరూ నాటలేదు. ఆ ప్రాణుల మీద ఎవరికీ అధికారం లేదు. జీవజాలానికెవరూ కూడుపెట్టి పెంచలేదు. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి'' వెక్కివెక్కి ఏడుస్తూ బోనులోనే కూలబడిపోయిందా శోకదేవత. సముద్రం అంటేనే గాంభీర్యం. ఎన్ని సునామీల్ని భరించి ఉండాలి. ఆటుపోట్లతో రాటుదేలిన సముద్రుడంతటివాడే... మనిషి దాడిని తట్టుకోలేక వణికిపోతున్నాడు. సృష్టిలోని జలసంపదకు ప్రతినిధిగా, నదీనదాలకు పెద్దదిక్కుగా బోనెక్కాడు సముద్రుడు.''ఏం చెప్పమంటారు దేవరా! మలినాల్ని శుభ్రంచేసే జలమే పరమ మురికిగా తయారైంది. నిన్నమొన్నటిదాకా 'గంగేచ యమునేచ..' అంటూ చేతులెత్తి మొక్కినవాళ్లే, ముక్కు మూసుకుని దాటుకెళ్తున్నారు. జలం విషమయమైపోయింది. నదులు మురికి కూపాలయ్యాయి. సముద్రం... మలినాలకు మజిలీగా మారుతోంది. సముద్రపు ఉప్పుతిన్నానన్న కృతజ్ఞత కూడా లేదీ మనిషికి. మరయంత్రాల సాయంతో మారణహోమం సృష్టిస్తున్నాడు. విచక్షణ లేకుండా వేటాడుతున్నాడు. సముద్ర జీవుల ఎగుమతులతో కోట్లకుకోట్లు కూడబెట్టుకుంటున్నాడు. ఆ దాడిలో చేపలే కాదు..అరుదైన జలచరాలూ నాశనమైపోతున్నాయి. చుక్కలనంటే అంతర్జాతీయ మార్కెట్ ధరలు నక్షత్ర తాబేళ్లను మింగేస్తున్నాయి. నీటిగుర్రం తదితర జీవుల్లోని ఔషధ గుణమే వాటికి శాపంగా మారింది. అణు కాలుష్యం మొదలుకొని, పారిశ్రామిక వ్యర్థాల దాకా... అన్నీ సముద్రం పాలే. దీంతో జలాశయాల్లో జీవ వైవిధ్యం బాగా తగ్గిపోతోంది. పుణ్యనదుల్ని కలుషితం చేసిన పాపమూ మనిషిదే. ఆ దెబ్బకి గంగమ్మతల్లే గుక్కతిప్పుకోలేకపోతోంది. పంటపొలాల్లో కుమ్మరించిన రసాయనాలూ క్రిమిసంహారకాలూ... వాగూ వంకల్లోని జలచరాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాల్నీ మలమూత్రాల్నీ కలిపేస్తున్నారు. నదుల్లోని మత్స్యసంపద సర్వనాశనమైపోతోంది. మిగిలిన కొద్ది జాతులూ విషతుల్యం అవుతున్నాయి. మంచినీటి చేపల్లో 70 శాతం... ఉనికి ప్రశ్నార్థకం అవుతోంది. జలాశయాల్ని ఆవాసం చేసుకుని మనుగడ సాగిస్తున్న రకరకాల జీవులు... నీటిలోని చెడు క్రిమికీటకాల్ని తినేసేవి. దీంతో ఎంతోకొంత శుభ్రమైన నీరు ప్రజలకు అందేది. ఇప్పుడా అవకాశం ఏదీ! ఏ కొద్దిమందో చేసిన ఖర్మ, అంతా అనుభవిస్తున్నారు...' గద్గద స్వరంతో గోడంతా వెళ్లబోసుకున్నాడు సముద్రుడు. న్యాయమూర్తి మొహంలో కలవరం. అదీ ఓ నిమిషమే. వెంటనే సర్దుకున్నారు. మరో సాక్షిని పిలిపించమని ఆదేశించారు. పంట-మంట జొన్నన్నం, సజ్జరొట్టెలు, గోధుమరవ్వ పాయసం, రాగి సంకటి, కొర్రబువ్వ... ఎన్ని రుచులు! ఎన్ని ఆహార ధాన్యాలు! ఎంత వైవిధ్యం! ఎంత ఆరోగ్యం! ఎన్ని పోషక విలువలు! అదంతా ఏమైపోయింది? పంటల వైవిధ్యం కూడా జీవ వైవిధ్యంలో భాగమే. ఒక్కో పంట ఒక్కో పక్షిజాతిని ఆకర్షిస్తుంది. బతికిస్తుంది. అలా, రకరకాల రెక్కల చప్పుళ్లు! ఒక్కో పంట పశుగ్రాసంలో ఒక్కో పోషక విలువ. అలా, ఆరోగ్యవంతమైన పశుసంపద! వాటి విసర్జితాలు పొలానికి బలమైన ఎరువులు. వ్యవసాయ రంగంలోని పరిస్థితుల్ని జీవవైవిధ్య న్యాయమూర్తికి వివరించింది ధాన్యలక్ష్మి. ఆమె మాట్లాడుతుంటే... ఎండు గింజల్ని చాటలో చరుగుతున్న శ్రావ్యత. ''గ్రామాల్లో ఎంత సందడి ఉండేది! పక్షుల కిలకిలలు, కోళ్ల కొక్కరకోలు, ఆవుల అంబాలు, బసవన్నల రంకెలు. వ్యవసాయమంటే పండించుకుని తినడమేనా, పంచుకుని తినడం కూడా. భూమితల్లి దోసెడు గింజలు ఇస్తే, పిడికెడైనా పంచుకోవాల్సిందే! గడ్డి పశువులకెళ్తుంది. తాలు పక్షులకెళ్తుంది. పరిగి బీదాబిక్కీ ఏరుకుపోతారు. రైతే రాజు... అంటారు. రాజంటే సంపన్నుడని కాదు, నలుగుర్నీ పోషించేవాడని అర్థం. ఒకప్పుడు రైతన్న పదివేల రకాల పంటలు పండించేవాడట. ఇప్పుడా సంఖ్య రెండువందల లోపే. దేశీ ధాన్యాల్లో చాలావరకూ చరిత్రలో కలిసిపోయాయి. వైవిధ్యాన్ని నమ్ముకుంటేనే... సేద్యానికి జవం, జీవం! ఏ వాణిజ్య పంటో అయితే ఇంత సందడి ఉండదు. లక్షలకు లక్షలు కుమ్మరించిన రైతన్నకు కంటిమీద కునుకెక్కడిది? వస్తే పంట, రాకపోతే కడుపుమంట! సేద్యాన్ని ఫక్తు జూదంగా తయారుచేస్తున్నాయి బహుళజాతి విత్తనాలు. ఇక రసాయనాలూ క్రిమిసంహారకాలైతే... మట్టిని విషపు ముద్దగా మార్చేస్తున్నాయి. మేతకెళ్లిన ఆవులూ గేదెలూ గొర్రెలూ మేకలూ... ఆ కాలకూట ప్రభావంతో కుప్పకూలిన దాఖలాలున్నాయి. మట్టినే నమ్ముకున్న వానపాములూ కప్పలూ ఎండ్రగప్పలూ మట్టిలోనే కలిసిపోతున్నాయి. మొక్కల సంపర్కానికి దోహదపడే కీటకాలు మాడిమసైపోతున్నాయి. నిన్నమొన్నటిదాకా... దోమల గుడ్లు తిని కప్పలు బతికేవి. కప్పల్ని తిని పాములు జీవించేవి. పాముల్ని వేటాడి గద్దలు కడుపునింపుకునేవి. పిచ్చుకైతే, రైతుచేతిలోని బ్రహ్మాస్త్రమే! మిడతలదండు నుంచి పంటను కాపాడేది. మనిషి స్వార్థం కారణంగా ఆ చక్రం చిన్నాభిన్నమైపోయింది. పాముల తోలు ఒలిచి ఫ్యాషన్ వస్త్రాలు అల్లుకుంటున్నారు. దీంతో గద్దలకు ఆహారం కరవైంది. ఏ వ్యవసాయ కుంటల్లోని చేపల్నో తిని..క్రిమిసంహారకాల ప్రభావంతో చచ్చిపోతున్నాయి. మట్టిని బంగారంగా మార్చే పరుసవేది విద్య తెలిసిన వానపాములు కూడా పలచబడిపోయాయి. ప్రతి ఇరవై నిమిషాలకు ఒక జీవజాతి అంతరించిపోతున్నట్టు అంచనా. ఇంతాచేసి మనిషైనా సుఖపడుతున్నాడా అంటే... అదీ లేదు. విత్తనాల కోసం వీధుల్లో నిలబడాల్సిన దౌర్భాగ్యం. తిండిగింజల కోసం రేషన్‌షాపు ముందు బారులు తీరాల్సిన దారిద్య్రం. ఆత్మహత్యలు సర్వసాధారణమైపోయాయి. వలసలు తప్పడం లేదు. ఎందుకు ఇన్ని కష్టాలు?''... ధాన్యలక్ష్మిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. అందరి వాదనలూ విన్న న్యాయమూర్తి తీర్పు చెప్పడానికి సిద్ధమవుతుండగా, 'మా బాధకూడా వినండి...' అంటూ తేనెటీగలు విజ్ఞాపన పత్రం సమర్పించాయి. 'అయ్యా... కొండంత అండ అన్న మాట వింటే ఏడుపొస్తుంది. ఏడ్వలేక నవ్వొస్తుంది. ఈ మనిషి కొండల్ని కూడా పిండిచేస్తున్నాడు. అక్కడా జీవవైవిధ్యం లేకుండా చేస్తున్నాడు. తెలియంది ఏముంది! మేం శ్రమజీవులం. కొండాకోనలు తిరిగి... మకరందాన్ని సేకరిస్తాం. ఈమధ్య కొండల మీద కూడా సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. రేడియేషన్ ప్రభావంతో మా సంతతి నశిస్తోంది. తేనె ఉత్పత్తి బాగా పడిపోతోంది' అని విన్నవించుకుందో నల్లమల తేనెటీగ. హిమాలయాలు మొదలు పశ్చిమ కనుమల దాకా... కొండలూ గుట్టలూ 'అవును... అవును. మా ఉనికీ నాశనమైపోతోంది. ఎన్నో ఔషధ మొక్కలు కనిపించకుండా పోతున్నాయి. ఎర్రచందనం రక్తమోడుతోంది. కలప గడపదాటుతోంది. అరుదైన జీవజాతులు మాయమైపోతున్నాయి'' అంటూ ఆవేదన వ్యక్తం చేశాయి. 'అర్థమైంది. పరిస్థితి అర్థమైంది. సమస్య చాలా తీవ్రమైందే. మీరేమైనా చెప్పదలుచుకున్నారా?' మనిషివైపు చూశారు న్యాయమూర్తి. అతను స్పందించలేదు. వాదన వినిపించే ప్రయత్నమూ చేయలేదు. దీంతో విచారణ ముగిసిందని ప్రకటించారు న్యాయమూర్తి. అంతిమ తీర్పు... 'యాభైకోట్ల సంవత్సరాలలో... ఐదుసార్లు విస్ఫోటనాలు సంభవించాయి. ఐదో వినాశనం అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం జీవరాశిని సమూలంగా నాశనం చేసింది. ప్రకృతిలో వచ్చిన అనూహ్యమైన మార్పులూ ఉల్కాపాతాలే వీటికి కారణం. ఆరోసారి... ఏదైనా తీవ్ర ఉత్పాతం సంభవించిందంటే మాత్రం, దానికి బాధ్యుడు మనిషే' 'సృష్టిలో మూడుకోట్ల వృక్ష, జంతుజాతులున్నాయి. ఇప్పటిదాకా గుర్తించింది మహా అయితే, పదీ పదిహేను లక్షలు. మిగిలినవన్నీ వృథాగా పడున్నాయి. నీలోని సాంకేతిక పరిజ్ఞానానికి రెక్కలు తొడిగి... అన్నింటినీ వర్గీకరించు. వాటిలోని ప్రత్యేకతల్ని అర్థంచేసుకో. మానవజాతికి అవెలా ఉపయోగపడతాయో ఆలోచించు. దీనివల్ల మిగతా జీవజాతులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రకృతి మీద భారం పెరగడానికి ప్రధాన కారణం...అధిక జనాభా! భారత్‌లాంటి పెద్ద దేశాలు కూడా నియంత్రించాల్సిన స్థాయిలో జనాభా పెరుగుదలను నియంత్రించడం లేదు. ఇదే వేగంతో జనాభా పెరిగితే... అడవి జంతువుల్నే కాదు, తోటి మనుషుల్నీ పీక్కుతినాల్సిన పరిస్థితి వస్తుంది, జాగ్రత్త! అడవుల్ని ఆక్రమించీ నదుల్ని పిండుకునీ కొండల్ని తవ్వుకొనీ సముద్రాన్ని మథించీ... పిల్లల కోసం, ఆ పిల్లల పిల్లల కోసం వేల కోట్లు కూడబెడతావు. బంగళాలు కట్టిస్తావు. అంతవరకూ బాగానే ఉంది కానీ, ఆనందాన్ని స్విస్‌బ్యాంకులో దాచిపెట్టగలవా, ఆరోగ్యాన్ని బంకర్లలో భద్రపరచగలవా? ఎందుకంటే... రేపటి భాగ్యం, ఆరోగ్యమే! కాలుష్యం కాటేయడానికి సిద్ధంగా ఉంది. కరవుకాటకాలు కాచుకు కూర్చున్నాయి. మాయరోగాలు ముసురుకుంటున్నాయి. ప్రకృతి మీద ప్రేమ ఉన్నా లేకపోయినా, పుత్రపౌత్రుల కోసమైనా... వైవిధ్యానికి విలువనివ్వు. |
ఇది నీ బాధ్యత. ఇది నీ అవసరం. ఇది నీ జాతి మనుగడ సమస్య'' హెచ్చరించాల్సిన చోట హెచ్చరిస్తూ, బుజ్జగించాల్సిన చోట బుజ్జగిస్తూ జీవవైవిధ్య న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.అంతా విన్న మనిషి... నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. మొహంలో ఏ మూలనో కాస్తంత పశ్చాత్తాపం. మార్పునకు అది తొలి సంకేతం కావచ్చు. |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి