యువకలం...కోలాహలం! (06/04/13)
సెల్ చాటింగ్‌కు సై... ఆన్‌లైన్ కాలక్షేపానికి సిద్ధం... సరదాలకు ముందు... కొత్త గ్యాడ్జెట్స్‌ని రఫ్ఫాడిస్తాం... ఏ కుర్రకారైనా ఇంతేగా? మరి పుస్తకాలు చదువుతారా? అని అడగండి...'అబ్బో... మాకంత తీరికెక్కడిది?' అనేస్తారు! అయితే ఈ తీరును బ్రేక్ చేసే వారూ ఉన్నారు! చదవడమేనా? ఆకట్టుకునే రచనలతో మది దోచేస్తున్నారు...వీళ్ల దృష్టంతా యువతపైనే... అలాంటి కొందరి పరిచయం.పుస్తకమంటే బద్ధకించే కుర్రాడైనా ప్రేమ, రొమాన్స్... పదాలు కనపడితే కళ్లు నులుముకుంటాడు. ఆకట్టుకునే శైలి అందిందా, అక్షరాల వెంట పరుగులు తీస్తాడు. ఇదే మంత్రంతో యువత నాడి పట్టేస్తున్నారు నేటి రచయితలు. చేతన్‌భగత్, రశ్మీబన్సాల్, రవీందర్‌సింగ్, అమీశ్ త్రిపాఠి, దుర్జయ్‌దత్తా... పేరేదైనా ముడిసరుకు ప్రేమ, కెరీర్, వ్యక్తిత్వ వికాసం, రొమాన్స్, స్నేహం, మేనేజ్‌మెంట్, భావోద్వేగాలే. ఇంటర్నెట్ పరిచయాలు, సెల్‌ఫోన్ ప్రేమలతో రవీందర్‌సింగ్ 'ఐ టూ హ్యాడ్ ఏ లవ్‌స్టోరీ' అల్లితే మూడునెలల్లో లక్షన్నర లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. 'స్టే హంగ్రీ స్టే ఫూలిష్' అంటూ రశ్మీబన్సాల్ స్ఫూర్తి పాఠాలు బోధిస్తే కళ్లకద్దుకుంది యువత. 'డోంట్ లాస్ యువర్ మైండ్ లాస్ యువర్ వెయిట్' అని రుజుతా దివాకర్ వ్యాయామ పాఠాలు చెబితే మాకేనంటూ ఎగబడి కొనేశారు. తాజాగా చేతన్‌భగత్ 'రివల్యూషన్ 2020' అమ్మకాల రివల్యూషనే సృష్టిస్తోంది.ఈ డిజిటల్ ఏజ్‌లో, స్పీడ్ యుగంలో కూడా యువత పుస్తకాలు చదువుతోందా? అంటే... 'అభిమాన రచయిత పుస్తకం కోసం నెలల తరబడి ఎదురుచూడటం, లక్షల కాపీలు అమ్ముడు పోవడమే ఇలాంటి సందేహాలకు సరైన సమాధానం' అంటారు ఉదయన్ మిత్ర. ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ ఎడిటర్. కవ్వించే కథ, మనసుకి హత్తుకునే శైలి, కెరీర్‌కి ఉపయోగపడే విషయం, స్ఫూర్తి నింపే రాతలు... ఎప్పుడూ విఫలం కావంటారాయన. ఇవన్నీ ఒకెత్త్తెతే టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో యువ రచయితలు ముందుంటున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్లలో తమ రచనల గురించి చర్చిస్తూ పాఠకుల్లో ఉత్సుకత రేకెత్తిస్తున్నారు. కొందరైతే సొంతంగా వెబ్‌సైట్, బ్లాగుల్లోనే పుస్తక విక్రయాలు చేసేస్తున్నారు. ఈ స్ఫూర్తితో తమ కలాలకు పదును పెడుతూ కొత్తగా దూసుకొస్తున్న వాళ్లెందరో.
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి