కసి పెట్టారు..కని పెట్టారు! (Eenadu eetaram_08/06/13)

సెల్‌ఫోన్‌లో ఎడతెగని కబుర్లు... ఆన్‌లైన్‌లో తెమలని చాటింగ్‌లు... సరదాలు, స్వీట్‌నథింగ్స్‌... ఎప్పుడూ ఉండేవేగా! ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నారు కొందరు యూత్‌... ప్రాజెక్టులంటూ ప్రయోగాలు మొదలెట్టారు... దిగాక అవాంతరాలు అడ్డుపడ్డాయ్‌... అయినా మధ్యలోనే కాడి వదిలేయలేదు... పట్టుపట్టి ముందుకెళ్లారు. ఎట్టకేలకు సాధించారు... అవార్డులూ వరించాయ్‌... ఇంతకీ ఆ విజేతలేం చేశారు?
ఆలోచన ఎగిరింది!
పరికరం: ఆర్నిథాప్టర్‌ (పక్షి, హెలికాప్టర్‌ పోలికలున్న విహంగం)రూపకర్తలు: వి.ఎన్‌.జశ్వంత్‌, ఎస్‌.ఎన్‌.వి.ఆంజనేయప్రసాద్‌, కాటం శ్రీనివాస్‌
ప్రత్యేకతలు: శత్రు స్థావరాలపై పక్షిలా ఎగురుతూ ఫొటోలు తీస్తుంది. 26/11 లాంటి ఉగ్రవాద సంఘటనల్లో శత్రువుల ఆనుపానులు గుర్తిస్తుంది. కారు రేసుల్ని పైనుంచి వీడియోలు తీస్తుంది.
ప్రేరణ: ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులో భాగంగా. చేసే ఆవిష్కరణ దేశానికి ఉపయోగపడాలనే తలంపు.
సాధించారిలా: ముగ్గురూ హైదరాబాద్‌లోని ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులే. కోర్సులో భాగంగా ఏదైనా భిన్నమైన ప్రాజెక్టు చేయాలనుకున్నారు. అంతర్జాలంలో వెతికితే పక్షిని పోలిన హెలికాప్టర్‌ని ఆర్నిథాప్టర్‌ అంటారని తెలిసింది. రేడియో కంట్రోల్‌ గ్రూపు ఫోరమ్స్‌ నుంచి సమాచారం సేకరించారు. అనుభవజ్ఞుల సలహాలూ స్వీకరించారు. పని మొదలైంది. మరోవైపు చదువు. శని, ఆదివారాలు పూర్తిగా ప్రయోగశాలకే పరిమితమయ్యేవాళ్లు. ఆర్నిథాప్టర్‌ విడి భాగాల్ని సొంతంగా తయారు చేయించారు. బీఎల్‌డీసీ ఔట్‌రన్నర్‌ మోటారు, ఎలక్ట్రానిక్‌ స్పీడ్‌ కంట్రోలర్‌, సర్వో మెకానిజం మోటార్లు, క్యామ్‌ మెకానిజమ్‌తో ఆర్నిథాప్టర్‌ తయారైంది. ఫోటలో తీయడానికి కెమెరా బిగించారు. ట్రాన్స్‌మీటర్‌ నుంచి సందేశాలు అందుకోవడానికి రిసీవర్‌ కూడా. మొత్తమ్మీద ఎనిమిదినెలల్లో తాము అనుకున్నట్టే లోహ విహంగాన్ని గాల్లో ఎగిరించారు. ఈమధ్యలో ఎన్నో అవాంతరాలు. ఎలక్ట్రానిక్‌ స్పీడ్‌ కంట్రోలర్‌ కాలిపోయింది. గేర్లు విరిగిపోయాయి. అయినా కుర్రాళ్లు పట్టువదిలితేగా. అన్నింటిని దాటుకొని విజయం సాధించారు.
ప్రమాదాలకిక సెలవ్‌!
పరికరం: ఐఆర్‌ బేస్డ్‌ చైల్డ్‌ రిస్కీ సిస్టమ్‌.రూపకర్తలు: ఏఎస్‌ఎల్‌.నిరుపమ, వై.హరిప్రియ, పి.రామానుజమ్మ, బి.ప్రియదర్శిని.
ప్రత్యేకతలు: బోరుబావిలో పడ్డ చిన్నారుల్ని రక్షించే పరికరం.
ప్రేరణ: మనదేశంలో రోజుకు ఐదుగురు పిల్లల్ని బోరుబావులు మింగేస్తున్నాయి. 2011లో ఏపీలో 124 మంది చనిపోయారు. ఈ సంఘటనలకి కలత చెందిన విద్యార్థులు కొత్త ఆవిష్కరణకు సిద్ధమయ్యారు.
సాధించారిలా: వీరంతా గుంటూరులోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థినులు. అనుకున్న ప్రకారం బోరుబావుల దగ్గరికెళ్లి ప్రమాదం ఎలా జరుగుతుందో పరిశీలించారు. దాని కనుగుణంగా పరికరం తయారీ మొదలుపెట్టారు. బోరు బావి పైపు వెడల్పు ఆధారంగా ఒక ఇనుప రేకు, ఎలక్ట్రానిక్‌ అలారం, తొమ్మిది ఓల్టుల సామర్థ్యం ఉన్న బ్యాటరీ, అవసరం మేరకు విద్యుత్తు ప్రవాహతీగలను వినియోగించారు. బోరు పైపునకు ఐదడుగుల లోతు వరకు తవ్వి పైపు మధ్యలో కదిలే విధంగా అడ్డంగా రేకు అమర్చారు. పైపు పైభాగంలో అతినీలలోహిత పరికరాలను అమర్చడంతో ఎవరైనా చిన్నారి బోరు బావిలో పడగానే ఆ ఒత్తిడికి స్విచ్ఛాన్‌ అవుతుంది. వెంటనే పైపునకు ఐదు అడుగుల కింద అడ్డంగా అమర్చిన ఇనుప రేకు మూసుకుపోతుంది. చిన్నారికి రక్షణ కవచంగా నిలుస్తుంది. ఈ పరికరాన్ని బోరుబావికి ముందే అమర్చితే పిల్లల్ని తేలికగా రక్షించొచ్చు. కేవలం రూ.300లతో ఈ పరికరం తయారు చేయొచ్చు.
అవార్డు: కేఎల్‌ వర్సిటీ 25వ జాతీయస్థాయి ప్రాజెక్టు ఎక్స్‌పోలో ఉత్తమ ప్రయోగ పరికరంగా బహుమతి గెల్చుకుంది. ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా డెబ్భై కళాశాలలు హాజరయ్యాయి.
- వెంకట్‌ పట్నాయక్‌, ఈనాడు: గుంటూరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు