యువ నేస్తం...ఈ-పుస్తకం (Eenadu_07/06/13)


యువగుండెల్లో... భావోద్వేగపు పరిమళాలు... అయినా జనం చేరే మార్గం తెలియదు! కలం కదిపితే కమ్మని రచనలు... అచ్చు వేయిద్దామంటే అదో ప్రయాస! ఇలాంటి కష్టాలకిక కాలం చెల్లినట్టే... కాణీ ఖర్చు లేకుండా రచనల్ని ఈ-పుస్తకాలుగా మలుస్తున్నాయి ఆన్‌లైన్‌ పుస్తక ప్రచురణ సంస్థలు... సత్తా ఉన్న కొత్త రచయితలకు సదా స్వాగతం అంటున్నాయి... ప్రచారం, మార్కెటింగ్‌ బాధ్యతా వాళ్లదే! ఊపందుకున్న ఈ కొత్త ట్రెండ్‌ సంగతులేంటో చూద్దామా?
కుర్రకారు సరదాలకు సరిదోస్తులే. అనుమానం లేదు! వారితోపాటే సాహిత్య ప్రియులు, జ్ఞాన పిపాసులూ ఉంటారండోయ్‌. అందుకే కాస్త తీరిక దొరికితే పుస్తకం తిరగేస్తుంటారు. వీలైతే కలం కదిలిస్తుంటారు. కథలు, కథానికలు, కవిత్వాలు, నవలలు.. ఎడాపెడా రాసేవాళ్లకి కొదవే లేదు. ఇప్పుడీ యువ రచనా వ్యాసంగం 'డిజిటల్‌' బాట పట్టింది. బ్లాగులు, సైట్లతో ముందుకెళ్లడమే కాదు, తమ రచనలను 'ఈ-పుస్తకం'గా వెలువరించే ధోరణిని యువత అందిపుచ్చుకుంటోంది. పెరిగిన సాంకేతిక ఈ కొత్త అభిరుచికి దారులు తెరుస్తోంది. యువతలో పెరుగుతున్న 'ఈ-రీడింగ్‌' అభిరుచి అందుకు ప్రోత్సాహం కల్పిస్తోంది. 'ఈ-రీడర్‌' పరికరాలు, స్మార్ట్‌ఫోన్లలో పుస్తకాల డౌన్‌లోడింగ్‌ పెరుగుతున్న ధోరణి, యువ రచయితలకు ఆన్‌లైన్‌ మార్గాలు పరుస్తోంది.
ముందుకెళ్లండిలా!
గుండె గొంతుకలో కొట్లాడినప్పుడు కలం కాగితంపై పరుగులు పెడుతుంది. యువ రచనలు బెస్ట్‌సెల్లర్స్‌గా మారుతున్న సందర్భాలూ చూస్తున్నాం. కానీ అందుకు తతంగం తక్కువేమీ కాదు. ప్రచురణ సంస్థలను వెతకాలి. ఒప్పించాలి. సొంతంగా అచ్చు వేయిద్దామంటే కాపీలను బట్టి వేలు, లక్షల ఖర్చు. ప్రచార కిటుకులూ తెలిసుండాలి. ఈ బాధలేం లేకుండా మన రాతల్ని నేరుగా పాఠకుల దగ్గరకి చేర్చేవే ఆన్‌లైన్‌ బుక్‌ పబ్లిషింగ్‌ సంస్థలు. రచనని డీటీపీ చేయించి సాఫ్ట్‌కాపీ వాళ్లకిస్తే చాలు. మిగతా తతంగం వాళ్లే నడిపిస్తారు. డబ్బులు ముట్టజెప్పాల్సిన పన్లేదు. ప్రచారమూ వాళ్లదే. అమ్ముడైన పుస్తకానికి 50 నుంచి 80 శాతం వరకు రాయల్టీ చెల్లిస్తారు.
ఇలాగైతే పాస్‌ 
ఇందుకు కొన్ని అర్హతలు తప్పనిసరి. ముందు ఆ రచన ప్రచురణకు తగినదో కాదో పరిశీలిస్తాయి సంస్థలు. కాపీరైట్‌ విషయమై ఆరా తీస్తారు. సొంతంగా రాశాడా, కాపీనా అన్నదీ పరిశోధిస్తారు. ఇవన్నీ చేయడానికి ప్రతి సంస్థ దగ్గర అనుభవజ్ఞులైన ఎడిటోరియల్‌ బృందం ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ దాటాకే పుస్తక ధర నిర్ణయమై, డిజటలైజేషన్‌కు వెళుతుంది. ఈ-బుక్‌రీడర్స్‌, స్మార్టుఫోన్లు, కంప్యూటర్ల ద్వారా పుస్తక ప్రియుల్ని చేరుతుంది. పబ్లిషర్‌ని నేరుగా కలవకుండానే ఈ వ్యవహారాన్నంతా ఆన్‌లైన్‌లోనే జరిపించవచ్చు.
ప్రచారమూ వాళ్లదే!
వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో పుస్తకం దర్శనమిస్తుంది. దాని సారాంశాన్ని ఆకట్టుకునేలా చెబుతారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లాంటి సామాజిక అనుబంధ వెబ్‌సైట్లలో ప్రచారం చేస్తారు. కినిగెలాంటి సంస్థలైతే తమ పుస్తకాల గురించి మీడియాలోనూ ప్రకటనలిస్తున్నాయి. ఇక ఈ-పుస్తకాల్ని కాపీ చేయకుండా, పైరసీకి ఆస్కారం లేకుండా డిజిటల్‌ రైట్స్‌ మేనేజ్‌మెంట్‌(డీఆర్‌ఎం) పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు ప్రచురణకర్తలు. కొన్నవాళ్లు మాత్రమే చదవగలరు.
భవిష్యత్తు జోరు
ఇంతకీ ఈ-పుస్తకాల భవిష్యత్తు బాగుంటుందా? దీనికి తాజా సర్వేలే సమాధానం. 'బౌకర్స్‌ గ్లోబల్‌ ఈబుక్‌ మానిటర్‌' సంస్థ భారత్‌ సహా పది దేశాల్లో పరిశోధన చేసింది. ఇండియాలోని పుస్తక ప్రియుల్లో ఇరవై శాతం మంది ఈ-రీడర్లే. భారత్‌లో 25 మిలియన్లకు పైగానే ఈ-పుస్తకాలు అమ్ముడయ్యాయంటోంది ఆ సర్వే. 'ది అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ పబ్లిషర్స్‌' లెక్కల ప్రకారం 2012లో ప్రపంచవ్యాప్తంగా ఈ-బుక్‌ అమ్మకాలు 41 శాతం పెరిగాయట. రూపా పబ్లిషర్స్‌ యజమాని కపీశ్‌ మెహ్రా మాటల్లో చెప్పాలంటే ఈ-పఠనం కొత్త మార్కెట్‌ను సృష్టించే సాధనం. దీన్ని పసిగట్టిన ప్రచురణ సంస్థలు పెంగ్విన్‌, పుస్తక్‌ మహల్‌, హార్పర్‌ కొలిన్స్‌లు వీటికి అత్యధిక ప్రాముఖ్యం ఇస్తున్నాయి.
కొత్త తరానికి ఆహ్వానం
రెండున్నరేళ్ల కిందట మొదలైంది కినిగె. చాలా మంది రచయితల్ని పరిచయం చేశాం. రంగనాయకమ్మ, తిలక్‌, యండమూరి, మల్లాది, మధుబాబు వంటి ప్రముఖ రచయితల రచనల్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. ప్రపంచంలో ఏ మూల రచయిత అయినా kinige.comద్వారా మమ్మల్ని చేరొచ్చు. వెబ్‌సైట్‌లో కుడివైపు పైభాగంలో ఉండేepublish your book పై క్లిక్‌ చేసి పుస్తకాన్ని అప్‌లోడ్‌ చేయొచ్చు.
- కిరణ్‌కుమార్‌ చావా,సహ వ్యవస్థాపకుడు, కినిగె
తొలి రచనే 'ఈ-నవల'
ఈ-బుక్‌తో ముందడుగు వేసిన కుర్ర రచయిత అద్దంకి అనంతరామ్‌. స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి. హైదరాబాద్‌లో ఎంటెక్‌ పూర్తిచేయగానే ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమొచ్చింది. టెక్‌శావీ కదా, సొంతంగా ఓ బ్లాగ్‌ సృష్టించి మనసులోని భావాల్ని అందులో కూర్చేవాడు. చదివిన మిత్రులు నవల రాయమని ప్రోత్సహించారు. నెల్లాళ్లు కష్టపడి 'రామ్‌ ఎట్‌ శ్రుతి డాట్‌కామ్‌'ని అక్షరీకరించాడు. ఆన్‌లైన్‌లో తన నవలని ఈ-పుస్తకంగా మార్చుకున్నాడు. బ్లాగులో కబుర్లు రాసే కుర్రాడిపుడు కొత్త రచయితగా మారాడు.










కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు