మన ఘన బాణీకి శత వసంతం

మన ఘన బాణీకి శత వసంతం
పాటకు సాహిత్యం ఎంత ముఖ్యమో.. బాణీ కూడా అంతే ముఖ్యం. వందల కోట్ల గొంతుకల్లో ప్రతిధ్వనించే.. మన జాతీయ గీతం బాణీ ఎక్కడ కట్టారో తెలుసా?  ‘జనగణమన అధినాయక జయహే..’ అనగానే యావత్‌ భారతం పులకిస్తుంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మరింత పొంగిపోతుంది.
ఎందుకంటే? మన జాతీయ గీతానికి.. మదనపల్లెకు అవినాభావ సంబంధం ఉంది. ఈ బెంగాలీ గీతాన్ని.. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఇక్కడే ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. స్వయంగా ఆలపించారు. ఇదంతా జరిగి వందేళ్లు అవుతోంది. దీనిని పురస్కరించుకొని బీటీ (బీసెంట్‌ థియోసాఫికల్‌) కళాశాలలో శతాబ్ది ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆనాటి అపురూప ఘట్టం మరోసారి తలుచుకుందాం..!
1919 ఫిబ్రవరి 25,
చిత్తూరు జిల్లా మదనపల్లె ఉడ్స్‌ జాతీయ కళాశాల (ప్రస్తుత బీటీ కళాశాల) ప్రాంగణం..
గుర్రపు బండి వచ్చి ఆగింది. ఓ మహానుభావుడు కిందికి దిగాడు. ఆయనే విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌.
దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా బెంగళూరు వచ్చిన ఠాగూర్‌ విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్‌ జేమ్స్‌ హన్రీ కజిన్స్‌, ఆయన భార్య మార్గరేట్‌ కజిన్స్‌ స్వయంగా మదనపల్లె రైల్వే స్టేషన్‌కు వెళ్లి.. ఆయనకు సాదర స్వాగతం పలికారు. కళాశాలకు వచ్చిన విశ్వకవి ఇక్కడి వాతావరణానికి మంత్రముగ్ధులయ్యారు. నాటి నుంచి మార్చి 2 వరకు.. ఆరు రోజులు కళాశాలలోనే బస చేశారు. కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుటీరంలో ఉన్నారు.
పోటీలో పాట..
బీటీ కళాశాలలో ప్రతి బుధవారం ‘సింగ్‌ ఎ సాంగ్‌- ఫన్‌’ పేరిట సంగీత పోటీలు జరుగుతుండేవి. విద్యార్థులంతా ఇందులో ఉత్సాహంగా పాల్గొనేవారు. యువత ఉత్సాహం విశ్వకవిని అబ్బురపరిచింది. వారి ప్రదర్శన ముచ్చటగొలిపింది. ఆయన కూడా విద్యార్థి అయిపోయారు. తాను కూడా పోటీలో పాల్గొంటానంటూ ఆసక్తిగా ముందుకొచ్చారు. స్వయంగా ‘జనగణమన..’ గీతాన్ని ఆలపించారు. బెంగాలీలో ఉండటంతో విద్యార్థులకు అర్థం కాలేదు. మార్గరేట్‌ కజిన్స్‌, ఇతర విద్యార్థులు దానిని ఆంగ్లంలోకి తర్జుమా చేయాల్సిందిగా అభ్యర్థించడం.. రవీంద్రుడు సరేననడం జరిగిపోయాయి.
ఉదయ రాగం.. హృదయ గానం..
1919 ఫిబ్రవరి 28, ‘జనగణమన..’ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు ఠాగూర్‌. దీనిని ‘మార్నింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ఇండియా’గా ప్రకటించారు. హృద్యంగా ఆలపించారు కూడా. విద్యార్థులతో పాడించారు. సంగీతంలో పీహెచ్‌డీ చేసిన మార్గరేట్‌ కజిన్స్‌.. ‘జనగణమన..’లోని సాహితీ విలువలను గుర్తించి.. అందుకు తగ్గట్టుగా బాణీ కట్టారు. తన పియానోపై స్వరాలు కూర్చారు. అలా మన జాతీయ గీతం ఆంగ్ల అనువాదానికి జన్మనివ్వడంతో పాటు అందమైన బాణీకి పునాది వేసింది కళాశాల. రవీంద్రులు ‘జనగణమన..’ ఆలపించి వందేళ్లు అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత ఫిబ్రవరి 28న మొదలైన ఉత్సవాలు 2019 ఫిబ్రవరి 28 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతి నెలా 28న ప్రత్యేక కార్యక్రమాలు చేయనున్నారు.
- కరీముల్లా షేక్‌, చిత్తూరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు