‘బెస్ట్’ స్మార్ట్‌ఫోన్ కోసం..!
వికాస్ గత రెండు మూడు నెలలుగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నాడు. కానీ, తాను చూసిన మోడళ్లో దేనిని ఎంపిక చేసుకోవాలో తెలియడం లేదు. నారాయణ రూ.10,000లతో ఓ మొబైల్ కొన్నాడు. కానీ, తాను ఊహించినంత స్థాయిలో అది పని చేయడం లేదు. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నవాళ్లలో చాలా మందికి ఇదే సమస్య.
ఫోన్ ధర ఎంత? ఇది ఏ కంపెనీది? ఒకప్పుడు ఫోన్ కొనాలంటే ఆలోచించే అంశాల్లో ముఖ్యమైనవి ఇవే. వాటికి తగ్గట్టే చాలా తక్కువ ఫోన్లు ఉండేవి.. చూసుకొని కొనేవాళ్లు. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తొలినాళ్లలోనూ ఇలాగే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో వారానికో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. దీంతో ఏ ఫోన్ కొనాలా? అనే విషయంపై చాలా మంది సతమతమవుతుంటారు. దీని నుంచి బయటపడి మనం కోరుకున్న ధరలో వీలైనన్ని ఎక్కువ ఫీచర్లు ఉండే ఫోన్లను ఎలా ఎంపిక చేసుకోవాలి? స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో.. ఓ లుక్కేద్దామా?
ప్రాసెసర్ కీలకం:
మొబైల్ పనిచేసే విధానం అందులోని ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్, యూఐ, బ్లాట్‌వేర్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం, స్ట్రీమింగ్ వీడియోలు, ఆన్‌లైన్‌లో వీడియోలు, ఫొటోలు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లయితే క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్‌ను ఎంచుకోవాలి. హైఎండ్ ఫోన్ కావాలనుకుంటే స్నాప్‌డ్రాగన్ 820/821 ప్రాసెసర్‌ను ఎంచుకోవచ్చు. అంతగా గేమింగ్‌ను ఇష్టపడనివారికి మీడియాటెక్ ప్రాసెసర్ అయినా సరిపోతుంది.
బ్యాటరీ:
బ్యాటరీ వినియోగం ఒక్కొక్క యూజర్‌కు ఒక్కో విధంగా ఉంటుంది. వినియోగదారుడు ఫోన్‌ను ఎలా ఉపయోగిస్తున్నాడనే అంశంపై బ్యాటరీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. మీరు యాప్స్, స్ట్రీమింగ్ వీడియోలు, ఆన్‌లైన్ గేమ్స్ లాంటి వాటిని ఎక్కువగా వినియోగిస్తే బ్యాటరీ సామర్థ్యం కనీసం 3500ఎంఏహెచ్ ఉండేలా చూసుకోవాలి. లేదంటే 3000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ అయినా ఛార్జింగ్ ఓ రోజంతా వస్తుంది. దీంతోపాటు బ్యాటరీ లైఫ్‌లో స్ర్కీన్ ఆన్‌టైమ్ కీలకం.
ప్యానల్ క్వాలిటీ:
మార్కెట్‌లో రెండు రకాల ప్యానల్స్‌తో మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. మొదటిది మెటల్‌తో తయారు చేస్తే.. రెండో రకం ప్లాస్టిక్‌తో తయారు చేస్తున్నారు. గ్లాస్ కోటెడ్ ప్యానల్స్ ఉన్నప్పటికీ వాటి వినియోగం తక్కువే. మీరు ‘స్మార్ట్‌ఫోన్‌ను సున్నితంగా ఉపయోగించలేము’ అనుకున్నట్లయితే ప్లాస్టిక్ లేదా మెటల్ బాడీ ఉన్న మొబైల్‌ను ఎంచుకోవడం ఉత్తమం. వైవిధ్యంగా కనిపించాలనుకుంటే గ్లాస్‌కోటెడ్‌ను ఎంచుకోవచ్చు.
డిస్‌ప్లే:
ఫోన్‌ను దేని కోసం వినియోగించుకోవాలనుకుంటున్నామో అనే విషయాన్నిబట్టి డిస్‌ప్లే పరిమాణం ఎంతుండాలో నిర్ణయించుకోవాలి. ఎక్కువగా వీడియోలు చూసేవారు, ఫోటోస్‌ను ఎడిట్ చేయాలనుకున్నవారు పెద్ద డిస్‌ప్లే ఉన్న ఫోన్లు ఎంచుకుంటే బాగుంటుంది. 5.5 నుంచి 6 అంగుళాల తాకేతెరలు ప్రస్తుత ట్రెండ్. పూర్తి హెచ్‌డీ లేదా క్యూహెచ్‌డీ తెర ఉన్న మొబైల్స్ పట్ల యువత ఆసక్తి చూపిస్తోందనేది టెక్ విశ్లేషకుల మాట. 6 అంగుళాల తెర ఉంటే హ్యాండిల్ చేయడం కష్టమనే వాదనా ఉంది. సాధారణ వినియోగదారులు 5 లేదా 5.5 అంగుళాల తెర ఉండే మొబైల్స్ ఎంచుకోవడం ఉత్తమం. ఇప్పుడు 18:9 తాకేతెరలు వచ్చిన తర్వాత ఆరు అంగుళాల మొబైల్‌ను హ్యాండిల్ చేయడం సులభమైపోయింది. మొబైల్ అంచుల పరిమాణం తగ్గించి డిస్‌ప్లే పెంచడంతో ఈ ఫుల్ డిస్‌ప్లే ఫోన్లకు ఆదరణ పెరుగుతోంది.
కెమెరా:
అధిక రెజెల్యూషన్ కెమెరా ఉన్నంత మాత్రాన నాణ్యమైన ఫొటోస్ వస్తాయని చెప్పలేం. కెమెరా అపెట్యూర్, ఐఎస్‌ఓ లెవెల్, పిక్సెల్ పరిమాణం, ఆటోఫోకస్ లాంటి సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. 16ఎంపీ కెమెరా ఉన్న మొబైల్స్‌లో కంటే 12 ఎంపీ సామర్థ్యం గల కెమెరా ఉన్న మొబైల్స్‌లో తీసే ఫొటోలు ఎక్కువ స్పష్టతతో ఉండొచ్చు. కెమెరా రెజెల్యూషన్ ఎక్కువగా ఉంటే ఇమేజ్ సైజు ఎక్కువగా ఉండటంతో పాటు తక్కువ పరిమాణం గల తెరలపై చూసేటప్పడు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. మీకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టముంటే 12 ఎంపీ లేదా 16 ఎంపీ కెమెరా సామర్థ్యం ఉన్న మొబైల్స్ ఎంచుకోవడం ఉత్తమం. సాధారణ వినియోగదారులకు 8ఎంపీ లేదా 12 ఎంపీ ఉంటే సరిపోతుంది. అయితే పైన చెప్పిన సాంకేతిక అంశాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి.
యూజర్ ఇంటర్‌ఫేస్:
స్మార్ట్ ఫోన్ ఎంపిక చేసుకోవడంలో యూజర్ ఇంటర్‌ఫేస్, ఓఎస్ వెర్షన్ ముఖ్య భూమిక పోషిస్తాయి. ఫోన్‌ను సాధారణ వినియోగదారుడు కూడా సులభంగా ఉపయోగించుకోవాలంటే దాని ఇంటర్‌ఫేస్ వినియోగదారుడికి స్నేహపూర్వకంగా ఉండాలి. ఎలాంటి ఆప్షన్‌నైనా ఇట్టే అర్థమ్యేలా ఉండాలి. ప్రస్తుతం జెన్ యూఐ, ఎక్స్‌పీరియా యూఐ, శాంసంగ్ టచ్ విజ్, ఈఎంయూఐ తదితర యూజర్ ఇంటర్‌ఫేస్‌లు వినియోగదారులకు చేరువయ్యాయి.
స్టోరేజీ:
స్మార్ట్‌ఫోన్ అంతర్గత స్టోరేజీలో చాలా భాగం ఆపరేటింగ్ సిస్టమ్, డిఫాల్ట్ యాప్స్ ఆక్రమించుకుంటాయి. వీటి కోసం కనీసం 8 నుంచి 10 జీబీ తీసుకుంటున్నారు. ఇది అంతర్గత మెమొరీ మీద ఆధారపడి ఉంటుంది. 64 జీబీ అంతర్గత మెమొరీ ఉన్న మొబైల్స్‌లో వినియోగదారుడు 55 జీబీ మాత్రమే వాడుకునే పరిస్థితి. మీరు తక్కువ యాప్స్ మాత్రమే ఉపయోగించదలచుకుంటే 32 జీబీ అంతర్గత మొమెరీ ఉన్న ఫోన్లు ఎంచుకోవడం మంచిది. అలాకానట్లయితే 64 జీబీ లేదా 128జీబీ సామర్థ్యం ఉన్న వాటిని ఎంచుకోవడం ఉత్తమం. లేదంటే, 16 జీబీ అంతర్గత మెమెరీతోపాటు మైక్రోఎస్‌డీ కార్డులను సపోర్టు చేసే ఫోన్లను ఎంచుకోవాలి. అయితే అదనపు మెమొరీ కార్డు వినియోగం మొబైల్ బ్యాటరీ మీద ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సెక్యూరిటీ:
ఇంతకు ముందు తరం స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ తక్కువగా ఉండేది. కేవలం పిన్ నంబర్, లేదా ప్యాట్రన్ లాక్ ద్వారా ఇతరులు తమ ఫోన్లను వినియోగించకుండా జాగ్రత్తపడేవారు. కానీ, నేను రకరకాల సెక్యూరిటీ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఐరిస్, ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ లాంటి ఆప్షన్ల ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయడం సాధ్యపడుతోంది. కేవలం వీటికోసమే కాకుండా ముఖ్యమైన డాక్యుమెంట్లకు, వీడియోలకు, యాప్స్‌కు సెక్యూరిటీ కల్పించడానికి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ. 5000లు పెడితే చాలు.. ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. అందువల్ల వీలైనంత వరకు లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన మొబైల్స్‌నే తీసుకోవడం ఉత్తమం.
ఆడియో ఫీచర్:
కొత్త మొబైల్ కొనేటప్పుడు స్పీకర్లు, సౌండ్ క్వాలిటీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వీడియో స్ట్రీమింగ్ ద్వారా ఎక్కువగా మాట్లాడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. అలాగే వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడటం లేదా మొబైల్‌లో సినిమాలు ఎక్కువగా చూడాలనుకునే వారయితే ఫోన్‌కు ముందువైపు స్పీకర్లు ఉన్న మొబైల్స్ ఎంచుకోవడం మంచింది. సాధారణ వినియోగదారులయితే ఫోన్ కింది భాగంలో లేదా వెనకవైపున స్పీకర్లు ఉన్నా ఫర్వాలేదు. అయితే ఈ ఫోన్లలో రింగ్‌టోన్ శబ్దం తక్కువగా వస్తుంది.
యూఎస్‌బీ పోర్టు:
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లను కంప్యూటర్లకు అనుసంధానించడం సర్వసాధారణమైపోయింది. దీని కోసం యూఎస్‌బీ పోర్టు తప్పనిసరి. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ కేబుళ్లనే ఎంచుకుంటున్నాయి. ప్రస్తుతం మైక్రో యూఎస్‌బీ, యూఎస్‌బీ-సీ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో యూఎప్‌బీ -సీ కేబుళ్లను ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే భవిష్యత్‌లో వీటినే ఎక్కువగా వినియోగించే అవకాశాలున్నాయి. రెండు సంవత్సరాల క్రితం సాధారణంగా 3.5మి.మీ హెడ్‌ఫోన్ జాక్‌లను ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. హెడ్‌సెట్‌లలో కూడా చాలా వరకు యూఎస్‌బీ-సీ రకం కేబుళ్లనే వాడుతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం.. మీకు నచ్చిన ధరలో వీలైనన్ని ఎక్కువ ఫీచర్లు వచ్చేలా ఉత్తమమైన ఫోన్‌ను సులభంగా ఎంచుకోండి.. ఓ మంచి ఫోన్ కొనేయండి!
-ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి