పరమ చెత్త సవాల్!
పరమ చెత్త సవాల్!
ఎన్నెన్నో రకాలు..అంతరిక్ష వ్యర్థాల్లో రాకెట్ ఉపరితల నిర్మాణాలు 17% ఉండగా.. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వస్తువులు 19% వరకూ ఉన్నాయి. ఇక విఫలమైన ఉపగ్రహాలు 22% కాగా.. చిన్న చిన్న శకలాలు 42% వరకూ భూకక్ష్యలో తిరుగుతున్నాయి.
ఇందుకలదందులేదని చెత్త సర్వత్రా వ్యాపిస్తోంది. ఇప్పటికే భూమిని, సముద్రాలను ముంచెత్తిన ఇది అంతరిక్షాన్నీ వదలటం లేదు. ఉపగ్రహాలు, రాకెట్లు, వ్యోమనౌకల ప్రయోగాలతో అద్భుతమైన విజయాలను సాధిస్తున్నామని పొంగిపోతున్న మనకిప్పుడు నిజంగా ‘చెత్త’ సవాలే ఎదురవుతోంది. రాకెట్ల విడిభాగాల దగ్గర్నుంచి కాలం చెల్లిన ఉపగ్రహాల వరకూ అన్నీ అంతరిక్షంలోనే ఉండిపోతూ.. అనంత వేగంతో తిరుగుతూ పెనుముప్పును తెచ్చిపెడుతున్నాయి. ఇవి ఎప్పుడే ఉపగ్రహాన్ని ఢీకొంటాయో, దేన్ని గతి తప్పిస్తాయో తెలియని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అందుకే శాస్త్రవేత్తలంతా ప్రస్తుతం ‘చెత్త పరిష్కారం’ దిశగానే దృష్టి సారిస్తున్నారు. అవును నిజంగా మనకిది ‘వ్యర్థ’ సమయమే!
స్పస్ డెబ్రిస్. ఇటీవలికాలంలో తరచుగా వినబడుతున్న పదమిది. ఆర్బిటల్ డెబ్రిస్.. స్పేస్ జంక్.. స్పేస్ వేస్ట్.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా వీటి అర్థం ఒకటే. అవే అంతరిక్ష వ్యర్థాలు. ఇంకా సులభంగా చెప్పాలంటే అంతరిక్షంలో పేరుకుపోయే చెత్త. ఇదంతా మనం అంతరిక్షంలోకి ప్రయోగించే ఉపగ్రహాలు, వ్యోమనౌకలు, రాకెట్లకు సంబంధించిన పనికిరాని వస్తువుల పుణ్యమే. రాకెట్లు వదిలిపెట్టే విడిభాగాలు, కాలం చెల్లిన ఉపగ్రహాలు, వాటికి వేసిన రంగుల పెచ్చులు, నట్లు, బోల్టులు.. ఇలా అన్నీ అంతరిక్ష వ్యర్థాలుగా పేరుకుపోయి ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ వ్యర్థాల్లో కొన్ని చిన్నగానే ఉండొచ్చు గానీ చాలా వేగంగా ప్రయాణిస్తుంటాయి. అందువల్ల వీటిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇంకాస్త పెద్దగా ఉండేవి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. మనం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రయోగించే ఉపగ్రహాలకు అడ్డుపడి, గతి తప్పేలా చేయొచ్చు. వాటిని పూర్తిగా దెబ్బతీయొచ్చు. ఇక కాలం చెల్లిన ఉపగ్రహాలైతే తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించొచ్చు కూడా. నిన్నటివరకూ మనల్ని తెగ భయపెట్టిన చైనా వ్యోమనౌక తియాంగాంగ్-1 ఇలాంటిదే. అరవై ఏళ్ల క్రితం మొదటిసారిగా స్పుత్నిక్ 1ని ప్రవేశపెట్టిన దగ్గర్నుంచి.. ఇప్పటి వరకు లక్షలాది టన్నుల చెత్త అంతరిక్షంలో పేరుకుపోతూనే ఉంది. మరో పాతిక సంవత్సరాల తర్వాత మనం ఎదుర్కోబోయే అతి పెద్ద సమస్య ఇదే కావొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం ప్రయాణించే దారిలో ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిస్తే ఏం చేస్తాం? చుట్టు తిరిగైనా వేరే దారిలో వెళ్లాలనుకుంటాం. దీంతో మన సమయం వృథా అవుతుంది. ఖర్చూ పెరుగుతుంది. లేదూ.. మన దారిన మనం వెళ్తుంటే అనూహ్య వేగంతో ఏదైనా వాహనం ఢీకొడితే? పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది. ప్రస్తుతం అంతరిక్ష వ్యర్థాలతో మనం ఇలాంటి ముప్పులనే ఎదుర్కొంటున్నాం. అంతరిక్షంలో పేరుకున్న వ్యర్థాలు ప్రస్తుతం మనం ప్రయోగిస్తున్న ఉపగ్రహాలకు పెద్ద ఉపద్రవాన్ని తెచ్చిపెడుతున్నాయి. వాటిని ఢీకొంటూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. లోఎర్త్‌ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, జియోస్టేషనరీ, హైఎర్త్ ఆర్బిట్ అంటూ భూమికి నిర్ణీత దూరాల్లో వివిధ రకాల కక్ష్యలుంటాయి. ఈ కక్ష్యల్లోనే మనం కీలకమైన సమాచార, వాతావరణ ఉపగ్రహాలను ప్రవేశపెడుతుంటాం. ఈ కక్ష్యల్లో వ్యర్థాలు పేరుకుపోతే ఉపగ్రహాలకు ఇబ్బందులు తప్పవు.
వందల కొద్దీ ఉన్నాయి స్కైలాబ్‌లు!
ఉపగ్రహాలంటే ఏంటో తెలియని మన అమ్మమ్మలకి, నాయనమ్మలకు స్కైలాబ్ పేరు సుపరిచితమే. స్కైకుమారి, స్కైబాబు లాంటి పేర్లు మన పల్లెల్లో కొత్తేం కాదు. దీనికి కారణం 1979లో స్కైలాబ్ రాకెట్ గతితప్పి భూమ్మీద పడటమే. ఇది రేపిన కలకలం అంతాఇంతా కాదు. ‘రేపో మాపో మన ఊరిపై స్కైలాబ్ పడిపోతుంది.. తింటే ఇప్పుడే తినాలి, ఉంటే ఇప్పుడే అనుభవించాలి’ అనుకుంటూ ప్రజలు క్షణక్షణం భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తు అది సముద్రంలో పడిపోవటంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ దాని జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ ప్రజల మనసుల్లో మిగిలిపోయాయి. ఇప్పుడు చర్చ స్కైలాబ్ గురించి కాదు. అంతరిక్షంలో తచ్చాడుతూ ఎప్పుడు ఎక్కడ పడతాయో తెలియకుండా ప్రాణికోటిని వణికిస్తున్న మరిన్ని ఉపగ్రహాల గురించే. వీటిని గతి తప్పేలా చేసే అంతరిక్ష వ్యర్థాల గురించే. డొనాల్డ్ కెస్లర్ అనే శాస్త్రవేత్త 1978లోనే నానాటికీ పెరుగుతున్న అంతరిక్ష వ్యర్థాలపై పరిశోధనలు చేశాడు. ఆయన పేరుతోనే కెస్లర్ సిండ్రోమ్ అనే పదం వాడుకలోకి వచ్చింది.
|
చెత్తని ఊడ్చిపెట్టొచ్చా....
మన ఇంట్లో చెత్తనయితే ఎప్పటికప్పుడు ఊడ్చేస్తాం. కానీ ఇది అంతరిక్ష చెత్తకదా అంత తేలిగ్గా ఊడ్చలేం. కానీ ఆ దిశగా ప్రయోగాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చెత్తని భూమ్మీదికి తీసుకురావడం అంత తేలికైన పనేమీ కాదు. ఖర్చుతో పాటు సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. అందుకే చాలామటుకు దేశాలు అంతరిక్ష చెత్తని తక్కిన వ్యోమనౌకలకి అడ్డురాకుండా పక్కకు మళ్లించి అక్కడ వాటిని నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇందుకోసం... లేజర్‌బ్రూమ్స్, సోలార్ సెయిల్స్, స్పేస్ నెట్స్, ఎలక్ట్రోడైనమిక్ టీతర్స్ విధానాలని ప్రముఖంగా ఉపయోగిస్తున్నాయి. తక్కిన వాటితో పోలిస్తే... స్పేస్‌నెట్, కలెక్టర్ శాటిలైట్ల పనితీరు కాస్త మెరుగ్గా ఉంది. స్పేస్‌నెట్... పేరుకు తగ్గట్టుగానే చూడ్డానికి చేపల వలలా ఉంటుందీ పరికరం. చేపలకు వల వేసి విసిరినట్టుగా ఒకరకమైన ప్రత్యేకమైన వలతో అంతరిక్ష వ్యర్థాలను ఒడిసిపట్టుకుని అంతరిక్షంలో మండిచేస్తుంది. బ్రేన్ క్రాఫ్ట్... తలవెంట్రుకలో సగం మందంతో మాత్రమే ఉంటుందీ పరికరం. ప్రస్తుతం ఈ పరికరం అంతరిక్ష వ్యర్థాలని ఏరిపారేసే పనిలో ఉంది.
*దారితప్పిన ఉపగ్రహాలను పట్టుకొని, దాని హార్డ్‌వేర్‌ను సంగ్రహించటానికి అమెరికా ఫీనిక్స్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. రెండు భాగాలుగా పనిచేసే ఇది రోబోటిక్ చేతితో ఉపగ్రహాన్ని ఒడిసి పట్టుకుంటుంది. * స్విట్జర్లాండుకు చెందిన క్లీన్‌స్పేస్ వన్ ప్రాజెక్టు ఉపగ్రహాన్ని వెంబడించి దాన్ని భూ వాతావరణంలోకి లాక్కొచ్చి ధ్వంసమయ్యేలా చేస్తుంది. |
కోటానుకోట్లుగా..
మన భూకక్ష్యలో సుమారు 17కోట్ల ‘అంతరిక్ష వ్యర్థాల’ శకలాలు తిరుగాడుతున్నట్టు అంచనా. కాలం చెల్లిన లేదా అదుపుతప్పిన అంతరిక్ష వాహనాలకు సంబంధించిన ఈ శకలాల్లో రాకెట్ అంత పరిమాణం దగ్గర్నుంచి రంగు ముక్కల వంటి చిన్న చిన్న వ్యర్థాల వరకూ ఉన్నాయి. అయితే వీటిల్లో 22వేల శకలాల గతుల గురించే మనకు తెలుసు. 10 సెంటీమీటర్లు, అంతకన్నా ఎక్కువ పెద్ద శకలాలు 20వేలకు పైగా.. 1-10 సెంటీమీటర్ల శకలాలు 5 లక్షలకు పైగా ఉన్నాయి. ఇక సెంటీమీటరు కన్నా చిన్న శకలాలు కోటికి పైగానే అంతరిక్షంలో విహరిస్తున్నాయి.
|
మహా మహా వేగం..
అంతరిక్ష వ్యర్థాలు మహా వేగంతో ప్రయాణిస్తుంటాయి తెలుసా? వీటి వేగం గంటకు 28వేల కిలోమీటర్లకు పైనే. ఇది ధ్వని వేగం కన్నా 23 రెట్లు ఎక్కువ కావటం గమనార్హం. అందువల్ల ఉపగ్రహాలకు చిన్న ముక్క తాకినా ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. 10 సెంటీమీటర్ల అల్యూమినియం ముక్క సెకనుకు 7.7 కిలోమీటర్ల వేగంతో ఢీకొంటే- 300 కిలోల టీఎన్‌టీ పేలుడు పదార్థం పేలినంత శక్తి వెలువడుతుంది. ఇవి ఢీకొట్టటం వల్ల ఏటా 3-4 ఉపగ్రహాలను కోల్పోవాల్సి వస్తోంది. ఇదిలాగే కొనసాగితే ఐదు, పదేళ్లలోనే అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాలన్నీ తుడిచిపెట్టుకుపోవటం ఖాయమన్నది నాసా అంచనా.
|
భారీ వస్తువులు మరీ ప్రమాదకరం
రాకెట్ ఉపరితల భాగాలు, పనిచేయని ఉపగ్రహాల వంటి భారీ వస్తువులు ఢీకొంటే మరింత వినాశనానికి దారితీస్తుంది. దీంతో మరింత పెద్దఎత్తున వ్యర్థాలు పుట్టుకొస్తాయి. ఇవి ఇతర ఉపగ్రహాలకు ఢీకొని మరిన్ని ప్రమాదాలకు దారితీయొచ్చు.
|
ఎంతెంత కాలం?
అంతరిక్ష వ్యర్థాల జీవనకాలం అవి భూకక్ష్యలో ఎంత ఎత్తులో తిరుగుతున్నాయి? వాటిపై సౌర ప్రభావం ఎంత వరకు పడుతోంది? వాటి ద్రవ్యరాశి, మధ్యభాగం విస్తీర్ణత శాతం ఎంత? అనే పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
|
అటు వినాశనం..ఇటు మహా నష్టం
సమాచార మార్పిడి, నావిగేషన్ వంటి వాటి విషయంలో ఉపగ్రహాలు మనకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. మనం వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లు, వైర్‌లెస్ పరికరాలు.. ఇలాంటివాటన్నింటికీ వీటి ద్వారా అందే సమాచారమే కీలకం. అంతరిక్ష వ్యర్థాల తాకిడికి ఉపగ్రహాలు దెబ్బతింటే ఇలాంటి సేవలకు తీవ్ర విఘాతం తప్పదు. సమాచార మార్పిడి మాత్రమే కాదు.. బ్యాంకు లావాదేవీల వంటివీ స్తంభించిపోవచ్చు. ఇప్పటికే రవాణా, ఇంధనం వంటి ఎన్నెన్నో రంగాలకు చెందిన పరిశ్రమలు ఉపగ్రహాలపై ఎక్కువగా ఆధారపడి పనిచేస్తున్నాయి. ఇవి దెబ్బతింటే దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలి పోయే ప్రమాదముంది.
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి