ఆదర్శం : ----------------->>>>>>>>>>>దీప కాంతుల కొత్త పుంత!

దీప కాంతుల కొత్త పుంత!
పేరు: మండాజి నర్సింహాచారి
ఏంటీయన ప్రత్యేకత?: చనిపోయాక మనిషి మళ్లీ బతకడు. కాలిపోయిన లైటూ అంతేనని మొదట్లో అనుకునే వారు. ఈ నానుడిని నర్సింహాచారి మార్చారు. కాలిపోయిన లైట్‌ మళ్లీ వెలుగుతుందని తెలియజెప్పారు.
ఇంకా..: ప్రసిద్ధ సీమెన్స్‌ ఫౌండేషన్‌ ప్రపంచవ్యాప్తంగా యువ శాస్త్రవేత్తల అన్వేషణ నిర్వహించింది. ఇందులో 52 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటే చారికి ప్రథమ బహుమతి లభించింది. దిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ పురస్కారం తీసుకున్నారు. కాలిన ట్యూబ్‌లైట్లను వెలిగించే ఫార్ములాకు చారి పేటెంటు తీసుకున్నారు. డిస్కవరీ ఛానల్‌, బీబీసీ, టీఎల్‌సీలలో ఆయన విజయగాథను ప్రసారం చేశాయి.
నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన  నర్సింహాచారి (39) బీఎస్సీ పూర్తి చేశారు. ప్రాథమిక పాఠశాలలోనే ప్రయోగాల మీద ఆసక్తి వాటిని చేసే వారు. ఒక రోజు ఇంట్లో రెండు ట్యూబ్‌లైట్లు కాలిపోయాయి. ఈ రోజు ఊళ్లో వాటిని అమ్మే షాపు మూసి వేసి ఉంది. ఈ రోజు కుటుంబం చీకట్లోనే ఉంది. కాలిన ట్యూబ్‌లైట్లను తీసుకున్న చారి ఒకదానిని పగులగొట్టి లోపల ఏమేం ఉన్నాయో చూశారు. తర్వాత ఊళ్లోని ఎలక్ట్రానిక్‌ షాపు వద్దకు వెళ్లి ట్యూబ్‌లైట్‌ ఎలా వెలుగుతుంది, చౌక్‌, స్టార్టర్‌ ఎందుకు అనే విషయాలు తెలుసుకున్నారు.దానికి చౌక్‌, స్టార్టర్‌తో పాటు ఫ్రేమ్‌ లేకుండా ట్యూబ్‌లైట్‌ పిన్నులకు రెండు వైర్లు అమర్చడం ద్వారా లైట్లను వెలిగించారు. మొదట్లో తమ ఊరిలో ప్రారంభించిన ఈ ప్రయోగం క్రమేపీ విస్తరించింది. అనేక గ్రామ పంచాయతీల్లో సిబ్బందికి ఈ విషయంలో శిక్షణనిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాలిన ట్యూబ్‌లైటు పునర్వినియోగ సృష్టికర్తగా ఆయన పేరే వినిపిస్తుంది.
ఎలా వెలుగుతుంది ?
2 మెగా రెసిస్టెన్స్‌లు రెండు, నిక్రోం రెసిస్టెన్స్‌ ఒకటి, మరో ఐసీ కలిపి లైట్‌ను వెలిగిస్తారు. ట్యూబ్‌లైట్‌లో రెండు ఫిలమెంట్లు ఉంటాయి. వాటికి చౌక్‌, స్టార్టర్‌ అనుసంధానం చేయడం ట్యూబు వెలుగుతుంది. వోల్టేజీ హెచ్చుతగ్గులు, ఎక్కువ సార్లు ఆన్‌, ఆఫ్‌ చేయడం వల్ల ఫిలమెంట్‌ బలహీనమై కాలిపోతుంది. అప్పుడు లైట్‌ వెలగదు. దీంతో ఫిలమెంట్లు లేకుండా దానికి కావాల్సిన వోల్టేజీని అందించే పరికరాన్ని అమర్చారు. రుణావేశం నుంచి ధనావేశం (క్యాతోడ్‌ నుంచి యానోడ్‌) వరకు ఎలక్ట్రాన్స్‌ వేగాన్ని పెంచడం ద్వారా కాలిన ట్యూబ్‌లైట్‌ వెలుగుతుంది. ఈ ఫార్ములాకు వాడే పరికరాలు రూ.100 కంటే తక్కువ ధరకే దొరుకుతాయి. ఇలా అమర్చిన ట్యూబులైట్లు రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు పాదరసం (మెర్క్యురీ) ఉన్నంత వరకు పనిచేస్తుంది. లో వోల్టేజీలో వెలుగుతుంది. పూర్తి కాంతివంతంగా ఉంటుంది.
బహుళ ప్రయోజనాలు : కాలిన ట్యూబ్‌లైట్లను వెలగించడం అనే ప్రక్రియ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఒక ట్యూబ్‌లైట్‌లో 5 మిల్లీగ్రాముల పాదరసం ఉంటుంది. ట్యూబ్‌లైట్‌ పగిలిపోతే భూమి కలుషితమవుతుంది. నీటిలో కలిసినా అది కలుషితమే, ట్యూబ్‌లైట్లను వినియోగించడం ద్వారా దానిలో పాదరసం శాతం తగ్గుతుంది. పర్యావరణ పరంగా ఇది ఎంతో ఉపయుక్తమయింది. విద్యుత్తు ఆదాకు తారకమంత్రంగా మారింది. కాలిపోయి పనికిరాకుండా మిగిలిన ట్యూబ్‌లైట్లను తిరిగి వెలిగించి, ఉపయోగించడం ద్వారా 30 నుంచి 40 శాతం వరకు విద్యుత్తు ఆదా అవుతోంది. ఈ పరికరాల ద్వారా ప్రయోగాత్మకంగా తొలుత రంగారెడ్డి జిల్లా అప్పారెడ్డిగూడలో కాలిపోయిన ట్యూబ్‌లైట్లను వెలిగించి పరిశీలించారు. దీంతో పాటు లోవోల్టేజీ వల్ల బల్బులు సరిగా వెలగక, తరచూ కాలిపోవడం ,ట్యూబ్‌లైట్లు కాంతివిహీనంగా ఉండడం వంటి సమస్యలకు పరిష్కారం లభించింది. .ఈ రోజుల్లో పేరొందిన కంపెనీల ట్యూబ్‌ ధర రూ.50 వరకు ఉండగా, చౌక్‌ రూ.285 వరకు, స్టార్టర్‌ రూ. 18 వరకు చొప్పున మొత్తం రూ. 350 వరకు ఆదా అవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, బీహార్‌, కర్ణాటక, యూపీ, దిల్లీ, గుజరాత్‌లలోని పలు గ్రామాల్లో కాలినట్యూబ్‌లైట్లను వినియోగించే విధానాన్ని ప్రారంభించారు.
అంతా సొంత ఖర్చుతోనే....
చారి ప్రయోగాలకు అవసరమైన పరికరాలు పూర్తిగా సొంత ఖర్చుతోనే సమకూర్చుకుంటున్నారు. డిగ్రీ అనంతరం ఇంజినీరింగ్‌  కళాశాలలో పనిచేసిన ఆయన ఆ తర్వాత నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో చిరుద్యోగిగా ఉన్నారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన గ్రామీణ సాంకేతిక పార్కులో చేరి ప్రయోగాలు చేస్తున్నారు. సొంత పెట్టుబడితో కాలిన ట్యూబులైట్లను వెలిగించే పరికరాలను తయారు చేయిస్తున్నారు. వాటిని తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కేంద్రమంత్రులను, ముఖ్యమంత్రులను, మంత్రులను, ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను కలిసి తన ప్రయోగాలను వివరిస్తున్నారు. ఇంత వరకు ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రోత్సాహం లేదు. స్వశక్తితోనే ఆయన ఎదుగుతున్నారు.
మొదట్లో కాలిన ట్యూబ్‌లైట్లను వెలిగించిన చారి సీఎఫ్‌ఎల్‌, మెర్య్సురీ వేపర్‌ (ఎంవీ) బల్బ్‌, సోడియం వేపర్‌ (ఎస్వీ) బల్బ్‌లు, సినిమా షూటింగులలో వాడే హెచ్‌ఎంఐ బల్బులను తిరిగి వెలిగిస్తున్నారు. దొంగతనాల నివారణకు సెల్‌ఫోన్‌ ద్వారా అప్రమత్తం చేసే విధానం కనుగొన్నారు. ఇందులో ఒక మైక్రో ప్రాసెసర్‌ను ఇంట్లో అమర్చి, దానిని సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేస్తారు. ఇంటి యజమానిని, పోలీసు స్టేషన్‌, ఇరుగుపొరుగువారి ఇళ్ల్లు, బంధువుల ఇళ్ల ఫోన్లకు సైతం దీనిని అనుసంధానం చేస్తారు. తాళం వేసిన ఇంట్లోకి ఎవరైనా దొంగ వస్తే వెంటనే ఆ సమాచారం క్షణాల్లో అనుసంధాన నంబర్లకు పోతుంది. దొంగలు వచ్చారు అని సందేశం వెళుతుంది. ఫోటో, వీడియో కూడా వెళుతుంది. వీధి లైట్లను, బోర్లను మోబైల్‌ ద్వారా ఆన్‌ఆఫ్‌ చేయడం వంటివి చేస్తున్నారు. రైల్వేగేట్‌ను ఆటోమేటిక్‌గా పనిచేసేలా మరో మైక్రో ప్రాసెసర్‌ను కనిపెట్టారు.
    -ఆకారపు మల్లేశం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు