ఆటోమేటిక్‌ బ్రేక్స్‌.. నో యాక్సిడెంట్స్‌!

ఆటోమేటిక్‌ బ్రేక్స్‌.. నో యాక్సిడెంట్స్‌!
2022 కల్లా అన్నివాహనాల్లో కొత్త సిస్టమ్‌
దిల్లీ: ఎంత పర్‌ఫెక్ట్‌గా డ్రైవింగ్‌ నేర్చుకున్నప్పటికీ వాహనదారులు అప్పుడప్పుడు రోడ్డు ప్రమాదాల బారిన పడుతూనే ఉంటారు. వాటిలో ఎక్కువ శాతం బ్రేక్‌లు సరిగ్గా పడక జరుగుతున్నవే. ఇక వాహనాల్లో అలాంటి లోపాలు తలెత్తవు. 2022 నాటికి బస్సులు, కార్లు, ట్రక్కుల్లో ఏడీఏఎస్‌(ఆడ్వాన్స్డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌)ను అమర్చనున్నారు.
ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడీఏఎస్‌ సిస్టమ్‌లో ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, అటానమస్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ సిస్టమ్‌, యాంటీ లాక్‌ బ్రేక్స్‌, లేన్‌ డిపార్చర్‌ వార్నింగ్‌, ఎడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్‌, బ్లైండ్‌ స్పాట్‌ మానిటర్‌ ఫీచర్స్‌ ఉన్నాయి. వీటి ద్వారా వాహనం వేగం పెరిగే సమయంలో ఈ ఫీచర్లన్నీ యాక్టివేట్‌ అవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో దానంతట అదే బ్రేక్‌ పడిపోతుంది. అయితే ఎంత వేగం వద్ద వాహనాలకు ఎమర్జెన్సీ బ్రేక్‌ సిస్టమ్‌ యాక్టివేట్‌ అవ్వాలి? అన్న విషయమై రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
‘ఈ విషయం గురించి స్టేక్‌హోల్డర్లతో ఒకసారి సమావేశమయ్యాం. పలు విదేశాల్లో ఈ సిస్టమ్‌ను 2021 నాటికి తప్పనిసరి చేయనున్నారు. అందుకే ముందస్తుగా మేమూ ప్లాన్‌ చేస్తున్నాం.’ అని ఓ ధికారి తెలిపారు. వాహనాల్లో అమర్చే ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ఈఎస్‌సీ) వాహనం అదుపు తప్పకుండా ఆపుతుంది. స్టీరింగ్‌ కంట్రోల్‌ తప్పుతున్న సమయంలో ఈఎస్‌సీ ఆటోమేటిక్‌గా బ్రేక్స్‌ వేస్తుంది. అదేవిధంగా అటానమస్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించి మరో వాహనంతో ఢీకొట్టకుండా బ్రేక్స్‌ వేస్తాయి. బ్లైండ్‌ స్పాట్‌ మానిటర్‌ ద్వారా చోదకుడు మత్తులో ఉన్నా, నిద్రలోకి జారుకుంటున్నా హెచ్చరిస్తుంది.
ప్రస్తుతం వోల్వో, మెర్సిడెజ్‌ కంపెనీలు ఈ ఫీచర్లతో కూడిన వాహనాలను తయారుచేసేందుకు ముందుకొచ్చాయి. అయితే రోడ్డు నిర్మాణాలు సరిగ్గా లేని ప్రదేశాల్లో ఈ ఫీచర్లు ఉన్న వాహనాలకు అనుమతి లేదు. సరైన రోడ్డు మార్గాలే కాకుండా గుర్తులు కూడా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వార్షిక రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారం.. మానవ తప్పిదాల కారణంగా భారతదేశంలో 80 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా భారత్‌లో జరిగే రోడ్డు ప్రమాదాల్లో దాదాపు రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు