అడవిలో..అవ్వ

అడవిలో..అవ్వ
25 ఏళ్లుగా అక్కడే ఆవాసం
భర్త, కుమారుల మరణం తర్వాత ఒంటరి జీవనం
దైవమే తోడుగా..ఆదివాసీ వృద్ధురాలి జీవిత ప్రయాణం
‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక కథనం
ఈనాడు-ఆదిలాబాద్‌: గంటపాటు టీవీ ఆగితే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. ఒక రోజు మనుషులెవరూ తారస పడకుంటే ఏకాకినైపోయానన్న భయం వెంటాడుతుంది. ఓ రాత్రి చిమ్మచీకట్లో గడిపితే వెన్నులో వణుకు మొదలవుతుంది. అలాంటిది 70 ఏళ్ల వృద్ధురాలు పాతికేళ్లుగా అడవే ఆవాసంగా కాలం వెళ్లదీస్తుందంటే ఓ పట్టాన నమ్మలేం. ఇది మాత్రం అక్షరాలా నిజమే. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ అటవీ ప్రాంతంలో ఓ అవ్వ చేస్తున్న అరణ్యవాసంపై ‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక కథనం.
ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలోని కన్నాపూర్‌-రాజులగూడ గ్రామాల మధ్యలోని అటవీప్రాంతంలో పూసం గిరుజుభాయి ఓ పూరిగుడిసెను ఆధారంగా చేసుకుని జీవిస్తోంది.
ఆమె కుటుంబంతో సహా దాదాపు 50 ఏళ్ల కిందట నార్నూర్‌ మండలం ఖైర్‌దాట్వా గ్రామం నుంచి ఉట్నూర్‌ మండలం కన్నాపూర్‌కు వలసొచ్చింది.  సమీపంలోని రెండెకరాల అటవీ భూమిని సాగుయోగ్యంగా మార్చుకుని జీవనం వెళ్లదీస్తుండేది. 30 ఏళ్ల క్రితం భర్త జైతు, ఆ తర్వాత కొంతకాలానికి కుమారుడు రాము మరణించడంతో ఆమె ఒంటరైంది. అయినా ధైర్యం కోల్పోని గిరుజుభాయి అటవీ ప్రాంతంలోని పొలం వద్దనున్న ఓ చెట్టు ఆధారంగా గుడిసె నిర్మించుకుని స్థిర నివాసం ఏర్పర్చుకుంది. పొలంలో పనిచేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది.
పండ్లే ఆహారం..సంప్రదాయ జీవనం 
ఆమె లోకం పోకడ ఏమాత్రం తెలియని..సంప్రదాయం వీడని అమాయక ఆదివాసీ మహిళ. రెండు జతల పాత చీరెలు, ఓ కుక్కి మంచం, రెండుమూడు వంటపాత్రలు, మూడు పొయ్యిరాళ్లు, ఒక బకెట్‌.. ఇవే ఆమె ఆస్తిపాస్తులు. ఎవరిచేతి వంటా తినదు. అడవిలోని ఫలాలనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుంది. కన్నాపురంలోని బంధువులు నెలకు అయిదు కిలోల చొప్పున ఇచ్చే బియ్యం, పప్పుతో అప్పుడప్పుడూ వంట చేసుకుంటుంది.
దేవుడే తోడు..పూజలతో కాలక్షేపం
విషయం తెలుసుకున్న ‘ఈనాడు ఈటీవీ’ బృందం ఇద్దరు ఆదివాసీల సహకారంతో ఆమె ఆవాసానికి వెళ్లగా అక్కడామె పూజలు చేసుకుంటూ కనిపించింది. గోండు భాష తప్ప మరో భాష తెలియని ఆమె..తొలుత మాట్లాడటానికి ఇష్టపడలేదు. స్థానిక ఆదివాసీల జోక్యంతో నోరు విప్పింది. ‘‘దైవానుగ్రహంతో అడవిలో ఉండటమే నాకు ఇష్టం. అడవిలో వన్యప్రాణులు నన్నేమి అనవు’’ అంటూ ధీమా వ్యక్తంచేసింది. ‘‘నా గుడిసెతోపాటు..నా ఆరాధ్య దైవం జంగుభాయి ఆలయానికి రేకులు కావాలి. దానికి నా చేతిలో డబ్బులు లేవు’ అని పేర్కొంది. ప్రభుత్వ పథకాలు అందలేదా? అంటే ఏమిటి అంటూ ఎదురు ప్రశ్నించింది. గిరిజన సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన ఉట్నూరు ఐటీడీఏ అధికార యంత్రాంగం ఇంతవరకు ఆమెవైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. గుంజలు తప్ప..కనీసం అడ్డుగా ఆకులు కూడా లేని గుడిసెలో ఉన్న ఆమె..వాన..చలి..ఎండలను తట్టుకుని..ఎలాంటి అనారోగ్యానికి గురికాకపోవడం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

Ratan Tata special article on Eenadu