భారత్‌కు భేషైన అవకాశం
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి పెద్ద పీట
ఊరిస్తున్న స్వదేశీ విపణి
ఎలక్ట్రానిక్స్ వ్యామోహం భారత్ జేబుకు చిల్లు పెడుతున్నట్లు స్పష్టమవుతూనే ఉంది. ఇప్పటికే చమురు దెబ్బకు కుదేలైన రూపాయికి ఇది గోరుచుట్టు మీద రోకటిపోటవుతోంది. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో 1.9 శాతంగా ఉన్న కరెంటు ఖాతా లోటు 2019 మార్చికల్లా 2.3 శాతానికి చేరుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 2020నాటికి భారత్‌లో ఎలక్ట్రానిక్ వస్తు గిరాకీలో 75 శాతాన్ని తీర్చడానికి దిగుమతులే ఆధారం కానున్నాయి. అప్పటికి మొత్తం గిరాకీ 40,000 కోట్ల డాలర్లకు చేరనుండగా, అందులో 10,400 కోట్ల డాలర్ల గిరాకీని మాత్రమే స్వదేశీ ఎలక్ట్రానిక్ పరిశ్రమ తీర్చగలుగుతుంది. మిగతా 30,000 కోట్ల డాలర్ల గిరాకీని తీర్చడానికి విదేశీ దిగుమతులే శరణ్యమవుతాయని అసోచామ్-ఎన్.ఇ.సి. టెక్నాలజీస్ సంయుక్త సర్వే తేల్చింది. మధ్యతరగతి భారతీయుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు గిరాకీ మరింత విజృంభించింది. స్థానికంగా గిరాకీ పెరుగుతున్నందునే స్వదేశీ ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ మార్కెట్ ఏటా 8.6 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తూ 2015నాటికి 7,500 కోట్ల డాలర్లకు చేరుకుంది. అదే సంవత్సరం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ పరిమాణాన్ని లక్షా 75 వేల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. ఇలా ఇంటాబయటా విజృంభిస్తున్న గిరాకీని తీర్చడానికి భారత్‌లోనే ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తిని ఇబ్బడిముబ్బడిగా పెంచాలి. ఈ పరిశ్రమ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌లో తయారీ పథకానికి ఎలక్ట్రానిక్స్ తయారీని ఇరుసుగా మలచాలి. చమురు, బంగారం, అరుదైన లోహాలను స్వదేశంలో తయారుచేసుకోలేం కానీ, ఎలక్ట్రానిక్స్ తయారీ మాత్రం భారత్‌కు సుసాధ్యమే. అలా చేస్తే విలువైన విదేశ మారక ద్రవ్యం ఆదా కావడంతోపాటు భారీయెత్తున ఉపాధి అవకాశాలనూ సృష్టించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో త్వరపడాలన్నది ‘అసోచామ్’ సూచన.

కొత్త పరిశ్రమలను స్థాపించడం ఒక్క పూటలో జరిగిపోయే వ్యవహారం కాదు. అయ్యవారు వచ్చేవరకు అమావాస్య ఆగదన్నట్లు స్వదేశీ ఉత్పత్తి ఊపందుకునే వరకు గిరాకీ ఆగదు. వినియోగదారులతోపాటు టెలికం, ఆటొమొబైల్ రంగాలకు కావలసిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో సింహభాగాన్ని దిగుమతి చేసుకోక తప్పడంలేదు. ఈ దిగుమతులు మన వాణిజ్య లోటును పెంచేస్తున్నాయి. దేశ ప్రజల ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ మరికొన్నేళ్ల పాటు దిగుమతులు ఎక్కువ కావడమే తప్ప తరిగే ప్రసక్తి ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇటీవల మొబైల్ ఫోన్లు, వాటి అనుబంధ వస్తువులు, టీవీలు, స్మార్ట్ వాచీలు తదితరాల దిగుమతులకు కళ్లెం వేయడానికి సుంకాలు పెంచింది. దీనివల్ల పెద్దగా ఉండదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనేవారు బ్రాండ్‌కు ఎక్కడలేని విలువ ఇస్తారు. కాబట్టి తమకు నచ్చిన బ్రాండ్ కొనడానికి వారు ధర గురించి మరీ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అయితే గియితే దిగువ మధ్యతరగతివారు అధిక సుంకాల వల్ల కాస్త వెనకాడవచ్చు. చివరకు దిగుమతులను అధిగమించాలంటే వాటితో పోటీపడగల ధర, సాంకేతికతలతో స్వదేశంలోనే ఉత్పత్తి చేయడం భేషైన పద్ధతి. కానీ, మేకిన్ ఇండియా ఈ రెండు అవసరాలను అందుకోలేకపోతోంది.
విదేశీ వస్తువులతో ఢీ అంటే ఢీ అనే సరకులను తయారు చేయడమన్నది ఆషామాషీ కాదు. కొత్త పరిశ్రమల స్థాపనకు భూ సేకరణ పెద్ద సమస్యగా ఉంది. ప్రాజెక్టులకు అనుమతులు రావడం, పెట్టుబడులు రావడం ఇప్పటికీ సమస్యాత్మకమే. ఇక మానవ వనరుల కొరత ఉండనే ఉంది. అలాంటప్పుడు 2020కల్లా ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు పూర్తిగా స్వస్తిచెప్పాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం సందేహమే. పైగా దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగదారులు సొంతానికి వాడుకుంటారు తప్ప, వాటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మరే విధంగానూ మేలు జరగదు. అదే స్వదేశీ, విదేశీ పెట్టుబడులతో భారత గడ్డపైనే ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేసి మన వినియోగదారులకు అందిస్తే దిగుమతులపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది. మున్ముందు ఈ పరికరాలను ఎగుమతి చేసే రోజు కూడా రావచ్చు. కాబట్టి భారత్‌లో తయారీ కింద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమివ్వాలి. మన ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా విదేశీ తయారీదారులతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలి.
స్వదేశంలో ఉత్పత్తి భారీయెత్తున ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి కర్ణాటక, మరికొన్ని రాష్ట్రాలు చొరవ తీసుకున్నా జరగాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు పెద్దగా కాలుష్యం వెదజల్లవు కాబట్టి వీటి స్థాపనకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. ఎలక్ట్రానిక్స్‌కు విపరీతమైన గిరాకీ ఉన్నందువల్ల ఈ రంగంలో కొత్త యూనిట్ల స్థాపనకు దేశవిదేశీ సంస్థలు ముందుకొస్తాయి. ప్రస్తుతం మనకు కావలసిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో 60 శాతం చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి.
ప్రస్తుతం మొబైల్ ఫోన్ల పరిశ్రమది మన జీడీపీకి 6.5 శాతం వాటా. ఇది 2020కల్లా 8.2 శాతానికి పెరుగుతుందని అంచనా. భారతీయులు విరివిగా మొబైల్ ఫోన్లను కొంటున్నందువల్ల మనదేశం త్వరలోనే అమెరికాను తోసిరాజని ప్రపంచంలో రెండో అతి పెద్ద మొబైల్ ఫోన్ల మార్కెట్‌గా అవతరించనుంది. సామ్ సంగ్ ప్రపంచంలో అతి పెద్ద మొబైల్‌ఫోన్ తయారీ కర్మాగారాన్ని ఇటీవల నోయిడాలో తెరచింది. ఈ యూనిట్ ఏడాదికి 12 కోట్ల స్మార్ట్ ఫోన్లను తయారుచేయగలదు. 100 డాలర్లకన్నా తక్కువ ధరకు లభించే ఫోన్లు మొదలుకొని ఖరీదైన సామ్ సంగ్ గెలాక్సీ ఫోన్ల వరకు ఇక్కడ తయారవుతాయి. ప్రస్తుతం భారత్‌లో 40 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. దేశ జనాభా 130 కోట్లకు పైబడింది. కాబట్టి మరెన్నో స్మార్ట్ ఫోన్లకు గిరాకీ ఖాయం. ఆ గిరాకీని తీర్చడానికి కొత్త కర్మాగారాలు రావలసి ఉంది. అలా కాకుండా దిగుమతులపై ఆధారపడతామంటే కుదరదు. అందుకే చరవాణులు, ఇతర పరికరాల దిగుమతులపై ప్రభుత్వం 20 శాతం అదనపు సుంకం విధిస్తోంది. భారత దేశంలోనే ఉత్పత్తి ప్రారంభించిన సామ్ సంగ్, షియోమీ కంపెనీలపై ఈ సుంకం ప్రభావమేమీ ఉండదు. ఖరీదైన స్మార్ట్ ఫోన్లను తయారుచేసే ఆపిల్ కంపెనీ సైతం ఇక్కడ తయారీ ప్రారంభించడం వల్ల దాని మీద కూడా ప్రతికూల ప్రభావం ఉండదు. ధర పట్టింపు జాస్తిగా ఉండే భారత్‌లో నెగ్గుకురావాలంటే ఇక్కడే ఉత్పత్తి చేపట్టడం కంపెనీలకు మేలు. ప్రస్తుతం స్థానికంగా చరవాణుల ఉత్పత్తి పుంజుకొంటున్నా మన అవసరాలను తీర్చే స్థాయిలో తయారీ జరగడం లేదు. దీన్ని పెంచడానికి ప్రభుత్వం విధానపరంగా విస్తృత చర్యలు తీసుకోవాలి. వెంటనే భారీ స్థాయి ఉత్పత్తి సాధ్యపడదు కాబట్టి దశలవారీగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. మొదట విదేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడ కూర్పు చేయడం, విదేశీ ఉత్పత్తిదారులను ఇక్కడకు ఆహ్వానించడం, స్థానిక ఉత్పత్తిదారులను క్రమంగా ప్రోత్సహించడం జరగాలి. కొత్త ఉత్పత్తిదారులు తేలిగ్గా పరిశ్రమలు స్థాపించే వాతావరణాన్ని కల్పించాలి. విదేశీ సంస్థలతో మన కంపెనీలు భాగస్వామ్యం కుదుర్చుకునే వీలు ఉండాలి. పరిశ్రమలతో సంప్రతించి వాటి అవసరాలను తీర్చే విధంగా విధాన నిర్ణయాలు తీసుకోవాలి.
- నీరజ్ కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి