Eenadu (19-06-11)
ల్యాంప్స్... కాలేజీ నుంచి పార్లమెంటులో అడుగుపెడుతున్న దివ్వెలు. ప్రజాస్వామ్య వ్యవస్థపై పరిశోధన చేస్తున్న యువరత్నాలు. పాతికేళ్లు కూడా నిండని వీరు సీనియర్ ఎంపీలకు మార్గదర్శులు.
సైన్స్, ఆర్ట్స్, ఇంజినీరింగ్... ఇలా ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి పాతికేళ్లు దాటని వారు ల్యాంప్ ఫెలోషిప్‌కు అర్హులు. ఏటా ఫిబ్రవరి, మార్చిలలో అభ్యర్థుల్ని ఎంపికచేస్తారు. పీఆర్‌ఎస్ (www.prsindia.org) వెబ్‌సైట్లో ఈ వివరాలు ఉంటాయి. ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల్ని ఎంపికచేస్తారు. ఎంపికైన వారు ఏడాదిపాటు ఒక ఎంపీ దగ్గర పనిచేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఏడాదిలో జరిగే మూడు పార్లమెంట్ సమావేశాలకు(వర్షాకాల, శీతాకాల, బడ్జెట్) వీరు పనిచేయాల్సి ఉంటుంది. సాధారణ డిగ్రీ చదివినవారు ఎంతో క్లిష్టమైన చట్టాల రూపకల్పనలో ఎంపీలకు ఎలా సాయపడగలరని సందేహ పడనవసరం లేదు. ఎందుకంటే ఫెలోషిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు పీఆర్‌ఎస్ నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటుచేస్తుంది. ఆ తర్వాతే పాలక, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలకు సహాయకులుగా నియమిస్తారు. వారు లోక్‌సభ లేదా రాజ్యసభకు చెందిన ఎంపీలు కావొచ్చు. తరచూ చర్చల్లో పాల్గొనే పార్లమెంట్ సభ్యుల్ని పీఆర్‌ఎస్ సంప్రదించి వారి దగ్గరకు సహాయకుల్ని పంపిస్తుంది. ఎంపీలకు సహాయకులుగా ఉండే అభ్యర్థులు సదరు సభ్యుడికి చెందిన ఆఫీసులో పనిచేయాలి లేదా సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. ఫెలోషిప్‌కు ఎంపికైన సభ్యులకు పీఆర్‌ఎస్ నెలకు రూ.12వేలు స్త్టెపెండ్, మరో రూ.3వేలు స్టేషనరీ ఖర్చు కింద అందిస్తుంది. ల్యాంప్ అభ్యర్థులు ఢిల్లీలోనే ఉంటూ తమకు కేటాయించిన ఎంపీలకు సహాయపడుతుండాలి. పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో నియోజకవర్గ పర్యటనకు వెళ్లాలా వద్దా అనేది సదరు ఎంపీ, అభ్యర్థుల మధ్య అవగాహననుబట్టి ఉంటుంది.
అభ్యర్థులు తమ రోజువారీ పనుల గురించి ఎంపీలకు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది. వారానికోసారి పీఆర్‌ఎస్ సిబ్బందితో సమావేశమై తమ ప్రాజెక్టు గురించి చెప్పాలి. విధి నిర్వహణలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా పీఆర్‌ఎస్ సహకారం తీసుకోవచ్చు.
భవిష్యత్ నాయకులు
మంగుళూరు విమాన ప్రమాద సమయంలో రాజ్యసభ ఎంపీ వెుయినల్ హసన్ 'విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో తలెత్తే సాంకేతిక సమస్యలూ ప్రయాణికుల ప్రాణాలు...' అంశంపై గుక్క తిప్పుకోకుండా అయిదు నిమిషాలు మాట్లాడారు. ఆ ప్రసంగానికి తోటి సభ్యులంతా చప్పట్లతో ప్రశంసించారు. ఆయన మాత్రం బయటకు వచ్చాక ప్రసంగాన్ని రాసిచ్చిన తన సహాయకురాలు 22ఏళ్ల రెబెక్కా జార్జిని ఎంతో మెచ్చుకున్నారు. 'ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే అనుకునేదాన్ని. పార్లమెంటు పనితీరును దగ్గరుండి పరిశీలించాక బిల్లుల తయారీ, ప్రశ్నలు సంధించడం గురించి లోతుగా తెలుసుకోగలిగాను' అని చెబుతుంది రెబెక్కా. 'రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తావా. వద్దులే, వారి దగ్గర రౌడీలు, గూండాలు కదా ఉంటారు'... ల్యాంప్ ఫెలోషిప్ చేస్తామనగానే చాలామంది తల్లిదండ్రుల నుంచి వచ్చే అభ్యంతరమిది. కానీ ఈ పని చాలా గౌరవప్రదమైనదనీ తమ పిల్లలు రాసిచ్చిన ప్రసంగాలే సదరు ఎంపీ సభలో చదువుతున్నారనీ తెలిశాక మాత్రం సంతోషానికి అవధులుండవు.
ల్యాంప్ ఫెలోషిప్ పూర్తిచేసిన వారిలో చాలామంది రాజకీయాల్లోకి వస్తామంటున్నారు. కొందరు ప్రజాస్వామ్య వ్యవస్థపై పరిశోధనలు చేస్తామంటే, మరికొందరు స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి ప్రజలకు సాయం చేస్తామంటున్నారు. ల్యాంప్ ఫెలోషిప్‌కు గతేడాది 500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలోంచి 12 మందిని ఎంపికచేశారు. ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య రెట్టింపు అయింది. అభ్యర్థుల సంఖ్యనూ 66కు పెంచారు. ఈ విధంగానైనా ప్రజాస్వామ్యంలో యువత పాత్ర పెరగడం హర్షణీయ పరిణామమంటున్నారు పలువురు రాజకీయవేత్తలు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి