Helping Hands
ఎన్నో పక్షులు ఆహారం కోసం విదేశాల నుంచి మనదేశానికి వలస వస్తాయి. కొన్నాళ్లు ఉండి తిరిగి వెళ్లిపోతాయి. అదే మనదేశంలో వలస జీవులు... ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఎన్నాళ్లు ఉంటారో లెక్కలేదు. అలాంటి వారి బాగోగుల కోసం కృషిచేస్తోంది 'ఎయిడ్ ఎట్ యాక్షన్.'ప్యారిస్ కేంద్రంగా పనిచేసే 'ఎయిడ్ ఎట్ యాక్షన్' సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. దక్షిణాసియాలో మనదేశంతో పాటు శ్రీలంక, నేపాల్‌లలో సేవలందిస్తోంది. మనదేశంలో ప్రధానంగా వలస కార్మికుల పిల్లల చదువులు, యువతకు స్థానికంగా ఉపాధి... అనే అంశాలపై ఈ సంస్థ దృష్టిపెట్టింది. ఉపాధి కల్పనలో భాగంగా ఎయిడ్ ఎట్ యాక్షన్ 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఐలీడ్)' కార్యక్రమం చేపడుతోంది. దీన్లో 18-25 ఏళ్ల మధ్య వయసు యువత వివిధ పరిశ్రమల్లో పనిచేసేందుకు కావాల్సిన నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. అలా గత పదేళ్లలో దేశవ్యాప్తంగా యాభైవేల మందికి వీరు శిక్షణ ఇచ్చారు. విప్రో, టాటా బీపీవో విభాగాలు, పిజ్జాకార్నర్, యమహా, నోకియా... వంటి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని వారి అవసరాలకు తగినట్టు యువతకు శిక్షణ ఇచ్చి ఆయా సంస్థల్లో ఉపాధి పొందేలా కృషిచేస్తారు. టైలరింగ్, సెల్ రిపేరింగ్, బ్యుటీషియన్ కోర్సు, ఆటోవెుబైల్ టెక్నాలజీలో వీరు శిక్షణ ఇస్తారు. మనరాష్ట్రంలో...
ఎయిడ్ ఎట్ యాక్షన్ వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో రాష్ట్రంలోని వలస జీవుల సంఖ్యను లెక్కించింది. ఆ గణాంకాలను ప్రభుత్వానికి అందించారు. రాష్ట్రంలో ఏటా సుమారు ఎనిమిది లక్షల మంది వలస పోతుంటారనేది వీరి సర్వే. వారిలో లక్షా డెబ్భైవేల మంది బడి ఈడు పిల్లలే. వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో జరిగే లబ్ధి అంతంత మాత్రమే. ఇలాంటివారు ఎక్కడున్నా ప్రభుత్వ ఫలాలు అందాలనేది వీరి ప్రతిపాదన. క్వారీలు, మైనింగ్, ఇటుక బట్టీలు, భవన నిర్మాణాలు జరిగేచోట తాత్కాలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు వలస పోవడంతో ఒంటరి వారైన పిల్లలకు ఆశ్రయం కల్పించడం కోసం వీరు శ్రీకాకుళం జిల్లాలో ఓ సీజనల్ హాస్టల్‌ను ప్రారంభించారు. అక్కడ సుమారు 200 మంది పిల్లలు వసతి పొందుతున్నారు.
తెలుగువారికోసం
'విద్యతోనే మార్పు'... అనేది ఎయిడ్ ఎట్ యాక్షన్ నినాదం. అందుకే చదువు ఎంత ముఖ్యవో తెలిపే డాక్యుమెంటరీలను పిల్లలకు చూపిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాల ప్రభుత్వ పాఠశాలల్లో 'పున్నీకీ కహానియా' పేరుతో ఈ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. విద్య బాలల హక్కు... వలసజీవుల పిల్లల చదువు కోసం వీరు చేస్తున్న కృషి ఎంతైనా ప్రశంసనీయం కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి