Interview_Mr. Bujjayi
బడికెళ్లలేదు. పాఠాలు చదువుకోలేదు. నాన్న వెనకాలే సాహితీసభలకు వెళ్లడం, నాన్న పక్కన కూర్చుని వందల మైళ్లు ప్రయాణించడం... ఇదే ఆయన విద్యాభ్యాసం. ఆ అనుభవాల్లోనే చదువులలోని సారమెల్లా చదివానంటూ 'ఫాదర్స్ డే' సందర్భంగా గుండెల్లోని నాన్నను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి తనయుడు బుజ్జాయి.
నాన్నగారికి రోగాలంటే భయం. అంటువ్యాధులున్న వారిని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. ఆ ఒక్కకారణంతోనే, వూరొదిలి వెళ్లిన రోజులున్నాయి. నాలుగేళ్ల వయసులో నాకు మశూచికం వచ్చినప్పుడు మాత్రం, ఆయనకా భయాలేవీ గుర్తుకురాలేదు. నన్ను భుజానికెత్తుకుని హాల్లో పచార్లు చేశారు. జోకొట్టి నిద్రపుచ్చారు. మందుల కంటే, నాన్న ప్రేమే బాగా పనిచేసింది. నా ఆరోగ్యం మెరుగుపడ్డాక, మళ్లీ ప్రయాణాలు వెుదలయ్యాయి. ఈ సారి ఒంటరిగా కాదు. వెనకాలే నేను. నన్నెంత ప్రేమగా చూసుకునేవారంటే, 'శాస్త్రి బుజ్జాయికి పాలివ్వడం తప్ప, అన్నీ చేస్తున్నాడు' అని హాస్యంచేసేవారు వెంకటరత్నంనాయుడు గారు.
నా బాల్యం నాన్నగారితోనే గడిచిపోయింది. ఒక్క క్షణం కూడా నన్ను వదల్లేకపోయేవారు. అందుకే స్కూలుకు కూడా పంపలేదు. అసలు ఆ ఆలోచనే రాలేదాయనకు. దానివల్ల మంచే జరిగిందనుకుంటాను. చదువే నా దగ్గరకు వచ్చింది. నాన్నగారి దగ్గరకు వచ్చే సాహితీవేత్తలు, కవులు, నటులు, చిత్రకారులు...అంతకంటే విలువైన పాఠాలు నేర్పించారు. ఆ విద్య పట్టాలకు పదిరెట్లు. ఆ ప్రపంచం విశ్వవిద్యాలయాలకంటే సువిశాలం. విశ్వనాథవారిని పెదనాన్నగారని పిలిచేవాణ్ని. అడివి బాపిరాజుగార్ని బందరు బాబయ్య అని సంబోధించేవాణ్ని. కాటూరివారూ నండూరివారూ నాకు మావయ్యలు! మా ఇంట్లో రోజూ సందడే. ఒక రోజు నాటకం, ఒక రోజు కవిసమ్మేళనం, ఒక రోజు గాత్ర కచేరీ. అదో కళల కూడలి. ఎంతపెద్ద సభలో పాల్గొన్నా ఎంత ఉద్వేగంతో ఉపన్యసిస్తున్నా...నాన్న మనసెప్పుడూ నా మీదే. వెుదటి వరుసలో నేనుండాల్సిందే. ఓసారి విశాఖపట్నంలో బ్రహ్మాండమైన సభ జరిగింది. మాటలు, పాటలు, కవిత్వం, చలోక్తులు...సాహితీప్రియులకు అదో విందు! నాకు మాత్రం ఎందుకో ఆయన ఉపన్యాసం ఆపరేవో అన్న భయంపట్టుకుంది. 'ఇక ఆపు...' అని గట్టిగా అరిచాను. 'నా ఉపన్యాసం ఆపేస్తున్నాను. మా అబ్బాయి ఆపెయ్యమంటున్నాడు' అని చెప్పేశారు. జనం వింటేగా! ఆయన ఉపన్యాసం ఆపకుండా ఉండటానికి ఎవరో నన్ను బయటికి తీసుకెళ్లి బిస్కెట్లూ గట్రా ఇప్పించారు. అప్పట్నుంచి ఆ వ్యక్తిని 'శీనూ శీనూ' అని పిలిచేవాణ్ని. ఆయన పేరు శ్రీశ్రీ. ఏంచేయమంటారు, నోరుతిరిగేది కాదు. ఓసారి ఇలానే నేను ఉపన్యాసాన్ని అడ్డుకున్నప్పుడు విశ్వనాథవారికి కోపం వచ్చింది. నాన్నగారికి మాత్రం నా మీద ఎప్పుడూ కోపం రాలేదు. నాకూ ఓ వ్యాపకం ఉండాలి కాబట్టి, ఎక్కడికి వెళ్తున్నా ఓ డ్రాయింగ్‌బుక్కు, పెన్సిలు కొనిచ్చేవారు. నేను రైలింజను బొమ్మలేస్తూ కూర్చునేవాణ్ని. ఆయనేవో ఉపన్యాసాల్లో లీనమయ్యేవారు. అలా మా ఇద్దరి సమస్యలూ పరిష్కారం అయ్యాయి. ఆ సాధనే నన్ను చిత్రకారుడిని చేసింది. అడివి బాపిరాజుగారు ఒళ్లో కూర్చోబెట్టుకుని రేఖాభ్యాసం చేయించారు. వల్లూరి జగన్నాథరావు అనే వాగ్గేయకారుడు నేలమీద సుద్దముక్కతో బొమ్మలు వేయడం నేర్పించారు.
నాన్నగారి వయసు పెరుగుతోంది. దాంతోపాటే అనారోగ్యమూ. డాక్టరు సలహా మీద చుట్టకాల్చడం కూడా మానేశారు. అయినా ఏవో సమస్యలు. కొన్నిసార్లు ఊపిరి ఆడేది కాదు, ఆయాసం. ఎందుకైనా మంచిదని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాం. ఏవో పరీక్షలు చేయించారు. కేన్సర్ అని తేలింది. 'ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకో రెండుమూడు నెలలు...' డాక్టరు మాట పూర్తికాకముందే మా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ విషయం నాన్నగారికి చెప్పకూడదని అనుకున్నాను. మంచి నిపుణులు ఉన్నారని తెలిసి, బొంబాయి తీసుకెళ్లాం. అక్కడా కొన్ని పరీక్షలు చేసి, శస్త్రచికిత్స తప్పదని చెప్పారు. స్వరపేటిక తీసేస్తారు. ఆ మహావక్త ఇక మాట్లాడలేరు. కంఠానికి ఓ రంధ్రం పెడతారు. అందులోంచే ఊపిరి పీల్చుకోవాలి. వాసనలు తెలియవు. మంచిగంధం, మల్లెపూలూ ఆస్వాదించలేరు. ఇవన్నీ చెబితే, ఆయన తట్టుకుంటారా? అయినా తప్పలేదు. సర్జరీ జరిగింది, మాట పోయింది. స్పీచ్ థెరపీతో పరిస్థితి కొంత మెరుగుపడుతుందని చెప్పారు. కానీ అది నాన్నగారికి నచ్చలేదు. చిన్న పుస్తకాల మీద రాయడమే హాయిగా అనిపించేది. అప్పుడు మాట్లాడేవారు. ఇప్పుడు రాస్తున్నారు. అంతే తేడా. దాదాపు పదహారేళ్లు ఆయన జీవితం నిశ్శబ్దంగానే సాగింది. ఆ అనారోగ్యం ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయింది. సాహితీ సృజన మీద ఎలాంటి ప్రభావమూ లేదు. ఆ సమయంలో అద్భుతమైన పాటలు రాశారు.
1980 ఫిబ్రవరి 24న...ఉదయం కొంచెం ఆయాసంగా ఉన్నట్టు కనిపించారు. డాక్టర్ రామ్‌దాస్‌గారిని తీసుకొచ్చాను. హార్ట్ స్పెషలిస్టుకు చూపించమన్నారు. ఆరోజు ఆదివారం కావటంతో నిపుణులు అందుబాటులో లేరు. మరుసటి రోజు వచ్చి చూస్తామన్నారు. రాత్రికి ఆయాసం ఎక్కువైంది. భయమేసి అంబులెన్సు పిలిపించాం. అంతలోనే, అంతా అయిపోయింది. ఇంతకాలం వేలుపట్టుకుని నడిపించిన నాన్న ఇక లేరని తెలిసి తట్టుకోలేకపోయాను. అయినా, ఆయనకు మరణం ఏమిటి? వెన్నెలరాజు, కలుములరాణి, గోరువంకలు, గోరింట పొదలు... ఉన్నంతకాలం కృష్ణశాస్త్రి ఉంటారు.
మానాన్న చిరంజీవి!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి