అయ్యే ఆంధ్రప్రదేశ్‌


అన్నింటా వెనుకబడ్డ రాష్ట్రం
వృద్ధిరేటులో రాష్ట్రానిది 11వ స్థానం
వృద్ధిరేటు, తలసరి ఆదాయం పెరుగుదలలో అగ్రపథాన బీహార్‌
ఆయుర్దాయంలో కేరళ, తమిళనాడు, కర్ణాటకలు
నిగ్గుతేల్చిన ఆర్థిక సర్వే
అక్షర క్రమంలో అగ్రభాగాన ఉన్నాం... హైటెక్‌ హంగులతో ముందుకెళుతున్నామంటూ ఇన్నాళ్లూ మన రాష్ట్రం గురించి గొప్పలు చెప్పుకున్నాం. వాస్తవాలు మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉన్నాయి. ఉపాధి హామీలో తప్ప... ఇతర అనేక కీలకాంశాలు, రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ బాగా వెనకబడి ఉందన్నది... బుధవారం పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే చెప్పిన చేదు నిజం. మన వెనుకబాటు స్థాయి ఎంతంటే... అనేక రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలతోనే కాకుండా బీహార్‌, మధ్యప్రదేశ్‌ల కన్నా తక్కువగా ఉంది. వృద్ధిరేటు, తలసరి ఆదాయాల్లో బీహార్‌ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ సగటుల్లోనూ వెనుకబాటే మన పాట.
రాష్ట్రం.. తిరోగమనం
అన్నింటా వెనకబాటే
ఉపాధి హామీ పనుల కల్పనలోనే మెరుగు
ఆరోగ్య కేంద్రాల్లో ముందున్న తమిళనాడు, కర్ణాటకలు
నిజాలు నిగ్గుతేల్చిన ఆర్థిక సర్వే 2012-13
ఈనాడు - హైదరాబాద్‌
వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో పెరుగుదల, గ్రామీణ, పట్టణ పేదరికం, నిరుద్యోగం, స్త్రీ- పురుషుల ఆయుఃప్రమాణం; శిశు మరణాలు, పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, విద్యార్థులు-ఉపాధ్యాయ నిష్పత్తి, అందుబాటులో వైద్యం, ఇందిరా ఆవాస్‌ యోజన పథకంలో ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పథకం, అందుబాటులోని బ్యాంకు సేవలు తదితర అంశాల్లో రాష్ట్రాల స్థానాన్ని 2012-13 ఆర్థిక సర్వే విశ్లేషించింది. ఉపాధి హామీ పథకం ద్వారా కుటుంబాలకు ఉపాధి కల్పించిన అంశంలో మినహా మన రాష్ట్రం అన్నింటా వెనుకబడి ఉంది. వివిధ అంశాల్లో కీలకమైన 16 రాష్ట్రాల ప్రగతిని బుధవారం పార్లమెంటులో ఆర్థికమంత్రి సమర్పించిన సర్వే నివేదికలో విశ్లేషించారు.
వృద్ధిరేటులో మనది 11వ స్థానం
వృద్ధిరేటులో బీహార్‌ ప్రథమ స్థానంతో దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్‌ 11 వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం కంటే బీహార్‌ వృద్ధి రేటు దాదాపు మూడురెట్లు ఎక్కువ ఉండటం విశేషం. కొన్ని రాష్ట్రాల వృద్ధిరేటు శాతం ఇలా ఉంది.

నిరుద్యోగులు.... 
దేశంలోకెల్లా రాజస్థాన్‌లో గ్రామీణ నిరుద్యోగం అతితక్కువ నిరుద్యోగం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ నిరుద్యోగంలో ఆరోస్థానంలో పట్టణ నిరుద్యోగంలో తొమ్మిదో స్థానంలో ఉన్నాం.
ఆయుః ప్రమాణాలు ... 
జీవిత ఆయుర్థాయం జాతీయ సగటు పురుషుల్లో 64.9 సంవత్సరాలుగా మహిళల్లో 69 సంవత్సరాలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. పదహారు రాష్ట్రాల్లో మనం 12వ స్థానంలో ఉన్నాం. పురుషుల ఆయుర్ధాయంలో 16 రాష్ట్రాల్లో మనం 12వ స్థానంలో ఉన్నాం. బీహార్‌, గుజరాత్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు మనకంటే ముందున్నాయి.
పాఠశాలలో చేరుతున్న విద్యార్థులు 
6-13 ఏళ్ల మధ్య పాఠశాలలో చేరే విద్యార్థులు సంఖ్యలో మన రాష్ట్రం 16 రాష్ట్రాల్లో 12వ స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రం విద్యార్థుల శాతం 122.6గా ఉండగా బీహార్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, యూపీ సహా మరికొన్ని రాష్ట్రాలు వందకంటే ఎక్కువగా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇది 92గా మాత్రం ఉంది.
ప్రాథమిక విద్యలో విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి
విద్యార్థులు-ఉపాధ్యాయ నిష్పత్తిలో హిమాచల్‌ప్రదేశ్‌ అత్యున్నత స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో ప్రాథమిక విద్యలో 15 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండగా, మాధ్యమిక పాఠశాలల్లో 14 మంది పిల్లలకు ఒక టీచరు ఉన్నారు. మన రాష్ట్రంలో నిష్పత్తి ప్రాథమిక విద్యలో 31 : 1, మాధ్యమిక పాఠశాలల్లో 25:1గా ఉంది. కర్టాటకలో ప్రాథమిక పాఠశాలల్లో 17:1, మాధ్యమిక పాఠశాలల్లో 27:1, కేరళలో ప్రాథమిక విద్యలో 23:1, మాధ్యమిక పాఠశాలల్లో 25:1, తమిళనాడు ప్రాథమిక పాఠశాలల్లో 27:1, మాధ్యమిక పాఠశాలల్లో 32:1 టీచరు ఉన్నారు.
బ్యాంకు శాఖల పెరుగుదల
ఆర్థిక సర్వేలో దశాబ్ద కాలంగా బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో వచ్చిన తీరుని విశ్లేషించారు. హర్యానా బ్యాంకుల శాఖల్లో 59.5 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా మన రాష్ట్రం 35.4 శాతంతో మూడో స్థానంలో ఉంది. బీహార్‌లో 14.4 శాతం మాత్రమే పెరుగుదల ఉంది. కేరళ 30.6 శాతం, కర్ణాటక 28.5, తమిళనాడులో 31.3 శాతంగా ఉంది. బ్యాంకు ఖాతాలు ఉన్న గృహాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లో అగ్రస్థానలో ఉంది. ఈ రాష్ట్రంలో 89.1 శాతం ఇళ్లలోని వారికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇది 53 శాతం మాత్రమే. జాతీయ సగటు 58.7.
ఇందిరా ఆవాస్‌ యోజన ఇళ్ల నిర్మాణం
ఐఏవై ఇళ్ల నిర్మాణలో బీహార్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 4,69,000 ఇళ్ల నిర్మాణం జరిగింది. ఉత్తరప్రదేశ్‌ 307000 ఇళ్లతో తర్వాత స్థానంలో ఉంది. మన రాష్ట్రం 2,49000 ఇళ్లతో మూడో స్థానంలో నిలిచింది.
జాతీయ ఆరోగ్య మిషన్‌ కింది వైద్య వసతులు
వైద్య వసతుల కల్పనలో తమిళనాడు అగ్రభాగాన ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌ అట్టడుగున ఉంది. తమిళనాడులో 1844 పీహెచ్‌సీలు ఉండగా కర్ణాటకలో 1132 పీహెచ్‌సీలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1183 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. కేరళలలో 660, రాజస్థాన్‌లో 1500 ఉన్నాయి. జనాబాలో తమిళనాడు, కర్టాటక రాష్ట్రాలకన్నా మన జనాభా అధికంగా ఉన్నా వైద్య వసతుల్లో మాత్రం వెనుకబడి ఉన్నాం.
శిశుమరణాల్లో బీహార్‌తో మనం దాదాపు సమానం
శిశుమరణాల సంఖ్య మన రాష్ట్రంలో వెయ్యికి 43గా ఉంది. బీహార్‌ లో ఇది వెయ్యికి 44. కేరళ శిశుమరణాలు తగ్గించడంలో గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ రాష్ట్రంలో వెయ్యి 12 మంది మరణిస్తున్నారు. అత్యధికంగా మధ్య ప్రదేశ్‌లో వెయ్యికి 59 మంది శిశువులు మృత్యువాత పడుతున్నారు. తక్కువ శిశుమరణాల రేటులో 16 రాష్ట్రాల్లో ... ఆంధ్రప్రదేశ్‌ కంటే తొమ్మిది రాష్ట్రాలు ముందున్నాయి
ఆశ్చర్యపరచిన బీహార్‌
బీహార్‌ రాష్ట్రం ఒకప్పుడు వెనుకబాటుతనానికి, హింసకు, రాజకీయ అస్తిరత్వానికి, పేదరికానికి పెట్టింది పేరు. కానీ గత కొంతకాలంగా బీహార్‌ ఇతర రాష్ట్రాలు అందుకోలేనంత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికీ పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు ఉన్నా వృద్ధి రేటులో తలసరి ఆదాయంలో జాతీయ సగటుకంటే మిన్నగా దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమైనా వాస్తవం. బీహార్‌లో వృద్ధి రేటు 16.71గా ఉంది.
హిమాచల్‌లో అత్యల్ప పేదరికం
దేశంలోని అతితక్కువ పేదరికం రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉంది.
పేదరికంలో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో ఉండగా... అత్యంత ఎక్కువ పేదరికంలో బీహార్‌ అగ్రస్థానంలో ఉంది.
పట్టణ, గ్రామీణ ఆదాయాల్లో అంతరం: పేదరిక రాష్ట్రాల్లో పేదలు తమ ఆదాయాల్లో అధిక మొత్తాన్ని ఆహారం కోసం వెచ్చిస్తున్నారు. బీహార్‌లో 65 శాతం ఆహారంపై వెచ్చిస్తున్నారు. కేరళలలో ఆహారంపై 46 శాతం వ్యయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 1234 రూపాయల ఆదాయం వస్తుండగా 58.1 శాతం ఆహారంపై ఖర్చుపెడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ.2238 ఆదాయం వస్తుండగా ఆహారంపై 44.8శాతం వ్యయం చేస్తున్నారు. కేరళలో గ్రామీణ ఆదాయం 1835 కాగా, పట్టణ ప్రాంతాల్లో ఇది రూ.2413గా ఉంది. తమిళనాడులో రూ. 1160 - 1948, కర్ణాటకలో రూ.1020 - 2053. పట్టణ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉండగా, గ్రామీణ ఆదాయాల్లో మనం ఐదో స్థానంలో ఉన్నాం.
ఉపాధి హామీలో మనమే ముందు
పాధిహామీ పథకంలో సగటు పనిదినాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుంది. మన రాష్ట్రంలో సగటున ప్రతి కుటుంబానికి 58 రోజులు పని కల్పించారు. ఇదే కర్ణాటక 42, కేరళ 45 తమిళనాడు 48 రాజస్థాన్‌లో ఇది 47 శాతంగా ఉంది. ఉపాధి హామీ పథకంలో మహిళల భాగస్వామ్యంలో కేరళ అగ్రస్థానంలో ఉంది. కేరళలో జాబ్‌కార్డులు ఉన్నవారిలో 92.76 శాతమంది మహిళలు ఉపాధి హామీ పనులు ఉపయోగించుకుంటున్నారు. మనరాష్ట్రంలో ఇది 57.79 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను ఉపాధిహామీ పథకం తీరుస్తోందని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాజస్థాన్‌లో గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం సమర్థంగా వినియోగించుకోవడంతో బాటు పెద్ద మొత్తంలో నిధులు ఉపయోగించుకోవడంతో... గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు వెయ్యికి నలుగురు మాత్రం ఉన్నట్లు గుర్తించారు. కేరళ అక్షరాస్యత సహా అనేక అంశాల్లో ముందుంది. అదే సమయంలో నిరుద్యోగంలోనూ అగ్రగామిగానే ఉంది. ఇక్కడ విద్యావంతులు ఎక్కువ ఉండటం వల్లే నిరుద్యోగం ఉందని విశ్లేషించారు. వీరు శారీరక శ్రమతో కూడిన ఉపాధి పనులు చేయడానికి ఆసక్తి చూపడంలేదని సర్వే లో పేర్కొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు