'లోకల్ టాలెంట్' గ్లోబల్‌గా సత్తా చాటుతోంది. 'మేడ్ ఇన్ ఇండియా' మొబైల్ అప్లికేషన్లు మార్కెట్‌లో మహాసందడి చేస్తున్నాయి. గృహిణులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఔత్సాహిక వ్యాపారులు... 'ఆప్ ఎంట్రప్రెన్యూర్స్' అవతారం ఎత్తుతున్నారు.
అర్జెంటుగా యోగా నేర్చుకోవాలి. కానీ, పొద్దున్నే లేవాలంటే బద్ధకం. అవసరానికో ఆప్. ఫేర్‌వెల్ పార్టీకి చీరకట్టులో వెళ్లాలని కోరిక. కుచ్చిళ్లు ఎలా సర్దుకోవాలో నేర్పడానికి మమ్మీ వూళ్లో లేదు. అభిరుచికో ఆప్. హైదరాబాద్ కొత్త. ఎటుచూసినా ఇరానీ కేఫ్‌లే. సాంబార్ ఇడ్లీ రెస్టారెంట్ ఎక్కడుందో వెతుక్కోవాలి. సందర్భానికో ఆప్. ఆండ్రాయిడ్, సింబియాన్, విండోస్, ఐవోఎస్, బ్లాక్‌బెర్రీ...రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్‌లకు రకరకాల మొబైల్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్లు (ముద్దుగా...ఆప్స్) సిద్ధంగా ఉన్నాయి. కొన్నయితే, మల్టిపుల్ ప్లాట్‌ఫామ్‌లోనూ పనిచేస్తాయి. ఆన్‌లైన్ దుకాణాల్లో...లక్షలకొద్దీ ఆప్స్ ఉన్నాయి. నిమిషానికో కొత్తసరుకు వస్తోంది. పాతవి అప్‌డేట్ అవుతున్నాయి. ప్రతి ఆప్ వెనుకా...ఓ హీరో! ఆ హీరో (హీరోయిన్లు కూడా) వెనుక బోలెడంత కృషి. ఆ కృషి వెనుక కొండంత క్రియేటివిటీ. ఆప్స్ తయారీకి భారీ పెట్టుబడులు అక్కర్లేదు.
ఓ మోస్తరు సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం చాలు. తొలిదశలో సిబ్బంది అవసరమూ పెద్దగా ఉండదు. మార్కెటింగ్ సమస్యలూ తక్కువే. ఈ వెసులుబాట్లన్నీ 'ఆప్ ఎంట్రప్రెన్యూర్స్'కు వరంగా మారాయి. అప్పటికే ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఐటీ కొలువులకు 'గుడ్ బై' చెప్పేశారు. కొత్తవారు సరికొత్త ఆశలతో రంగప్రవేశం చేశారు. టెక్నాలజీ మీద అవగాహన లేకపోయినా...ఆప్స్‌లోని అద్భుత వ్యాపారకోణాన్ని పట్టుకున్న 'నాడీ' జ్యోతిష్కులూ ఉన్నారు. ఇక్కడ...కరెన్సీ కంటే ఐడియా ముఖ్యం. కోడింగ్ నైపుణ్యం కంటే ఆధునిక సమాజంలో మనిషి అవసరాల్ని డీకోడ్ చేయగల పదునైన బుర్ర ముఖ్యం. ఇక చెప్పేదేముంది, 'ఆప్ ఎంట్రప్రెన్యూర్స్' సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. ఒకరిద్దరైతే పెద్ద కంపెనీలకు దీటుగా ఎదుగుతున్నారు. ఆప్ పోటీదార్లను 'ఉఫ్'మని వూదేస్తున్నారు.ఐఫోన్ కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు జూమ్ ఫంక్షన్ లేదు. కెమెరాకు డిజిటల్‌జూమ్ సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన కలిగింది రోహిత్‌భట్ అనే ఉడుపీ కుర్రాడికి. అప్పటికే ఐటీ రంగంలో రాటుదేలిపోయాడేమో, సాఫ్ట్‌వేర్ రూపకల్పన సమస్యే కాలేదు. దాదాపు కోటిన్నర డౌన్‌లోడ్స్‌తో భట్ 'కెమెరా ప్లస్' దుమ్మురేపింది. భట్ సృష్టించిన 'ప్రిజర్ మేహెమ్ హెచ్‌డీ', 'వర్డ్స్‌వర్త్' ఆప్స్ యూరోపియన్ మార్కెట్‌ను వూపు వూపాయి.
హర్యానాలోని సోనేపట్ కేంద్రంగా హేమంత్‌కుమార్ ప్రారంభించిన సైన్యూ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ నిత్యజీవితంలో పనికొచ్చే ఎన్నో ఆప్స్‌ను అందించింది. 'వాలెట్‌ఎక్స్'... బ్యాంకు అకౌంటు, పాన్‌కార్డు, ఇన్సురెన్స్ పాలసీలూ తదితర వివరాలను ఓ చోట దాచి ఉంచుకునే అవకాశం కల్పిస్తుంది. డెబిట్‌కార్డుకో పాస్‌వర్డ్, క్రెడిట్‌కార్డుకో పాస్‌వర్డ్, సిస్టమ్ లాగిన్ పాస్‌వర్డ్, ఫేస్‌బుక్ పాస్‌వర్డ్...ఇన్నిన్ని గుర్తుపెట్టుకునే పరీక్షలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఆ బాధేం లేకుండా వాటన్నిటినీ 'వాలెట్‌ఎక్స్'లో భద్రపరుచుకోవచ్చు. ఇక 'ఫాస్ట్‌ట్యూబ్' ఆప్ ... యూట్యూబ్ స్పీడు పెంచుతుంది. 'మిస్టర్ ఎక్స్‌పెన్స్' ద్వారా రోజువారీ ఖర్చులను ఓచోట రాసిపెట్టుకోవచ్చు. దుబారాకు కళ్లెం వేయడానికి ఇదో మంచి మార్గం. ఫాస్ట్‌ట్యూబ్ ఇప్పటికే ఆరు లక్షల పైచిలుకు డౌన్‌లోడ్లు సాధించింది. మిగిలినవీ మంచి ఆదరణ పొందాయి.
ఆప్స్ వీరుల్లో చాలామంది మహానగరాల జోలికి వెళ్లకుండా, పెద్దటౌన్లలోనే టెంట్లు పాతుతున్నారు. అద్దెలు తక్కువ. జీతాల భారం తక్కువే. వలసల ఇబ్బంది ఉండదు. ఎటూ ఇంజినీరింగ్ కాలేజీలు ఉంటాయి కాబట్టి, మానవ వనరుల కొరతే లేదు. భట్ తన సంస్థను ఉడుపీ కేంద్రంగా ప్రారంభిస్తుంటే అంతా నవ్వారు. ఇప్పుడు భట్ కంపెనీ అసలుపేరు ఎవరికీ గుర్తులేదు. అంతా 'ఉడుపీ కంపెనీ' అనే పిలుస్తారు. పెద్దగా ఐటీ సందడి లేని జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్ తదితర ద్వితీయశ్రేణి నగరాలు ఆప్స్ కేంద్రాలు అవుతున్నాయి. 'మా నిర్ణయం పూర్తిగా వ్యాపారపరమైంది కాదు. అందులో సొంతూరి మీద ప్రేమా ఉంది' అంటారు సోనేపట్ హేమంత్ కుమార్.
ఒక ఐడియా... ఆప్స్ అంటే...మహా అయితే గేమ్స్ లేకుంటే ఉపకరణాలు. అంతకంటే ఏమీ లేదా...అన్న ఆలోచన నుంచి ఆప్‌బుక్స్ పుట్టుకొచ్చాయి. అరుణ్ బెంటి, రోహిత్ రెగో, అనిల్‌గార్గ్ - ముగ్గురు మిత్రుల మేధోమథన ఫలితమిది. ఆ మిత్రత్రయం చదువుకునే రోజుల్లోనే ఇంటర్నెట్ సెంటర్‌ను నడిపారు. ఆతర్వాత అంతా ఐటీవైపు అడుగులేశారు. ఆప్స్ హంగామాకు ఆకర్షితులై ఇటువైపు వచ్చారు. లాఫ్టీ వైజ్‌మాన్ సుప్రసిద్ధ రచన 'ఎస్‌ఎఎస్ సర్వైవల్ గైడ్'ను ఆప్ రూపంలోకి తెచ్చారు. ప్రాజెక్టు విజయవంతం కావడంతో, మరిన్ని ప్రచురణ సంస్థలు వరుస కట్టాయి. ఆ కుర్రాళ్లు స్థాపించిన 'ఐరెమిడీ' దాదాపు 200 అమరచిత్ర కథ కామిక్స్‌ను రకరకాల ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి తెచ్చింది. టెక్‌జోన్ అనే ముంబయి సంస్థ బిగ్-బి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరుతో ఓ ఆప్‌ను సృష్టించింది. అదో అమితాబ్ విజ్ఞాన సర్వస్వం. బచ్చన్‌జీ ట్విటర్ ఖాతాతో దాన్ని అనుసంధానించారు.
యోగా మీద ఆసక్తి ఉన్నా... బద్ధకంతోనో తీరిక లేకపోవడంవల్లో... ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకుంటున్నవారూ ఉన్నారు. అలాంటివారికి ఉపయోగపడేలా... కృష్ణాజిల్లా అగిరిపల్లిలోని ఎన్.ఆర్.ఐ. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు యోగా ఆప్ తయారుచేశారు. ఇంగ్లిష్, జపనీస్, కొరియన్ భాషల్లో దాన్ని రూపొందించారు. విదేశాల్లోనూ మంచి స్పందన వచ్చింది. రోజువారీ ప్రణాళికను రాసిపెట్టుకుని, కచ్చితంగా అమలు చేయడానికి చెన్నై సంస్థ 'టెన్‌మైల్స్' రూపొందించిన 'వండర్‌ఫుల్ డే' ఆప్ .. అమెరికన్ ప్రొడక్టివిటీ చార్ట్‌లో రెండో స్థానం సంపాదించింది. 'గేమ్స్2విన్' అనే ముంబయి కంపెనీ 'పార్కింగ్ ఫ్రెంజీ' అటు అమెరికా, ఇటు యూకే మొబైల్ ఆప్ మార్కెట్లను వూపు వూపింది. వాహనాల పార్కింగ్ ఇతివృత్తంగా రూపొందించిన ఆట అది. హ్యాంగ్‌మాన్ (స్పైస్‌లాబ్స్), దివాలీ థీమ్ (విముక్తి) కూడా అంతర్జాతీయంగా మంచి హిట్స్ కొట్టాయి.కొత్తదారి... లక్షణంగా బెంగళూరులో ప్రాక్టీసు చేసుకుంటున్న డాక్టర్ రోహిత్ సింఘాల్‌ను ఆప్స్ చీమ కుట్టింది. స్టెతస్కోప్ పక్కనపడేసి... సోర్స్‌బిట్ సంస్థను స్థాపించారు. కంప్యూటర్ ముందు కూర్చుని రకరకాల ఆప్స్ సృష్టించారు. డాక్టరుగారే కాబట్టి హెల్త్ ఆప్స్ ఏమైనా తయారు చేస్తారేమో అని అంతా అనుకున్నారు. ఆ జోలికే వెళ్లకుండా...'ఫన్‌బూత్' అనే ఫొటోగ్రఫీ ఆప్‌ను తయారుచేశారు. దాంతో ఫొటోలకు చిత్రవిచిత్రమైన ఎఫెక్ట్స్ ఇవ్వవచ్చు. రాత్రిపూట మెరుస్తూ సమయాన్ని చూపించే 'నైట్ స్టాండ్' ఆప్‌కు భారీ స్పందన వచ్చింది. కొద్దిరోజుల వ్యవధిలోనే 30 లక్షల డౌన్‌లోడ్లు జరిగాయి. ఈ గెలుపు అంత సులభంగా ఏం రాలేదు. 'ఓ దశలో దుకాణం కట్టేయాలన్న ఆలోచన వచ్చింది' అంటారు రోహిత్. ఆ భయాన్ని ఆశావాదం ఓడించింది.
ఆప్స్ తయారీ మహిళలనూ ఆకర్షిస్తోంది. రష్మీసచన్ అచ్చమైన గృహిణి. భర్త, పిల్లలు, ఇల్లు .. తప్పించి మరో ప్రపంచం తెలియని మనిషి. ఇప్పుడామె ప్రచురణకర్తల సహకారంతో పిల్లల కథల పుస్తకాల్ని ఆప్స్‌గా తెస్తున్నారు. రష్మీ సంస్థ 'ఫ్లిప్‌లాగ్' నుంచి దాదాపు నలభై దేశాల్లో పదిలక్షల డౌన్‌లోడ్లు జరిగాయి. కాలిఫోర్నియాలో స్థిరపడిన సిప్రామిట్టల్ ఏకంగా రామాయణాన్నే ఆప్‌గా రూపొందించారు. వీళ్లెవరూ ఇంజినీరింగ్ చదువుకోలేదు. సాంకేతిక విషయాలపై పెద్దగా అవగాహనా లేదు. పిల్లల మీద ప్రేమ, ఆప్స్‌ను ఓ వికాస మాధ్యమంగా వాడుకోవాలన్న తపనే ఈ మహత్కార్యానికి ముందుకు నడిపించింది. బాధ్యతల కారణంగానో, ఒత్తిడుల కారణంగానో ఉద్యోగాలు మానేసిన నడివయసు మహిళలూ దీన్నో పార్ట్‌టైమ్ వ్యాపారంగా స్వీకరిస్తున్నారు. చెన్నై గృహిణి నిరంజన బాలసుబ్రహ్మణ్యం, ఇంట్లో కూర్చునే మెక్సికో అధ్యక్షుడి కోసం ఓ ఆప్ తయారుచేసి పెట్టారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ ఇండియా నిర్వహించిన మహిళా ఆప్ వ్యాపారవేత్తల సదస్సుకు దాదాపు యాభైమంది హాజరయ్యారు. ఇదంతా ఆరంభమే! 'ఇంగ్లిష్ ... వింగ్లిష్'లానే శ్రీదేవిని హీరోయిన్‌గాపెట్టి 'ఆప్స్..మామ్స్' పేరుతో సినిమా తీయవచ్చు.ఏ సంస్థనైనా ఓ స్థాయివరకు తీసుకెళ్లడం సులభమే. అంతకంటే పైకి ఎదగాలంటే .. సాధనసంపత్తి కావాలి. హంగులూ ఆర్భాటం అవసరం. పెద్ద కంపెనీలతో పోటీపడగల ఆర్థిక స్థోమతా ఉండాలి. ఆ సంగతి వెంచర్ క్యాపిటలిస్టులకు బాగా తెలుసు. అందుకే, 'ఐడియా మీది...పెట్టుబడి మాది' అంటూ ఆప్ ఎంట్రప్రెన్యూర్స్‌తో బేరాలు సాగిస్తున్నారు. కోట్ల పెట్టుబడులకు సిద్ధపడుతున్నారు. ఒకట్రెండు 'విన్-విన్' ఆఫర్లు ఇప్పటికే కార్యరూపం దాల్చాయి.
సమాజం కోసం... కొన్ని ఆప్స్ అచ్చంగా సమాజం కోసమే పుడుతున్నాయి. 'టెలీబ్రహ్మ' సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను మైసూరు ట్రాఫిక్ పోలీసులు విధినిర్వహణలో వాడుకుంటున్నారు. మనకు తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు భాషా సమస్య సర్వసాధారణమే. అలాంటి సందర్భాల్లో ఆదుకునే ఆప్ ఒకటుంది. పుణెకు చెందిన ఎక్సెటెంటియా తయారుచేసిన అప్లికేషన్ దాదాపు 54 భాషల్లో అనువాద సేవలు అందిస్తుంది. దుబాసీగా కూడా వ్యవహరిస్తుంది. మనం హిందీలోనో మరాఠీలోనో మాట్లాడితే... ఏ జపనీస్‌లోకో అనువదించి చెప్పమన్నా చెబుతుంది. ఇంకేం, నిర్భయంగా ప్రపంచాన్ని చుట్టేసిరావచ్చు. నిరక్షరాస్యులకు ఇదో వరం. 'అత్యాచారాల రాజధాని' ఢిల్లీకి చెందిన వైపోల్ స్వచ్ఛంద సంస్థ చొరవతో 'ఫైట్‌బ్యాక్' అనే ఆప్ సిద్ధమైంది. ప్రమాదకర పరిస్థితుల్లో మహిళలు తమ సెల్‌ఫోన్ నుంచి ఒక్క మీట నొక్కినా చాలు ... పోలీసులతో సహా మొత్తం ఐదుగురికి సమాచారం వెళ్లిపోతుంది. జీపీఎస్ ద్వారా...ఎక్కడ ఉన్నదీ వారికి తెలిసిపోతుంది. హైదరాబాదీ సంస్థ విముక్తి టెక్నాలజీస్ ధూమపానాన్ని మానేయాలనుకునే వారికి ఉపకరించే ఆప్‌ను రూపొందించింది. కాన్సర్‌పై ఇదో పరోక్ష పోరాటం. ఆప్స్ సృష్టికర్తలు పూనుకుంటే...అనేకానేక సామాజిక సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలు దొరుకుతాయి.
ఇలా మొదలైంది... మొబైల్ ఆప్స్...అక్షరాలా పాతికవేల కోట్ల పరిశ్రమ! అదో వూటబావి. తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత. ఆ మార్కెట్ పరిమాణం ఆవిష్కర్తలను స్థిమితంగా ఉండనీయడం లేదు. అందులోనూ భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరుగుతోంది. ఆప్స్ బజారులో రోజుకు కోటి డౌన్‌లోడ్లకు అవకాశం ఉంది. నాలుగు నుంచి ఐదు కోట్ల ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్టు అంచనా. ఇవన్నీ వూరించే అంశాలే. 2008లో ఆపిల్ 'ఆప్ స్టోర్'ను ప్రారంభించడంతో హంగామా మొదలైంది. ఆప్స్ ఆవిష్కర్తలకు ఓ వేదిక దొరికినట్టయింది. ఆండ్రాయిడ్, విండోస్ కూడా ఆ దార్లోకే వచ్చాయి. దీంతో మార్కెట్ విస్తరించింది. ఆప్స్ తయారీ ఐటీ పరిశ్రమ లాంటిది కాదు. ఒక్కసారిగా కనకవర్షం కురవదు. అప్లికేషన్స్‌ను నేరుగా మొబైల్ కంపెనీలకు అమ్ముకోవడం ఒకదారి. దీనివల్ల ఆర్థిక సమస్యలు పెద్దగా ఉండవు. లాభాలూ గొప్పగా ఉండవు. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టడం మరోదారి. ఆ ధరలూ నామమాత్రమే. దీనికితోడు రూపాయిలో 30 పైసలు... 'ఆప్ స్టోర్స్'కు ఇవ్వాలి. ఉచితంగా అందిస్తూ ప్రకటనలు సంపాదించడం చివరిమార్గం. ఇక్కడ వైవిధ్యమైన మార్గాల్ని అనుసరిస్తున్నారు భారతీయ ఆప్ వ్యాపారవేత్తలు. అత్యధిక జనాదరణ పొందిన రా-వన్ గేమ్ అప్లికేషనే తీసుకోండి. దీన్లో బిస్కెట్ల ప్రకటనను జోడించారు. హీరో... మరింత శక్తి కోసం మధ్యమధ్యలో ఆ బ్రాండు బిస్కెట్లు తింటాడు. యాడ్స్‌ను ఇతివృత్తంలో భాగం చేయడం వల్ల పంటికింద రాయిలానూ అనిపించదు. టెక్నాలజీనీ ఐడియానూ సమపాళ్లలో రంగరించడం అంటే ఇదే. అమెరికా లాంటి దేశాల నుంచి 'అవుట్‌సోర్సింగ్' అవకాశాలూ పెరుగుతున్నాయి.
వీటన్నిటికి తగినట్టే ఆప్ హీరోలు తమ వ్యూహాల్ని రూపొందించుకుంటున్నారు. దాదాపు అన్ని మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అందులోనూ ఆప్స్ జీవితకాలం చాలా తక్కువ. హిట్టా ఫట్టా అన్నది గంటల్లో తేలిపోతుంది. మహా అయితే, నెలరోజులు హడావిడి ఉంటుంది. అంతలోనే మరొకటి వస్తుంది. జనం అటువైపు పరుగులు తీస్తారు. అంటే, ఆప్స్ సృష్టికర్తలకు ప్రతిరోజూ ప్రతి నిమిషం పరీక్షే! మార్కెట్‌లో నిలబడాలంటే, పరుగెత్తాల్సిందే. ఆ పరుగులో అందరికంటే ముందుండాల్సిందే. భారత్ ఆప్‌వీరులకు అలాంటి సవాళ్లేం కొత్తకాదు. మనవాళ్ల దూకుడు చూస్తుంటే.. ఔత్సాహికుల్లోంచి ఆప్స్ నారాయణమూర్తులూ ఆప్స్ ప్రేమ్‌జీలూ... పుట్టుకొచ్చే రోజు ఎంతోదూరం లేదనిపిస్తుంది. |
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి