అమ్మ చందమామను చూపిస్తూ చెప్పిన కథ, అమ్మమ్మ గోరుముద్దలు తినిపిస్తూ చెప్పిన కథ, తాతయ్య గుండెల మీద కూర్చోబెట్టుకుని చెప్పిన కథ...ఇప్పుడు, కార్పొరేట్ హంగులు అద్దుకుంటోంది.మార్కెటింగ్ వ్యూహాలు నేర్పించడానికీ విజయ రహస్యాలు బోధించడానికీ ఉపయోగపడుతోంది.
కథ-1
అక్బరు చక్రవర్తి దర్బారుకు ఓ గుర్రాల వ్యాపారి వచ్చాడు. తన దగ్గర మేలుజాతి అశ్వాలున్నాయంటూ...వాటి గుణగణాల్ని వర్ణించాడు. పాదుషాకు గుర్రాలంటే మక్కువ. భారీ మొత్తంలో బయానా చెల్లించి...వీలైనంత త్వరగా అశ్వాలను అప్పగించమని చెప్పాడు. వ్యాపారి డబ్బు మూట తీసుకుని వెళ్లిపోయాడు. నెలలు గడిచినా అతని జాడలేదు. బీర్బల్‌కు మొదట్లోనే అనుమానం వచ్చింది. చక్రవర్తి నిర్ణయాన్ని ప్రశ్నించడం సభామర్యాద కాదు కాబట్టి, మౌనంగా ఉండిపోయాడు. కనీసం ఇప్పుడైనా, ఆ సంగతి చెప్పాలనుకున్నాడు. అక్బర్ ఉల్లాసంగా ఉన్న సమయం చూసి ...'ప్రభూ! దేశంలోని తెలివితక్కువ వ్యక్తుల జాబితా తయారు చేశాను. మీరూ చూడాలి' అంటూ ఓ పత్రాన్ని చేతిలో పెట్టాడు. తీరా చూస్తే మొదటి పేరు అక్బర్‌దే! ప్రభువులవారికి కోపం వచ్చింది. అయినా, తమాయించుకుని...కారణం అడిగాడు. బీర్బల్ గుర్రాల వ్యాపారి మోసాన్ని వివరించాడు. 'అతను కనుక గుర్రాల్ని తీసుకొస్తే నీ నిర్ణయం మారుతుందా?' అనడిగాడు. 'తప్పకుండా. మీ పేరు కొట్టేసి, వాడిపేరు రాస్తాను ప్రభూ!' చమత్కారంగా చెప్పాడు బీర్బల్. అక్బర్ తన తొందరపాటును గ్రహించాడు. కృతజ్ఞతాపూర్వకంగా బీర్బల్ భుజం తట్టాడు.నీతి: సాక్షాత్తూ బాసే పొరపాట్లు చేస్తుంటే, హెచ్చరించాలా వద్దా అన్న సందేహం ప్రతి ఉద్యోగినీ వేధిస్తూ ఉంటుంది. తప్పకుండా చెప్పాల్సిందే. అది కూడా, నొప్పింపక తానొవ్వక అన్న పద్ధతిలోనే!
కథ-2
ఓ మహాముని ఆశ్రమంలో ముసలి కుక్క ఉండేది. ఎంగిలి మెతుకులు తిని కాలక్షేపం చేసేది. ఓరోజు ఆశ్రమంలోకి పులి వచ్చింది. కుక్క పరుగుపరుగున వెళ్లి మహాముని కాళ్లమీద పడింది. 'స్వామీ! నాకు పులిని ఎదిరించే శక్తినివ్వండి' అని అడిగింది. 'తథాస్తు' అన్నాడు ముని. ఆ బలంతో పులిని తరిమేసింది. కొంతకాలానికి అటుగా సింహం వచ్చింది. ఈసారి కూడా 'స్వామీ! నాకు సింహబలం ప్రసాదించు' అని వేడుకుంది. మరో ఆలోచన లేకుండా వరమిచ్చేశాడు మహాముని. అపారమైన శక్తి వచ్చాక, కుక్కకు దుర్బుద్ధి పుట్టింది. 'ఈ మునిని చంపేస్తే...ఆశ్రమంలోకెల్లా నేనే బలశాలిని అవుతాను కదా' అనుకుంది. ఆయనపై దాడిచేయబోయింది. ప్రమాదాన్ని గ్రహించి, కుక్కలోని శక్తినంతా వెనక్కి తీసేసుకున్నాడు ఆ మునీశ్వరుడు.
నీతి: శక్తిసామర్థ్యాల్నిబట్టి పదవులు ఇవ్వాలి. అనర్హులను అందలమెక్కిస్తే అసలుకే ఎసరు.
కథ-3
ఒక రాజు తన ఆస్థానంలోని ప్రముఖులందర్నీ పిలిపించి ...ఒక్కొక్కరి చేతిలో ఒక్కో విత్తనం పెట్టాడు. 'నా వయసు మీరిపోతోంది. రాజ్యభారం మోయలేను. మీరంతా సమర్థులే. సర్వశక్తి సంపన్నులే. కానీ మీలో ఎవరో ఒకరినే నా వారసుడిగా ఎంచుకోగలను. అందుకే ఈ పరీక్ష. మీకు ఇచ్చిన విత్తును నెలరోజుల వ్యవధిలో మొక్కగా చేసి తీసుకురండి. ఎవరు బాగా సంరక్షిస్తే వారికే నా వారసత్వం...' అని ప్రకటించాడు. నెలరోజులు గడిచాయి. సచివులూ సైన్యాధిపతులూ ఏపుగా పెరిగిన మొక్కలతో ఆస్థానానికి వచ్చారు. ఓ ఉద్యోగి మాత్రం మట్టిముద్దను చేతిలో పట్టుకుని రాజు ముందు నిలబడ్డాడు. 'ప్రభూ...నీళ్లు పోశాను. ఎరువు చల్లాను. ఒకటేమిటి, చిత్తశుద్ధితో నావంతు ప్రయత్నాలన్నీ చేశాను. అయినా విత్తు మొలకెత్తలేదు. క్షమించండి' అని నిజాయతీగా చెప్పాడు.
'నేను అందరికీ తాలుగింజలే ఇచ్చాను. అవి మొలకెత్తే అవకాశమే లేదు. నాకు కోపం వస్తుందేమో అన్న భయంతో మీరంతా ఏదో ఓ మొక్క తీసుకొచ్చారు. ఈ వ్యక్తి మాత్రం ధైర్యంగా అపజయాన్ని అంగీకరించాడు. నాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఇదే. ఇతనే నా వారసుడు' అని ప్రకటించాడు రాజు.
నీతి: ఫెయిల్యూర్ మేనేజ్‌మెంట్ కూడా ఓ కళే. తప్పనిసరి అయినప్పుడు, వైఫల్యాన్ని హుందాగా స్వీకరించాలి.
* * *
అనగనగా...అంటూ మొదలుపెట్టగానే అంతా నిశ్శబ్దం. నోళ్లకు తాళాలు పడతాయి. చెవులు నిక్కబొడుచుకుంటాయి. కథలో లీనమైపోతాం. పాత్రల్లో ఒకరమైపోతాం. అందాల గంధర్వకన్య అలా అలా మేఘాల్లోంచి దిగొస్తుంది. ఒంటికన్ను రాక్షసుడు వూహల్లోనే వికటాట్టహాసం చేస్తాడు. సప్తసముద్రాలకు అవతల ఉన్న ఒంటిస్తంభం మేడకు మనసులోనే ఓ రూపం ఇచ్చుకుంటాం. కథకంటే వేగంగా మన ఆలోచనలు పరిగెడతాయి. రకరకాల ముగింపులు ఆలోచించుకుంటాం. కథ ముగిసినా...ప్రభావం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. ఆ కథనే మరొకరికి...మరింత అందంగా, మరింత ఉత్కంఠ భరితంగా చెప్పడానికి బోలెడన్ని రిహార్సల్సు వేసుకుంటాం. మన మార్కు కొసమెరుపుతో ముక్తాయించే ప్రయత్నం చేస్తాం.మొత్తంగా...కథంటే సృజనాత్మక కసరత్తు. వూహలకు రెక్కలు తొడిగే ప్రక్రియ. భావాలకు బంగరు పూత. కార్టూన్ నెట్‌వర్కులూ కంప్యూటర్ గేములూ 'అనగనగా కథ..'ను అమాంతంగా మింగేశాయి. అమ్మమ్మలూ నానమ్మలూ ఇంటిపెద్ద స్థానం నుంచి వైదొలగిపోయారు. దీంతో చెప్పాలని ఉన్నా, కథ చెప్పే అవకాశం రావడంలేదు పెద్దలకు. వినాలని ఉన్నా, పోరిపోరి చెప్పించుకునేంత చనువు ఉండటంలేదు పిల్లలకు. అమ్మలైతే, మునుపటితరం కంటే బిజీ అయిపోయారు. అటు ఇల్లూ, ఇటు ఆఫీసూ! సాయంత్రానికల్లా సత్తువంతా ఆవిరైపోతోంది. 'కావాలంటే పుస్తకాలు కొనిస్తాలే! సీడీలు తెచ్చిస్తా ప్లీజ్!..' అంటూ కథల్నీ కాకరకాయల్నీ వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాఠశాలలకు ర్యాంకుల పిచ్చిపట్టుకుంది. చదువులన్నీ మూర్ఖంగా మార్కులచుట్టే తిరుగుతున్నాయి. ఒకటారెండా, కథ కంచికెళ్లడానికి రకరకాల కారణాలు.
ఇదంతా బాధకలిగించే పరిణామమే అయినా, కథాప్రియులకు ఒక తీపి కబురూ ఉంది. చిన్నారులకు దూరమైపోతున్న కథ...పెద్దలకు దగ్గరవుతోంది. అరుగులనూ డాబాలనూ పాఠశాల ఆవరణలనూ దాటుకుని కార్పొరేట్ వాతావరణంలోకి అడుగుపెడుతోంది. సిబ్బందిలో స్ఫూర్తి నింపడానికీ సంస్థ పట్ల విధేయత పెంచడానికీ క్లయింట్లను ప్రభావితం చేయడానికీ ఇన్వెస్టర్లను ఆకట్టుకోడానికీ కథామార్గాన్ని ఎంచుకుంటున్న సంస్థలెన్నో.
అయినా, అనగనగా కథలెక్కడ, అంతెత్తు కార్పొరేట్ భవంతులెక్కడ? అచ్చమైన వూహలెక్కడ, అద్భుతమైన వ్యూహాలెక్కడ? ఎలా కుదిరిందీ జోడీ అంటే..అదో కథ. కథ వెనుక కథ. అంకెలకు జీవం ఉండదు. గ్రాఫులకు హృదయం ఉండదు. స్ఫూర్తిదాయక వాక్యాల్లో తడి తక్కువ. అదే కథల్లో...పుష్కలంగా జవజీవాలుంటాయి. పాత్రల్లో జీవకళ తొణికిసలాడుతూ ఉంటుంది. ఎత్తుగడ హత్తుకుంటుంది. మలుపులు మురిపిస్తాయి. ముగింపు కదిలిస్తుంది. ఎంత సంక్లిష్టమైన విషయాన్ని అయినా అరటిపండు ఒలిచినట్టు చెప్పగల శక్తి ఒక్క కథకే ఉంది. ఉపన్యాసాల్ని వింటాం, గణాంకాల్ని పరిశీలిస్తాం, గ్రాఫులను చూస్తాం. అదే కథ అయితే, విజువలైజ్ చేసుకుంటాం. మనసు తెరమీద ఓ నాటకంలా తిలకిస్తాం. మనిషి మెదడు ప్రత్యేకత ఏమిటంటే, ఏ విషయాన్ని అయినా సంఘటనలుగా...అంటే కథల రూపంలోనే నిక్షిప్తం చేసుకుంటుంది. మంచి కథలు కలకాలం గుర్తుండిపోడానికి కారణమిదే. అందుకే, 'అనగనగా...' ఓ అద్భుతమైన భావవ్యక్తీకరణ మార్గమైంది. మంచి బాస్ మంచి కథకుడు కూడా కావలసిన అవసరం ఏర్పడింది. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, ఒడాఫోన్, ఎమ్ అండ్ ఎమ్, ఏషియన్ పెయింట్, ఐబీఎమ్, మైక్రోసాఫ్ట్...వంటి సంస్థలు తమ సిబ్బందికి కథలు చెప్పడంలో శిక్షణ ఇప్పిస్తున్నాయి. తరచూ 'స్టోరీ టెల్లింగ్' సెమినార్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఎన్జీవోలు కూడా కథల దార్లోనే నడుస్తున్నాయి. స్వచ్ఛంద కార్యకర్తలకూ దాతలకూ తమ లక్ష్యాల్నీ తమ ద్వారా మారిన జీవితాల్నీ వివరించడానికి 'అనగనగా...' విధానాన్నే ఆశ్రయిస్తున్నాయి. 'చిన్నచిన్న కథల్లో అంత గొప్ప సందేశం ఉందని నాకిప్పుడే అర్థమైంది. కథ వినడం మంచి అనుభవం' అంటాడు సదస్సులో పాల్గొన్న 'యూత్ ఫర్ సేవ' వాలంటీర్ విశ్వ.ఇదేం బొత్తిగా కొత్తధోరణి కాదు. పూర్వం ఓ రాజుగారి మూర్ఖ సంతానానికి మంచిచెడులు బోధించడానికి విష్ణుశర్మ అనే గురువుగారు కథా మార్గాన్నే ఎంచుకున్నారు. 'పంచతంత్ర కథలు' అలా పుట్టినవే. అయినా, కథలేం ఆకాశంలోంచి వూడిపడలేదు. మనిషి ఆలోచనల్లోంచి పుట్టాయి. అనుభవాల్లోంచి ప్రాణంపోసుకున్నాయి. కథంటే...కాస్త కల్పన జోడించిన నిజం! తరాలు మారినా మనిషి మనిషే! మనిషిలో మంచి ఉన్నంతకాలం మిత్రలాభం కథలుంటాయి. చెడు ఉన్నంతకాలం మిత్రభేదం కథలుంటాయి. నొప్పింపక తానొవ్వక మాట్లాడాల్సిన అవసరం తప్పనంతకాలం తెనాలి రామలింగకవి వంటి 'కమ్యూనికేషన్ స్కిల్స్' నిపుణుల సహకారం తప్పదు. 'క్రైసిస్ మేనేజ్‌మెంట్' ప్రాధాన్యం పెరిగేకొద్దీ బీర్బల్‌లోని బుద్ధికుశలతను అరువు తెచ్చుకోవాల్సిందే. సమర్థ తీర్పరిగా వ్యవహరించాల్సిన కార్పొరేట్ నాయకుడు మర్యాద రామన్నలా క్షీరనీర న్యాయాన్ని ఆకళింపు చేసుకోవాల్సిందే. బౌద్ధసాహిత్యంలోని జాతక కథలను కూడా సమకాలీన పరిస్థితులకు అన్వయించుకోవచ్చు. కోరికలే దుఃఖానికి హేతువని చెబుతాడు బుద్ధుడు. దురాశ అయినా, అసంతృప్తి అయినా అందులోంచి పుట్టినవే. అనేకానేక కార్పొరేట్ సంక్షోభాలకు మూలం అక్కడే ఉంది. కథల్లోని మరో గొప్పకోణం... అనంతమైన ఆశావాదం! 'ఆ నిరుపేద యువకుడు అందాల రాకుమారిని పెళ్లాడి సుఖంగా జీవించాడు', 'రాజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు', 'ఆ సంపన్నుడి అహంకారం తొలగిపోయింది'... ఇలా అన్ని కథలూ సుఖాంతమే అవుతాయి.
కథలో ఇమిడిపోని ఇతివృత్తమంటూ ఉండదు. సంస్థ ఘనచరిత్రను అందమైన కథలా చెప్పవచ్చు. కంపెనీ విజయాల్ని రోమాంచితంగా మలచవచ్చు. వ్యవస్థాపకుడి విలువల బాటను స్ఫూర్తిదాయక ఉదాహరణలతో వివరించవచ్చు. మార్కెట్ అవరోధాలనూ, పోటీసంస్థల వ్యూహాలనూ ఎలా తిప్పికొట్టగలమో వివిధ పాత్రలతో చెప్పించవచ్చు. అందులోనూ మనకు అపారమైన కథా సంపద ఉంది. మహాభారతం...కథల కాణాచి. వేలకొద్దీ కథలూ ఉపకథలూ ఉన్నాయి. వాల్మీకి రామాయణంలోనూ కథలకు కొదవలేదు. ఉపనిషత్తులు మంచి కథలకు నెలవు. ఆ నీతిని ఏ సంస్థకైనా నిరభ్యంతరంగా అన్వయించుకోవచ్చు. సంస్థలొక్కటేనా, ఆధునిక మానవుడి అవసరాలకూ అవి అతికినట్టు సరిపోతాయి. ప్రతి వ్యక్తీ ఏదో ఒక సమయంలో 'అనగనగా...' కథ చెప్పాల్సిన అవసరం వస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగి అయితే ఖాతాదారుడికీ సినిమా రచయిత అయితే నిర్మాతకూ ఎంట్రప్రెన్యూర్ అయితే ఇన్వెస్టర్‌కూ నిరుద్యోగి అయితే ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకూ..తమతమ అర్హతల గురించీ ఉత్పత్తుల గురించీ ఐడియాల గురించీ...అందమైన కథలా ఆవిష్కరించాల్సి ఉంటుంది. టాటా సంస్థల సిబ్బంది నెలకోసారి యాజమాన్యానికి 'డిలైట్ స్టోరీస్' చెప్పాలి. అంటే, తమ సేవలతో కస్టమర్లను బాగా సంతృప్తిపరచిన సంఘటనలను వివరించాలి. కథను బట్టి నజరానా ఉంటుంది. కొన్నిసార్లు వరుస విజయాల సూపర్‌స్టార్లు కూడా వూరూపేరూలేని దర్శకులకు అవకాశం ఇస్తుంటారు. విలేకరుల సమావేశంలో అదే మాట అడిగితే, '...ఫలానా యువ దర్శకుడు కథ చెప్పిన పద్ధతి బావుంది. సినిమా సూపర్‌హిట్ అవుతుందన్న నమ్మకం కుదిరింది. అందుకే, బ్యానర్ గురించీ బడ్జెట్ గురించీ ఆలోచించకుండా ఓకే చెప్పేశాను' అంటారు హీరో. 'పవర్ ఆఫ్ స్టోరీ...' అంటే అదే!'కథా'నాయకులు...
'అనుచరుల్ని లక్ష్యం దిశగా నడిపించడమే నాయకుడి ప్రధాన బాధ్యత. అతని మాటలు మెదడును కాదు, మనసును తాకాలి. హృదయ కవాటాల్ని తెరిచే తాళం చెవి...కథ'
- హార్వర్డ్ బిజినెస్ రివ్యూ
ప్రతి విజేత వెనుకా...ఏ కథనైనా హృదయానికి హత్తుకునేలా చెప్పగల నేర్పరితనం ఉంటుంది. ఆపిల్ సృష్టికర్త స్టీవ్‌జాబ్స్ ఉపన్యాసాల్లో కథలకు కొదవే ఉండేది కాదు. 'నేను మీకో కథ చెబుతాను...నా జీవితంలో జరిగిందే..' అంటూ ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి. 'ఇన్ఫోసిస్' నారాయణమూర్తి పాత రోజుల్నీ తొలి అనుభవాల్నీ అచ్చంగా కథల్లానే చెబుతుంటారు. 'సాదాసీదా ఆఫీసుగది...చిన్నచిన్న ఖర్చులకు కూడా తడుముకునే పరిస్థితి...నేనూ సుధా కొంతమంది మిత్రులూ... ప్రాజెక్టు పూర్తిచేయడానికి రేయింబవళ్ల కృషి..' అంటూ కథలాంటి నిజాన్ని కళ్లకుకడతారు. మహాత్ముడు కూడా గొప్ప కథకుడే. సందర్భానికి తగినట్టు ఉపన్యాసాల్లో నీతి కథలు జోడించేవారు. గాంధీజీ ఆత్మకథ 'మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్' అచ్చంగా ఓ కథలానే నడుస్తుంది. పుస్తకం చదువుతున్నంతసేపూ మనకు మహాత్ముడు కనిపించడు. మోహన్‌దాస్ కరమ్‌చంద్‌గాంధీనే చూస్తాం. గాంధీజీని ప్రభావితం చేసింది కూడా కథలే...హరిశ్చంద్రుడి కథ, శ్రవణకుమారుడి కథ. జవహర్‌లాల్‌నెహ్రూ మొదలుకొని కథలతో ఉపన్యాసాల్ని రక్తికట్టించిన పార్లమెంటేరియన్లు ఎంతోమంది. ప్రపంచవ్యాప్తంగా శిష్యప్రశిష్యులున్న ఆధ్యాత్మిక గురువులు...జగ్గీవాసుదేవ్, అమృతానందమయి, సుఖబోధానంద తదితరుల అనుగ్రహభాషణలకు భారత భాగవతాల్లోని కథలే ఆకర్షణ. 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్ కథల్లో ప్రేక్షకుల్నీ భాగస్వాములను చేస్తారు. ముగింపు వారితోనే చెప్పిస్తారు. ఇదో ప్రత్యేక శైలి. నీతి కథల పుస్తకాలకూ డీవీడీలకూ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. నవనీత, అల్కా, అమర్‌చిత్ర కథ, స్పేస్‌టూన్ ఇండియా... తదితర సంస్థలు చూడచక్కని ప్రచురణలు అందిస్తున్నాయి.
కథల బడులు...
కథను ఎలా ప్రారంభించాలో, ఎలా కొనసాగించాలో, ఎలా ముగించాలో, ఎలాంటి కథాంశాల్ని ఎంచుకోవాలో, ఏ సందర్భంలో ఏ కథ చెప్పాలో బోధించడానికి కథల బడులు పుట్టుకొస్తున్నాయి. ఎరిక్ మిల్లర్ స్థాపించిన 'ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లింగ్ ఇన్‌స్టిట్యూట్' చెన్నై కేంద్రంగా కథల్ని ప్రజల మధ్యకు తీసుకెళ్తోంది. నోయిడాలోని సిమీ శ్రీవాత్సవ 'కథాశాల' పిల్లల కోసం ప్రారంభమైనా పెద్దలతోనూ కళకళలాడుతోంది. వీధి అరుగుమీదో పెరట్లోని చెట్టుకిందో జరగాల్సిన కథల కచేరీ...స్టార్ హోటళ్లకూ విస్తరించింది. ఆధునిక టెక్నాలజీనీ ఆసరాగా తీసుకుంటోంది. కథా నిపుణులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. పవర్‌పాయింట్‌తో కొత్త పవర్ తీసుకొస్తున్నారు. తోలుబొమ్మల్నీ యానిమేషన్ చిత్రాల్నీ సాధనాలుగా వాడుకుంటున్నారు. అవసరమైతే నేపథ్య సంగీతాన్ని జోడిస్తున్నారు. నాట్యాన్ని చేరుస్తున్నారు. నటనా కళనూ ఉపయోగించుకుంటున్నారు. 'కథ అనేది ఏకవ్యక్తి నాటకంగా మారుతోంది' అంటారు మిల్లర్. అనేకానేక కారణాలతో పిల్లలకు దూరమైన కథానుభూతిని మళ్లీ దగ్గర చేయడానికి ప్రత్యేకంగా 'స్టోరీ టెల్లింగ్ సెషన్లు' జరుగుతున్నాయి. కొన్ని పాఠశాలలు కథా మార్గంలోనే పాఠాలు చెబుతున్నాయి. ఏమైతేనేం, ఎలా మారితేనేం కథ బతికే ఉంది. అంతేచాలు. అంతేనా...కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటోంది. సరికొత్త మాధ్యమంగా అవతరిస్తోంది. కొత్తతరాలకు కొంగొత్తగా పరిచయం అవుతోంది.
* * *
అనగనగా...ఓ ముగింపు
ఓ దిగంబర మూర్తి సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. ధగధగా మండిపోతున్నాడు. అతని దగ్గరికి వెళ్లడానికి ఎవరూ సాహసించడం లేదు. అతన్ని ఎవరూ దగ్గరకు రానివ్వడం లేదు. ఏం చేయాలో తెలియక..ఓ చోట విచారంగా కూర్చున్నాడు. 'కథ'... తళుకుబెళుకుల దుస్తుల్లో అటుగా వెళ్తోంది. ఆ వ్యక్తిని చూసింది. 'ఎందుకయ్యా! అంత విచారం' అని పరామర్శించింది. 'ఏం చేయమంటావు తల్లీ... ఇదీ నా పరిస్థితి' అని చెప్పాడా వ్యక్తి. 'ఏం ఫర్వాలేదు...నా రంగుల వస్త్రాలిస్తాను, ధరించు. నిన్ను ప్రేమగా స్వాగతిస్తారు' అని సముదాయించింది. అలంకరణలతో అతని ఆకారమే మారిపోయింది. జనం సాదరంగా ఆహ్వానించారు. ప్రేమగా దగ్గరకి తీసుకున్నారు.
అతను ... సత్యం - ద ట్రూత్! మనిషి నగ్న సత్యాన్ని తట్టుకోలేడు. ఆ తీవ్రతను భరించలేడు. నువ్వు అసమర్థుడివి అంటే కోపమొస్తుంది. నువ్వు దారితప్పుతున్నావంటే ఆవేశం పొంగుకొస్తుంది. నీ పద్ధతేం బావోలేదంటే అలిగి కూర్చుంటాడు. చెప్పీచెప్పనట్టు చెప్పాలి. పరోక్షంగా హెచ్చరించాలి. అంత సున్నితంగా అంత సూటిగా అంత సమర్థంగా సత్యాన్ని బోధించగల మాధ్యమం...కథే. కథ ఒక్కటే!
'బ్రాండ్' కథలు...
ఏ సంస్థ అయినా బ్రాండ్ విలువను పెంచుకోడానికి...బ్యాలెన్స్‌షీట్ ఒక్కటే సరిపోదు. అంకెలు ఓపట్టాన అందరికీ అర్థంకావు. స్టాక్ మార్కెట్‌లో దూసుకుపోయినంత మాత్రాన సంబరపడాల్సిన అవసరం లేదు. క్షణక్షణముల్...దలాల్‌స్ట్రీట్ మెరుపుల్! జనం హృదయాల్లో స్థానం సంపాదించాలంటే 'అనగనగా...' అనాల్సిందే. తమ కంపెనీ విజయగాథను పుస్తక రూపంలో ప్రజల్లోకి తెస్తున్న సంస్థలెన్నో. అదనంగా ఆడియో వెర్షన్లూ వస్తున్నాయి. తొలి అడుగులు, మలి నడకలు, ఎదురుదెబ్బలు, ఎదురులేని విజయాలు...ప్రతి మలుపునూ ఉత్కంఠభరితంగా చెబుతున్నాయి. 'గూగుల్ స్టోరీ'...ఆ సెర్చ్ ఇంజిన్ కథను కళ్లకు కట్టింది. 'స్మాల్ వండర్ - మేకింగ్ ఆఫ్ ద నానో' ... టాటాల చిన్నకారు పెద్ద విజయాన్ని ఆవిష్కరించింది. 'లీడర్‌షిప్ ఎట్ ఇన్ఫోసిస్'...ఐటీ దిగ్గజం మానవవనరుల విధానాన్ని స్ఫూర్తిదాయకంగా వివరించింది. 'ఇన్‌సైడ్ ఆపిల్ - సీక్రెట్స్ బిహైండ్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ స్టీవ్‌జాబ్స్ ఐకనిక్ బ్రాండ్'...ఆపిల్ విజయయాత్రను విడమరచి చెబుతుంది. చాలా సందర్భాల్లో కంపెనీలు నేరుగా పుస్తకాలు వేయించవు. కానీ, రచయితలకూ ప్రచురణకర్తలకూ పరోక్ష సహకారం అందిస్తాయి. బ్రాండ్ విలువ మాత్రం నేరుగా ఆయా కంపెనీల ఖాతాల్లోకే చేరుతుంది.
|
వూ కొడతారా...
నీతి కథ కావచ్చు, పురాణ కథ కావచ్చు, జరిగిన కథ కావచ్చు, స్వీయకథా కావచ్చు. ఏ కథ అయినా, కథకు సంబంధించిన ప్రాథమిక అంశాలన్నీ ఒకేలా ఉంటాయి. వాటిని ఆకళింపు చేసుకుంటే ఎవరైనా కథలు చెప్పగలరు. గెలుపు కథలు రాసుకోగలరు.
సందర్భానికి తగిన కథను ఎంచుకోవడం ఒక కళ. నాయకత్వ లక్షణాల గురించి చెబుతూ నాయకుడిని అవహేళన చేసే కథ చెప్పకూడదు. 'ఈ కథలోని నీతి ఇదీ...' అని ఒకటికి రెండుసార్లు గుర్తుచేయాల్సిన అవసరం ఎప్పుడూ రాకూడదు. |
మంచి కథకుడు అనిపించుకోవాలంటే..మనకంటూ ఓ 'స్టోరీ బ్యాంక్' ఉండాలి. ఎటూ చిన్నకథలే కాబట్టి, వర్ణనలు అక్కర్లేదు. చిన్నచిన్న పదాలే ఉత్తమం. మనదైన వాతావరణమే కథలో కనిపించాలి |
జనం నోళ్లలో నానిపోయిన కథలకు దూరంగా ఉండటం మంచిది. పాత కథలు చెప్పినా, కొత్త 'ట్విస్ట్' జోడించాలి |
కథకు ముగింపే ప్రాణం. సాధ్యమైనంత అనూహ్యంగా ఉండాలి. ఎంతోకొంత మెరుపు ఉండాలి. ముగింపు ఎంత బలంగా ఉంటే.. కథ అంతకాలం నిలబడుతుంది |
మన కథ మనమే చెప్పుకోవడం కత్తిమీద సామే. మసాలా లేకపోతే జనానికి నచ్చదు. మసాలా ఎక్కువైతే మొహం మొత్తుతుంది. నిజాలకు ఒకటిరెండు కల్పనలు జోడించడం వరకూ ఫర్వాలేదు. తొంభై తొమ్మిది కల్పనలకు ఒకటిరెండు నిజాలు జోడించాలని అనుకుంటే మాత్రం నవ్వులపాలు అవుతాం |
కథ...అందమైన అమ్మాయి గౌనులాంటిది. మరీ పెద్దగా ఉంటే, ఆకర్షణ ఉండదు. మరీ చిన్నగా ఉంటే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సమయసందర్భాల్ని బట్టి నిడివిని నిర్ణయించుకోవాలి |
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి