నెట్‌ లేకున్నా... ఫైర్‌ుచాట్‌ (07_02_2016_Sunday)

నెట్‌ లేకున్నా... ఫైర్‌ుచాట్‌ 
వాట్సాప్‌, హైక్‌, వి చాట్‌... ఇలాంటి చాటింగ్‌ ఆప్స్‌ చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ పనిచేయడానికి ఇంటర్నెట్‌ ఉండాలి. కనీసం టెలీఫోన్‌ నెట్‌వర్క్‌ అయినా ఉండాలి. కానీ ఎలాంటి నెట్‌వర్క్‌ అవసరం లేకుండా పనిచేసే ఆప్‌ కూడా ఉంది... అదే ‘ఫైర్‌ చాట్‌’.
తిండి, ఆవాసం, బట్టల తర్వాత అంత ముఖ్యమైంది సమాచారమనే చెప్పాలి. దానికి నిదర్శనమే పెరుగుతున్న మొబైల్‌ ఫోన్ల కొనుగోలుదారులూ, ఇంటర్నెట్‌ వినియోగదారులూ. ఫోన్‌, నెట్‌ ఉన్నాయంటే చాటింగ్‌ ఆప్స్‌ ఉండాల్సిందే! చాటింగ్‌ ఆప్స్‌ పనిచేయాలంటే టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ లేదా ఇంటర్నెట్‌ కావాల్సిందే! ఆ పరిమితుల్ని అధిగమిస్తూ పనిచేయగల ఆప్‌ ‘ఫైర్‌చాట్‌’. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ పరికరాల్లో పనిచేసే ఈ ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి మాత్రమే ఇంటర్నెట్‌ ఉండాలి. ఒకసారి డౌన్‌లోడ్‌ చేసుకున్నాక దీనిద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఎలాంటి నెట్‌వర్కూ అవసరంలేదు.
ఎలా పనిచేస్తుందంటే... 
ఫైర్‌చాట్‌ పనిచేసే విధానాన్ని ‘మెష్‌ నెట్‌వర్క్‌’ అని పిలుస్తారు. బ్లూటూత్‌, వైఫై ఆన్‌చేసి ఈ ఆప్‌ ఉన్న రెండు మొబైల్‌ ఫోన్లను అనుసంధానం చేసుకోవచ్చు. అయితే వాటి మధ్య దూరం 200 అడుగులు మించకూడదు. ఈ ఆప్‌ నుంచి మెసేజుల్ని ప్రత్యేకించి ఒకరికి కానీ లేదా సమీపంలో ఉన్న అందరికీ కానీ పంపుకోవచ్చు. సమాచార పంపిణీ జరగాల్సిన మొబైల్‌ ఫోన్ల మధ్య దూరం ఎక్కువగా ఉన్నపుడు వాటి మధ్యలో ఫైర్‌చాట్‌ ఉన్న ఫోన్లుంటే అవన్నీ ఆ నెట్‌వర్క్‌లో భాగమైపోయి సమాచారం ఎంతదూరమైనా చేరడానికి తోడ్పడతాయి. శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ‘ఓపెన్‌ గార్డెన్‌’ సంస్థ ఈ ఆప్‌ని అభివృద్ధి చేసింది. 2014 మార్చిలో వచ్చిన ఈ ఆప్‌ మరో ప్రత్యేకత గోప్యత. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు సహా ఇతర మెసేజింగ్‌ ఆప్‌ల ద్వారా పంపే వివరాలు వారి వారి సర్వర్లలో నమోదవుతాయి. కానీ ఫైర్‌చాట్‌ ద్వారా పంపేవన్నీ ఆ వ్యక్తుల మధ్యనే ఉంటాయి.
విప్లవాల ఆప్‌ 
సునామీ, భూకంపం, తుపానుల్లాంటి విపత్తుల సమయంలో టెలిఫోన్‌ నెట్‌వర్క్‌లు స్తంభించిపోవచ్చు. కానీ ఫైర్‌చాట్‌ మాత్రం పనిచేస్తుంది. ఫోన్‌ని ఫ్లైట్‌ మోడ్‌లో ఉంచినపుడు కూడా ఫైర్‌చాట్‌ పనిచేస్తుంది. దీన్ని విప్లవాల ఆప్‌గా చెప్పాలి. నాలుగైదేళ్ల కిందట అరబ్‌ దేశాల్లో నియంతల్ని గద్దె దించడంలో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ కీలకపాత్ర పోషించాయి. కానీ ఆ తర్వాత ప్రభుత్వ నిఘా యంత్రాంగాలు వీటిలో జరిగే పరిణామాలపైన దృష్టి పెట్టడంతో స్వేచ్ఛగా సమాచారాన్ని పంచుకునే అవకాశం లేకుండా పోయింది. అలాంటి నిర్బంధ వాతావరణంలో ఫైర్‌చాట్‌ కీలకపాత్ర పోషిస్తోంది. తైవాన్‌, ఇరాన్‌, ఇరాక్‌, హాంకాంగ్‌ దేశాల్లో వివిధ నిరసనల సమయంలో ఫైర్‌చాట్‌ సమాచార పంపిణీ వేదిక అయింది. హాంకాంగ్‌లో 2014 సెప్టెంబరులో ప్రజాస్వామ్యం కోసం పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో ఇంటర్నెట్‌ అందుబాటులో లేకుండా చేసింది ప్రభుత్వం. అప్పుడు నిరసనకారులు ఫైర్‌చాట్‌ను వేదికగా చేసుకొని సమాచారాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో కేవలం 24 గంటల్లో లక్ష మంది, వారం రోజుల్లో 50 లక్షల మంది ఈ ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ‘మేం సమాచార పంపిణీ కోసమే దీన్ని ప్రారంభించాం తప్ప రహస్యాలు పంచుకోవడానికి కాదు. అయినప్పటికీ భావ ప్రకటనా స్వేచ్ఛ మా అంతిమ లక్ష్యం’ అని చెబుతాడు ఫైర్‌చాట్‌ సహ వ్యవస్థాపకుడూ, సంస్థ సీయీవో మిషా బెనోలియల్‌. ఈ ఆప్‌ను 10 లక్షల మందికి పైగా వాడుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి. కశ్మీర్‌, చెన్నై వరదల సమయంలో టెలిఫోన్‌ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేనపుడు కొందరు ఈ ఆప్‌ ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. దిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రాంగణాల్లో విద్యార్థుల నిరసనల సమయంలో ఫైర్‌చాట్‌దీ కీలకపాత్రే.
సాధారణంగా ఒక టెలిఫోన్‌ టవర్‌ నెట్‌వర్క్‌ పరిధిలో వినియోగదారులు పెరిగేకొద్దీ సమాచార పంపిణీ వేగం తగ్గిపోతుంది. కానీ ఫైర్‌చాట్‌ వినియోగదారులు పెరిగే కొద్దీ నెట్‌వర్క్‌ పరిధి, వేగం పెరుగుతాయి. సభలూ సమావేశాల్లో, క్రీడా మైదానాల్లో సమాచారాన్ని పంపుకోవడానికీ, సంగీత కచేరీల్లో డీజేలతో ప్రేక్షకులు తమ అభిప్రాయాల్ని పంచుకోవడానికీ ఈ ఆప్‌ ఉపయోగపడుతుంది. దీన్లోని లైవ్‌ చాట్‌ రూమ్స్‌ ద్వారా.. ఒక విషయంపైన ఒకేసారి ఎందరైనా సమాచారం పంచుకోవచ్చు. ఫైర్‌చాట్‌ ఉంటే అప్పటికప్పుడు అక్కడికక్కడ ఒక కొత్త నెట్‌వర్క్‌ని సృష్టించుకున్నట్టే. ఏదైనా నగరంలో టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ విఫలమయ్యే సమయంలో... మొత్తం మొబైల్‌ వినియోగదారుల్లో అయిదు శాతం మంది ఫైర్‌చాట్‌ వాడుతుంటే, ఆ నగరమంతా ఒక ఫైర్‌చాట్‌ నెట్‌వర్క్‌ని సిద్ధం చేయొచ్చనీ 20 నిమిషాల్లో ఒక చివరి నుంచి మరో చివరకి సమాచారాన్ని చేరవేయొచ్చని వ్యవస్థాపకులు చెబుతారు. భవిష్యత్తులో డేటా ప్లాన్‌ లేకుండానే నగరాల్లో సమాచారాన్ని పంచుకునే విధంగా మార్పు తీసుకొస్తామంటున్నారు వీరు.
ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ అవసరంలేని ఆప్స్‌లో ‘ఫైర్‌ చాట్‌’ మొదటిది మాత్రమేననీ, మున్ముందు మరిన్ని రానున్నాయని చెబుతున్నారు టెక్‌ నిపుణులు!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు