నడుస్తున్న చరిత్ర.. నగిషీలు (Article about Lepakshi Temple, Source: Eenadu, Date: 24-02-16)

నడుస్తున్న చరిత్ర.. నగిషీలు 
హిందూపురం, లేపాక్షి: అద్భుత కళలలకు నిలయమైన లేపాక్షి గత చరిత్రకే కాదు.. నడుస్తున్న చరిత్రకూ సాక్షిగా వెలుగొందుతోంది. విజయనగర రాజుల కాలంలో అచ్యుత రాయల వద్ద కోశాధికారిగా పనిచేసిన విరూపణ్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షిలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడి శాసనాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆలయం క్రీ.శ 1533లో నిర్మించినట్లు శాసనాల్లో ఉంది. విజయనగర రాజుల కాలంలో లేపాక్షి గొప్ప వాణిజ్య కేంద్రంగాను, పర్యాటక ప్రాంతంగాను పేరొందినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడే రతనాలను రాశులుగా పోసి అమ్మినట్లు లిఖించబడింది. మహాభారతం, రామాయణ గాథలను భావితరాలకు అందించేందుకు ఎన్నో శిల్పాలు, తైలవర్ణ చిత్రాలను ఇక్కడ అబ్చురపరిచేలా చెక్కి చూపారు. నాటి చరిత్ర నేటికీ నడుస్తూనే ఉంది. లేపాక్షి కళాఖండాలను నలుదిశలా చాటేందుకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చింది. ఎన్నో సినిమాలు, లఘు చిత్రాలు, నాటికలు, కథలు, వాణిజ్య ప్రకటనలను లేపాక్షిలో చిత్రీకరించారు. వీటిలో లేపాక్షి అందాలను కళ్లకు కట్టినట్లు చూపారు. వాటిలో కొన్నింటిని పరికిస్తే...
లేపాక్షిలో ఒక్క మగాడు.. 
లేపాక్షి చిత్రకళా సౌరభాన్ని దేశానికి చాటిచెప్పేలా 2006-07లో ఒక్క మగాడు సినిమా పాటలు, సన్నివేశాలను ఇక్కడి ఆలయంలో చిత్రీకరించారు. ఈ సినిమాకు వైవీఎస్‌ చౌదరి దర్శకత్వం వహించారు. కథానాయుడిగా నందమూరి బాలకృష్ణ నటించారు. దేవాయంలో, నంది వద్ద దేవాధి దేవా అందరి దేవా వందనం వందనం అనే పాఠ చిత్రీకరణ జరిగింది. అప్పట్లో సినిమా షూటింగ్‌ను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. కథానాయకుణ్ని చూసేందుకు జనం ఆసక్తి చూపారు. ఇటీవల ఉత్సవాల పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అప్పట్లో నందివద్ద, ఆయలంలో తీసిన సన్నివేశాలను గుర్తు చేసుకొన్నారు.
కృష్ణగాడి వీర ప్రేమగాథ 
నాని, మెహరిన్‌ జంటగా ఇటీవల విడుదలైన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా సన్నివేశాల్ని లేపాక్షి ఆలయంలో చిత్రీకరించారు. ఈ సినిమాకు హను రాఘవపుడి దర్శకత్వం వహించారు. 2015లో లేపాక్షిలో కొన్ని రోజుల పాటు ఇక్కడ సినిమా చి‌్రత్రీకరణ జరిగింది. చిత్రీకరణను చూసేందుకు పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు.
సీతాకే రామ్‌ రామాయణ సీరియల్‌ 
ఓ హిందీ ఛానల్‌లో ప్రస్తుతం ప్రసారమవుతున్న రామాయణ చరిత్ర తెలిపే సీతాకేరామ్‌ హిందీ సీరియల్‌ను 2015లో లేపాక్షి ఆలయంలో వారం రోజుల పాటు చిత్రీకరించారు. శైలేష్‌ ఎస్‌ వైద్య దర్శకత్వంలో అశిష్‌ శర్మ రాముడిగా, కరణ్‌ సుచాక్‌ లక్ష్మనుడిగా ఏడీ రక్షీ ముండ్లే సీతగా నటించారు. వీరిపై రామాయణంలోని ప్రముఖ ఘట్టాలు, రామలక్ష్మణుల చిన్ననాటి సన్నివేశాలను తీశారు.
ప్రచరణలోకి పలు పుస్తకాలు... 
లేపాక్షి ప్రాశస్తాన్ని వివరిస్తూ పలు పుస్తకాల్లో అందరికీ తెలిసెలా ఫొటోలు, కథలను వివరించారు. ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. ప్రధానంగా వీరభద్రాలయం, నాట్య మంటపం, శివపార్వతుల కల్యాణం, ఏడు పడగల నాగేంద్రుడు, నంది విశేషాలను అందులో చూపారు. లేపాక్షి ఆలయ చరిత్రను సమగ్రంగా వివరించారు
నంది పేరుతో రాత పుస్తకాలు... 
లేపాక్షి నంది పేరుతో చూడముచ్చటగా రాత పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. ఈ రాత పుస్తకాలకు ప్రభుత్వం కొంత కాలం రాయితీపై విద్యార్థులకు అందించేవారు. నాణ్యతగా ఉంటుండటంతో బాగా ప్రచురణలోకి వచ్చాయి. స్పైరల్‌ రాత పుస్తకాలు సైతం అందుబాటులోకి వచ్చాయి.
ప్రపంచ నలుదిశలకు లేపాక్షి సౌరభాలు... 
హిందూపురం పట్టణానికి చెందిన రాజేంద్రవినోద్‌ అనే యువకుడు ఎంఎస్సీ మల్టీమీడియా చదువుతూ లేపాక్షి ఆలయంపై లఘు చిత్రాని తీశాడు. చరిత్ర పుటల్లో కళల కాణాచిగా నిలిచిన లేపాక్షి శిల్పకళా సౌరభాలను రాజేంద్రవినోద్‌ ప్రపంచ నలుదిశగా ప్రకాశింపజేశాడు. తొలుత ఆంగ్లంలో తీసిన లేపాక్షి లఘుచిత్రాన్ని తెలుగుతో పాటు 14 భాషల్లో తన స్నేహిడుతుడు, మారిశష్‌ దేశస్థుడైన నవీద్‌ సాయంతో అనువందించాడు. ఈ లఘు చిత్రానికి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం లభించింది. జులైలో వాషింగ్టన్‌లో ‘గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు కల్చరల్‌ సంఘం’ వారు నలభై ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈ లఘు చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. అలాగే ఆగస్టులో కోల్‌కతాలో జరిగిన అంతర్జాయ లఘు చిత్రోత్సవానికి ఎంపికై స్పెషల్‌ ఫెస్టివల్‌మెన్షన్‌ అవార్డు దక్కించుకొంది.
కర్ణాటక రాజముద్రలో లేపాక్షి స్థానం... 
లేపాక్షిలో ఏక శిలపై చెక్కిన నంది విగ్రహాన్ని కర్ణాటక ఆర్టీసీ రాజముద్రగా వాడుతోంది. నంది మెడ కింది భాగంలో కనిపించే గండబేరుండ పక్షి. రెండు కాళ్లకు రెండు ఏనుగులు, వాటి ముక్కల్లో వేలాడే ఏనుగులు ఉండేలా చెక్కారు. అంటే గండ బేరుండ పక్షి ఏనుగుకంటే బలమైనదిగా శిల్పులు చూపారు. ఇది పక్క రాష్ట్రం కర్ణాటకలో రాజముద్రగా వాడుతున్నారు. అక్కడి బస్సులపై ఈ గండబేరుండ పక్షి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకే లేపాక్షికి అంత ప్రాధాన్యం ఉంది.
ఏటా నంది అవార్డులు.. 
కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏటా నంది నాటకోత్సవాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులకు గుర్తింపునిస్తోంది. అలాగే సినిమాల్లో ఉత్తమ నటన కనబరచిన నటులకు లేపాక్షి నంది పేరుతో ప్రభుత్వం ఏటా నంది అవార్డులను ప్రకటిస్తోంది.
అద్భుతం.. వారి కళానైపుణ్యం 
ఒక్కో స్తంభానికి నాలుగు రకాల కళాకృతులు... చెక్కిన డిజైన్‌ను మళ్లీ చెక్కకుండా వారు చూపిన నైపుణ్యం అద్భుతం. ఇక్కడి ఆలయంలో దాదాపు 876 స్తంభాలున్నాయి. ఇందులో 246 స్తంభాలపై శిల్పులు తమ కళానైపుణ్యంతో ఎక్కడా ఒకదానికి మరొకటి పోలిక లేకుండా డిజైన్లను చెక్కారు. ప్రధానంగా నాట్యమంటపం పక్కన లతా మంటపంలో ఒక్కో స్తంభంపై నాలుగు చొప్పున 36 స్తంభాలపై 144 రకాల డిజైన్లను చెక్కారు. అలాగే కల్యాణ మంటపంలో, గుడి చుట్టూ ఉన్న మరో 210 స్తంభాలపైనా ఇవి దర్శనమిస్తాయి. ఇక నాట్య మంటపంలోని స్తంభాలపై ఆనాడు రాణులు వాడిన ఆభరణాలను పొల్లు పోకుండా చెక్కి చూపారు. నాటి డాలర్‌, నెక్లెస్‌లు, రకరకాల చెవిపోగులు ధరించిన వైనాన్ని అయిదు వందల ఏళ్ల కిందటే ఆవిష్కరించారు. వాటినే నేడు రకరకాల పేర్లతో వాడుతున్నారు. ప్రస్తుతం ఆడవారు ఎంతో ఇష్టంగా కట్టుకునే పట్టు చీరల అంచుల రకాలన్నీ ఆ స్తంభాలపై ఉన్న డిజైన్లను చూసే వేస్తున్నారు. వీటన్నిటిన్నీ ప్రత్యక్షంగా చూసి తరించాలంటే లేపాక్షిని సందర్శించాల్సిందే..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు