ప్రజల సన్యాసి! (Sunday Special 17/06/2012)
ప్రజల సన్యాసి! ఆ కాషాయాంబరధారి ముక్తి గురించి మాట్లాడరు. కోటానుకోట్ల నిరుపేదలకు భుక్తి దొరకాలని ఆకాంక్షిస్తారు. సేవలోనే కైలాసం ఉందంటారు. శ్రమలోనే దేవుణ్ని చూడమంటారు. శివకుమారస్వామి నాయకత్వంలో కర్ణాటకలోని సిద్ధగంగ మఠం...చదువులకు నిలయమైంది. సామాజిక సంస్కరణలకు కేంద్రమైంది. 'బు ద్ధీ! మన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాల బిల్లు ఇది. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టాలి...' 'బుద్ధీ! మనం నిర్మించాలనుకుంటున్న ఆసుపత్రి ప్లాన్. మీరు ఒక్కసారి చూస్తే...' 'అన్నీ ఉన్నాయి. మనశ్శాంతి కరవైపోయింది. మీరే దారి చూపాలి బుద్ధీ!' 'ఈ పూటకు ఏం వండమంటారు బుద్ధీ? పదిహేనువేలమంది భోంచేస్తారని అంచనా' ...ఎన్నో విన్నపాలు, ప్రార్థనలు, అభ్యర్థనలు. ఎవరికి ఇవ్వాల్సిన ఆదేశాలు వారికిస్తూ, ఎవరికి అవసరమైన ఉపదేశాలు వారికి బోధిస్తూ చకచకా ముందుకెళ్తారు ఆయన. వెనకాలే, శిష్యులూ సిబ్బందీ పరుగులాంటి నడకతో. మాటల్లో...ఢమరుక ధ్వని. చూపుల్లో...త్రిశూల శక్తి. విభూతిరేఖలు...వైరాగ్యానికి చిహ్నాలు. కాషాయం...అందరివాడన్న సంకేతం. అనుభవ చిహ్నంగా వెన్నెముక వంగిపోయింది. సం...