గిన్నిస్... భారత్‌కు వచ్చింది
గిన్నిస్ ప్రపంచ రికార్డుల సంస్థ తాజాగా మన దేశంలో ఓ ప్రత్యేక ప్రతినిధిని నియమించింది. భారతీయుల కోసమే ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ 'ఆల్‌టైమ్ రికార్డు' ప్రేమ వెనుక చాలా కారణాలే ఉన్నాయి.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ భారత దేశంలో డేరా వేసింది. ప్రత్యేకంగా ఇక్కడో ప్రతినిధిని నియమించింది. త్వరలోనే పూర్తిస్థాయి కార్యాలయమూ రాబోతోంది. కాదుకాదు, భారతీయులే పట్టుబట్టి రప్పించుకుంటున్నారు.ఎందుకంటే, గిన్నిస్ రికార్డు దరఖాస్తుల్లో మూడొంతులు మనవే. ఆ సాహసం చేద్దామనుకుంటున్నాం, ఈ సాహసం చేద్దామనుకుంటున్నాం - అంటూ మనవాళ్లు పంపే ప్రతిపాదనలు నాలుగేళ్లలో నాలుగువందల రెట్లు పెరిగాయి. రికార్డుల నమోదు 250 శాతం ఎక్కువైంది. గుట్టలకొద్దీ ఈ-మెయిళ్లు, కట్టలకొద్దీ ఉత్తరాలు...సిబ్బందిని ఉక్కిరిబిక్కిరి చేసేవి. గిన్నిస్ వెబ్‌సైట్ 'క్లిక్'లలో భారత్ మొదటి వరుసలో ఉంది. ఇక, గిన్నిస్ రికార్డుల పుస్తకం అమ్మకాలైతే ఏటికేడాది పెరుగుతున్నాయి. గిన్నిస్ మన దేశంలో కాలుపెట్టడం వెనుక ఇన్ని కారణాలు, ఇన్ని వ్యాపార కోణాలు. సంస్థ హెడ్డాఫీసు లండన్‌లో ఉంది. న్యూయార్క్, టోక్యోలలో అనుబంధ కార్యాలయాలున్నాయి. చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికాలలో అధికార ప్రతినిధులున్నారు.గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్... చాలా యాదృచ్ఛికంగా మొదలైంది. 'అత్యంత వేగంగా వెళ్లే వేటపక్షి ఏది?'...ఏదో పార్టీలో గిన్నిస్ బ్రీవరీస్ సంస్థ అధినేత హ్యూగ్ బీవర్‌కు ఓ సందేహం కలిగింది. ఎవర్నడిగినా చెప్పలేకపోయారు. ఎన్‌సైక్లోపిడియా తిరగేసినా జవాబు దొరకలేదు. ఇలాంటి అరుదైన విషయాల్ని సేకరించి, పుస్తకంగా తీసుకొస్తే నలుగురికీ ఉపయోగపడుతుందన్న ఆలోచన వచ్చింది బీవర్‌గారికి. ఆ ప్రయత్నంలో...నోరిస్, రోజ్‌మెక్ విర్టర్ అనే కవల సోదరుల సహకారం తీసుకున్నారు. ఆ కుర్రాళ్లకు నడిచే విజ్ఞాన సర్వస్వాలని పేరు. కొంతకాలానికి, రోజ్ ఓ అతివాద సంస్థ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. నోరిస్ ఒక్కడే గిన్నిస్ రికార్డుల బాధ్యతంతా చూసుకున్నాడు. 27 ఆగస్టు, 1955న 'గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్' మార్కెట్‌లోకి వచ్చింది. వేయికాపీలు క్షణాల్లో అమ్ముడయ్యాయి. మరుసటి ఏడాది 70వేల కాపీలు వేశారు. అవీ హాట్‌కేకులే! మార్పులకూ చేర్పులకూ లోనవుతూ పరిధులు విస్తరించుకుంటూ...పాత రికార్డుల నమోదుకే పరిమితం కాకుండా, కొత్తరికార్డులను ఆహ్వానించే స్థాయికి ఎదిగింది...గిన్నిస్! ఐదున్నర దశాబ్దాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లిమిటెడ్ చాలా చేతులే మారింది. ప్రస్తుతం కెనడాకు చెందిన జిమ్ పాటిసన్ గ్రూప్‌లో భాగంగా ఉంది.
'సామాన్య' విజయాలు.. ఒకప్పుడు, 'రికార్డు' సృష్టించడం అన్నది చాలా అరుదైన విషయం. చేతినిండా డబ్బుండాలి. గుండెనిండా ధైర్యం ఉండాలి. రెండూ లేకపోయినా తెలివితేటలుండాలి. గిన్నిస్ వచ్చాక కొలమానాలే మారిపోయాయి. ఆ విజయం అత్యద్భుతమైంది కాకపోవచ్చు. ఆ రికార్డు అత్యంత ఆశ్చర్యకరమైందీ కాకపోవచ్చు. అప్పటిదాకా ఎవరూ సాధించలేనిదైతే చాలు. కొండల్ని పిండి చేయాల్సిన అవసరం లేదు. సప్తసముద్రాల్ని ఈదాల్సిందీ లేదు. నీకు చేతనైన పనేదో చెయ్! గంటసేపట్లో గుట్టలకొద్దీ బట్టలు ఉతకొచ్చు. అరగంటలో లెక్కలేనన్ని ప్యాంట్లూ షర్టులూ ఇస్త్రీ చేయొచ్చు. చకచకా గడ్డాలు గీకొచ్చు, సుయ్యిమంటూ దోసెలు వేయొచ్చు. ఎవరికి తెలుసు? మన ఎత్తు, మన బరువు, మన లావు, మన కళ్లు, మన చెవులు, మన ముక్కు...మనకో రికార్డు సాధించి పెట్టవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, గిన్నిస్ అతిసాధారణ వ్యక్తులను విజేతలను చేసింది. అర్భకులతో రికార్డులు బద్దలుకొట్టించింది.
కాన్పూర్ విద్యార్థి మహ్మద్ ఒమర్... గిన్నిస్‌లో ఎందుకు ఎక్కాడో తెలుసా? పద్నాలుగేళ్లుగా అతను ఒక్కరోజు కూడా విద్యాసంస్థకు గైరుహాజరు కాలేదు. ఆ ఒక్క కారణంతో ఓ దిగువ మధ్యతరగతి కుర్రాడు హీరో అయిపోయాడు. మధురై వాసి దామోదరన్ ...48.25 అడుగుల అతిపెద్ద దోసె తయారు చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. అదేమంత ఖరీదైన వ్యవహారం కాదు. వినూత్నమైన ఆలోచనే అతన్ని సెలబ్రిటీని చేసింది. బాజ్‌పాయ్ 13.2 సెంటీమీటర్ల చెవి వెంట్రుకలతో గిన్నిస్ బాబాయ్ అయ్యాడు. 'జీవితంలో నేనేమీ సాధించలేదని మా ఆవిడ పోరుతూ ఉండేది. తన నోటికి తాళంపడింది' అంటూ చెవి మీసాలు మెలేస్తాడు బాజ్‌పాయ్. ఈ మాత్రం ప్రోత్సాహం...ఎక్కడ దొరుకుతుంది, ఎవరిస్తున్నారు? కుటుంబమా, సమాజమా, ప్రభుత్వమా? ...ఎవరూ కాదు. ఆ పని గిన్నిస్ చేస్తోంది!
ఒకరికి పుస్తకాలు సేకరించే అలవాటు ఉంటుంది. ఒకరికి ఆల్చిప్పలు భద్రపరిచే అలవాటు ఉంటుంది. ఎవరికి మాత్రం తెలుసు...అందులోనూ అరుదైన రికార్డులుంటాయని. ఆ సంగతి కూడా గిన్నిసే గుర్తుచేసింది. గిన్నిస్ నమోదు చేసేదాకా హాబీలకు ప్రత్యేకమైన గుర్తింపులేదు. అభిరుచుల కోసం లక్షలు ఖర్చు చేసినవారు ఉన్నారు. జీవితాల్ని అంకితం చేసినవారు ఉన్నారు. ప్రాణాలకు తెగించినవారు ఉన్నారు. వాళ్లందరికీ ఈ రికార్డుల చిట్టా ఓ వరమైంది. గుజరాత్‌కు చెందిన నికుంజ్ వగాడియా...258 బుల్లి పుస్తకాలను(మినియేచర్ బుక్స్) సేకరించడం ద్వారా రికార్డులకెక్కాడు. ఆ తర్వాతే, అతని గురించి నలుగురికీ తెలిసింది. వాటితో ప్రత్యేకంగా ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తామంటూ చాలామంది ముందుకొస్తున్నారు. 'నా కల నిజమైంది...' అంటూ ఆనందబాష్పాలు రాలుస్తాడు నికుంజ్.
ఈ సామాన్యులను చూసి మరికొందరు సామాన్యులు, ఆ మరికొందర్ని చూసి ఇంకొందరు...రికార్డులు సృష్టిస్తున్నారు. రికార్డుకు ముందూ తర్వాతా...వాళ్ల ఆర్థిక పరిస్థితిలో పెద్దగా తేడా లేకపోవచ్చు. కానీ ఆత్మవిశ్వాసం మాత్రం చాలా పెరిగింది. మానవుడు సంఘజీవే కాదు, 'గుర్తింపు'జీవి కూడా!
సమాజం కోసం... రికార్డుల కోసమే చేసి ఉండవచ్చు. కానీ ఆ ప్రయత్నం వల్ల సమాజానికీ ఎంతోకొంత మంచి జరిగింది. ముంబయికి చెందిన స్వాభిమాన్ సంఘటన్ స్వచ్ఛంద సంస్థ ఒకేరోజు 25,300 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి గిన్నిస్‌లో స్థానం సంపాదించుకుంది. కాల్‌సెంటర్లు, ప్రైవేటు సంస్థలు, మాల్స్ సహకారంతో జాబ్‌మేళా జరిపింది. గిన్నిస్ సంగతి పక్కన పెట్టినా, పాతికవేల జీవితాల్లో వెలుగులు నింపడం గొప్ప రికార్డు! బెంగళూరులోని నోవా నార్డిస్క్ ఫౌండేషన్ 3,573 మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించి గిన్నిస్‌ను ఆకర్షించింది. ఇది కూడా సమాజానికి మేలు చేసే కార్యక్రమమే. అహ్మదాబాద్‌లో కొంతమంది యువకులు ఏడాదిపాటు శిబిరాన్ని నిర్వహించి... 21వేల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఆ మహాదానం ఎన్నో ప్రాణాల్ని నిలబెట్టింది. గిన్నిస్‌వారు ఈ ఘనతను కూడా నమోదు చేశారు.
కొల్లాయి, బోసినవ్వులు, వూతకర్ర, గుండ్రటి కళ్లజోడు...చాలు చాలు, ఈమాత్రం ఆనవాళ్లు చాలు. మహాత్ముడే అని గుర్తుపట్టేస్తాం. ఒకరు కాదు ఇద్దరు కాదు...దాదాపు ఐదువందలమంది చిన్నారులు మహాత్ముడి వేషంలో దర్శనమిస్తే - చూడ్డానికి రెండు కళ్లూ చాలలేదు కలకత్తా వాసులకు. ఈ వినూత్న కార్యక్రమం గిన్నిస్‌లో స్థానం సంపాదించుకుంది. అహింసా సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి 'ట్రాక్స్' అనే స్వచ్ఛంద సంస్థ ఎంచుకున్న మార్గమిది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే.. రికార్డుల్లోనే కాదు, ప్రజల గుండెల్లో కూడా స్థానం సంపాదించుకోవచ్చు!
కొన్నిసార్లు, ఎవరికీ ఉపయోగపడని పిచ్చిపనులు కూడా గిన్నిస్ రికార్డుల్లోకి జొరబడుతున్నాయి. ఒకే చోట వేయిమందో, లక్షమందో పళ్లు తోముకుంటే..సమాజానికి ఒరిగేదేమిటి? ఒళ్లంతా టాటూలు వేయించుకోవడం, అత్యధిక వివాహాలు చేసుకోవడం... ఎవర్ని ఉద్ధరించే పనులు? ఎవరో పెద్దమనిషి డెబ్భైరెండు గంటలు నిర్విరామంగా పోకర్ ఆడితే.. మనకు వచ్చిందేమిటి? ఇలాంటి విమర్శల్ని తట్టుకోడానికే కాబోలు...గిన్నిస్ ఆషామాషీ రికార్డులను పుస్తకంలో ఎక్కించడం లేదు. వెబ్‌సైట్‌లో కూడా పెట్టడం లేదు. మహా అయితే, ధ్రువీకరణ పత్రాలు పంపి చేతులు దులుపుకుంటోంది. ఇప్పటిదాకా ముప్ఫై వేల కేటగిరీలలో గిన్నిస్ రికార్డులున్నాయి. లక్షలమంది విజేతలుగా నిలిచారు. అందులోంచి నాలుగువేల రికార్డులు మాత్రమే ఏటా విడుదలయ్యే సరికొత్త ఎడిషన్‌లో ప్రచురితం అవుతున్నాయి.
వివాదాలూ విమర్శలూ... ఫౌజాసింగ్ అనే వందేళ్ల వృద్ధుడు...శాంతి సందేశాన్ని చాటుతూ ఎనిమిది గంటల్లో 42.195 కిలోమీటర్లు పరుగెత్తాడు. గిన్నిస్ మాత్రం దాన్నో రికార్డుగా అంగీకరించలేదు. పెద్దాయన దగ్గర జనన ధ్రువపత్రం లేకపోవడమే ఆ తిరస్కారానికి కారణం. వందేళ్ల క్రితం.. భారత్‌లో బర్త్ సర్టిఫికెట్ల వ్యవస్థంటూ ఉండేదా? ఇప్పటికీ సగానికి సగంమందికి తామెప్పుడు పుట్టారో కూడా తెలియదు. ఆ ఒక్క కారణంతో ఆ శతాధికుడిని అవమానించడం ఎంతవరకూ న్యాయం?
బతికున్నప్పుడే దహన సంస్కారాలు చేసుకుంటే ఓ రికార్డు అవుతుంది..అని ఎవరో సలహా ఇస్తే, కేరళకుట్టి జగత్‌కుమార్ అన్నంతపనీ చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ రికార్డు పిచ్చోణ్ని వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించబట్టి సరిపోయింది.
...ఇలాంటి విషయాల్లో గిన్నిస్ సంపాదకవర్గం తప్పులు సరిదిద్దుకుంటూనే ఉంది. తిండికి సంబంధించిన, మద్యానికి సంబంధించిన రికార్డులను తిరస్కరిస్తోంది. ప్రాణాంతకమైన ప్రయత్నాలను నిరుత్సాహపరుస్తోంది. ఒకేసారి వంద సిగరెట్లు తాగడం వగైరా విన్యాసాలు వద్దేవద్దని తెగేసి చెబుతోంది. ఆమధ్య 'బరువైన చేప'కు రికార్డుల్లో స్థానం కల్పించినప్పుడు, చాలామంది పోటీపడిమరీ చేపల్ని పెంచారు. బలవంతంగా వాటితో ఆహారం తినిపించారు. రికార్డుల కోసం మూగజీవాలను బాధపెట్టడం ఇష్టంలేక... గిన్నిస్ ఆతరహా నమోదులు ఆపేసింది.
ఎందుకీ ఆరాటం... ఢిల్లీలో ఓంప్రకాశ్ అనే పెద్దమనిషి ఉన్నాడు. అసలు పేరుతో పిలిస్తే ఆయన కూడా స్పందించడు. 'గిన్నిస్ రుషి' అంటేనే అంతా గుర్తుపడతారు. ఆయనా 'ఓయ్...' అని పలుకుతాడు. అరవై ఎనిమిదేళ్లు వచ్చినా ఓంప్రకాశ్‌కు 'గిన్నిస్' యావ తగ్గలేదు. ఎప్పుడూ ఏదో ఓ రికార్డు సృష్టించాలన్న తహతహ. ఇప్పటికే చాలా రికార్డులు ఆయన పేరు మీద ఉన్నాయి. అరవై ఒక్క సంవత్సరాల బావమరిదిని దత్తత తీసుకోవడం ద్వారా...అతి ఎక్కువ వయసున్న వ్యక్తిని దత్తత తీసుకున్నందుకు గిన్నిస్ ఎక్కాడు. పెరట్లో అతిపెద్ద షుగర్ క్యూబ్ టవర్‌ను నిర్మించి రికార్డు సృష్టించాడు. ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో దాకా వెళ్లి పిజ్జా డెలివరీ ఇచ్చొచ్చాడు. ఇది కూడా గిన్నిస్ రికార్డే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి, ఒక్క ఓటు కూడా తెచ్చుకోకుండా మరో రికార్డు సృష్టించాలని అనుకున్నాడు కానీ, కుదర్లేదు. వద్దు మొర్రో అని మొత్తుకున్నా 30 ఓట్లు వచ్చి పడ్డాయి. ఈసారి, ఒళ్లంతా జెండాల టాటూలు వేయించుకుని గిన్నిస్ ఎక్కాలని ప్రయత్నం. 'ఎందుకింత తపన మాస్టారూ?' అనడిగితే... జనం నోళ్లలో నానడం నాకిష్టం. ఏమీ చేయకపోతే అంతా నన్ను మరచిపోతారుగా' అంటాడా గిన్నిస్ మహర్షి. మనిషిలోని ఈ బలహీనతే, గిన్నిస్ విజయ రహస్యం కూడా! 'నేనో ప్రత్యేకమైన వ్యక్తిని. నా ఆలోచనలు ప్రత్యేకం. నా నైపుణ్యం ప్రత్యేకం. నా సృజనా ప్రత్యేకం'- అనుకుంటాడు ఏ మనిషైనా. గిన్నిస్ పుస్తకం ఆ ప్రత్యేకతను సాధికారికంగా నిరూపించుకోడానికి ఒక వేదిక అవుతోంది. ఆ 'కిక్కు' కోసమే చాలామంది రికార్డుల వెంట పరుగులు తీస్తున్నారు.
తెలుగు 'రికార్డు' వీరులు... 'గిన్నిస్' రికార్డుల్లో తెలుగువారికీ తగిన స్థానం ఉంది. అత్యధిక చిత్రాల ప్రొడ్యూసర్‌గా రామానాయుడు, అత్యధిక చిత్రాల మహిళా దర్శకురాలిగా విజయనిర్మల, అత్యధిక చిత్రాల్లో నటించినందుకు బ్రహ్మానందం, అత్యధిక సంఖ్యలో నేపథ్య గీతాలు పాడినందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు గిన్నిస్ నిచ్చెన ఎక్కేశారు. వ్యక్తిత్వ వికాస ఉపన్యాసం, జ్ఞాపకశక్తి, టైపింగ్ తదితర విభాగాల్లో స్క్వాడ్రన్ లీడర్ జయసింహ ఏకంగా ఎనిమిది రికార్డులు సాధించారు. 1,086 పదాల సుదీర్ఘ శీర్షిక ఉన్న పుస్తకాన్ని రాసి పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వంగీపురం శ్రీనాథాచారి గిన్నిస్‌లో స్థానం సంపాదించారు. 5,570 కిలోల 'తాపేశ్వరం' లడ్డూ, అన్నమయ్య లక్షగళార్చన, సిలికానాంధ్ర కూచిపూడి నృత్యం... ఆ జాబితా చాలాచాలా పెద్దది. ఎందరో గిన్నిస్ వీరులు, అందరికీ అభినందనలు!
నమోదు ఎలా? మహాపొడగరి, మరుగుజ్జు, లావైన మనిషి, బక్కపల్చ జీవి, అతిపెద్ద నోరు, పొడవైన నాలుక... భారీ వస్తువును తయారుచేయడం, సూక్ష్మ కళలో ఆరితేరడం, సుదూర ప్రయాణం... అతి ఎక్కువ సమయం నటించడం, పాడటం, మాట్లాడటం, నృత్యం చేయడం...అతి తక్కువ సమయంలోనే చాలా విషయాల్ని గుర్తుపెట్టుకోవడం - జన్మతః వచ్చే ప్రత్యేకతలు కావచ్చు, మానవ సృష్టిలోని విశిష్టతలూ కావచ్చు- ఇదీ అని ప్రత్యేకంగా చెప్పలేం! అది కొలవగలిగినదై ఉండాలి, నిరూపించగలిగినదై ఉండాలి, మరొకరు అధిగమించగలిగినదై ఉండాలి. ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరూ సాధించలేనిదైతే చాలు. సాధించి ఉంటే, ఆ రికార్డును బద్దలుకొట్టగలమన్న నమ్మకం ఉంటే చాలు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారినిwww.guinnessworldrecords.comద్వారా సంప్రదించవచ్చు. 'బ్రేక్ ఎ రికార్డ్' విభాగంలోకి వెళ్లి... మనం ఏం చేయాలనుకుంటున్నామో సమగ్రంగా టైప్ చేస్తే సరిపోతుంది. ఎందుకు? ఏమిటి? ఎలా? ఎప్పుడు? తదితర ప్రాథమిక ప్రశ్నలన్నింటికీ అందులో సమాధానం ఉండాలి. ప్రదర్శనకు కనీసం మూడువారాల ముందు గిన్నిస్ వారికి ఆ సంగతి తెలపాలి. ప్రయత్నం అర్హమైందని భావిస్తే...గిన్నిస్ ప్రతినిధులు నియమనిబంధనల్ని పంపుతారు (ప్రతిపాదనను తిరస్కరించినట్టయితే...ఆ కారణాల్నీ వివరిస్తారు). సమాజంలో గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తుల సమక్షంలో...రికార్డు ప్రదర్శన కార్యక్రమం జరగాలి. దానికి సంబంధించిన వీడియోలూ ఫొటోలూ గిన్నిస్ కార్యాలయానికి పంపాలి. వాటన్నిటినీ పరిశీలించాక ఒక నిర్ణయానికి వస్తారు. అంతా సవ్యంగా జరిగితే... 'మీరు గిన్నిస్ రికార్డులకు ఎక్కారోచ్!' అన్న వర్తమానం అందుతుంది. ఆతర్వాత ధ్రువీకరణ పత్రం పంపుతారు. ఇక్కడో సంగతి గుర్తుపెట్టుకోవాలి. రికార్డుల్లో చోటు దొరికినంత మాత్రాన ...ఎలాంటి పారితోషికం అందదు! అందుకైన ఖర్చులూ ఇవ్వరు. ఏడాది చివర్లో విడుదలయ్యే 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' పుస్తకంలో పేరూ బొమ్మా ఉంటాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఎంపిక చేసిన రికార్డులను మాత్రమే ప్రచురిస్తారు.
అయినా, ఎవరో రికార్డు సృష్టిస్తే...గిన్నిస్‌కు ఒరిగేదేమిటి? వీళ్లకు పేరు ప్రఖ్యాతులొస్తే, వాళ్ల కడుపెలా నిండుతుంది? అన్న సందేహం రావచ్చు. గిన్నిస్ వాళ్లేం సమాజ సేవ చేయడం లేదు. అదో బిజినెస్. 'రికార్డు'లతో వ్యాపారం! గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్...ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కాపీలు అమ్ముడుపోతున్న పుస్తకం. ప్రచురణ విభాగం లాభాలు కోట్లలోనే ఉంటాయి. గిన్నిస్ నమోదు ప్రదర్శనల్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేసుకునే హక్కుల్ని విక్రయించడం ద్వారా కూడా బాగానే సంపాదిస్తుందా సంస్థ. సుపరిచితమైన గిన్నిస్ లోగోను వాణిజ్య ప్రకటనల్లో వాడుకునే హక్కుల్నీ వెలకట్టి విక్రయిస్తుంది. తమ దరఖాస్తులకు సత్వర స్పందన కావాలనుకునే వారు, 'ఫాస్ట్ ట్రాక్' సేవల కోసం నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా ఓ ఆదాయవనరే.
'దళారులను నమ్మకండి...' అని హెచ్చరిస్తున్నారు గిన్నిస్ పెద్దలు. 'మీ పేరు ఎక్కించే బాధ్యత మాదీ..' అంటూ కొంతమంది బ్రోకర్లు అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నట్టు కథనాలొచ్చాయి. ఈ సమస్య భారతదేశానికే పరిమితం కాలేదు, ప్రపంచ వ్యాప్తంగా ఉంది. 'గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం ఎలా?' అన్న విషయం మీద ఆశ్రిత్ అనే వ్యక్తి ఓ వెబ్‌సైట్ నిర్వహిస్తున్నాడు. 'నా సలహా ఒకటే. మీరు సంతోషంగా చేయగలిగిన అంశాన్నే ఎంచుకోండి...' అంటాడా 'గిన్నిస్ గురు'. ఇక గిన్నిస్‌లో స్థానం సంపాదించాలనుకునే వారికి ఉపకరించే పుస్తకాలూ బ్లాగులూ చాలానే ఉన్నాయి. ఇవన్నీ వంట సాహిత్యం లాంటివే. థియరీ అన్నది అవగాహన కోసమే. ప్రాక్టికల్సే ప్రాణం.
ధైర్యంచేసి బరిలో దూకాలి.ఏదో ఓ రికార్డు నెలకొల్పాలి. లేదంటే, పాత రికార్డుల్ని బద్దలుకొట్టాలి. |
సాహసము శాయరా డింభకా... గిన్నిస్ రికార్డు నీకు దక్కురా!
యువరాజు పెళ్లివేడుక పెళ్లంటే అదీ! బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్, కేథరిన్ మిడిల్టన్‌ల వివాహ ఘట్టాన్ని దాదాపు 188 దేశాల నుంచి 7.2 కోట్లమంది ప్రజలు యు-ట్యూబ్ ద్వారా సందర్శించారు. ఆన్‌లైన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పెళ్లివేడుక ఇది. |
పెంగ్విన్ ప్రపంచం బిర్గిట్స్ బెరెండ్ దగ్గర ... రకరకాల పెంగ్విన్ బొమ్మలున్నాయి. ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నప్పుడు వాటిని సేకరించడం మొదలు పెట్టింది. ఇప్పటికి ఆ లెక్క పదకొండువేలా అరవైరెండుకు చేరుకుంది. గిన్నిస్ రికార్డే! |
పోగుల రికార్డు పెదాల చుట్టూ 94, కనురెప్పల మీద పాతిక, ముక్కుమీద ఎనిమిది, చెప్పుకోలేని ప్రాంతాల్లో 278... ఒళ్లంతా పోగులతో జర్మనీకి చెందిన రోల్ఫ్ పురుషుల విభాగంలో ప్రపంచ రికార్డు సాధించాడు. మహిళల విభాగంలో ఎలెన్ డేవిడ్‌సన్ (యూకే) ఆ ఘనతను సొంతం చేసుకుంది. |
శ్రీమాన్ రొయ్యగారు 'రొయ్యకులేవా బారెడు' అంటూ కవిచౌడప్ప కయ్యానికి కాలుదువ్వవచ్చు కానీ... రామ్‌సింగ్ చౌహాన్ మీసాలు మాత్రం జానెడూ బారెడూ కాదు ఏకంగా... పద్నాలుగు అడుగుల పొడవు ఉన్నాయి. గిన్నిస్ రికార్డుల్లో తన పేరు చూసుకుని మరోసారి మెలేసాడు చౌహాన్‌జీ! |
నఖసుందరి క్రిస్ వాల్టన్ కనుక ప్రేమతోనో కసికొద్దో గోళ్లతో రక్కిందే అనుకోండి...నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లాల్సిందే. అవసలు గోళ్లే కాదు...కాంతారావు కత్తులు! కుడిచేతి గోళ్ల పొడవు- పది అడుగులా రెండు అంగుళాలు. ఎడమచేతి గోళ్ల పొడవు - తొమ్మిది అడుగులా ఏడు అంగుళాలు. గోరంతలు కొండంతలు అంటే ఇదేనేమో! |
చాక్లెట్ పిరమిడ్ చాక్లెట్ చప్పరించడానికే కాదు, రికార్డులు సృష్టించడానికీ పనికొస్తుంది. ఫ్రాంకోయిస్ మెల్లెట్ అనే కార్పొరేట్ పాకశాస్త్ర నిపుణుడు... 8,273 కిలోల చాక్లెట్‌తో అందమైన పిరమిడ్‌ను తయారుచేసి గిన్నిస్ ప్రతినిధుల ప్రశంసలు పొందాడు. |
బాక్సాఫీసు బద్దలు! 'టాయ్ స్టోరీ-3'...యానిమేషన్ చిత్రం 2010లో అమెరికాలోని 4,028 థియేటర్లలో విడుదలై రూ. రెండు లక్షల కోట్లకు పైగా వసూలు చేసింది. |
నింగి-నేల గిన్నిస్ పుస్తకం (2012) ప్రకారం పురుషుల విభాగంలో... అతిపొడగరి బ్రెండెన్ ఆడమ్స్ (అమెరికా), మహాపొట్టి థాపా మాగర్ (నేపాల్). |
రామోజీ ఫిల్మ్‌సిటీ 'ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్...'గా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీ గిన్నిస్ రికార్డుకెక్కింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా... అందరి ప్రశంసలు అందుకున్న సినిమాలోకం, వినోద కేంద్రం రామోజీ ఫిల్మ్‌సిటీ. |
సెభాష్...గిన్నిస్!గిన్నిస్ పుస్తకంలోని కాగితాల్ని పర్యావరణానికి హానిచేయని ముడిపదార్థంతోనే తయారు చేస్తారు. పచ్చదనాన్ని నాశనం చేయడం సంస్థ నిబంధనలకు విరుద్ధం.* 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' ఏటా 35 లక్షల కాపీలు అమ్ముడుపోతుంది. గిన్నిస్ వెబ్‌సైట్‌ను ఏటా కోటిమందికిపైగా సందర్శిస్తారు.
* ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో నూటికి 98 శాతం మంది గిన్నిస్ లోగోను ఇట్టే గుర్తుపడతారని ఓ సర్వేలో తేలింది.
* యూకేలో కోటి ఇళ్లలో గిన్నిస్ రికార్డు పుస్తకాలున్నాయి. అమెరికాలోని లైబ్రరీలలో అతి ఎక్కువసార్లు చోరీకి గురైన పుస్తకం కూడా ఇదే.
* గిగిన్నిస్ రికార్డులను బద్దలుకొట్టడమే ఇతివృత్తంగా 'కలర్స్' ఛానల్‌లో 'అబ్ ఇండియా తోడేగా' కార్యక్రమం ప్రసారమైంది. ప్రీతీ జింతా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
* గిన్నిస్ రికార్డులను కళ్లకు కట్టినట్టు చూపించే ఉద్దేశంతో 1976లో గిన్నిస్ సంస్థ కాలిఫోర్నియాలో ఓ మ్యూజియం ఏర్పాటు చేసింది. వివిధ కారణాల వల్ల దాన్ని మూసేశారు. ప్రపంచ వ్యాప్తంగా మినీ మ్యూజియాలు మాత్రం నడుస్తున్నాయి. |
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి