'సైట్' కొట్టు గురూ సినిమా కబుర్లు షురూ!! (Eetaram 09/06/2012)
పాలూ నీళ్లని వేరు చేయగలమా? కంటిని, చూపుని విడదీయగలమా? సినిమా, కుర్రకారూ అంతే... షూటింగ్‌కి కొబ్బరికాయ కొట్టిన దగ్గర్నుంచి థియేటర్‌లో బ్యానర్లు కట్టి హిట్ చేసే వరకూ యువ అభిమానులదే కీలక పాత్ర! అలాంటి ఫ్యాన్స్‌ని ఏ స్టార్లు మాత్రం వదులుకుంటారు? దగ్గరవడానికి ఉన్న దారులన్నీ వెతుకుతారు! అదే బాటలో ఇప్పుడంతా ఆన్‌లైన్ మంత్రం జపిస్తున్నారు... ప్రత్యేక వెబ్‌సైట్లు... ఫేస్‌బుక్ పేజీలు... ట్విట్టర్ ట్వీట్స్‌తో... ఒకటే సందడి చేస్తున్నారు! జోరందుకుంటున్న ఈ ట్రెండ్‌పై 'ఈతరం' కథనం.* దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి 'ఈగ' సినిమా ప్రకటించాడు. హడావుడి మొదలైంది. ట్రైలర్లు విడుదలయ్యాయి. జోరు మరింత పెరిగింది. ఇప్పుడా ఆసక్తిని ఏమాత్రం తగ్గించకుండా చూస్తోంది, ఆ సినిమా అధికారిక వెబ్‌సైట్. ఇప్పటికే ఆ సైట్‌ని లక్షలమంది క్లిక్‌మనిపిస్తే వేల మంది వెబ్‌సైట్ పోటీలో పాల్గొంటున్నారు.* 'దమ్ము' సినిమాకి ఎన్టీఆర్ సరికొత్త ప్రచారం ఎంచుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవు ఆ సినిమా ఫేస్‌బుక్ పేజీ మొదలైంది. ప్రశంసలు, అభిమాన వర్షం కురిసింది. కామెంట్లు పోటెత్తాయి. అడపాదడపా విమర్శలు కూడా. హిట్టా, కాదా అన్నది పక్కన పెడితే జనాలకు దగ్గరైంది. ఇప్పుడు టాలీవుడ్ ఆన్‌లైన్ బాట పట్టింది. తారలు అభిమానులతో 'ట్వీట్' చేస్తున్నారు. సినిమాలు 'ఫేస్‌బుక్'లో 'పోస్ట్'లుగా మారుతున్నాయి. ఈమధ్య ప్రతి సినిమాకీ ఓ అధికారిక వెబ్‌సైట్ ప్రారంభమై, అభిమానుల వేలికొసల్లో గిలిగింతలు పెడుతోంది. ఆన్‌లైన్‌తో ప్రేక్షకులకు దగ్గరవుతున్న తారల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. ఓ వైపు సులువైన ప్రచారం, మరోవైపు ఫీడ్‌బ్యాక్ సౌలభ్యం ఇందుకు దోహదం చేస్తున్నాయి. వెబ్‌సైట్లు, సోషల్ నెట్‌వర్క్‌లు తారలు, అభిమానుల్ని కలిపే రాచమార్గంగా మారాయి. మరో వైపు యువతకు ఇదొక ఉపాధి మార్గంగా కూడా మారుతోంది. అందుకే ఈ నయా ట్రెండ్ 'క్లిక్'లతో ఉరకలెత్తుతోంది. తెలుగులో ఈ సంప్రదాయం బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌లతో మొదలైంది. అయితే ప్రతి సినిమాకీ వెబ్‌సైట్ ఉండాలనే నియమం లేదు. భారీ బడ్జెట్ సినిమాకి సొంత వెబ్‌సైట్ నిర్వహణ పెద్ద కష్టం కాదు. చిన్న సినిమాలకి అది తలకు మించిన భారమే. ఈ రోజుల్లో ఇంటర్నెట్ రాన్రానూ యువతకు చేరువ కావడం, కుర్రకారు సినిమా వివరాలకే ఎక్కువగా నెట్‌ను వాడడం ఈ ఊపును పెంచుతున్నాయి. అభిమాన హీరోహీరోయిన్ల వ్యక్తిగత వివరాలు, సినిమా కబుర్లు తెలుసుకోవాలనే ఆతృత, ఆరాటం ఉండటం యువతలో సహజమే. అందుకే ఇలా అభిమానుల నాడి పట్టుకుంటున్నారు తారలు, దర్శకులు, నిర్మాతలు. వాళ్లకి నచ్చినట్టు సినిమా, వ్యక్తిగత వెబ్‌సైట్లు రూపొందిస్తున్నారు. తారాగణం మొదలుకొని షూటింగ్ విశేషాలు, వర్కింగ్ స్టిల్స్, ట్రైలర్లు, వాల్‌పేపర్లు, విడుదల తేదీ... ఎప్పటికప్పుడు సైట్లలోకి అప్‌లోడ్ చేసేస్తున్నారు. రాన్రాను వీటికి ఇంకాస్త మసాలాలు దట్టిస్తున్నారు. రకరకాల పోటీలు పెట్టి గెలిస్తే బహుమతులివ్వడం, హీరోహీరోయిన్లను కలిసే అవకాశం, మొదటి షోకి టికెట్లివ్వడం ఇలాంటివెన్నో. కొన్నిసార్త్లెతే వెబ్‌సైట్‌లోనే టికెట్ల బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఇదో వ్యాపార గిమ్మిక్కు. ఏం చేసినా అంతిమ లక్ష్యం అభిమానికి దగ్గర కావడమే. ఎప్పట్లాగే ఈ ట్రెండ్‌కి మాతృక హాలీవుడ్‌నే. 'స్పైడర్‌మ్యాన్'తో అధికారిక వెబ్‌సైట్ సంప్రదాయం మొదలైంది. వయా బాలీవుడ్ టాలీవుడ్‌కి చేరింది. సినీ జనాలకు సైట్లు రూపొందించడం, వాటిని నిర్వహించడం, అభిమానుల సందేశాలకు సమాధానాలు పంపడం లాంటి వ్యాపకాల్లో యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు కూడా దక్కుతున్నాయి. సినీ సైట్లు రూపొందించే కంపెనీలు హైదరాబాద్‌లో అరడజను వరకు ఉన్నాయి. పెద్ద సినిమాకి అధమంగా రూ.యాభై వేల నుంచి రెండు లక్షలు వసూలు చేస్తారు. తారలపై ఉన్న పిచ్చి అభిమానంతో ఉచితంగా వెబ్‌సైట్ రూపొందించి ఇచ్చే డిజైనర్లూ ఉన్నారు. ఆడియో లాంచ్ అంత భారీగా కాకపోయినా వెబ్‌సైట్ లాంచ్ కార్యక్రమమూ జరపడం పరిపాటైంది. వ్యక్తిగత వెబ్‌సైట్లతో పాటు తారలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఆర్కుట్‌లాంటి సోషల్ నెట్‌వర్క్‌ల్లో అభిమానుల్ని పలకరిస్తున్నారు. ఫ్యాన్‌మెయిల్ నిర్వహణకు మేనేజర్లను నియమించుకుంటున్నారు. ప్రతి సినిమా వెబ్‌సైట్లో ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఆర్కుట్, గూగుల్‌ప్లస్‌ఖాతాల లింక్‌లు ఇస్తారు. ఇందులోనూ పూర్తి సమాచారం ఉంటుంది. అయితే 'సొంత వెబ్‌సైట్ కంటే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌తోనే అభిమానులకు మరింత దగ్గర కావొచ్చు' అన్నది కమెడియన్ వెన్నెల కిషోర్ అభిప్రాయం. 'లక్షలు పెట్టి వెబ్‌సైట్ రూపొందించినా దాని కాల పరిమితి కొన్నాళ్లే. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లకి ఇలాంటి పరిమితులుండవు' అని విశ్లేషిస్తాడు. తన వెన్నెల వన్ అండ్ సినిమా ప్రచారమంతా ఫేస్‌బుక్‌లోనే చేసేశాడు. ఉపాధికి వూతం 'ఈ ట్రెండ్ ద్వారా ఉపాధి పొందాలంటే సాంకేతికంగా అప్‌డేట్ అవడం, సినిమా పరిజ్ఞానం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న ఫ్లాష్, ఫ్లెక్స్ టెక్నాలజీతోపాటు కొత్తగా వచ్చిన హెచ్‌టీఎమ్‌ఎల్-5 లాంగ్వేజీపై పట్టు సాధిస్తే వెబ్‌డిజైనింగ్ సులభమే' అంటున్నాడు సినీ వెబ్‌సైట్ రూపకర్త అగ్నిపుత్రవర్మ. 'బిజినెస్‌మేన్', 'వూ కొడతారా ఉలిక్కిపడతారా' సినిమాల వెబ్‌సైట్లను రూపొందించింది ఇతడే. సినిమా వెబ్‌సైట్ల ట్రెండ్ ఈమధ్యే మొదలైనా వ్యక్తిగత వెబ్‌సైట్లు 2002 నుంచే ఉన్నాయని చెబుతున్నాడు. ========================================================================= |
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి