కలం బలం! కలకలం!! (Eetaram 02/06/2012)


బ్రిటన్‌ సాహిత్య పురస్కారం... అరుదైన అందలం... దాన్నే అందుకున్నాడో కుర్రాడు... ఈ యువ రచయిత ఎవరో కాదు... మన భారతీయుడే! ఇప్పుడతడి పుస్తకం ఓ సంచలనం! మరో మూడు బహుమతులూ కైవసం!
న్‌డాట్జీ సాహిత్య అవార్డు. బ్రిటన్‌కి చెందిన 'రాయల్‌ సొసైటీ ఆఫ్‌ లిటరేచర్‌' ప్రదానం చేస్తుంది. ప్రతి రచయిత కలలు కనే అవార్డది. ఈ ఏడాది తలలు పండిన రచయితలని అధిగమించి దాన్ని దక్కించుకున్నాడో భారతీయుడు. అతడేరాహుల్‌ భట్టాచార్య. అతడి తొలి నవల 'ది స్త్లె కంపెనీ ఆఫ్‌ పీపుల్‌ హూకేర్‌'కే ఈ అరుదైన పురస్కారం లభించింది. దీంతో పాటు మరో మూడు బహుమతులూ, అంతర్జాతీయ గుర్తింపు అతడి సొంతమయ్యాయి. అవడానికి ఇది తొలి నవలే అయినా రచయితగా ఇతడు పాతవాడే. క్రికెట్‌నే శ్వాసించే ఇతగాడు ఎన్నో పత్రికల్లో విశ్లేషణలు రాశాడు. ఆరేళ్ల క్రితం క్రికెట్‌పైనే ఓ పుస్తకం రాశాడు. అప్పట్లో అదీ ఓ సంచలనమే!హౖదరాబాదీనే!
రాహుల్‌ బాల్యం హైదరాబాద్‌లో గడిచింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ఉండేవాళ్లు. భిన్న రాష్ట్రాలు, సంస్కృతుల నేపథ్యం. తండ్రి బెంగాలీ. తల్లి గుజరాతీ. ముంబైలో పుట్టాడు. తండ్రి ఉద్యోగరీత్యా ఇక్కడికొచ్చాడు. 'నా జీవితంలో అత్యంత మధుర క్షణాలు సికింద్రాబాద్‌లో గడిపినవే' అంటాడు రాహుల్‌. ఇంటి ఆవరణలో స్నేహితులతో కలిసి గంటలకొద్దీ క్రికెట్‌ ఆడేవాడు. సీతాకోక చిలుకల వెంట పడేవాడు. క్లాసు పుస్తకాలు వదిలేసి ప్రపంచాన్ని చదివే పుస్తక పఠనం ఇక్కడే అలవాటైంది. తర్వాత మకాం ముంబైకి మారింది. పక్క ఫ్లాట్లలో పంజాబీ, సింధీ, గుజరాతీ, కేరళ కుటుంబాలుండేవి. బాగా డబ్బున్నవాళ్లు, లేనివాళ్లు. అసమానతలు, అంతరాలు. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించేవాడు. ఊహాశక్తితో సమాజాన్ని దగ్గరగా చూడటం మొదలుపెట్టాడు. క్రికెట్‌పై అభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. అదే పిచ్చితో డిగ్రీ మధ్యలోనే మానేసి ఢిల్లీకి పయనమయ్యాడు.
క్రికెట్‌.. క్రికెట్‌
క్రికెటర్‌గా దేశానికి ప్రాతినిధ్యం వహించడం రాహుల్‌ కల. అది నెరవేరలేదు కానీ ఇరవై రెండేళ్లకే కాలమిస్ట్‌ అయ్యాడు. క్రికెట్‌ పత్రికలు, ఆన్‌లైన్‌ జర్నళ్లల్లో వచ్చే అతడి విశ్లేషణలకు చాలా క్రేజ్‌ ఉండేది. ప్రముఖ పత్రిక గార్డియన్‌కి వ్యాసాలు రాసేవాడు. విజ్డెన్‌ ఆసియా క్రికెట్‌కి సంపాదకుడిగా వ్యవహరించాడు. పదకొండేళ్లు అతడి జీవితం ప్రతిక్షణం క్రికెట్‌తోనే గడిచిపోయింది. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వెస్టిండీస్‌కు చేరాడు, అందమైన ప్రకృతిని ఆస్వాదించాలనే ఉద్దేశంతో. ఇంతకు ముందు భారత జట్టుతో కలిసి అక్కడ పర్యటించిన అనుభవం ఉంది.
గయానా పయనం
కొత్త ప్రదేశాలు తిరగడం రాహుల్‌కి కొత్తేం కాదు. ముప్పై మూడేళ్లలో కోల్‌కతా, హైదరాబాద్‌, ముంబై, గుజరాత్‌, ఢిల్లీలో గడిపాడు. విశ్లేషకుడిగా మారాక భారత క్రికెట్‌ జట్టుతో కలిసి ఎన్నో దేశాలు చుట్టొచ్చాడు. అప్పుడే వెస్టిండీస్‌ వాతావరణం, ఆహారం, అలవాట్లు, హుషారెత్తించే సంగీతం, నృత్యం... ఇవన్నీ రాహుల్‌ మనసుని తాకాయి. చెరుకు తోటల్లో పనిచేసే అమాయక కూలీలు, వాళ్లని మోసం చేసే కంపెనీలు మనసుని కదిలించాయి. కూలీలు, జనాభాలో ఎక్కువ మంది ఒకప్పుడు ఇండియా నుంచి వలస వెళ్లినవాళ్లే. వాళ్లకి ఇండియాపై విపరీత అభిమానం. కాని 'మాది భారతదేశం' అని చెప్పుకోలేని అశక్తత. ఈ చరిత్ర మూలాల్లోకి వెళ్లాడు రాహుల్‌. బ్రిటీష్‌ కాలనీల సంస్కృతి అవగతమైంది. మరింత సమాచారం కోసం గయానాలోని అణువణువూ వెతికాడు. చెరకు తోటల్లో కూలీలతో గడిపాడు. కొండలు, కోనలు, గ్రంథాలయాలు, మార్కెట్లు... రాహుల్‌ తిరగని ప్రదేశం లేదు. నిజంగా అదో సాహస యాత్ర. మనసులో ఎన్నో అంతస్సంఘర్షణలు, మర్చిపోలేని అనుభూతులు. వీటికి అక్షర రూపమే 'ది స్త్లె కంపెనీ ఆఫ్‌ పీపుల్‌ హూ కేర్‌' అనే నవల. అనుభవాలకు మరింత కాల్పనికత జోడించి, ఓ ప్రేమ కథ జొప్పించి తళుకులద్దాడు.
సంచలనం...
ఈ నవల ప్రపంచవ్యాప్తంగా పొగడ్తలు, అవార్డులు అందుకుంది. మొదట్లో దీన్ని విమర్శించిన వాళ్లూ లేకపోలేదు. 'గయానాలో పుట్టి పెరిగిన వాళ్లకే ఇది అర్థం అవుతుంది' అన్నారు. భాష చాలా కఠినంగా ఉందన్నారు. అన్నింటినీ తేలిగ్గా తీసుకున్నాడు రాహుల్‌. అనుభూతులు పలికించిన ఆ అక్షరాలకే బహుమతులు వరించాయి. ఆపై విమర్శల స్థానంలో మెచ్చుకోళ్లు. కొందరైతే అతడి శైలిని మెచ్చుకుంటూ ప్రఖ్యాత రచయిత వి.ఎస్‌.నైపాల్‌కి వారసుడంటూ ఆకాశానికి ఎత్తేశారు. న్యూయార్క్‌ టైమ్స్‌ నుంచి డెయిలీ మెయిల్‌, ట్రిబ్యూన్‌, ఇండియా టుడే, ఔట్‌లుక్‌ లాంటి ప్రముఖ పత్రికలన్నీ ఈ పుస్తకంపై రివ్యూలు రాశాయి.
పండిట్స్‌ ఫ్రం పాకిస్థాన్‌
ఈ నవల కంటే ముందే రాహుల్‌ 2004లో 'పండిట్స్‌ ఫ్రమ్‌ పాకిస్థాన్‌' అనే పుస్తకం రాశాడు. భారత క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌ పర్యటన అనుభవాలకు ప్రతిరూపం అది. రెండు దేశాలపై క్రికెట్‌ చూపే ప్రభావం, అభిమానుల సంఘర్షణలు భావోద్వేగాలు, క్రికెటర్ల ఇంటర్వ్యూలు, ఆఫ్‌ఫీల్డ్‌ రాజకీయాలను ఇందులో గుది గుచ్చాడు. దీన్ని విజ్డెన్‌ క్రికెటర్‌ ఆల్‌టైమ్‌ అత్యుత్తమ ఐదు పుస్తకాల్లో ఒకటిగా ఎంపిక చేసింది. దీనికే 'వొడాఫోన్‌ క్రాస్‌వర్డ్‌ బుక్‌ అవార్డ్‌' వరించింది.
అవార్డులు
* ది హిందూ లిటరరీ ప్రైజ్‌ * కామన్వెల్త్‌ బుక్‌ప్రైజ్‌కి షార్ట్‌లిస్ట్‌
* ది మ్యాన్‌ ఆసియన్‌ ప్రైజ్‌కి షార్ట్‌లిస్ట్‌
*'వొడాఫోన్‌ క్రాస్‌వర్డ్‌ బుక్‌ అవార్డ్‌'

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు