హల్లో స్టూడెంటు! విజయానికి ఇదే రూటు!! (Eetaram 16/06/2012)
కాలేజీ రోజులంటే... కమ్మని అనుభూతులు... నాణ్యమైన జీవితానికి నిచ్చెన మెట్లు... సరదాలు.. సంతోషాలు.. మరుపురాని జ్ఞాపకాలు... అంతే కాదండోయ్! ఆకర్షణల వలలూ.. సమస్యల తోరణాలు.. చిక్కుముడుల సవాళ్లూ ఇక్కడే... మరి ఓ మంచి స్టూడెంట్ అనిపించుకోవాలంటే ఏం చేయాలి? జీవితమనే పుస్తకంలో విలువైన పాఠాన్ని ఎలా రాసుకోవాలి? నిపుణులతో సూచనలు ఇప్పిస్తోంది 'ఈతరం'... కాలేజీ ద్వారాలు తెరుచుకుంటున్న తరుణంలో ఈ ప్రత్యేక కథనం! చొరవగా అడుగెయ్! కాలేజీ క్యాంపస్.. కొత్త వాతావరణం, కొత్త ముఖాలు. మనసులో గందరగోళం, మాట పెగలదు. మీ ఒక్కరికేనా? అందరిదీ ఇదే పరిస్థితి. నలుగురిలో ఒక్కరమే. కానీ ఆ నలుగురూ మెచ్చేలా ఉంటేనే విజయం. 'నేనసలే పల్లెటూరి పిల్లగాణ్ని! మాట్లాడ్డమెలాగో చేతకాద'ంటూ ముడుచుకుపోతే కుదరదు. అలాగని 'నేనే మ...మ...మాస్' అని రెచ్చిపోయినా తప్పే. కొత్తగా కాలేజీకి ముస్తాబైనా, విశ్వవిద్యాలయం మెట్లెక్కినా ముందుగా తరచి చూసుకోవలసింది మనలోకి మనమే. కొత్త పరిచయాల మధ్య సరికొత్త వ్యక్తిత్వంతో వికసిస్తే విద్యలోనే కాదు, జీవితంలో కూడా ఎదగిపోడానికి ఆకాశమే హద్దు. అందుకు అలవర్చుకోవలసినవి ఏమిటో, వదిలించుకోవలసినవి ఏంటో మనకి మనమే నేర్చుకోవాలి. 'పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోవడానికి కొత్త విద్యార్థి కొంత సమయం తీసుకున్నా తప్పులేదు' అంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్. కానీ మన భావ వ్యక్తీకరణ తీరు, ప్రవర్తన సరళిలను స్వీయ పరిశీలన చేసుకుని సరిదిద్దుకోవడం చాలా అవసరం అంటారాయన. అప్పుడే జీవితానికి అవసరమయ్యే సాఫ్ట్‌స్కిల్స్‌పై పట్టుసాధించడానికి వీలవుతుందని విశ్లేషిస్తారు. గురుశిష్యుల అనుబంధం బుజ్జగించడానికి అమ్మానాన్నలు అందుబాటులో ఉండరు. 'ఒరేయ్ బడుద్ధాయ్...' అంటూ చెవి మెలిపెట్టి మంచి మాటలు చెప్పే మాస్టార్లూ దొరకరు. కళాశాల స్థాయికొచ్చాక గురుశిష్యుల చొరవకి హద్దులేర్పడతాయి. అనుబంధం గౌరవంగా మారుతుంది. ఆ హుందాతనం కాపాడుకోవాల్సింది విద్యార్థే. అంతేగానీ గురువుని సినిమాల్లో చూపించే కమేడియన్‌గా భావిస్తే నవ్వులపాలయ్యేది మీ జీవితమే. 'పాఠశాల స్థాయిలోని పరాన్న జీవుల్లా కాకుండా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సత్తా పుణికిపుచ్చుకోవడం ఉత్తమ విద్యార్థి లక్షణం' అంటూ చెబుతున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ వీరజారావు. చెడు సావాసాలకు బైబై కాలేజీ అంటే కలల లోకమే కాదు, జీవితాన్ని నిలబెట్టే పునాది కూడా. యూనిఫారం నుంచి లభించిన స్వేచ్ఛకి మొదటిగా ఎదురయ్యేది ఆకర్షణే. అపోజిటిక్ సెక్స్ అనే ఈ మాయాజాలం వల్ల అమ్మాయిని చూస్తే అబ్బాయి మనసులో తుళ్లింత. అబ్బాయితో మాట్లాడితే అమ్మాయిలో తెలియని అనుభూతి. ఈ ఆకర్షణ హద్దుల్లో ఉంటే ఫర్వాలేదు. అదే లోకమైతే ముప్పే. దీన్ని మించిన సవాళ్లు చెడు స్నేహాలు, చెడు అలవాట్లు. వాటికి 'జీ హుజూర్' అన్నామా జీవితం జారిపోయినట్టే. ఇలాంటపుడే మనసుని అదుపులో పెట్టాలి. కలిసి మెలిసి... కలివిడిగా... ఎదగాలంటే ఎగరాల్సిందే. దేశమంతా తిరగాల్సిందే. కరీంనగర్ కుర్రాడికి కాన్పూర్ ఐఐటీలో సీటు రావడం ఇప్పుడు గొప్పేం కాదు. శ్రీకాకుళం అమ్మాయి బిట్స్ పిలానీలో దుమ్ము రేపడం కొత్తేం కాదు. వాళ్లంతా చేరేది హాస్టల్‌లోకే. లేదంటే నలుగురు కలిసి ఓ గదిని పంచుకోవడం తప్పనిసరి. కానీ నాలుగు గోడల మధ్యకి చేరిన ఆ నలుగురివీ వేర్వేరు నేపథ్యాలు. విభిన్న మనస్తత్వాలు. అర్థరాత్రి దాటినా బల్బు వెలుగుతూనే ఉండాలి ఒకరికి. వెలుతురు కంటిమీద పడితే కునుకురాదు మరొకరికి. గది అద్దంలా మెరవాలంటుందో అమ్మాయి. ఇదంతా చాదస్తం అనుకుంటుందో రూమ్మేటు. అవడానికి ఇవి చిన్నవిషయాలే. కానీ నా మాటే నెగ్గాలంటే పెద్ద సమస్యలే. ఇక్కడే సర్దుబాటు మొదలవుతుంది. అలా అని ఇబ్బందులు సహిస్తూ ఉండక్కర్లేదు. మన ఇబ్బందిని సున్నితంగా చెప్పే మార్గాలు వెతకాలి. అప్పుడు సమస్య దూదిపింజలా తేలిపోతుంది. ఇందుకు చూపాల్సింది కాస్తంత చొరవ, మరి కాస్తంత సంయమనం.
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి