యాభై వసంతాల గుండమ్మ కథ (Eenadu Sunday 03/06/2012)


రిమోట్‌తో చకచకా ఛానళ్లు మారుస్తున్నప్పుడు, అనుకోకుండా 'గుండమ్మ కథ' తగులుతుంది. ఏ గంటయ్యో లొడలొడా వాగేస్తుంటాడు. ఏ గుండక్కో గుడ్లురుముతూ దర్శనమిస్తుంది. సరదాగా కాసేపు చూసి తిప్పేద్దామనుకుంటాం. ఇక ఆ విషయమే గుర్తుండదు. సినిమాలో లీనమైపోతాం. 'శుభం' కార్డు పడేదాకా కదిల్తే ఒట్టే! ఇంకో యాభై ఏళ్ల తర్వాతైనా...ఇదే అనుభవం! అదే 'గుండమ్మ కథ' గొప్పదనం!ద్దరు అగ్రనటులు...అందులోనూ తెలుగు తెరకు రెండు కళ్లలాంటివారు...కలిసి నటిస్తున్నారంటే, ఆ సినిమా టైటిలు ఎలా ఉండాలి? అభిమాన సంఘాలు ఏ స్థాయిలో వూహించుకోవాలి? ఆతరహా లెక్కలకూ అంచనాలకూ పరమ విరుద్ధంగా ఉండటమే 'గుండమ్మ కథ' ప్రత్యేకత! జానపదం లాంటి సరదా ఇతివృత్తం... గిలిగింతలు పెట్టే నాటకీయత...గుండెలు పిండే ఘట్టాలకు చోటేలేని కథనం...ప్రతి పాత్రకూ ప్రాధాన్యం...వీటన్నిటినీ 'విజయ' సూత్రంతో కలిపిన సంగీతం...అన్నీ కలగలిసి ప్రేక్షకులను మెప్పించాయి. విమర్శకుల హృదయాలను గెలుచుకున్నాయి. కథలోని గుండమ్మకు ఎన్ని సంవత్సరాలో తెలియదుగానీ... 'గుండమ్మ కథ' సినిమాకు మాత్రం సరిగ్గా యాభయ్యేళ్లు!
1962 జూన్‌ 7న ఆ సినిమా విడుదలైంది.
తరాలు మారినా తరగని వినోదం 'గుండమ్మ కథ' సొంతం. గుండక్క తెరపైకి వచ్చేందుకు జరిగిన కసరత్తు కూడా ఆ సినిమా అంత తమాషాగానే ఉంటుంది. 'దేశంలో మనకు ఇంత గొప్ప పేరుందని నాకు ఇంతవరకూ తెలీదు' అని గుండమ్మతో అంటాడు గంటయ్య. నిజమే, గుండమ్మ గయ్యాళితనాన్నీ గొప్పదనాన్నీ యాభయ్యేళ్లుగా తెలుగు జనం చూస్తూనే ఉన్నారు...చెప్పుకుంటూనే ఉన్నారు. ప్రతిదానికీ గొడవపడే ఆడవాళ్లను 'అమ్మో! గుండమ్మ లాంటిదిరా బాబూ' అని ఇప్పటికీ అంటూ ఉంటారు. తెలుగు ప్రజల మనసుల్లో ఆపేరూ ఆపాత్రా ఎంత చిరస్థాయిగా నిలిచిపోయిందో, దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. నిజానికి గుండమ్మ పదహారణాల తెలుగు మహిళ కానే కాదు. అచ్చమైన కన్నడ వనిత. కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయింది. గయ్యాళి భార్యలకూ సవతి తల్లులకూ 'బ్రాండ్‌ అంబాసిడర్‌'గా బలపడిపోయింది. అసలు, కన్నడదేశం నుంచి గుండమ్మ ఎలా వచ్చింది, ఎందుకొచ్చింది, ఏమిటా కథ అంటారా?... ఆ విషయం తెలియాలంటే 'మనె తుంబిద హెణ్ను' గురించి తెలుసుకోవాలి.
విఠలాచార్య సృష్టి...
సినిమా ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు... విఠలాచార్య. జానపద చిత్రాలను జనరంజితంగా చూపించిన దర్శకుడాయన. ఆ తరహా చిత్రాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నా, చక్కని కుటుంబ కథల్ని కూడా తెరకెక్కించారు. స్వతహాగా కన్నడిగుడైన విఠలాచార్య మాతృభాషలో 'మనె తుంబిద హెణ్ను' చిత్రాన్ని తీశారు. అది విజయవంతమైంది. చిత్ర నిర్మాణంలో ఆయన విజయా సంస్థ అధినేత బి.నాగిరెడ్డి సహాయసహకారాలు తీసుకున్నారు. ఆ కృతజ్ఞతతోనే పరభాష హక్కుల్ని నాగిరెడ్డికి ఇచ్చేశారు విఠలాచార్య. 'మనె తుంబిద..' కథ నాగిరెడ్డికి చాలా నచ్చింది. అందులోని పాత్రే గుండమ్మ. ఆమె భర్త నోరూవాయి లేనివాడు. గుండమ్మకు ఓ సవతి కూతురూ ఓ సొంత కూతురూ ఉంటారు. సవతి కూతుర్ని పిచ్చివాడికిచ్చి పెళ్లి చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సవతి కూతురు మేనమామ కోపంతో రగిలిపోతాడు. గుండమ్మకు బుద్ధి చెప్పేందుకు ఆమె సొంత కూతుర్ని ఓ జైలు పక్షికిచ్చి పెళ్లి చేయిస్తాడు. ఇదంతా నాటకీయంగా సాగుతుంది. గుండమ్మ పాత్ర, కుటుంబ వ్యవహారాలూ చాలా తమాషాగా అనిపించాయి నాగిరెడ్డికి. సరిగ్గా ఆ సమయంలోనే, విజయా ప్రొడక్షన్స్‌పై ఓ కుటుంబ కథాచిత్రం తీయాలన్న ఆలోచన కలిగింది. ఎటూ హక్కులున్నాయి కాబట్టి, 'మనె తుంబిద హెణ్ను' చిత్రాన్ని రీమేక్‌ చేయాలనుకున్నారు. అప్పటి వరకూ విజయా సంస్థ తమ సొంత కథల్నే తెర మీదకు తీసుకొచ్చింది. తొలిసారి మరో భాషలోని సినిమాను తీసేందుకు సిద్ధపడ్డారు. అందులో భాగంగా రచయిత డి.వి.నరసరాజుతో చర్చలు సాగించారు. కథకు కొన్ని మార్పులు చేసి, సంభాషణలు సిద్ధం చేశారు. దర్శకుడిగా బి.ఎన్‌.రెడ్డి పేరు అనుకున్నారు. అంతా అయ్యాక మళ్లీ నాగిరెడ్డే మనసు మార్చుకున్నారు. విఠలాచార్య సినిమాను బి.ఎన్‌.రెడ్డిలాంటి అగ్ర దర్శకులు రీమేక్‌ చేయడం ఏం బాగుంటుందీ, మరొకర్ని ఎంచుకుందామని అనుకున్నారు. పుల్లయ్య అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనా వచ్చింది. నరసరాజు సిద్ధం చేసిన డైలాగ్‌ వెర్షన్‌ను ఆయనకు పంపించారు. కొన్ని సందేహాలు వ్యక్తం చేసి...'ఈ ట్రీట్‌మెంట్‌ నాకంతగా నచ్చలేదు' అనేశారు పుల్లయ్య. దాంతో మరోసారి ఆ సినిమా పక్కకు వెళ్లింది.
ఆయనెందుకు మధ్యలో?
నాగిరెడ్డి సినిమాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, అంతిమంగా చక్రపాణి ఆమోద ముద్ర వేయాల్సిందే. గుండమ్మ ఫైలు ఆయన ముందుకెళ్లింది. పిచ్చివాళ్లతో వికలాంగులతో సన్నివేశాలు నడపడం చక్రపాణికి పెద్దగా ఇష్టం ఉండదు. దాంతో కథ ఆయనకు నచ్చలేదు. నాగిరెడ్డికి మాత్రం, ఎలాగైనా సినిమాను పట్టాలెక్కించాలని పట్టుదలగా ఉండేది. చర్చోపచర్చలు జరిగాక... కన్నడ కథలోని గుండమ్మ కుటుంబాన్ని మాత్రమే తీసుకోవాలని తీర్మానించారు. ఆంగ్ల, బెంగాలీ సాహిత్యాలపై పట్టు ఉన్న చక్రపాణి.. స్క్రిప్టు మొత్తం మార్చేశారు. షేక్‌స్పియర్‌ రచన 'టేమింగ్‌ ఆఫ్‌ ది ష్రూ' నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధం చేశారు. దర్శకుడిగా కమలాకర కామేశ్వరరావును ఎంచుకున్నారు. నరసరాజు, కమలాకరలతో జరిగే చర్చల్లో చకచకా నిర్ణయాలు తీసేసుకునేవారు చక్రపాణి. మొత్తంగా గుండమ్మ కుటుంబాన్ని తీసుకున్నా...ఆమె భర్త పాత్రను మాత్రం తీసేద్దామని చెప్పారాయన. 'అదేంటి... గుండమ్మను ముత్తయిదువుగా చూపించి పట్టుచీరలు, నగలు వేస్తే బాగుంటుందనుకున్నానే' అని దర్శకుడు చెప్పాడట. 'అయినా, మధ్యలో వాడెందుకు...పెళ్లానికి సమాధానం చెప్పలేనివాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ పాత్ర మనకు అనవసరం' అని తేల్చేశారు చక్రపాణి. ఆ వూపులోనే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తీసుకోవాలన్న నిర్ణయమూ జరిగింది. అందుకు తగ్గట్టూ, తెలుగు వాతావరణానికి అతికినట్టూ కథను తీర్చిదిద్దుకున్నారు.
కాల్షీట్లకు కటకట!
కథా చర్చలు మొదలుపెట్టిన చాన్నాళ్లకు సినిమా విడుదలైంది. కారణం ఏమిటంటే... ఈ సినిమాకు ఎంచుకున్న నటులంతా లబ్ధప్రతిష్ఠులే! పైగా అందరూ బిజీబిజీగా ఉన్నవాళ్లే. పక్కాగా స్క్రిప్టు ఉంది. గుండమ్మ ఇంటి సెట్‌ను విజయావారి స్టూడియోలోనే వేసుంచారు. అంతమంది ఆర్టిస్టుల్ని ఒకేసారి కెమెరా ముందు తీసుకొచ్చేందుకు కాల్షీట్లు సర్దుబాటయ్యేవి కావు. దాంతో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లతోనే చిత్రీకరణ చేస్తూ వచ్చారు. చక్రపాణి రోజూ ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లిపోయి...ఆర్టిస్టులకు ఫోన్లు చేస్తూ ఉండేవారట. సావిత్రి నంబరు కలిపి... 'ఈ రోజు నీ ప్రోగ్రామ్‌ ఏమిటి?' అనడిగేవారు. 'షూటింగ్‌కి వెళ్లాలి' అంటే 'ఓకే...' అని పెట్టేసేవారట. సూర్యకాంతం అందుబాటులో ఉంటే ఆమెతోపాటూ రమణారెడ్డినో, ఇంకొకర్నో పిలిపించి షూటింగ్‌ కానిచ్చేవారు. ఉదాహరణకు...'కోలో కోలోయన్న...' పాటనే తీసుకుందాం. ఎన్టీఆర్‌, సావిత్రి, ఏఎన్నార్‌, జమున కలిసి పాడుతున్నట్లు ఉంటుంది. అయితే నలుగురూ కలిసి చేయనేలేదు. ఏ జంట దొరికితే ఆ జంటతోనే చిత్రీకరణ కానిచ్చారు. ఎడిటింగ్‌లో తేడాలేకుండా జాగ్రత్తపడ్డారు.సినిమాలో నీతులూ ధర్మాలూ చెప్పడం చక్రపాణికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. సినిమా అనేది నూటికినూరుపాళ్లు వినోదాన్ని పొందేందుకే అన్నది ఆయన సిద్ధాంతం. అప్పట్లో సాంఘిక చిత్రం అంటే ఎంతోకొంత నీతి చెప్పాలనే నియమం ఉండేది. 'గుండమ్మ కథ' చిత్రీకరణ సమయంలో ఓ పంపిణీదారుడు చక్రపాణిని కలిశారు. 'మీ సినిమాలో నీతి ఏమిటండీ' అని అడిగేసరికి ఆయనకు చిర్రెత్తుకొచ్చిందట. 'ఏమిటి బొచ్చు... నీతి నువ్వు చెప్పేది! మనకే లేదు... నీతి వాళ్లకేం చెబుతాం. అయినా టిక్కెటు కొనుక్కుని సినిమాకొచ్చేది నీతులు చెప్పించుకోడానికా' అని గయ్‌ఁమన్నారట. ఆయన సమాధానాలన్నీ ఇలాగే ఉండేవి...లాగి కొట్టినట్లు! సినిమాలో ఎల్‌.విజయలక్ష్మి ఉంటుంది.. హరనాథ్‌కి జోడీగా. ఆమె మంచి నర్తకి. సినిమాతో సంబంధం లేకపోయినా ఓ నృత్య సన్నివేశాన్ని చిత్రించారు. హరనాథ్‌, జమున, అక్కినేని ప్రేక్షకుల్లో ఉండి ఆ నృత్యం చూస్తున్నట్లు జొప్పించారు. ఓ సినిమా వ్యక్తి వచ్చి 'ఎల్‌.విజయలక్ష్మి డ్యాన్స్‌ ఎందుకండీ?' అని అడిగాడట, అది సినిమా కథకు అడ్డం అవుతుందనే ఉద్దేశంతో. చక్రపాణి ఠక్కున చెప్పారట... 'చూడ్డానికి' అని.
ఇందులో ఏముంది?
'గుండమ్మ కథ' చిత్రీకరణ ఏడాదిపాటు జరిగింది. సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో బోలెడంత ఆసక్తి! విడుదలకు పది రోజుల ముందే... ఎల్వీ ప్రసాద్‌ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో అతిథుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. దాంతో టాక్‌ బయటకు వెళ్లింది. సినీజనాలు మోసేయడం మొదలుపెట్టారు. కథ ఏమీ లేదనీ, సూర్యకాంతంలో గయ్యాళితనాన్ని సరిగ్గా చూపించలేదనీ, అందుకు సంబంధించిన సన్నివేశాలూ లేవనీ విమర్శలు గుప్పించారు. అయితే దర్శకనిర్మాతలకూ రచయితకూ మాత్రం చిత్రం మీద చాలా నమ్మకం. నిజానికి, సినీపండితులు ఎత్తి చూపిన అంశాలన్నీ వాళ్లు ఎప్పుడో చర్చల దశలో మాట్లాడుకున్నవే. సూర్యకాంతాన్ని గుండమ్మగా పెట్టాం...మళ్లీ గయ్యాళితనాన్ని ప్రత్యేకంగా చూపించడం దేనికి? అలాంటి సన్నివేశాల అవసరమే లేదని ముందే నిర్ణయించుకున్నారు. 'హరనాథ్‌, విజయలక్ష్మి పాత్రలు అవసరమా?' అన్నవాళ్లూ ఉన్నారు. ఆ పాత్రలు ఉండొచ్చు... కథకేమీ అడ్డం కాదు అని తేల్చుకున్నారు. జమున పాత్ర సరిగా లేదని మరో విమర్శ. ఆమె గారాబంగా పెరిగిన పొగరుబోతు పిల్ల. ఇల్లరికం కాకుండా... అత్తారింటికి తీసుకురావాలంటే, ముందు ఆమె పొగరు అణచాలి... అందుకే నాగేశ్వరరావుతో అలాంటి పరీక్షలు పెట్టించారు. 'ఎవరెన్ని అనుకున్నా సినిమా హిట్‌' అని చక్రపాణి ప్రివ్యూ వేసిన రోజునే ప్రకటించారు. కారణం ఏమిటో తెలుసా... ఆ సినిమాలో రామారావు నిక్కరు వేసుకుని వచ్చిన సన్నివేశాన్ని చూడగానే పిల్లలంతా పడీపడీ నవ్వారట. అదే చక్రపాణి లెక్క. ఎన్టీఆర్‌తోనూ ఆ మాటే చెప్పారట. సినీజనాల అంచనాల్నీ విమర్శల్నీ తోసిరాజనేలా, విడుదలైన రోజు నుంచే 'హిట్‌ టాక్‌' సొంతం చేసుకుంది... 'గుండమ్మ కథ'.
అయిదు దశాబ్దాల తర్వాత కూడా 'గుండమ్మ కథ' గురించి చెప్పుకుంటున్నారంటే, అందుకు కారణం కథలోని బలమే. సవతి తల్లి మూలంగా బాధలుపడే ఓ యువతిని కాపాడి... ఆ సవతి తల్లికి గుణపాఠం చెప్పడమనేదే స్థూలంగా ఇందులో ఉండే అంశం. అప్పటికీ ఇప్పటికీ మారుటి తల్లి వల్ల బాధలుపడేవాళ్లు ఉన్నారు. సవతి బిడ్డల్ని ఆడిపోసుకునే తీరును హృదయ విదారకంగా కాకుండా, సున్నితమైన హాస్యం జోడించి చూపడం వల్లే ప్రేక్షకులకు అంతగా నచ్చింది. అంతేకాదు... ఆ సవతి తల్లి పొగరునూ, ఆమె ధాటినీ ఇంట్లో కొడుకే అసహ్యించుకోవడం... చివరికి సవతి బిడ్డే ఆమెను కాపాడటం లాంటివి కుటుంబ ప్రేక్షకులకు నచ్చాయి. గుండమ్మ పాత్ర కథలోకి ప్రవేశిస్తూనే... 'ఏమిటి పొద్దునే ధనాధనామని, మమ్మల్నేం నిద్రపోనివ్వవా' అంటూ సవతి కూతుర్ని మొట్టుతుంది. ఆమె 'కోడి కూసింది పిన్నీ?' అని చెబితే 'అదీ నీలాంటిదే... పనీపాటా లేక కూసి వుంటుంది' అంటుంది గుండమ్మ. ఇలాంటి సంభాషణలతోనే గుండమ్మ తీరును స్పష్టం చేశారు. గుండమ్మ శైలిని ఆమె పాత్ర ద్వారా కంటే ఇతర పాత్రల నుంచే ఎక్కువ చూపించారు. హోటల్లో ఉద్యోగం వూడగొట్టుకున్న సర్వర్‌ను, పని ఇప్పిస్తానంటూ తీసుకొస్తాడు గంటయ్య. సర్వర్‌ ఆ ఇంటి వరకూ వచ్చి అది గుండమ్మ ఇల్లని గ్రహించి చెప్పే సంభాషణలు...ఆ సమయంలోనే వచ్చే రామభద్రయ్యతో గంటయ్య పలికే పలుకులు గుండమ్మ పాత్రను సంపూర్ణంగా ఆవిష్కరిస్తాయి. అలాగే గుండమ్మ రోజూ తన భర్త ఫొటోకు నమస్కరిస్తూ, చెప్పుల్ని కళ్లకు అద్దుకునే ఘట్టం తప్పకుండా నవ్విస్తుంది. అంజి అనే పనివాడుగా ఎన్టీఆర్‌ ప్రవేశించినప్పటి నుంచీ కథ పూర్తి వినోదంగా మారిపోతుంది. గుండక్క, బుల్లెమ్మ, చిట్టెమ్మ, బుల్లోడా...అంటూ అంజి చేసే హంగామా ఎవరూ మరచిపోరు. గుండమ్మ ఇంట్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కలుసుకునే సన్నివేశం కూడా నాటి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 'సరోజ ఉందా?' అని అడగాలి. దానికంటే ఓ విజిల్‌ వేసి హావభావాల ద్వారా అడిగితే బాగుంటుందని నరసరాజు భావించారు. ఆ ఆలోచన అందరికీ నచ్చడంతో, సన్నివేశం మొత్తం విజిల్స్‌ ద్వారానే నడిపించారు. గుండమ్మకు గుణపాఠం చెప్పాలంటే అంతకంటే గయ్యాళి మరొకరు అవసరం. అందుకే దుర్గమ్మ పాత్రను కథలోకి తీసుకొచ్చారు. గుండమ్మ కోడలి తరఫు బంధువునంటూ ఇంట్లో తిష్టవేసే దుర్గమ్మగా ఛాయాదేవి నటన కూడా అందరికీ నచ్చింది. సూర్యకాంతం, ఛాయాదేవి పోటాపోటీగా నటించారు. గంటయ్య ప్రోత్సాహంతో గుండమ్మను కొట్టంలోకి పంపిస్తుంది దుర్గమ్మ. పెళ్లి చేసుకుని పెద్దింటి కోడలిగా వెళ్లిపోయిన సవతి కూతురు తిరిగి వచ్చాక...గుండమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం...దుర్గమ్మ ముందుకు వెళ్లేందుకు భయపడటం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఎంత హాయి...
నరసరాజు కలం నుంచి వెలువడిన ప్రతి మాటా తెలుగుదనాన్ని నింపుకుంది. మనలో సహజంగా ఉండే వెటకారం, సందర్భాన్ని బట్టి ఆ చిత్రంలో కనిపిస్తుంటుంది. గంటయ్య పాలు తీసుకెళ్తే, సర్వర్‌ చూసి నీళ్లలా ఉన్నాయని అంటాడు. 'ఈ మధ్య మా గేదె నీళ్లు జాస్తి తాగుతుంది లేవయ్యా' అని జవాబిస్తాడు గంటయ్య. ఇలాంటి సరదా మాటలు సినిమాలో అనేకం వినిపిస్తాయి. కథాబలం, నటుల ప్రతిభ ఒక ఎత్తు. ఘంటసాల స్వరాలు మరో ఎత్తు. చిత్రంలోని అన్ని గీతాలూ శ్రోతల్ని అలరించాయి. అలరిస్తూనే ఉన్నాయి. 'లేచింది నిద్ర లేచింది మహిళా లోకం...' నేటికీ స్త్రీశక్తి గురించి చెప్పే సందర్భాల్లో వినిపిస్తూనే ఉంటుంది. నాటి సామాజిక పరిస్థితులకు తగ్గట్టు రాసినా, అందులోని పంక్తులు ఇప్పటికీ ప్రస్తావించుకునేలా ఉంటాయి. 'కోలు కోలోయన్న...' హుషారుగా సాగుతుంది. 'ప్రేమయాత్రలకు బృందావనము...' గురించి ఓ తమాషా విషయం చెప్పుకోవాలి. ఆ పాటను ఏ వూటీలోనో, మైసూరు బృందావన్‌ గార్డెన్‌లోనో తీస్తారని అంతా అనుకున్నారు. అంత వరకూ వెళ్లడం ఎందుకు, విజయా గార్డెన్‌లోనే అందంగా తీసేద్దామని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. ఛాయాగ్రాహకుడు మార్కస్‌ బార్‌ట్లే ఎంతో సుందరంగా చిత్రించారు. 'మనిషి మారలేదు... ఆతని మమత తీరలేదు', 'అలిగిన వేళనే చూడాలి', 'కనులు మూసినా నీవాయె', 'ఎంత హాయి ఈ రేయి', 'మౌనముగా నీ మనసు పాడిన' పాటలూ వినసొంపుగా ఉంటాయి. పింగళి నాగేంద్రరావు ఈ గీతాల్ని రచించారు. ఇక ఇందులో ఎన్టీఆర్‌, రాజనాల మధ్య వచ్చే ఫైట్‌ కూడా వినోదాత్మకంగా ఉంటుంది. షూటింగ్‌ సమయంలో మద్రాసులో కిక్‌ బాక్సింగ్‌ పోటీలు జరిగాయి. వాటి స్ఫూర్తితో తమాషాగా ఆ ఫైట్‌ని కంపోజ్‌ చేయించారు.
'రీమేక్‌' గుండమ్మ కావలెను
అలనాటి చిత్రాల్ని రీమేక్‌ చేయడం తాజా ధోరణి. ఈ కథను మరోసారి తెరకెక్కిద్దామని చాలా సందర్భాల్లో దర్శకులూ హీరోలూ భావించారు. 'గుండమ్మ కథ' చేయాలని ఉందని బాలకృష్ణ, నాగార్జున కూడా చెప్పారు. కలిసి నటించేందుకు సిద్ధమే అని ప్రకటించారు. కానీ సూర్యకాంతం స్థాయిలో నటించగలిగేవాళ్లు ఇప్పుడు ఉన్నారా...గయ్యాళితనాన్ని ముఖంలోనే పలికించగల నటి ఎవరు...అనే అంశం దగ్గరే సందేహాలు మొదలయ్యాయి. ఈ మధ్య జూనియర్‌ ఎన్టీఆర్‌, నాగచైతన్య కూడా గుండమ్మ కథ మీద మనసు పడ్డారు. వారి ఉత్సాహానికీ స్పీడ్‌ బ్రేకర్‌ ... గుండమ్మ పాత్రే. ఎవరు నటించినా... సూర్యకాంతాన్ని చూసిన కళ్లతోనే చూస్తారు...తేలిపోతే ఇబ్బంది అవుతుందని అందరి భయం! కొన్ని పాత్రలు.. కొందరి కోసమే పుట్టాయేమో అనిపిస్తుంది. మరొకర్ని వూహించలేం, రీప్లేస్‌మెంట్‌ అసాధ్యం... అనడానికి గుండమ్మ పాత్రే నిదర్శనం.
అల్లుణ్ని ఇల్లరికం తెచ్చుకోవాలని తపించిన గుండమ్మ కాస్తా చివరాఖరికి 'అల్లుడరికం' వచ్చేస్తుంది. అలా వచ్చేసి... యాభయ్యేళ్లయింది. అప్పట్నించి తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లోంచి వెళ్లిపోలేదు. మరికొన్ని దశాబ్దాలైనా గుండక్క అలాగే ఉంటుంది. ఎందుకంటే... ఎన్నేళ్లయినా అలాంటి గుండుపోగుల గుండమ్మలు, వాళ్ల తిట్లను భరించే లక్ష్మిలాంటి మారుటి కూతుళ్లు, 'అమ్మా కాఫీ' అంటూ నిద్ర మంచమ్మీంచే అరిచే గారాల కూతుళ్లు, వాళ్లని మార్చే అంజిలాంటి గడుగ్గాయిలు ఎక్కడో ఓచోట కనిపిస్తూనే ఉంటారు కాబట్టి!
 
ఆ పేరే ఎందుకంటే...
'గుండమ్మ కథ'కు ఆధారమైన 'మనె తుంబిద హెణ్ను'లో ఓ పాత్ర పేరు గుండమ్మ. కథను మార్చుకోవడంలో గుండమ్మను ప్రధాన పాత్రగా చేసుకున్నారు. అసలు ఆ పాత్రకు ఏ పేరు పెట్టాలా అని తెగ ఆలోచించారు. గుండమ్మ అనే ఉంచేయమన్నారు చక్రపాణి. అది తెలుగు పేరు కాదేమో అన్న సందేహం వ్యక్తమైంది. 'ఆఁ పెడితే అదే తెలుగు పేరు అవుతుంది. గుండమ్మ అని ఉంచేయండి' అన్నారు చక్రపాణి. అలాగే ఉంచేసి, కథాచర్చలు సాగించారు. ఆ సమయంలోనే నిర్మాత నాగిరెడ్డి ఇంట్లోవాళ్లు అడుగుతుండేవారట... 'గుండమ్మ కథ ఎంత వరకూ వచ్చిందీ' అని. అలా నాగిరెడ్డి ఇంట్లోనూ విజయా వర్గాల్లోనూ అది గుండమ్మ కథ అయిపోయింది. సినిమాకు కూడా ఆ పేరే పెట్టేస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించారు. అదే ఖాయం చేసేశారు. అప్పటికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ స్టార్‌ హీరోలు. అయినా సూర్యకాంతం పోషించిన పాత్ర ఆధారంగా పేరుపెట్టి సంచలనం సృష్టించారు.
ఆయనకు నచ్చలేదు!
యిదు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న 'గుండమ్మ కథ' ఒకరికి మాత్రం అస్సలు నచ్చలేదు. ఆయనెవరో తెలుసా..? ప్రముఖ దర్శకులు కె.వి.రెడ్డి. విజయా సంస్థతో ఎంతో అనుబంధం ఉన్న దర్శకుడాయన. ప్రివ్యూ తరువాత తన అభిప్రాయాన్ని నరసరాజుతో పంచుకుంటూ ''అదేం కథండీ! కృష్ణా, గుంటూరు జిల్లా సంపన్నవర్గాల కథలా ఉంది. చక్రపాణిగారే రాయగలరు అలాంటి కథలు. మీ డైలాగ్స్‌ బాగున్నాయనుకోండీ. కాని డైలాగ్స్‌తోనే పిక్చరుపోతుందా! కథ అక్కరలేదా?'' అని పెదవి విరిచారట. సినిమా హిట్‌ టాక్‌ వచ్చాక కూడా 'విజయా వారి సినిమా. పెద్ద స్టార్‌ కాస్ట్‌. మొదట్లో హౌస్‌ఫుల్‌ అవుతాయి. చూద్దాం...' అనేవారట. సినిమా పెద్ద హిట్‌ అయ్యాక... 'జనం ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదండీ' అని వాపోయారట. ఎప్పుడు 'గుండమ్మ కథ' ప్రస్తావన తెచ్చినా కె.వి.రెడ్డి ఇదే మాట అనేవారట.
సీక్వెల్‌ ఏమైంది?
'గుండమ్మ కథ' విడుదలైన కొన్నేళ్ల తరువాత చక్రపాణి ఓ కథ రాశారు. దానిపేరు 'గుండమ్మ కూతుళ్ల కథ'. 'భారతి' పత్రికలో అచ్చయింది. గంటయ్యను విలన్‌గా చేశారందులో. అతగాడు గుండమ్మ కూతుళ్ల మధ్య తగవులు పెడతాడు. ఆ కథ చదివినవాళ్లు, 'గుండమ్మ కథ'కు రెండో భాగం సిద్ధం చేస్తారేమో అని భావించారు. అయితే ఎందుకో చక్రపాణి ఆ వైపు దృష్టిపెట్టలేదు. 'గుండమ్మ కూతుళ్ల కథ' ఛాయలతోనే 'వయ్యారి భామలు-వగలమారి భర్తలు' చిత్రం వచ్చింది. అందులో ఎన్టీఆర్‌, కృష్ణ కథానాయకులు. అన్నట్లు... తమిళంలో 'గుండమ్మ కథ'ను 'మనిదన్‌ మారవిల్త్లె' పేరుతో రీమేక్‌ చేశారు. ఇక్కడ ఎన్టీఆర్‌ పోషించిన పాత్రను జెమినీ గణేశన్‌ చేశారు. సూర్యకాంతం స్థానంలో సుందరిబాయి, రమణారెడ్డి బదులు తంగవేలు నటించారు. అలాగే గంటయ్య కొడుకుగా ఇక్కడ రాజనాల నటిస్తే అక్కడ ఇ.ఆర్‌.సహదేవ్‌ చేశారు. తమిళ చిత్రానికి చక్రపాణి దర్శకత్వం వహించారు.
ఎవరు ముందు...
గ్ర కథానాయకులు కలిసి నటిస్తుంటే ఎన్నో లెక్కలు చూసుకోవాలి. ఇద్దరి స్థాయికీ తగ్గ విధంగా పాత్రలు తీర్చిదిద్దుకోవాలి. పాటలు, ఫైట్లు కూడా వాటాలు వేయాల్సిందే! మల్టీస్టారర్‌ చిత్రాల్లో ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కలిసి చేసిన 'గుండమ్మ కథ' విషయంలోనూ చిత్రమైన సమస్య వచ్చింది. తెరపైన ఎవరి పేరు ముందు వేయాలి? అప్పటికి ఇద్దరూ తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకులు. మొత్తానికి, తెరపైన పేర్లు వేసే బదులు ఫొటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావు ఫొటోలను తొలుత చూపిస్తారు. ఆ తరువాత సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్‌, ఎల్‌.విజయలక్ష్మి, రాజనాల ఫొటోలు కనబడతాయి. ఘనవిజయం సాధించిన చిత్రాలకు వేడుకలు చేయడం రివాజు. 'గుండమ్మ కథ'కు మాత్రం సిల్వర్‌జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అప్పుడు ఇండియా-చైనా యుద్ధం జరుగుతోంది. కార్యక్రమానికయ్యే ఖర్చును యుద్ధనిధికి విరాళంగా అందజేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు