ప్రజల సన్యాసి! (Sunday Special 17/06/2012)


ప్రజల సన్యాసి!
ఆ కాషాయాంబరధారి ముక్తి గురించి మాట్లాడరు. కోటానుకోట్ల నిరుపేదలకు భుక్తి దొరకాలని ఆకాంక్షిస్తారు. సేవలోనే కైలాసం ఉందంటారు. శ్రమలోనే దేవుణ్ని చూడమంటారు. శివకుమారస్వామి నాయకత్వంలో కర్ణాటకలోని సిద్ధగంగ మఠం...చదువులకు నిలయమైంది. సామాజిక సంస్కరణలకు కేంద్రమైంది.
'బుద్ధీ! మన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాల బిల్లు ఇది. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టాలి...' 
'బుద్ధీ! మనం నిర్మించాలనుకుంటున్న ఆసుపత్రి ప్లాన్‌. మీరు ఒక్కసారి చూస్తే...' 
'అన్నీ ఉన్నాయి. మనశ్శాంతి కరవైపోయింది. మీరే దారి చూపాలి బుద్ధీ!' 
'ఈ పూటకు ఏం వండమంటారు బుద్ధీ? పదిహేనువేలమంది భోంచేస్తారని అంచనా' 
...ఎన్నో విన్నపాలు, ప్రార్థనలు, అభ్యర్థనలు. 
ఎవరికి ఇవ్వాల్సిన ఆదేశాలు వారికిస్తూ, ఎవరికి అవసరమైన ఉపదేశాలు వారికి బోధిస్తూ చకచకా ముందుకెళ్తారు ఆయన. వెనకాలే, శిష్యులూ సిబ్బందీ పరుగులాంటి నడకతో. 
మాటల్లో...ఢమరుక ధ్వని. 
చూపుల్లో...త్రిశూల శక్తి. 
విభూతిరేఖలు...వైరాగ్యానికి చిహ్నాలు. 
కాషాయం...అందరివాడన్న సంకేతం. 
అనుభవ చిహ్నంగా వెన్నెముక వంగిపోయింది. సంకల్పం మాత్రం... నిటారైన వజ్రాయుధం! 
ఇప్పటి మనిషా అతను? నూట అయిదేళ్లవాడు! కాయకష్టంలోనే కైలాసముందని నమ్మిన శ్రమజీవి. సిద్ధగంగ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని...విద్యాలయంగా, విజ్ఞానకేంద్రంగా మలిచిన చదువుల తండ్రి! ఆయన చదవని గ్రంథం లేదు. అర్థంచేసుకోని ధర్మసూక్ష్మం లేదు. అందుకే శిష్యులూ అభిమానులూ శివకుమారస్వామిని ప్రేమగా, వినమ్రంగా...'బుద్ధీ' అని సంబోధిస్తారు. 
సన్యాస దీక్ష చేపట్టేనాటికి, సిద్ధగంగ మఠం ఉత్తరాధికారిగా నియుక్తుడయ్యేనాటికి శివస్వామి వయసు ఇరవై మూడు. వేలుపట్టుకుని నడిపించిన ప్రియగురువు మరుళారాధ్యులు పరమపదించారు. పెద్దగురువు ఉద్దానస్వామి ఉన్నా...అటువైపు నుంచి సహకారం తక్కువనే చెప్పాలి. ఆయన స్వరం చాలా తీవ్రంగా ఉండేది. కోపగించుకునేవారు. విసుక్కునేవారు. చూసేవారికి, పెద్దగురువులు శివన్నను వేధిస్తున్నట్టో సాధిస్తున్నట్టో అనిపించేది. శివన్న మాత్రం, దాన్ని కాఠిన్యమని భావించలేదు. కర్తవ్యదీక్షోపదేశమని నమ్మాడు. వజ్రాన్ని సానబట్టినట్టు, బంగారాన్ని నిప్పుతో కడిగినట్టు...తనను రాటుదేలేట్టు చేయడమే గురువుగారి ప్రవర్తన పరమార్థమని విశ్వసించాడు. 
ఉద్దానస్వామి శివన్నకు విద్యాసంస్థల బాధ్యత అప్పగించారు. విద్యార్థి నిలయం బాగోగులు చూడమని చెప్పారు. వాటితోపాటు...నిత్యాన్నదాన కార్యక్రమం. ఏ యాత్రికుడూ భోజనం చేయకుండా వెళ్లడానికి వీల్లేదు. ఏ విద్యార్థీ ఆకలితో అలమటించకూడదు. ఇది క్షేత్ర ధర్మం. కానీ నిధులకెప్పుడూ కటకటే. ఓసారి అయితే...మఠంలో ఉప్పుకుండ కూడా నిండుకుంది. అన్న సంతర్పణకు వేళవుతోంది. యాత్రికుల సంఖ్య భారీగానే ఉంది. ఎన్నాళ్లుగానో దాచుకున్న చిల్లర పైసలన్నీ తీసుకొచ్చి శివన్న ముందు కుప్పగా పోశారు విద్యార్థులు. మరోదారి లేదు. ఆలస్యం చేయడమూ తగదు. ఆ మూట తీసుకుని సరుకులకు బయల్దేరాడు. ఎన్నాళ్లిలా? ఎన్నేళ్లిలా? ఉద్దానస్వామివారిని ఇదేమాట అడిగాడు. 
'శ్రమించు...సంపాదించు...పోషించు' అని ఆదేశించారాయన.
ముక్తసరిగా మూడుమాటలు. శివుడికి కర్తవ్యం బోధపడింది. నాలుగు గోడలు దాటి బయటికొచ్చాడు. జోలెపట్టుకుని జనం మధ్యకెళ్లాడు. అన్నదాన మహత్యాన్ని వివరించాడు. మానవత్వాన్ని బోధించాడు. ఆ భాషణ ప్రజల హృదయాల్ని తాకింది. ఓరైతు తన పొలంలో పండిన కూరగాయలిచ్చాడు. మరోరైతు కరవు రోజులకని గాదెలో దాచుకున్న వరిధాన్యం తీసిచ్చాడు. పాడిరైతు చిక్కటి పెరుగు ఇచ్చాడు. శివస్వామి ఆ దానాల్ని మూటగట్టుకుని..మఠానికి తిరిగొచ్చాడు. ఇలాంటి అనుభవాలు ఎన్నో. ఆ రోజుల్లో వాహనాల్లేవు, సహాయకుల్లేరు. నలభై మైళ్లయినా యాభై మైళ్లయినా కాలినడకనే. నిరుపేదలూ నిర్భాగ్యులూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులూ కడుపునిండా భోంచేస్తున్న దృశ్యాన్ని చూడగానే ఆయన అలసట గాలికెగిరిపోయేది.
పెద్దగురువులు పరమపదించారు. శివకుమారస్వామి పీఠాధిపతి అయ్యారు. ఆ సమయానికి మఠం ఖజానాలో ఉన్న సొమ్ము మూడువందల రూపాయలు. విద్యాసంస్థల నిర్వహణ దినదినగండమైంది. అదిచాలదన్నట్టు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు. వానల్లేవు. పంటల్లేవు. తిండిగింజల్లేవు. ఆకలి, ఆకలి, ఆకలి. ఎటు చూసినా క్షామమే. ఆ ప్రభావం మఠం మీద పడింది. విద్యార్థులకూ సిబ్బందికీ భోజనాలు పెట్టాలి. అన్నసంతర్పణ నిర్విఘ్నంగా సాగాలి. కరవు రోజులు కావడంతో...అన్నం దొరుకుతుందన్న ఆశతో బీదాబిక్కీ తరలివచ్చేవారు. అంతమంది ఆకలితో అలమటిస్తుంటే, ఎప్పుడు భోజనం పెడతారా అని ఆశగా ఎదురుచూస్తుంటే...అదేమీ పట్టించుకోకుండా తనమానాన తాను మొదటి పంక్తిలో కూర్చుని, కడుపునింపుకోవడం శివస్వామికి నచ్చలేదు. విస్తరికి నమస్కరించి...పంక్తిలోంచి లేచొచ్చారు. ఆ సంక్షోభ సమయంలో...చిట్టచివరి పంక్తిలో, చిట్టచివరి విస్తరి ఆయనదే. ఇరవైనాలుగు గంటలూ...పొయ్యి వెలిగేది. ఏ సమయంలో వెళ్లినా, వేడివేడి భోజనం సిద్ధంగా ఉండేది. అన్నీ తానే అయి అన్నయజ్ఞాన్ని నడిపారు శివస్వామి. వంటమనిషి రాకపోతే, గరిటపట్టుకున్నారు. వంటచెరకు నిండుకుంటే గొడ్డలి పట్టుకున్నారు. ఆ నిరతాన్నదానం గురించి కర్ణాటక ప్రభుత్వానికీ తెలిసింది. ముఖ్యమంత్రే స్వయంగా వచ్చాడు. కళ్లారా చూశాడు. సర్కారు తరఫున నెలకు వంద బస్తాల బియ్యం మంజూరు చేశాడు. శివస్వామి అనుభవిస్తున్న ఒత్తిడి చూడలేక, 'ధర్మప్రబోధమే మఠాల బాధ్యత. ఈ భారమంతా మీకెందుకు?' అని సలహా ఇచ్చినవారూ ఉన్నారు. అలాంటివారికి శివస్వామి సమాధానం ఒకటే.. 'అసలు, మఠాలు స్థాపించేదే సమాజ సేవ కోసం'. సిద్ధగంగ క్షేత్రం ఆదాయవ్యయాల్లో సమతూకం రావడానికి చాలాకాలమే పట్టింది. కాలక్రమంలో భక్తుల రద్దీ పెరిగింది. విరాళాలు పెరిగాయి. శివస్వామి నిరంతర కృషి ఫలితమిది.
పదివేలమంది విద్యార్థులు, ఐదువేలమంది యాత్రికులు. రోజూ పదిహేనువేల మందికి భోజనం అంటే, మాటలు కాదు. పండగలూ ప్రత్యేక సందర్భాల్లో ...మరికొన్ని వేలమంది. నెలకు దాదాపు కోటిరూపాయల వ్యయం. పెద్దగా ఆస్తిపాస్తుల్లేని సిద్ధగంగ మఠానికి ఇది శక్తికి మించిన పనే. శివస్వామి...ఆ మహత్కార్యాన్ని నిర్విఘ్నంగా నడిపిస్తున్నారు. 'ఇదంతా ఎలా సాధ్యమైంది? మీ దగ్గర అక్షయపాత్ర ఏమైనా ఉందా?' - ఎవరో అడిగారు. 'అవును. ఇదిగో ఇక్కడ..' అంటూ గుండె మీద చేతులు వేసుకున్నారు శివస్వామి. సంకల్పం అక్షయమైనప్పుడు... ఇంకో అక్షయపాత్ర ఎందుకు?
చదువూ సంస్కారం... 
అక్షరంతోనే మార్పు సాధ్యం, విద్యతోనే అభివృద్ధి సాధ్యం...అని శివస్వామి ప్రగాఢ విశ్వాసం. సిద్ధగంగ పరిసర గ్రామాల్లో..పేదరికం, నిరక్షరాస్యత రాజ్యమేలేవి. తల్లిదండ్రులు పిల్లల్ని చదివించడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఆ పరిస్థితుల్లో శివస్వామి...పల్లెపల్లెకూ వెళ్లారు. చదువుల ప్రాధాన్యం వివరించారు. ఇంటింటికీ తిరిగి పిల్లల్ని తీసుకొచ్చారు. అనతికాలంలోనే, సిద్ధగంగ సకల విద్యలకూ నిలయంగా మారింది. సంస్కృత పాఠశాలను కళాశాలగా తీర్చిదిద్దారు. సాధారణ విద్యతోపాటు వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం బోధిస్తారిక్కడ. 'సిద్ధగంగ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌' నేతృత్వంలో శివస్వామి విద్యాసంస్థల విస్తరణ కార్యక్రమం చేపట్టారు. పదివేల మంది విద్యార్థులతో సిద్ధగంగ ఆవరణ కళకళలాడుతోందిప్పుడు. కులమతాలకు అతీతంగా చదువు, వసతి, భోజనం ఉచితం. బయటి విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు కూడా ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. అందుకుగాను, ఏడాదికి వందరూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, నర్సింగ్‌...వంటి వివిధ విభాగాలతో మొత్తం 132 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. అంధుల పాఠశాలనూ నెలకొల్పారు. 'విద్యార్థులకు నీడనివ్వడంతో, ఆకలి తీర్చడంతో నా బాధ్యత తీరిపోలేదు. వాళ్లను చక్కని పౌరులుగా తీర్చిదిద్దాలి. దేశానికి పనికొచ్చేలా తయారుచేయాలి' అని చెబుతారు శివస్వామి. ఏ కాస్త సమయం దొరికినా ఆయన విద్యార్థుల మధ్యకు వచ్చేస్తారు. స్ఫూర్తిదాయక విషయాలు బోధిస్తారు. ఆ పాఠాలు, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యావిధానం...ఎంతోమంది జీవితాల్ని మార్చాయి. మృత్యుంజయస్వామి అనే విద్యార్థి కాషాయం ధరించి, తనకు జ్ఞానాన్నిచ్చిన విద్యాలయం కోసం జీవితాన్నే అంకితం చేశాడు. ఇక్కడ చదువుకుని...ఎంతో ఎత్తుకు ఎదిగినవారు వేలమంది! శివస్వామి నాయకత్వంలో పనిచేయడం గొప్ప అదృష్టమని భావించేవారికి కొదవేలేదు. పెద్దపెద్ద కొలువుల్నీ లక్షల జీతాల్నీ వదులుకుని వచ్చినవారూ ఉన్నారు. 'గురు రుణం తీర్చుకోడానికి ఇదోమంచి అవకాశం' అంటారా పూర్వ విద్యార్థులు. మఠం ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్యశాలను నిర్మిస్తున్నారు. అది కనుక పూర్తయితే, నిరుపేదలూ నిర్భాగ్యులూ నిర్భయంగా అనారోగ్యాన్ని జయించవచ్చు.
కళలే ఆయుధంగా.. 
ఆ కాషాయాంబరధారి నిలువెత్తు హేతువాది. 'కులాల పేరుతో కుమ్ములాటలూ మతాల పేరుతో మారణహోమాలూ... ఇంకా ఎంతకాలం? ఆ వూబిలోంచి బయటికి రానంతకాలం దేశం అభివృద్ధి చెందదు' అన్నది శివస్వామి నిశ్చితాభిప్రాయం. 'పూజకంటే శ్రమే విలువైంది. తీర్థం కంటే, చెమటే పవిత్రమైంది' అని బోధిస్తారాయన. మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లో అన్ని మతాలవారూ ఉన్నారు. అన్ని కులాలవారూ ఉన్నారు. చదువుకోవాలన్న కోరికే సిద్ధగంగ ఆవరణలో ప్రవేశానికి ఏకైక అర్హత. భారతీయ సంప్రదాయంలో...పండగలకూ పబ్బాలకూ కొదవే లేదు. సామాజిక సంస్కరణలకు వాటినో వేదికగా మార్చుకున్నారు. నాటకాలు బలమైన మాధ్యమాలు అయ్యాయి. 'బసవజయంతి' సందర్భంగా సమసమాజ భావనను జనంలో ప్రచారం చేస్తారు. బసవేశ్వరుడు సామాజిక విప్లవవేత్త! కుల వ్యవస్థను వ్యతిరేకించారు. డంబాచారాల్ని గర్హించారు. కర్మకాండల్ని నిరసించారు. శ్రమను గౌరవించారు. ఆ సూత్రాల్నే శివస్వామి వివిధ కళారూపాల ద్వారా వివరిస్తున్నారు. వీటన్నిటి కోసం సిద్ధగంగ మఠం ఆధ్వర్యంలో ఓ సాంస్కృతిక సంస్థను స్థాపించారు. గానం, నృత్యం, నాటకం...తదితర ప్రక్రియల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతుంటాయి. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడానికి ఏటా పదిరోజులపాటు వ్యవసాయ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇలాంటి సందర్భాల్లో సిద్ధగంగ... జనగంగ అవుతుంది. వేలాది మంది తరలివస్తారు. ఆ సందోహాన్ని చూడగానే...శతాధికులైన శివస్వామి పాతికేళ్ల యువకుడిగా మారిపోతారు. 'ఇంత శక్తి ఎలా వచ్చింది...?' అని అడుగుతుంటారు చాలామంది. 'మీరు ఇచ్చిందే...' బోసినవ్వులతో జవాబిస్తారు శివస్వామి.
సహస్రమానం భవతి... 
బెంగళూరు జిల్లా మాగడి తాలూకాలోని వీరాపురం శివస్వామి సొంతూరు.'శివుడూ', 'శివన్నా' అని పిలిచేవారు. హొన్నప్ప, గంగమ్మ అమ్మానాన్నలు. ఏడుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లల తర్వాత పుట్టాడు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అల్లరీ తక్కువేం కాదు. దీంతో తల్లి, 'శివా! నువ్విలా అల్లరిచేస్తే పరమశివుడు కైలాసానికి రానివ్వడు తెలుసా..? అని హెచ్చరించేది. అంతే, శివయ్య కిమ్మనకుండా ఓ మూలన కూర్చునేవాడు. ఆ మౌనమూ కాసేపే. శివుడికి ఎనిమిదేళ్లు నిండకుండానే...తల్లి చనిపోయింది. పెద్దక్క ఇంట్లో పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. సిద్ధగంగ మఠం ఆ వూరికి దగ్గరే. అక్క కుటుంబంతో కలిసి తరచూ వెళ్లేవాడు. ఉద్దానస్వామిని చూడగానే ఆ కుర్రాడికి గురుభావం కలిగింది. ఉత్తరాధికారి మరుళారాధ్యులంటే ఆత్మీయభావం ఏర్పడింది. ఆ మఠంతో, పరిసరాలతో జన్మజన్మల అనుబంధం ఉన్నట్టు అనిపించేది. ఒక్కపూట సెలవు దొరికినా, సిద్ధగంగ క్షేత్రానికి వచ్చేవాడు. సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాడు. గురుసేవ చేసేవాడు. శ్రీమఠం సిబ్బందికి తల్లో నాలుకగా మారిపోయాడు. ఇంటర్‌ పాసయ్యాక, బెంగళూరులోని సెంట్రల్‌ కాలేజీలో సీటు వచ్చింది. ఆ సమయంలోనే, మరుళారాధ్యుడి మరణవార్త తెలిసింది. హుటాహుటిన బయల్దేరి వెళ్లాడు. అంతిమ కార్యక్రమాల్లో తనవంతు బాధ్యతలు నిర్వర్తించాడు. మరుళారాధ్య వారసుడిగా ఎవర్ని ఎంపిక చేయాలనే విషయంపై తర్జనభర్జన నడిచింది. శివన్నపేరు ప్రస్తావనకు వచ్చింది. బుద్ధిమంతుడు, విద్యావంతుడు, సంస్కారవంతుడు! ఎవరు మాత్రం కాదంటారు? ఆ ప్రతిపాదనకు ఉద్దానస్వామి ఆమోదం లభించింది. ఆయనే పిలిచి అభిప్రాయం అడిగారు. 'గురు ఆజ్ఞ...' అని సవినయంగా జవాబిచ్చాడు శివన్న. ముహూర్తం నిర్ణయమైంది. కాషాయ వస్త్రాలు ధరించాడు. శివకుమారస్వామిగా సన్యాస జీవితాన్ని ప్రారంభించాడు. తండ్రికి ఈ విషయం తెలిసింది. చాలా బాధపడ్డాడు. బిడ్డ బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఆయన కోరిక. కొడుకును బతిమాలాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆస్తంతా రాసిస్తాను వచ్చేయమన్నాడు. చక్కని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అప్పటికి శివన్న డిగ్రీ మూడో సంవత్సరంలో ఉన్నాడు. ఆరోజుల్లో పట్టభద్రులు అతి తక్కువ. అందులోనూ శివన్న చురుకైన విద్యార్థి. ఆంగ్లభాష మీద మంచి పట్టుంది. కోరుకుని ఉంటే పెద్ద కొలువులే వచ్చేవి. కానీ ఆ యువకుడికి ఐహికమైన వాంఛలేం లేవు. 'సమాజ సేవ, గురుసేవ, దైవసేవ... ఇవే నాకు ఆస్తిపాస్తులకంటే విలువైనవి. ఆ భాగ్యాన్ని నేను కాదనుకోను. క్షమించు నాన్నా! ఇంకెప్పుడూ ఆ ప్రస్తావన వద్దు' అని సున్నితంగా తిరస్కరించాడు శివుడు. 
ఆధ్యాత్మిక చింతన. 
విద్యాసేవ.అన్నదానం... 
...ఈ మూడూ జీవన పరమార్థాలని భావించారు శివకుమారస్వామి. నాటి నుంచి నేటి దాకా అదే మార్గం. దశాబ్దాలుగా ఆయన దినచర్య మారలేదు. వయసుతోపాటు ఉత్సాహమూ పెరుగుతోంది. రోజూ తెల్లవారుజామున రెండింటికే నిద్రలేస్తారు. స్నానాదులు పూర్తిచేసుకుని పూజకు కూర్చున్నారంటే ... అదో లోకం! మదినిండా కైలాసం. తెల్లారేలోపే .. ఆయన ఆశీస్సుల కోసం, మార్గనిర్దేశనం కోసం ఎంతోమంది ఎదురుచూస్తూ ఉంటారు. అందర్నీ పేరుపేరునా పలకరిస్తారు. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం నింపుతారు. వైఫల్యాలు బాధిస్తున్నవారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తారు. అయోమయంలో ఉన్నవారికి లక్ష్యోపదేశం చేస్తారు. ఆతర్వాత, మఠం పరిపాలన వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. పిడికెడు భోజనం, వేప కషాయం... ఇదే ఆయన ఆహారం. నూట ఐదేళ్ల వయసులోనూ శివస్వామి కళ్లజోడు ధరించరు. ఖాతాపుస్తకాల్లో ఏ చిన్న పొరపాటు ఉన్నా ఇట్టే పట్టేసుకుంటారు. విద్యాసంస్థలకెళ్లి ఆంగ్లం, కన్నడం, సంస్కృతం... బోధిస్తారు. స్వామీజీ పాఠాలంటే విద్యార్థులకు చాలా ఇష్టం. ఒక్కసారి వింటే చాలు...మళ్లీ చదువుకోవాల్సిన అవసరమే ఉండదు. అంత బాగా గుర్తుండిపోతాయి. ఆడిటోరియంలో తన కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ధర్మమార్గం బోధిస్తారు. ఆ ప్రవచనాలు వినడం గొప్ప అనుభూతి! ఎక్కడా సుదీర్ఘ సమాసాలుండవు. అర్థంకాని పదాలుండవు. మార్మిక బోధనలుండవు. ప్రతిమాటా సూటిగా గుండెల్ని తాకుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్ని వీక్షించి, మార్పులుచేర్పులు సూచించి... వంటశాలకు విచ్చేస్తారు. సకాలంలో వంట పూర్తయి అన్నసంతర్పణ ప్రారంభంకాకపోతే విలవిల్లాడిపోతారు. రోజూ కాసేపైనా గోసేవ చేయాల్సిందే. సాయంత్రం విద్యార్థులతో ప్రార్థనా సమావేశం ఉంటుంది. ఆ సందర్భంగా ఓ పది నిమిషాలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారు. శ్రమజీవన సౌందర్యం, నైతికత, మానవత...ప్రధాన ఇతివృత్తాలు! రాత్రి పదకొండు గంటలకు తన గదిలోకి వెళ్లిపోతారు. అక్కడ మంచం తప్ప మరే వస్తువూ ఉండదు. పూజగది అయితే మరింత నిరాడంబరంగా ఉంటుంది. 
సమాజమే దేవాలయం అయినప్పుడు... 
శ్రమలోనే దేవుణ్ని చూడగలిగినప్పుడు... 
సేవను మించిన పూజాదికాలు లేవని విశ్వసించినప్పుడు... 
ప్రపంచమే ఒక సిద్ధగంగ క్షేత్రం అవుతుంది. 
నరుడే హరుడవుతాడు. 
'ఇంత నిర్మలంగా, ఇంత నిరాడంబరంగా బతకడం సాధ్యమేనని చాటడానికైనా మీరు వెయ్యేళ్లు జీవించాలి బుద్ధీ!'
గురుబోధ 
దృష్టి-సృష్టి
మన ఆలోచనలను బట్టే ప్రపంచం ఉంటుంది. మన దృష్టి మంచిదైనప్పుడు లోకం మంచిగానే కనిపిస్తుంది. చెడుగా ఉన్నప్పుడు అంతా చెడ్డగా కనిపిస్తుంది. దృష్టిని బట్టే సృష్టి, భావాలనుబట్టే భవిష్యత్‌.
మార్గదర్శి...
మన సంస్కృతిలో ఉపాధ్యాయుడికి (గురువుకు) ఎంతో మహత్తరమైన స్థానం ఉంది. ఆచార్యుడంటేనే పాండిత్యం ఉన్నవాడనీ, నిరాడంబరుడనీ, త్యాగశీలుడనీ, సమాజ సంక్షేమాన్ని కోరేవాడనీ...ఇలా అనేక అర్థాలున్నాయి. పూర్వం ఉపాధ్యాయుడు గ్రామ న్యాయమూర్తిగా కూడా వ్యవహరించేవాడు. ప్రజలకు హితవు బోధించేవాడు. నేడు, అందుకు పూర్తి వ్యతిరేక వాతావరణం ఏర్పడింది. గురువును ఆటపట్టించే తరం వచ్చింది. ఇదంత మంచి పరిణామం కాదు.
జీవన కళ
సంగీతం, సాహిత్యం, నృత్యం...మొదలైనవాటి లాగానే జీవితమూ ఒక కళే. కళాసిద్ధికి సాధన ముఖ్యం. జీవనకళ వారంలోనో నెలలోనో సంవత్సరంలోనో అలవడేది కాదు. నిరంతర ప్రయత్నం, ఓర్పూ అవసరం. ప్రతివ్యక్తిలోనూ మంచీచెడూ ఉంటాయి. సాధన ద్వారా చెడుగుణాలను చాలామటుకు తొలగించుకుని, మంచిని ఎంతోకొంత పెంపొందించుకుంటే ఆదర్శ వ్యక్తిగా ఎదుగుతాం. అందులో పరిపూర్ణత సాధిస్తే పూజనీయులం అవుతాం. దీన్నే ఇచ్ఛాశక్తి అంటారు.
చదువులతోనే వెలుగులు
- శివకుమార స్వామి
నేను సిద్ధగంగ బాధ్యతలు స్వీకరించే సమయానికి మఠం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. గురువుగారి ఆరాధన మహోత్సవాలు జరిపించడం కూడా కష్టంగా ఉండేది. సంకల్పబలంతో, గురుకృపతో సమస్యల్ని అధిగమించాం. వ్యక్తి ఉన్నతికీ, దేశ అభివృద్ధికీ, పేదరిక నిర్మూలనకూ చదువే మార్గం. అందుకే విద్యాదానానికి పెద్దపీట వేశాను. విద్య ఉన్న చోట అన్ని సంస్కారాలూ ఉన్నట్టే. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికొచ్చి చదువుకుంటున్నారు. జాతి, కులం, మతం అన్న తేడా శ్రీమఠంలో ఎప్పుడూ కనిపించదు. సంస్థ నియమాలకు కట్టుబడి ఉంటే చాలు. ఎలాంటి ఫీజులూ చెల్లించాల్సిన పన్లేదు. రోజూ ఉదయం, సాయంత్రం వేలమంది విద్యార్థులతో నిర్వహించే సామూహిక ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని పనులున్నా తప్పకుండా హాజరవుతాను. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే ప్రార్థనే భగవదనుగ్రహానికి కారణం. పిల్లల్లో దేవుడు కనిపించే అమృత ఘడియలు అవి!
సిద్ధగంగ ప్రశస్తి
సిద్ధగంగ కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. బెంగళూరుకు అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు-పుణె రహదారిపై తమకూరుకు మూడు కిలోమీటర్ల ఇవతలే కనిపిస్తుంది. ఆరువందల సంవత్సరాల క్రితం... గోసల సిద్ధేశ్వరుడు ఈ మఠాన్ని స్థాపించాడు. అప్పటి నుంచి రేవణసిద్ధ, మరుళసిద్ధ, సిద్ధరామ...అనే సిద్ధత్రయంతో పాటు అనేకమంది పీఠాధిపతులు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యానికి కృషిచేశారు. సిద్ధగంగకు ఈ పేరు రావడం వెనుక ఓ ఐతిహ్యం ఉంది. గోసల సిద్ధేశ్వరుని సమకాలీనులైన ఎందరో యోగులు సిద్ధగంగ గుహల్లో తపస్సు చేసుకునేవారు. ఒక తపస్వికి అర్ధరాత్రి విపరీతమైన దాహం కలిగింది. చిమ్మచీకటి. అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. దాహం తీర్చి ప్రాణం కాపాడమని మనసులోనే సిద్ధేశ్వర యోగిని ప్రార్థించుకున్నాడు. ఆయన ప్రత్యక్షమై, అక్కడే ఉన్న బండరాతిని తన చేత్తో కొట్టాడు. అంతే! గంగోద్భవం జరిగింది. ఆ నీటితో వృద్ధ తపస్వి దాహం తీర్చుకున్నాడు. సిద్ధేశ్వరుని తపోబలంతో ఉద్భవించిన గంగ కాబట్టి 'సిద్ధగంగ' అయ్యింది. ప్రస్తుత పీఠాధిపతి శివకుమార స్వామీజీ ఆ గురుపరంపరలోని వారే (మఠం ఫోన్‌: 09900250045, 09964319441).
- జగదీశ్వరి, న్యూస్‌టుడే, బెంగళూరు









కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు