Snehamila..Saagiponi (Eetaram_04/08/2012)
'మీరు', 'గారు'ల కాలం ఎప్పుడో పోయింది... 'రేయ్', 'ఏమే'ల స్నేహం పాత పడింది... ఇప్పుడంతా 'హాయ్', 'బై'లే... ఇన్‌స్టంట్ కాఫీలా.. టీ20 మ్యాచ్‌లా... ట్విట్టర్ ట్వీట్‌లా.. ఫేస్‌బుక్ షేర్‌లా... ఈ ఉధృతిలో భావోద్వేగాల బంధం బందీ అవుతోంది... దాన్ని ఆపాలంటే ఏం చేయాలి? అసలింతకీ నిజమైన స్నేహం ఎలా ఉండాలి? స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాలేంటి? రేపు స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిపుణులను సంప్రదించింది 'ఈతరం'.స్నేహాన్ని నిర్వచిస్తూ బోలెడు సినిమాలొచ్చాయ్. వర్ణిస్తూ కవుల కలాల నుంచి అనుభూతుల అక్షరాలే జాలు వారాయ్. వాళ్ల మాటల్లో చెప్పాలంటే స్నేహం విశ్వమంత విశాలమైంది. సముద్రం కన్నా లోతైంది. అమృతంలా మధురమైంది. మరి స్నేహితుడంటే?? ప్రపంచమంతా నిన్ను వేలెత్తి చూపిస్తుంటే నేనున్నానంటూ అండగా నిలబడేవాడు. అయితే ఉరుకుల పరుగుల ఈ కాలంలో ఇంతటి కమ్మని అనుబంధాలు కరువై పోతున్నాయి. ఇప్పటి స్నేహాల్లో ఎక్కువ శాతం పైపై మెరుగులే అంటున్నారు నిపుణులు. 'ముఖ పుస్తకం'లో మూడువందల స్నేహితులుంటారు. అందులో ముఖ పరిచయం లేనివాళ్లే ఎక్కువ. ట్విట్టర్‌లో వేలమంది ఫాలో అవుతారు. అవసరానికి చేరువయ్యేవాళ్లు అరుదే.మంచి స్నేహితుంటే? కష్టాల్లో వెన్నంటే ఉండేవాడు. మనసు చదివే చొరవ చూపేవాడు. తప్పు చేస్తే సుతిమెత్తగా చీవాట్లు పెట్టేవాడు. గొప్ప పని చేస్తే భుజాలకెత్తుకొని మెచ్చుకునేవాడు. హైటెక్ యుగంలో ఈ అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. 'ఇప్పటి యువత దృష్టిలో స్నేహం అంటే ఇచ్చిపుచ్చుకోవడమే. ఒకరి గురించి మరొకరు ఆలోచించేంత ఓపిక, తీరిక లేవు. దీనికి ఎవర్నీ తప్పు పట్టడానికి లేదు. ఇదంతా ప్రపంచీకరణ పుణ్యం' అంటారు ప్రొఫెసర్ బి.రాజశేఖర్. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సైకాలజీ హెడ్. మరో మానసిక నిపుణురాలు వీరజారావు మాటల్లో చెప్పాలంటే 'స్వచ్ఛమైన స్నేహం తరగతి గదుల్లో మొగ్గ తొడుగుతుంది. ఆటపాటల్లో ఎదిగి, మనసు విప్పి మాట్లాడుకున్నపుడు వికసిస్తుంది. కానీ నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే నేటితరం పిల్లలకి అంత సమయం ఎక్కడిది?' అంటారామె. ఉన్న స్నేహం నిలబడాలంటే ఎన్నో సానుకూల అంశాలు కావాలి. విడిపోవడానికి చిన్న కారణం చాలు. ఎంత దగ్గరి స్నేహితులైనా అభిప్రాయ బేధాలు సహజం. మనస్పర్థలు తలెత్తడం ఖాయం. అప్పుడే వాదన ముదురుతుంది. 'తప్పు నీదంటే నీద'ని బెట్టు చేస్తారు. మెట్టు దిగడానికి ఎవరూ ఇష్టపడరు. ఇది ఏళ్ల స్నేహానికి గండి కొడుతుంది. ఒకప్పుడు 'యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్' అన్న స్నేహితులే శత్రువుగా మారిపోతారు. 'అదే ఇద్దరిలో ఒకరు చొరవ చూపి ఎదుటివాళ్ల తరపున ఆలోచిస్తే ఈ సమస్య పురిటిలోనే మాయం అవుతుంది' అంటారు వీరజారావు. ఆపై ఓ ఆత్మీయ స్పర్శ, నులివెచ్చని కౌగలి. మొత్తం సమస్య దూదిపింజలా తేలిపోతుంది. పట్టు విడుపులుంటే మరణశయ్య ఎక్కబోతున్న స్నేహం సైతం కొత్త చిగుళ్లు వేస్తుంది.
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి