తాలిబన్ల కిరాతకం (Eenadu Special)
నాటి అకృత్యాల్ని గుర్తుకు తెస్తున్న అరాచకశక్తులు అఫ్గానిస్థాన్- ఈ పేరు వింటే గుర్తుకొచ్చేది సుదీర్ఘకాలంగా సాగుతున్న ఆధిపత్య పోరాటాలు, మతమౌఢ్యం మూర్తీభవించిన తాలిబాన్ల అకృత్యాలు, సంకీర్ణ సేనల యుద్ధాలు. 2001 సెప్టెంబరు 11 దాడుల తర్వాత- అఫ్గానిస్థాన్‌పై జరిపిన యుద్ధంతో తాలిబాన్లు తోకముడిచారని అమెరికా లెక్కలేసుకుంటుంటే... తాలిబాన్లు మళ్లీ పుంజుకుంటూ... మునుపటి భయానక పరిస్థితుల్ని గుర్తుకు తెస్తుండడం ఒళ్లు గగుర్పొడిచే పరిణామం. పాశ్చాత్య సంస్కృతితోపాటు పరమత ద్వేషాన్ని నరనరానా జీర్ణించుకున్న తాలిబాన్లు- ఆఖరికి స్వదేశీ మహిళలు, పిల్లల్ని సైతం కర్కశంగా హింసిస్తున్నారు. దానికి పరాకాష్ఠే తాజాగా హెల్మండ్ ప్రావిన్స్‌లో 17 మందిని ఊచకోత కోయడం. సంగీత, నృత్యాలతో పార్టీ చేసుకుంటున్నారన్న అక్కసుతో ఇద్దరు మహిళలు సహా 17 మంది తలల్ని తెగనరికి తాలిబాన్లు తమ పైశాచికత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఇలా ఆడా మగా ఒకచోట చేరి పార్టీలు చేసుకోవడం వ్యభిచారం కిందికి వస్తుందని బలంగా నమ్మే తాలిబాన్లు- గత జూన్‌లో కూడా కాబూల్‌లోని ఒక హోటల్‌లోకి జొరబడి 20 మందిని ఊచకోత కోశారు. షరియా (ఇస్లామిక్ చట్టాలు) అమలుకోసం ఎంతటి ఘోరాలకైనా తెగబడే తాలిబాన్లు అఫ్గానిస్థాన్‌లో సాగిస్తున్న అకృత్యాలకు దాదాపు 20 ఏళ్ల చరిత్ర ఉంది. ఇస్లామిక్ మత గురువు ముల్లా మహ్మద్ ఒమర్ 1994లో కొందరు ఇస్లామిక్ విద్యార్థుల(వీరిలో ఎక్కువమంది పష్తూన్‌లు)తో కలిసి తాలిబాన్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అఫ్గానిస్థాన్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకుని, షరియాను పటిష్ఠంగా అమలుచేయడం ఈ ఉద్యమ లక్ష్యం. అఫ్గానిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో అప్పటికే వేళ్లూనుకున్న యుద్ధప్రభువులపై పైచేయి సాధిస్తూ తాలిబాన్లు అఫ్గానిస్థాన్‌పై పట్టు బిగించారు. అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్ 1996లో అఫ్గానిస్థాన్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది. తాలిబాన్ల మతమౌఢ్యం కొత్త పుంతలు తొక్కడం ప్రారంభించింది. అమెరికాపై సెప్టెంబరు 11 దాడుల తర్వాత అఫ్గానిస్థాన్‌పై బుష్ సర్కారు యుద్ధం ప్రారంభించింది. ఆ దాడుల్లో ముల్లా ఒమర్ కూడా చనిపోయాడని వార్తలు వచ్చినప్పటికీ.. దీనిపై ఇప్పటిదాకా ధ్రువీకరణల్లేవు. హమీద్ కర్జాయ్‌ను అధ్యక్షుడిగా చేసి... సంకీర్ణ సేనలే దాదాపు అఫ్గానిస్థాన్‌ను పాలిస్తున్నాయి. దాదాపు 1,30,000 మంది నాటో బలగాలు అఫ్గాన్‌లో పనిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో సంకీర్ణ సేనల్లోని ఒక్కొక్క దేశమే తమ బలగాల్ని ఉపసంహరించుకుంటున్నాయి. దీంతో పాక్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో తిష్ఠవేసిన తాలిబాన్లు మళ్లీ అఫ్గాన్‌లోకి అడుగిడుతున్నారు. రెండు నెలల క్రితం ఏకంగా రాజధాని కాబూల్‌పైనే గురిపెట్టి... వరుస దాడులతో కాబూల్‌ను దాదాపు హస్తగతం చేసుకున్నంత పనిచేశారు. అఫ్గాన్ పోలీసులు, సంకీర్ణ సేనలు సకాలంలో స్పందించడంతో వారి ఆటలు సాగలేదు. |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి