అంగారకుడిపై దిగిన నాసా వ్యోమనౌక క్యూరియాసిటీ (A special news)


జీవాన్వేషణలో మానవ అద్భుతం
జీవాన్వేషణలో కొత్త శకం
అంగారకుడిపై దిగిన నాసా వ్యోమనౌక క్యూరియాసిటీ
రోదసి ప్రయోగాల చరిత్రలోనే అత్యంత ఆధునిక, భారీ ప్రయోగశాల
వెనువెంటనే అక్కడి పరిసరాల ఛాయాచిత్రం
ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న శాస్త్రవేత్తలు
అరుణగ్రహం మీద జీవం ఉనికిపై పరీక్షలు
మరో 3నెలల్లో పూర్తిస్థాయిలో పని
హ్యూస్టన్‌
గ్రహాంతర జీవం కోసం మనిషి జరుపుతున్న శతాబ్దాల అన్వేషణ మరో మలుపు తిరిగింది. సైన్స్‌ చరిత్రలోనే అత్యంత అధునాతన, భారీ ప్రయోగ పరికరాలతో కూడిన వ్యోమనౌక 'క్యూరియాసిటీ' అంగారకగ్రహంపై సోమవారం సురక్షితంగా దిగింది. రెండేళ్లపాటు అరుణగ్రహంపై సంచరిస్తూ అక్కడి మట్టిని, రాళ్లను విశ్లేషిస్తూ క్యూరియాసిటీ పంపించే వివరాలు.. గ్రహాంతర జీవం అన్వేషణలో కొత్త కోణాలను అందిస్తాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. వారి అంచనాలు ఇంత భారీ స్థాయిలో ఉన్నాయి కాబట్టే అంగారకుడిపై క్యూరియాసిటీ అడుగిడిన వెంటనే నాసా శాస్త్రవేత్తలు ఉద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.ఇతర గ్రహాల్లో జీవం ఉందా? అసలు జీవం ఉండటానికి అనువైన పరిస్థితులున్నాయా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాల కోసం సాగుతున్న శతాబ్దాల అన్వేషణ సోమవారం మరో మలుపు తిరిగింది. అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత అధునాతనమైన వ్యోమనౌక/రోవర్‌ 'క్యూరియాసిటీ'.. అంగారకగ్రహం అంతు తెలుసుకోవటానికి అక్కడ దిగింది. అరుణారుణ వర్ణంతో పరిశోధకులను వందల ఏళ్లుగా ఆకర్షిస్తున్న ఆరుణగ్రహం గురించి మరింత తెలుసుకొని ఆ వివరాలు మనకు అందించటానికి సిద్ధమైంది.
మనిషి పాదముద్రలకు మార్గం సుగమం!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) గత ఏడాది నవంబరులో పంపించిన ఈ వ్యోమనౌక భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకుంది. వెనువెంటనే అక్కడి నుంచి కొన్ని ఫొటోలను కూడా పంపింది. 'టచ్‌డౌన్‌ కన్‌ఫర్మ్‌డ్‌' (క్యూరియాసిటీ అంగారకుడిపై దిగింది) అన్న నాసా ఇంజినీర్‌ అలెన్‌చెన్‌ ప్రకటనతో కాలిఫోర్నియాలోని జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీలో సంతోషాతిరేకం వ్యక్తమైంది. అక్కడున్న తెరపై క్యూరియాసిటీ ల్యాండింగ్‌ను చూసి ఉద్విగ్నభరితులైన శాస్త్రవేత్తలు ఆనందభాష్పాలు రాల్చారు. ఒకర్నొకరు గట్టిగా హత్తుకున్నారు. 'అంగారకుడి మీద మనిషి పాదముద్రలను వేయించే మార్గాన్ని ఈ రోజు క్యూరియాసిటీ ప్రకాశవంతం చేసింది. ఇప్పటివరకూ తయారైన గ్రహాంతర రోవర్లలోకెల్లా అత్యాధునికమైన క్యూరియాసిటీ ప్రస్తుతం అంగారకుడి ఉపరితలంపై ఉంది. అరుణగ్రహంపై గతంలో ఎప్పుడైనా జీవం ఉనికిలో ఉందా? భవిష్యత్తులో జీవం ఉనికిలో ఉండటానికి అవసరమైన పరిస్థితులు అక్కడున్నాయా? వంటి ప్రశ్నలకు క్యూరియాసిటీ సమాధానలు కనుగొనే ప్రయత్నం చేస్తుంది' అని నాసా అడ్మినిస్ట్రేటర్‌ ఛార్లెస్‌ బోల్డన్‌ ప్రకటించారు.వెళ్లగానే పని ఆరంభం
క్యూరియాసిటీ అంగారకుడిపై 4.8 కి.మీ.ల ఎత్తు, 154 కి.మీ.ల వ్యాసం ఉన్న ఓ భారీపర్వతం దిగువ భాగంలో దిగింది. ఈ ప్రాంతం గేల్‌ అనే భారీ బిలం మధ్యలో ఉంది. అరుణగ్రహంపై దిగిన కొన్ని నిమిషాలకే క్యూరియాసిటీ.. బొటనవేలు అంత సైజున్న నలుపు, తెలుపు ఫొటోను పంపించింది. ఆ తర్వాత భారీసైజున్న మరో ఫొటోను పంపింది. అంగారకుడికి సంబంధించి మనిషి అవగాహనను క్యూరియాసిటీ విప్లవాత్మకంగా మార్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఆ గ్రహంపై జీవం ఉనికికి సంబంధించిన శేషప్రశ్నలకు ఈ ఆధునిక గ్రహాంతర రోవర్‌ సమాధానం చెప్పనుంది. అంతేకాదు అక్కడి మట్టిని, రాళ్లను భూమ్మీదికి తీసుకువచ్చి వాటిని పరీక్షించే భవిష్యత్‌ ప్రాజెక్టులకు.. అంతిమంగా వ్యోమగాములను అక్కడికి పంపించాలన్న సుదీర్ఘస్వప్నాన్ని సాకారం చేయటానికి మార్గం వేయనుంది. జీవించి ఉన్న లేదా శిలాజరూపంలో ఉన్న సూక్ష్మక్రిములను గుర్తించే సామర్థ్యం క్యూరియాసిటీకి లేదు. కానీ, జీవం ఉనికికి అత్యవసరమైన కార్బన్‌, నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌, సల్ఫర్‌, ఆక్సిజన్‌ వంటి మూలకాలను అది అన్వేషిస్తుంది.
57 కోట్ల కి.మీ.ల ప్రయాణం
ఇప్పటివరకూ జరిగిన ఖగోళ పరిశోధనల్లో ఇతర గ్రహాలపైకి పంపించిన వ్యోమనౌకల్లో కెల్లా క్యూరియాసిటీ పెద్దది. కారు సైజులో, ఒక టన్ను బరువుతో ఉండే ఈ వ్యోమనౌక కేవలం పరిమాణంలోనే కాదు.. ప్రతిభలోనూ అగ్రస్థానంలో నిలుస్తుంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీన్ని తయారుచేశారు. 250 కోట్ల డాలర్ల (రూ.12,500 కోట్లు) వ్యయంతో ఇది నిర్మితమైంది. గత నవంబరులో అంగారకుడి దిశగా పయనం ప్రారంభించిన క్యూరియాసిటీ ఆ గ్రహంపై దిగటానికి ముందు 57కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయానించింది.కదిలే ప్రయోగశాల 
క్యూరియాసిటీ ఒక భారీ ప్రయోగశాల వంటిది. దాంట్లో 10 సైన్స్‌ పరికరాలున్నాయి. అవన్నీ కలిపి అంగారకుడిపైకి నాసా గతంలో పంపించిన రోవర్లు స్పిరిట్‌, అపార్చునిటీల్లో ఉన్న పేలోడ్‌లకన్నా 15 రెట్లు అధికంగా ఉంటాయి. ఈ పరికరాల్లో లేజర్‌ ఫైరింగ్‌ వంటి కొన్ని పరికరాలు పూర్తిగా కొత్తవి. వీటిని తొలిసారిగా ఉపయోగిస్తున్నారు. క్యూరియాసిటీ తన రోబోటిక్‌ చేతిని ఉపయోగించి అంగారకుడి ఉపరితలంపైనున్న మట్టిని, రాళ్లను సేకరించి లోనికి పంపిస్తుంది. వాటిపై పరికరాలు పరీక్షలు జరిపి విశ్లేషిస్తాయి. మొదటి వారం రోజుల్లో క్యూరియాసిటీ ప్రధాన యాంటెన్నా పని ప్రారంభిస్తుంది. అదే సమయంలో కెమెరాలు, లేజర్‌ పరికరాలు పని మొదలుపెడతాయి. వీటిద్వారా క్యూరియాసిటీ తన చుట్టూ ఉన్న పరిసరాల ఫొటోలను తీస్తుంది. మరోవైపు, నాసా తొలినెలరోజులపాటు క్యూరియాసిటీ పనితీరును పరీక్షిస్తుంది. ఆ తర్వాతే వచ్చే నెల ప్రారంభంలో క్యూరియాసిటీ కదలటం మొదలవుతుంది. సెప్టెంబర్‌ మధ్యలో అంగారకుడి మట్టి నమూనాల విశ్లేషణ, అక్టోబర్‌ లేదా నవంబరులో అక్కడి రాళ్లను తవ్వే ప్రక్రియ ఆరంభమవుతుందని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. 96 మైళ్ల గేల్‌ బిలంలో క్యూరియాసిటీ పూర్తి సామర్థ్యంతో రెండేళ్లపాటు అన్వేషణ కొనసాగిస్తుంది. ఆ తర్వాత కూడా చాలాకాలంపాటు అది పని చేసే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ వ్యోమనౌక ప్లుటోనియం వేడి నుంచి పుట్టే విద్యుత్తు ద్వారా పని చేస్తుంది. దీనివల్ల ఇది కొన్ని దశాబ్దాలైనా పని చేయగలదు.












కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు