విడివిడిగా కలివిడిగా..సామాజిక ఒరవడిగా! (Eetaram_12/01/13)
వూసుపోని కబుర్లు... ఉకదంపుడు ముచ్చట్లు... సరదాల కాలక్షేపం... సల్లాపాల వ్యవహారం... ఫేస్‌బుక్ అనగానే చాలామంది భావమిదే! కానీ కొంతమంది దృష్టిలో... అదో అనుబంధాల వారధి... సమాజ సేవకు మార్గం... అభిరుచుల సమాహారం... దాని కోసం వాళ్లు ఫేస్‌బుక్ 'గ్రూపు'లుగా జ తకడుతున్నారు! ఆన్‌లైన్ మాటల్ని ఆఫ్‌లైన్‌లో చేతలుగా మార్చేస్తున్నారు! ఆ సంగతుల ఖజానా ఈవారం.నలుగురు యూత్ కలిస్తే కబుర్ల వరదే. ఆన్‌లైన్లో సామాజిక అనుబంధాల వారధైన 'ఫేస్‌బుక్'లో లక్షలాది మధ్య జరిగేది కూడా ఇదే. 'ప్రతి ఫ్రెండూ అవసరమేరా...' తరహాలో ఒకరి పరిచయాలు మరొకరితో 'ఫ్రెండ్ రిక్వెస్ట్'లై, 'కన్‌ఫం' స్నేహితుల కలబోతల కబుర్లతోనే ఆగిపోవడం లేదు యువత. వేర్వేరు అభిరుచుల మేరకు వేర్వేరు బృందాలుగా ఏర్పడుతూ కలిసి కట్టుగా సాగుతున్నారు. ఇప్పుడు ఆ ట్రెండే జోరు మీదుంది. ఇక లక్షల గ్రూపులు పుట్టకుండా ఉంటాయా? "those who love a girl truely... - - - - - - one day he loves me too... అంటుందట వైన్‌షాపు బోర్డు. ప్రేమికుడిని ఉద్దేశించి ఓ టీనేజీ కుర్రాడు కొంటెగా చేసిన వ్యాఖ్య ఇది. 'లవ్ ఫెయిల్యూర్' గ్రూపు అందుకు వేదిక. ఇలాంటి చమక్కులు, సెటైర్లు.. ముఖ పుస్తక బృందాల్లో బోలెడు. పరీక్షలు బోర్ కొట్టే అబ్బాయి 'లెట్స్ దిస్ సెమిస్టర్ గో... ఐ విల్ స్టడీ సీరియస్‌లీ ఫ్రమ్ నెక్ట్స్ సెమిస్టర్' అంటూ ఓ గ్రూప్ మొదలుపెట్టాడు. వందలమంది జత కూడారు. ప్రేమని పిచ్చిపిచ్చిగా ప్రేమించే ఓ కుర్రాడు 'లవర్స్ పాయింట్'కి ఊపిరిలూదాడు. ఇరవై ఎనిమిదివేల మంది సభ్యులయ్యారు. అందులో వైఫల్యం చెందినా 'లవ్ ఫెయిల్యూర్' ఉండనే ఉంది. ప్రతిభ నిరూపించుకునేందుకు 'ఎక్స్‌ప్లోర్ యువర్ టాలెంట్' అని ఒకరంటే, స్నేహం విలువ తెలిసిన వ్యక్తి 'ఫ్రెండ్స్ ఫరెవర్' అన్నాడు. 14,550 మంది స్నేహ హస్తం అందించారు. సినిమా వాళ్ల కథలు, వెతలు పంచుకోవడానికి 'కృష్ణానగరే మామా... కృష్ణానగరే' పుట్టింది. గల్ఫ్‌లో స్థిరపడ్డ ప్రభాకర్ సరదాగా తన ఇంటిపేరు మీదే 'బాలైట్స్' మొదలుపెట్టాడు. డెబ్భైఏడు మంది సభ్యులయ్యారు. ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగులూ గ్రూపు కడుతున్నారు. ఇంతేకాదండోయ్... నచ్చిన నాయకుడ్ని పొగడటానికో గ్రూప్, తిట్టడానికో గ్రూప్. అభిమాన సినిమా తారలకో గ్రూప్, అసహ్యించుకోవడానికో గ్రూప్. భాష, సంగీతం, సాహిత్యం, గాడ్జెట్స్, హాస్యం.. ఇలా ఒక్కో అభిరుచికో గ్రూప్. ఆఖరికి ఏ పనీ పాటాలేనివాళ్లకీ గ్రూప్. ఈ సభ్యులంతా తమ భావాల్ని ఫేస్‌బుక్ గోడలపై కుమ్మరిస్తారు. గ్రూప్ చాట్‌లో మూకుమ్మడిగా ముచ్చట్లాడతారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేసేస్తుంటారు.గోడలు దాటి.. ఈ అనుబంధాలు కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాదు. గ్రూపు సభ్యులు 'గోడ'లు దాటి బాహ్య ప్రపంచంలోకి వచ్చేస్తున్నారు. మనసు విప్పి ముచ్చట్లాడతారు. ఆటపాటలతో సేదతీరతారు. తెలుగు ఇండిపెండెంట్ సినిమా సభ్యులైతే ఏకంగా ఓ సినిమానే నిర్మించారు. ఇక ఆన్‌లైన్‌లో జట్టుకట్టి సేవా కార్యక్రమాలకీ సై అంటున్న యువత లేకపోలేదు. అయితే వీటన్నింటికీ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మాత్రం ఆన్‌లైన్ టైమ్‌లైన్‌లోనే టైమ్లీగా జరుగుతుంటుంది. తీరుతెన్నులు తేలికే... ఇన్ని లాభాల ఫేస్‌బుక్ గ్రూపు ప్రారంభించడం తేలికే. ఫేస్‌బుక్ తెరిచి ఎడమవైపు ఉండే 'క్రియేట్ గ్రూప్'ని సింపుల్‌గా క్లిక్‌మనిపించడమే. ఆపై గ్రూపుకి నచ్చిన పేరు పెట్టేసి, సభ్యుల్ని ఆహ్వానిస్తే సరి. ఇద్దరితో మొదలైనా గ్రూపే. సభ్యుల సంఖ్యకు పరిమితి లేదు. అయితే ఈ గ్రూపుల్లో మూడు రకాలుంటాయి. * ఓపెన్ గ్రూప్: గ్రూపు సభ్యులు, సభ్యులు కానివాళ్లూ ఫాలో కావొచ్చు. తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. * క్లోజ్డ్ గ్రూప్: ఎవరైనా ఈ గ్రూపుని గమనించవచ్చు. పోస్ట్‌లు చేయాలంటే మాత్రం సభ్యులు కావాల్సిందే. * సీక్రెట్ గ్రూప్: కేవలం గ్రూపు సభ్యులకే పరిమితం. |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి