క్రిస్మస్‌ వేళ రుచుల మేళా


శాంతాక్లాజ్‌ అందించే కానుకలూ, నక్షత్రాల వెలుగులూ,  జింగిల్‌ బెల్స్‌ సందడీ, ఆత్మీయులతో కలిసి పండగ జరుపుకోవడం... క్రిస్మస్‌ వస్తోందంటే సందడే సందడి. ఈ ఆనందాల సమయంలో నోరు తీపి చేసుకునేందుకు కచ్చితంగా కేక్‌లూ, బిస్కెట్లూ, పిండివంటలూ ఉండాల్సిందే. పిల్లలే కాదు, ఇంటిల్లిపాదీ రుచిరుచిగా తినేందుకు అనువైన అటువంటి పదార్థాల పరిచయమే ఇది.
రుచిరుచిగా కొబ్బరి బిస్కెట్లు
కావల్సినవి: కొబ్బరితురుము - రెండు కప్పులు, చక్కెరపొడి - రెండు కప్పులు, పాలు - కప్పు, వెన్న - నాలుగుటేబుల్‌స్పూన్లు, జీడిపప్పుపొడి - టేబుల్‌స్పూను, గులాబీ ఎసెన్సు - అరచెంచా.తయారీ: బాణలిలో రెండు టేబుల్‌స్పూన్ల వెన్న, కొబ్బరితురుము, చక్కెరపొడి, పాలు, జీడిపప్పు పొడి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగి మిశ్రమం దగ్గరపడేవరకూ ఉంచాలి. ఆ తరవాత మిగిలిన వెన్న, గులాబీ ఎసెన్సు వేసి మరోసారి కలపాలి. రెండుమూడు నిమిషాలయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక బిస్కెట్ల్లలా కోసుకుంటే సరిపోతుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కొబ్బరి బిస్కెట్లు సిద్ధం. 
పసందైన కోవా, స్ట్రాబెర్రీ కేక్‌
కావల్సినవి: వెన్న - 200 గ్రా, చక్కెర - 100 గ్రా, మైదా - 200 గ్రా, పచ్చి కోవా, మిల్క్‌ మెయిడ్‌ - 50 గ్రా చొప్పున, బేకింగ్‌పౌడర్‌ - చెంచా, వంటసోడా - పావుచెంచా, స్ట్రాబెర్రీ స్త్లెసులు - ఆరు, స్ట్రాబెర్రీ ఎసెన్సు - నాలుగైదు చుక్కలు.తయారీ: ఓ గిన్నెలో మైదా, బేకింగ్‌పౌడర్‌; వంటసోడా తీసుకుని బాగా కలిపి జల్లించి పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న, చక్కెర తీసుకుని ఐదునిమిషాలు గిలక్కొట్టాలి. అదయ్యాక మిల్క్‌మెయిడ్‌, కోవా ఒకదాని తరవాత ఒకటి వేస్తూ.. ఐదు నిమిషాల చొప్పున గిలక్కొట్టాల్సి ఉంటుంది. ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉంటే పావుకప్పు పాలు వేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రాబెర్రీ ఎసెన్సు, జల్లించి పెట్టుకున్న మైదా వేశాక పదినిమిషాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన కేక్‌మౌల్డ్‌లో సగం వేసి పైన స్ట్రాబెర్రీ ముక్కల్ని పరవాలి. దానిపై మిగిలిన పిండిని కూడా వేసేయాలి. ముందుగా ఓవెన్‌ను 180 డిగ్రీల్లో వేడిచేసి దీన్ని బేక్‌చేయాలి. ఈ కేక్‌ పన్నెండు నుంచి ఇరవైనిమిషాల్లో తయారవుతుంది. 
కమ్మని క్రిస్మస్‌ కేక్‌
కావల్సినవి: వెన్న, చక్కెర పొడి - 100 గ్రా చొప్పున, గుడ్లు - నాలుగు, మైదా - 200 గ్రా, బేకింగ్‌ పౌడర్‌ - రెండు చెంచాలు, వంటసోడా - పావు టీస్పూను, బత్తాయిరసం, నిమ్మరసం - రెండు చెంచాల చొప్పున, అన్నిరకాల డ్రైఫ్రూట్స్‌ - 50 గ్రా. తయారీ: ముందుగా మైదాలో బేకింగ్‌పౌడర్‌, వంటసోడా వేసి కలిపి జల్లించుకుని పెట్టుకోవాలి. ఓ గిన్నెలో కోడిగుడ్ల సొనను తీసుకుని ఐదు నిమిషాల పాటు బాగా గిలక్కొట్టాలి. ఇందులో ఒక్కో పదార్థాన్నీ వేస్తూ ఐదు నిమిషాల చొప్పున గిలక్కొట్టాల్సి ఉంటుంది. అంటే ముందుగా వెన్న వేసి ఐదు నిమిషాలు గిలక్కొట్టాక చక్కెర పొడి, బత్తాయిరసం, నిమ్మరసం వేసుకుంటూ గిలక్కొట్టాలి. చివరగా జల్లించి పెట్టుకున్న మైదాను వేసినప్పుడు మాత్రం పది నిమిషాలు కలపాలి. బేక్‌ చేసే ముందు డ్రైఫ్రూట్లు వేసి ఓసారి కలిపితే పిండి తయారైనట్లే. ఓవెన్‌ను 180 డిగ్రీల్లో ముందుగా వేడిచేసి ఈ మిశ్రమాన్ని నెయ్యి లేదా వెన్న రాసిన గిన్నెలోకి తీసుకుని బేక్‌ చేయాలి. కనీసం ఇరవై, ఇరవై అయిదు నిమిషాలకు కేక్‌ తయారవుతుంది.
వూరించేలా...
కావల్సినవి: మైదా - అరకేజీ, చక్కెర పొడి - పావుకేజీ, వెన్న - పావుకేజీ, కోడిగుడ్లు - ఆరు, వంటసోడా - చిటికెడు, యాలకులపొడి - అరచెంచా, నూనె - వేయించడానికి సరిపడా. తయారీ: ఓ గిన్నెలో గుడ్ల సొనను తీసుకుని బాగా గిలక్కొట్టాలి. అందులో చక్కెరపొడి, వెన్న వేసి బాగా కలపాలి. ఆ తరవాత యాలకులపొడి, వంటసోడా వేయాలి. చివరగా మైదా కూడా కలిపితే ఇది గట్టిగా చపాతీ ముద్దలా అవుతుంది. ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉంటే కొన్ని పాలు వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పిండిని అరగంట నాననివ్వాలి. ఆ తరవాత మరోసారి కలిపి కొంచెం మందంగా చపాతీలా వత్తుకుని చిన్న మూతతో కట్‌చేస్తే బిస్కెట్లలా వస్తాయి. ఇలా చేసుకున్న వాటిని వేడినూనెలో ఎర్రగా వేయించాలి. అయితే మంట తక్కువగా ఉంటేనే ఈ బిస్కెట్లు మాడకుండా ఉంటాయి. నూనె వద్దనుకుంటే ఓవెన్‌లో బేక్‌ చేసుకోవచ్చు.
తీయని గులాబీలు
కావల్సినవి: మైదా - అరకేజీ, వరిపిండి - అరకేజీ, గోధుమపిండి - పావుకేజీ, యాలకులపొడి - చెంచా, వంటసోడా - చిటికెడు, చక్కెర - అరకేజీ, నూనె - వేయించడానికి సరిపడా. తయారీ: ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కోటి చొప్పున తీసుకోవాలి. అన్నింటినీ ఓసారి కలిపి ఆ తరవాత సరిపడా నీటితో దోశలపిండిలా చేసుకోవాలి. బాణలిలో సరిపడా నూనె వేసి బాగా వేడిచేయాలి. ఆ తరవాత గులాబీలు వేసే కాడను పిండిలో ముంచి వేడినూనెలో ఉంచేయాలి. పిండి వేగగానే కాడ నుంచి విడిపోయి పువ్వులా వస్తుంది. ఇలా మిగిలిన పిండిని కూడా చేసుకోవాలి. ఈ పిండిని నీళ్ల కన్నా కొబ్బరిపాలతో కలిపితే చాలా రుచిగా ఉంటుంది. ఈ కాడలు బజార్లో దొరుకుతాయి. పని సులువవ్వాలంటే.. కనీసం రెండు కాడల్ని కొనుక్కోవడం మంచిది.
డి.హెప్సీ ప్రవీణ, వైజాగ్‌
క్యారెట్‌ కేక్‌
కావలసినవి
కోడిగుడ్లు: రెండు, వెన్న: అరకప్పు, డెసికేటెడ్‌ కొబ్బరి: కప్పు, అక్రోట్లముక్కలు: ముప్పావుకప్పు, ఎండుద్రాక్ష: కప్పు, క్యారెట్‌ తురుము: రెండున్నర కప్పులు, దాల్చినచెక్కపొడి: టీస్పూను, జాజికాయ పొడి: టీస్పూను, అల్లంపొడి: టీస్పూను, బ్రౌన్‌ షుగర్‌ (ముడి పంచదార): కప్పు, మైదాపిండి: ఒకటింపావు కప్పు, బేకింగ్‌సోడా: టీస్పూను, ఆరెంజ్‌ జ్యూస్‌: 2 టీస్పూన్లుతయారుచేసే విధానం
ఓ గిన్నెలో మైదా, మసాలా పొడులు, బేకింగ్‌ సోడా, బ్రౌన్‌ షుగర్‌, వాల్‌నట్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో గుడ్లు వేసి గిలకొట్టాలి.
విడిగా ఓ పాన్‌లో వెన్న వేసి కరిగిన తరవాత బంగారువర్ణంలోని ఎండుద్రాక్ష, క్యారెట్లు, ఆరెంజ్‌ జ్యూస్‌ వేసి కలిపి వెంటనే దించి మైదా మిశ్రమంలో వేసి కలపాలి. తరవాత గిలకొట్టిన గుడ్డు మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన బేకింగ్‌ టిన్‌లో వేసి సుమారు గంటసేపు 150 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర బేక్‌ చేయాలి. చిన్న టూత్‌పిక్‌తో ఉడికిందో లేదో చూసి బయటకు తీయాలి. బయటకు తీసిన తరవాత ఐసింగ్‌ చేసి అందిస్తే బాగుంటుంది.
బటర్‌ కుకీస్‌
కావలసినవి
మైదా: 6 కప్పులు, బేకింగ్‌ పౌడర్‌: 3 టీస్పూన్లు, ఉప్పు: టీస్పూను, పంచదార: 2 కప్పులు, వెన్న లేదా మార్గరిన్‌: 2 కప్పులు, కోడిగుడ్లు: 2, క్రీమ్‌: 6 టేబుల్‌స్పూన్లు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌: 2 టీస్పూన్లుతయారుచేసే విధానం
గిన్నెలో మైదా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. తరవాత వెన్న వేసి కలపాలి. ఇప్పుడు గుడ్డుసొన, క్రీమ్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ కూడా వేసి బాగా కలపాలి. తరవాత ఈ పిండిని ఫాయిల్‌ కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో 24 గంటలు ఉంచాలి.
ఓవెన్‌ను 400 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర వేడిచేయాలి. ఇప్పుడు పిండిని బయటకు తీసి పావు అంగుళం మందంలో చపాతీలా వత్తాలి. కుకీ కట్టర్‌తో క్రిస్‌మస్‌ ట్రీ ఆకారంలో కోసి నెయ్యి రాసిన ట్రేలో పెట్టి సుమారు 8 నిమిషాలపాటు బేక్‌ చేయాలి. తరవాత నచ్చినట్లుగా రంగుల ఐసింగ్‌ షుగర్‌తో అలంకరించుకోవచ్చు.
కొబ్బరి కప్‌ కేకులు
కావలసినవి
మైదా: 6 కప్పులు, బేకింగ్‌ పౌడర్‌: 2 టీస్పూన్లు, వంటసోడా: టీస్పూను, ఉప్పు: టీస్పూను, పంచదార: 4 కప్పులు, వెన్న: ఒకటిన్నర కప్పులు, కోడిగుడ్లు: ఆరు, ఆల్మండ్‌ ఎసెన్స్‌: 3 టీస్పూన్లు, వెనీలా ఎసెన్స్‌: 3 టీస్పూన్లు, మజ్జిగ: 2 కప్పులు, కొబ్బరి తురుము: ఐదున్నర కప్పులు
ఐసింగ్‌కోసం: క్రీమ్‌ చీజ్‌: అరకిలో, వెన్న: ముప్పావు కప్పు, వెనీలా ఎసెన్స్‌: టీస్పూను, ఆల్మండ్‌ ఎసెన్స్‌: అరటీస్పూనుతయారుచేసే విధానం
మైదాలో బేకింగ్‌ పౌడర్‌, వంటసోడా, ఉప్పు వేసి కలపాలి.
వెన్న, పంచదార బాగా గిలకొట్టాలి. తరవాత గుడ్లసొన కూడా వేసి గిలకొట్టాలి. ఇప్పుడు ఎసెన్స్‌లు కూడా కలిపి మైదాపిండి, మజ్జిగ ఒకదాని తరవాత ఒకటి కాస్తకాస్త చొప్పున కలపాలి. తరవాత ఐదు కప్పుల కొబ్బరితురుము కూడా కలిపి పేపర్‌ కప్పుల్లో ఈ మిశ్రమాన్ని నింపి కప్‌ కేక్‌ బేకింగ్‌ ట్రేలో పెట్టి 160 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర సుమారు అరగంటసేపు బేక్‌ చేయాలి.
ఐసింగ్‌ కోసం తీసుకున్నవన్నీ బాగా గిలకొట్టి క్రీమ్‌లా చేయాలి. బయటకు తీసిన కప్‌ కేకులమీద ఐసింగ్‌ క్రీమ్‌ను సర్ది వాటిమీద మిగిలిన కొబ్బరి తురుము చల్లి అందించాలి.
డార్క్‌ క్రిస్మస్‌ పుడ్డింగ్‌
కావలసినవి
ఎండుద్రాక్ష (లేత బంగారురంగులో ఉండేవి): 300గ్రా., ఎండుద్రాక్ష(ముదురు రంగులో ఉండేవి): 300గ్రా., మైదా: 120గ్రా., ఉప్పు: టీస్పూను, అల్లంతురుము: టీస్పూను, జాజికాయపొడి: టీస్పూను, దాల్చినచెక్కపొడి: టీస్పూను, లవంగాలపొడి: టీస్పూను, మార్గరిన్‌ తురుము: 240 గ్రా., తాజా బ్రెడ్‌ ముక్కలు: 120గ్రా., పంచదార లేదా బెల్లం: 120గ్రా., చెర్రీలు: 60గ్రా., బాదం: 60గ్రా., ఆరెంజ్‌తొక్కతురుము: 2 టేబుల్‌స్పూన్లు, నిమ్మతొక్కల తురుము: టేబుల్‌స్పూను, ఆరెంజ్‌ జ్యూస్‌: అరకప్పు, కోడిగుడ్లు: రెండు, వెనీలా ఎసెన్స్‌: టీస్పూనుతయారుచేసే విధానం
ఎండుద్రాక్షని బాగా కడిగి ఆరనివ్వాలి.
పిండిని జల్లించి ఓ గిన్నెలో వేసి అందులో ఉప్పు, మసాలా పొడులు కలపాలి. తరవాత బ్రెడ్‌ముక్కలు, పంచదార, మార్గరిన్‌ వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఎండుద్రాక్ష, చెర్రీలు, బాదం, ఆరెంజ్‌, నిమ్మతొక్కల తురుము వేసి కలపాలి.
విడిగా మరో గిన్నెలో ఆరెంజ్‌రసం, గుడ్లసొన, వెనీలా ఎసెన్స్‌ వేసి బాగా కలిపి ఎండుద్రాక్ష మిశ్రమంలో కలపాలి.
ఈ మిశ్రమం వెుత్తాన్ని నెయ్యి రాసిన అంచు గిన్నెలో వేసి మందపాటి బట్టను గిన్నె పైన కప్పి అది వూడిపోకుండా దారంతో కట్టేయాలి. ఇప్పుడు ఈ గిన్నెను ప్రెషర్‌ కుక్కర్‌లో పెట్టి మూడు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించాలి. తరవాత బయటకు తీసి బట్ట తీసి మూతపెట్టి ఉంచాలి. తినేముందు మరోసారి ఆవిరిమీద వేడి చేసి వడ్డిస్తే సరి!
క్రిస్మస్‌ రుచుల సందడి
ముంగిట్లో నక్షత్ర మెరుపులు... తోడుగా కొవ్వొత్తుల కాంతులు..ముచ్చటగొలిపే గంటలు.. శాటిన్‌ రిబ్బన్లు.. రంగురంగుల బంతులతో.. అందంగా తీర్చిదిద్దిన చెట్టు.. కానుకలందించే తాత.. త్వరలో రానున్న క్రిస్మస్‌ ప్రత్యేకత ఇంతే అనుకుంటే పొరబాటే. కమ్మని కేకులు.. పసందైన పిండివంటల గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. రానున్న ఆ పర్వదినం సందర్భంగా..మీరు చేయాలనుకుంటున్న రుచులతోపాటు వీటినీ ప్రయత్నించండి.
పసందైన ప్లమ్‌ కేక్‌

కావల్సినవి: మైదా - పావుకేజీ, వెన్న - 200 గ్రా, పంచదార పొడి - పావుకేజీ, బేకింగ్‌పౌడర్‌ - చెంచా, కోడిగుడ్లు - ఆరు, వంటసోడా - పావుచెంచా, శొంఠి, దాల్చినచెక్క, లవంగాలు కలిపి చేసిన పొడి - చెంచా, చెర్రీ, ప్లమ్‌, ఎండుద్రాక్ష - కొన్ని (ముందురోజే కోలాలో నానబెట్టుకోవాలి), వెనిల్లా ఎసెన్సు - కొన్ని చుక్కలు, కారమిల్‌ - నాలుగు చెంచాలు, పాలు - కొద్దిగా (ఇందులో కారమిల్‌ను నానబెట్టుకోవాలి)తయారీ: మైదాలో బేకింగ్‌పౌడర్‌, వంటసోడా వేసి జల్లించి పక్కన పెట్టుకోవాలి. రెండు గిన్నెలు తీసుకుని కోడిగుడ్లు పగలకొట్టి.. పచ్చ తెల్ల సొనల్ని విడివిడిగా గిలక్కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటినీ మరోసారి కలిపి వెన్న, పంచదారపొడి కలపాలి. అందులో శొంఠి, లవంగాలు, దాల్చినచెక్క కలిపి చేసిన పొడిని చేర్చాలి. ఆ తరవాత ముందురోజే నానబెట్టుకున్న ఎండుద్రాక్ష, ప్లమ్స్‌, చెర్రీలను వేయాలి. ఇప్పుడు పాలల్లో నానబెట్టుకున్న కారమిల్‌ కలపాలి. చివరగా మిగిలిన మైదా, వెనిల్లా ఎసెన్సు కూడా వేసి ఐదు నిమిషాల సేపు కలిపి ఉంచాలి. ఓవెన్‌ను 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసి ఆ తరవాత ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన పాత్రలో వేసుకుని కనీసం ముప్ఫై అయిదు నిమిషాలు బేక్‌ చేయాలి. ఈ కేక్‌ క్రిస్మస్‌ ప్రత్యేకం.
వూరించే 
ఓట్స్‌కప్‌కేక్‌
కావల్సినవి: ఓట్స్‌ - వంద గ్రా (పొడి చేసుకోవాలి), రాగిపిండి - వంద గ్రా, పంచదార - 150 గ్రా, బేకింగ్‌ పొడి - టేబుల్‌స్పూను, వెన్న - వంద గ్రా, పాలు - 50 ఎంఎల్‌, కోడిగుడ్లు - నాలుగు, యాలకులపొడి - చెంచా.
తయారీ: రాగిపిండి, ఓట్స్‌పొడి, బేకింగ్‌పౌడర్‌ను ఓ గిన్నెలో కలిపి జల్లించుకుని పెట్టుకోవాలి. ఓ పాత్రలో కోడిగుడ్ల సొన పంచదార పొడి, వెన్న, యాలకులపొడి కూడా తీసుకుని ఫోర్కుతో బాగా గిలక్కొట్టాలి. ఐదునిమిషాలయ్యాక పాలు చేర్చి.. మరోసారి గిలక్కొట్టాలి. ఆఖరున రాగి, ఓట్స్‌ పిండిని కలపాలి. చెంచాతో ఈ మిశ్రమాన్ని తీసుకుంటే.. రిబ్బన్‌లా రావాలి. ఓవెన్‌ను ముందుగానే 180 డిగ్రీల్లో వేడిచేసి.. కాగితం కప్పులో 2/3 వంతు ఈ మిశ్రమాన్ని ఉంచి.. బేక్‌ చేయాలి. పదిహేను నిమిషాల్లో నోరూరించే కప్‌కేక్‌లు సిద్ధం.
పోషకాల డ్రైఫ్రూట్స్‌ కేక్‌
కావల్సినవి: మైదా - 200 గ్రా, పంచదార - 150 గ్రా, మిల్క్‌మెయిడ్‌ - యాభై గ్రా, వెన్న - 150 గ్రా, యాలకులపొడి - అరచెంచా, బేకింగ్‌ పొడి - ఒకటిన్నర చెంచా, ఆహార రంగు - చిటికెడు, ఆరెంజి లేదా పైనాపిల్‌ ఎసెన్సు - కొద్దిగా, పాలు - పావు కప్పు, అన్నిరకాల డ్రైఫ్రూట్స్‌ - పావుకప్పు, మిరిండా - కొద్దిగా.తయారీ: మైదాలో బేకింగ్‌పొడి వేసుకుని జల్లించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మరో పాత్రలో వెన్న, పంచదార, మిల్క్‌మెయిడ్‌, పాలు, యాలకులపొడి తీసుకుని బాగా కలపాలి. అందులో ఆహార రంగు, డ్రైఫ్రూట్స్‌ మిరిండా చేర్చి మరోసారి కలపాలి. ఆఖరున మిగిలిన మైదా, ఆ తరవాత నచ్చిన ఎసెన్సు వేసుకుని మరోసారి కలపాలి. ఓవెన్‌ను ముందుగానే 180 డిగ్రీల దగ్గర వేడిచేసి పెట్టుకోవాలి. కేక్‌ పాత్రలో వెన్న రాసి.. ఈ మిశ్రమాన్ని అందులో వేసుకుని అరగంట బేక్‌చేస్తే సరిపోతుంది. నోరూరించే కేక్‌ సిద్ధం.
తేనె ఓట్స్‌ లడ్డూ
కావల్సినవి: ఓట్స్‌ - కప్పు, తేనె - అరకప్పు, జీడిపప్పు, బాదం - అరకప్పు చొప్పున, గోధుమ నూక, నెయ్యి, ఖర్జూర పలుకులు - రెండు చెంచాల చొప్పున, పంచదార - నాలుగు చెంచాలు, యాలకుల పొడి - అరచెంచా.తయారీ: బాణలిలో నెయ్యి కరిగించి జీడిపప్పు, బాదంపలుకుల్ని వేయించి తీసి పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఓట్స్‌ కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు బాదం, జీడిపప్పును బరకగా పొడి చేసుకోవాలి. ఓట్స్‌ను మెత్తటి పొడిలా చేసుకుని జీడిపప్పు, బాదంపొడిని కూడా వేసుకోవాలి. ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని తేనెతో ఉండలు చుట్టుకుంటే చాలు.. పోషకాల ఓట్స్‌ లడ్డూ సిద్ధం.
తృణధాన్యాల కుకీలు
కావల్సినవి: రాగిపిండి, ఓట్స్‌పిండి - కప్పు చొప్పున, జొన్నపిండి, గోధుమరవ్వ - అరకప్పు చొప్పున, పంచదారపొడి - కప్పు, యాలకులపొడి - చెంచా, నెయ్యి - సరిపడా.తయారీ: పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని నెయ్యి వేడిచేసి మరీ గట్టిగా, అలాగని మెత్తగా కాకుండా పిండిలా కలుపుకోవాలి. ఆ పిండిని నచ్చిన ఆకృతిలో బిస్కెట్ల మాదిరి అద్దుకుని ఓవెన్‌ ట్రేలో సర్దుకోవాలి. ఓవెన్‌ను ముందుగానే 180 డిగ్రీల్లో వేడిచేసి ఈ ట్రేని దాన్లో పావుగంట ఉంచితే కుకీస్‌ సిద్ధం. ఇవి నిల్వ ఉండటమే కాదు.. ఆరోగ్యానికి మంచివి.
కమ్మని కోర్‌చాక్లెట్లు

కావల్సినవి: కోకో పొడి - కప్పు, మిల్క్‌మెయిడ్‌ - అరకప్పు, పంచదార పొడి - నాలుగు చెంచాలు, వెన్న - రెండు చెంచాలు, తీపికోవా - కప్పు, డ్రైఫ్రూట్స్‌ - అరకప్పు.తయారీ: ముందుగా తీపికోవా, డ్రైఫ్రూట్స్‌ పలుకులను కలిపి ఉండల్లా చుట్టుకోవాలి. ఆ తరవాత మిగిలిన పదార్థాలన్నీ కలిపి ఓవెన్‌లో రెండు నిమిషాలు కరిగించి తీయాలి. మిశ్రమం కాస్త దగ్గరగా అయ్యాక ఉండలుగా చేసి.. చేత్తో చిన్న పూరీలా అద్దుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసిపెట్టుకున్న కోవా ఉండను ఆ చాక్లెట్‌లో ఉంచి.. చుట్టూ మూసేయాలి. ఇలా మిగతావీ చేసుకుంటే కమ్మని కోర్‌ చాక్లెట్లు సిద్ధం. వీటిని రేపర్‌ కాగితాల్లో ఉంచి... ఫ్రిజ్‌లో పెడితే.. సరిపోతుంది.
Eenadu Direct link: http://eenadu.net/Specialpages/ruchulu/Ruchuluinner.aspx?qry=christmasSpecial

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు