తీపి.. తీపి సంబరాలు



తీపి.. తీపి సంబరాలు
ముంగిట్లో మెరిసే రతనాల రంగవల్లికల నుంచి.. తెల్లవారుజామున వేసే భోగిమంటలు.. తలంటుస్నానాలు.. గాలిపటాలు ఎగరేస్తూ పిల్లలు కొట్టే కేరింతల దాకా.. సంక్రాంతి అంటే ఒకటే హడావుడి. ఈ సమయంలో సంప్రదాయ పిండివంటలతోపాటు.. విభిన్న పదార్థాలు లేకపోతే.. పండక్కి నిండుదనమే లేదు. కాదంటారా.. ఆలస్యమెందుకు అలాంటి రుచుల్ని మీరూ ప్రయత్నించండి మరి.
గసగసాల హల్వా
కావల్సినవి: గసగసాలు, పంచదార - గ్లాసుచొప్పున, నెయ్యి - అరగ్లాసు, యాలకులపొడి - అరచెంచా. తయారీ: గసగసాల్ని మూడునాలుగు గంటలముందు నానబెట్టుకోవాలి. ఆ తరవాత సన్నని రవ్వమాదిరి రుబ్బి.. పంచదార కలపాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద ఉంచి.. మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. హల్వా కొద్దిగా ఉడికాక నెయ్యి, యాలకులపొడి చేర్చాలి. ముదరు వర్ణంలోకి వచ్చాక పొయ్యికట్టేయాలి. తడి తగలకపోతే.. ఈ హల్వా వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది. 
- సోమ మనోరమ, హైదరాబాద్‌
ఉటంకులు
కావల్సినవి: బియ్యం - గ్లాసు, పంచదార - ముప్పావుగ్లాసు, పాలు - పావులీటరు, నూనె -వేయించడానికి సరిపడా.తయారీ: బియ్యాన్ని నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరవాత నీటిని వంపేసి.. మరోసారి వడకట్టాలి. ఇప్పుడు బియ్యం, పంచదారను కలిపి మధ్యమధ్య పాలు చేర్చుతూ కనీసం గంటన్నరసేపు మెత్తగా రుబ్బాలి. ఈ పిండి చిక్కగా ఉంటుంది. బాణలిలో నూనె వేడిచేయాలి. ఈ పిండిలో ఐదువేళ్లు ముంచి నూనెలో పడేలా గుండ్రంగా తిప్పుతూ వదలాలి. తీగలా వస్తుంది. అలా నాలుగైదుసార్లు వేస్తే సన్నని జంతికల చుట్లలా వస్తాయి. బంగారువర్ణంలోకి వచ్చాక తీసేయాలి. ఇలా చేసుకున్న వాటిని మధ్యకు మడిస్తే ఉటంకులు సిద్ధం.
- లావణ్య, హైదరాబాద్‌
పంచరత్న పోలె
కావల్సినవి: మినప్పప్పు, అలసందలపప్పు, బొబ్బర్లు, పెసరపప్పు, సెనగపప్పు - ఒక్కోటి అరకప్పు చొప్పున, పచ్చిమిర్చి మిశ్రమం- చెంచా, అల్లం - అర అంగుళం, ఉప్పు - తగినంత, గోధుమపిండి - రెండుకప్పులు, నెయ్యి - తగినంత, నువ్వులు - రెండుటేబుల్‌స్పూన్లు, కరివేపాకు పొడి - టేబుల్‌స్పూను, పుదీనాపొడి - టేబుల్‌స్పూనుతయారీ: ముందుగా గోధుమపిండిలో ఉప్పు వేసి దోరగా వేయించిన నువ్వులు, కరివేపాకుపొడి, పుదీనా పొడి, కొద్దిగా నెయ్యి, సరిపడా నీళ్లతో చపాతీపిండిలా కలపాలి. పైన పేర్కొన్న పప్పులన్నింటినీ శుభ్రంగా కడిగి కుక్కర్‌లో ఒక కూత వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ తరవాత ఉడికిన పప్పును బాగా మెదిపి అందులో పచ్చిమిర్చి మిశ్రమం, అల్లం, ఉప్పు కలిపి చిన్న ఉండల్లా చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమపిండిని కొద్దిగా తీసుకుని చిన్న చపాతీలా చేసి అందులో పప్పుల ఉండను ఉంచి చుట్టూ మూసేసి మరోసారి ఒత్తుకుని పెనంపై నెయ్యివేసి రెండువైపులా కాల్చాలి. బంగారువర్ణంలోకి వచ్చాక తీసేయాలి.
డ్రైఫ్రూట్స్‌ అరిసెలు
కావల్సినవి: బియ్యం - కప్పు (నానబెట్టి వడకట్టి తడిపొడిగా పిండి చేసుకోవాలి), బెల్లం - కప్పు, బాదం, పిస్తా, జీడిపప్పు, అక్రూ ట్లు - రెండుచెంచాల చొప్పున, నూనె - వేయించడానికి సరిపడా.తయారీ: జీడిపప్పు, అక్రూట్లను నానబెట్టి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. బాదం, పిస్తాలను సన్నగా తరగాలి. ఓ గిన్నెలో అరకప్పు నీళ్లుపోసి.. బెల్లం వేసి ముదురుపాకం రానివ్వాలి. అందులో జీడిపప్పు మిశ్రమం వేయాలి. ఆ తరవాత బియ్యప్పిండి చేర్చాలి. అయితే పాకాన్ని బట్టే పిండి వేసుకోవాలి. అరిసెల్లా చేసుకునేటప్పుడు బాదం, పిస్తా ముక్కల్ని కూడా అద్ది.. కాగుతున్న నూనెలో వేయించుకుంటే సరిపోతుంది. డ్రైఫ్రూట్స్‌ అరిసెలు సిద్ధం.
- చెరుకూరి కారుణ్య, ఖమ్మం
అటుకుల పూర్ణాలు
కావల్సినవి: అటుకులు - కప్పు, బెల్లంతురుము - కప్పు, పచ్చికొబ్బరితురుము - కప్పు, క్యారెట్‌ తురుము - కప్పు, యాలకులపొడి - రెండు చెంచాలు, మంచినూనె - వేయించడానికి సరిపడా.
తయారీ: ఓ పాత్రలో గ్లాసు నీళ్లు తీసుకుని అందులో బెల్లం తురుము చేర్చి.. పొయ్యిమీద పెట్టి కరిగించాలి. ఆ తరవాత అటుకుల్ని బెల్లంనీటిలో వేసి ఐదునిమిషాల నాననిచ్చి తరవాత తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు కొబ్బరి, క్యారెట్‌ తురుము, యాలకులపొడిని మెత్తగా రుబ్బుకొని.. దాంతోపాటు అటుకుల మిశ్రమాన్ని కూడా బెల్లంనీటిలో వేయాలి. బాణలిలో నూనె వేడిచేయాలి. ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేయాలి. బంగారువర్ణంలోకి వచ్చాక తీసేస్తే సరిపోతుంది. కరకరలాడుతూ, మెత్తగా ఉండే పూర్ణాలు నోరూరిస్తాయి.
 
స్వీట్‌కార్న్‌ తీపి వడలు
కావల్సినవి: స్వీట్‌కార్న్‌ - పావుకేజీ, బెల్లం - నూటయాభైగ్రా, యాలకులపొడి - కొద్దిగా, నూనె - వేయించడానికి సరిపడా.తయారీ: స్వీట్‌కార్న్‌, బెల్లం, యాలకులపొడి తీసుకుని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని అరటి ఆకుమీద చేత్తో తట్టి కాగుతున్న నూనెలో వేయాలి. బంగారువర్ణంలోకి వచ్చాక తీసేస్తే సరిపోతుంది. కరకరలాడుతూ, తియ్యగా ఉండే ఈ వడల రుచే వేరు.
- షర్మిల, హైదరాబాద్‌

Eenadu link: http://eenadu.net/Specialpages/ruchulu/Ruchuluinner.aspx?qry=sankranthisambaralu

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు